Category Archives: Sliders

రామ్‌తో ‘జగడం’ రీమేక్ చేయాలనుంది: సుకుమార్

పదిహేడేళ్ల కుర్రాడు… కొత్తగా గ్యాంగ్‌లో జాయిన్ అయ్యాడు. కొట్లాటకు గ్యాంగ్ సభ్యులతో కలిసి వెళ్ళాడు. ఎదురుగా పెద్ద గ్యాంగ్ ఉంది. వాళ్ళను చూసి కుర్రాడి గ్యాంగ్ లీడర్ భయపడి వెనకడుగు వేశాడు. కానీ కుర్రాడు వేయలేదు. చురకత్తుల్లాంటి చూపులతో తనకంటే బలవంతుడిని ఢీ కొట్టి ధైర్యంగా నిలబడ్డాడు. ఆ సీన్‌కి రాజమౌళి కూడా ఫ్యాన్ అయిపోయాడు. గ్యాంగ్‌కి కుర్రాడు కొత్త. కాని సినిమా ఇండస్ట్రీకి, ప్రేక్షకులకు కాదు. అప్పటికే ‘దేవదాసు’తో అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఈ సీన్‌తో మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. యాక్షన్ హీరోకి కావాల్సిన లక్షణాలు ఇతడిలో ఉన్నాయని నిరూపించుకున్నాడు. ఇవన్నీ చెబుతుంటే ‘జగడం’లో సీన్ అని గుర్తొచ్చే ఉంటుంది. ఆ ఎనర్జిటిక్ హీరోయే రామ్ పోతినేని.

హీరోగా రామ్‌కి, దర్శకుడిగా సుకుమార్‌కీ ‘జగడం’ ఎంతో పేరు తెచ్చింది. రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా పైన చెప్పిన సీన్ గురించి ప్రస్తావించారంటేనే అందులో స్ట్రెంగ్త్ అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ ‘జగడం (వయలెన్స్) ఈజ్ ఫ్యాషన్’, ‘5 ఫీట్ 8 ఇంచెస్ కింగు లాంటి శీనుగాడు’ పాటలు యూత్ ప్లే లిస్టులో ఉంటున్నాయి. ఓవర్ ద ఇయర్స్ ప్రేక్షకులలో అభిమానులను పెంచుకుంటూ వస్తున్న ‘జగడం’ విడుదలై మార్చి 16కి 14 వసంతాలు పూర్తి చేసుకుని 15వ ఏట ప్రవేశిస్తోంది.ఈ సందర్భంగా సినిమా విశేషాలను, అప్పటి సంగతులను దర్శకుడు సుకుమార్ మరోసారి గుర్తు చేసుకున్నారు.

ఆ ఆలోచన నుంచి… ‘జగడం’

చిన్నప్పటి నుంచి ఒక విషయం నాకు ఇన్స్పిరేషన్ గా ఉండేది. ఎక్కడైనా గొడవ జరుగుతుంటే… నేను వెళ్ళేసరికి ఆగిపోతుండేది. కొట్టుకుంటారేమో, కొట్టుకుంటే ఎలా ఉంటుందో చూడాలని ఉండేది. నేను ఎదుగుతున్న క్రమంలోనూ ఆ ఆలోచన పోలేదు. ఎక్కడైనా కొట్లాటలో వాళ్ళు కొట్టుకోలేదంటే డిజప్పాయింట్ అయ్యేవాడిని. నా స్నేహితులైనా అరుచుకుంటుంటే బాధ అనిపించేది. వీళ్ళు కొట్టుకోవడం లేదేంటి? అని! ఎక్కడో మనలో వయలెన్స్ ఉంది. వయలెన్స్ చూడాలని తపన ఉంది. ఉదాహరణకు, అడవిని తీసుకుంటే అందులో ప్రతిదీ వయలెంట్ గా ఉంటుంది. పులి-జింక తరహాలో ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటాయి. ఎక్కడ చూసినా బ్లడ్ ఉంటుంది. ‘ఆహారాన్ని సాధించే దారి అంతా వయలెన్స్‌తో ఉంటుంది. అలాగే సెక్స్‌ను సాధించే దారి ప్రేమతో ఉంటుంది. ఇలా ఎన్నో ఆలోచనల నుంచి మొదలైనదే జగడం. మన చుట్టుపక్కల చూస్తే చిన్నపిల్లలు ఎవరైనా పడిపోతే, దెబ్బ తగిలితే… ‘నిన్ను కొట్టింది ఇదే నాన్నా’ అని రెండుసార్లు కొట్టి చూపిస్తాం. ఇటువంటి విషయాలు నాలో కనెక్ట్ అయ్యి ఓ సినిమా సినిమా చేద్దామని అనుకున్నా.

‘ఆర్య’ కంటే ముందే…
నిజాయతీగా చెప్పాలంటే… ‘ఆర్య’ కంటే ముందు ‘జగడం’ చేద్దామనుకున్నా. నా దగ్గర చాలా ప్రేమకథలు ఉన్నాయి. ‘ఆర్య’ తర్వాత వాటిలో ఏదైనా చేయవచ్చు. వయలెన్స్ నేపథ్యంలో కొత్తగా ఏదైనా చేద్దామని అనుకున్నా. అప్పటికి నాలో ఆలోచనలు రకరకాలుగా మారి ‘జగడం’ కథ రూపొందింది.

రామ్… చాలా షార్ప్!

‘జగడం’ కథ పూర్తయిన సమయానికి ‘దేవదాసు’ విడుదలై ఏడు రోజులు అయినట్టు ఉంది. నేను సినిమా చూశా. రామ్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. హుషారుగా చేస్తున్నాడు. ఎఫ‌ర్ట్‌లెస్‌గా పెర్ఫార్మన్స్ చేస్తున్నాడని అనిపించింది. రామ్‌తో ‘జగడం’ చేయాలని ‘స్రవంతి’ రవికిశోర్ గారిని అప్రోచ్ అయ్యాం. ఆయన సరే అన్నారు. అలా ‘జగడం’ మొదలైంది. అప్పుడు రామ్‌కి పదిహేడేళ్లు అనుకుంట. ఆ టైమ్‌లో ఏం చెప్పినా చేసేసేవాడు. ‘నాకు రాదు. రాలేదు. చేయలేను’ అనే మాటలు ఉండేవి కావు. చేత్తో కాయిన్ తిప్పమని అడిగితే… పక్కకి వెళ్లి పది నిమిషాల్లో ప్రాక్టీస్ చేసి వచ్చి చేసేవాడు. అంత షార్ప్. నాకు తెలిసి… ఇప్పటికీ రామ్‌ని ఆ బ్రిలియన్స్ కాపాడుతుంది. దానివల్లే తను సక్సెస్ అవుతున్నాడు.

రామ్ మంచి స్థాయికి వస్తాడని అప్పుడే అనుకున్నా

నేను ప్రతిక్షణం రామ్‌ను చూసి షాక్ అవుతూ ఉండేవాడిని. అంటే… చిన్న వయసులో ప్రతిదీ ఈజీగా చేయగలుగుతున్నాడు. వెంటనే పట్టుకుని పెర్ఫార్మన్స్ చేయగలుగుతున్నాడు. ఈ సన్నివేశంలో ఇలా కాకుండా వేరేలా చేస్తే బావుంటుందని అడిగితే… మనం కోరుకున్న దానికి తగ్గట్టు ఎక్స్‌ప్రెష‌న్స్‌ వెంటనే మార్చి చేసేవాడు. అన్ని రియాక్షన్స్ ఉండాలంటే ఎక్కువ లైఫ్ ఎక్స్‌పీరియ‌న్స్‌లు ఉండాలి. అప్పటికి తనకు ఎటువంటి లైఫ్ ఎక్స్‌పీరియ‌న్స్‌లు ఉన్నాయో తెలియదు కానీ… ఎటువంటి రియాక్షన్ అడిగినా చేసి చూపించేవాడు. ‘జగడం’ చేసే సమయానికి రామ్‌ను చూస్తే వండర్ బాయ్ అనిపించాడు. ఇండస్ట్రీలో రామ్ మంచి స్థాయికి వస్తాడని అప్పుడే అనుకున్నాను. ఇప్పుడు అదే ప్రూవ్ అయ్యింది.

 

ప్రతి పాట హిట్టే

‘ఆర్య’తో దేవిశ్రీ ప్రసాద్‌తో నాకు అనుబంధం ఉంది. ‘జగడం’ చిత్రానికీ తనను సంగీత దర్శకుడిగా తీసుకున్నాను. ఇద్దరి మనుషుల మధ్య ప్రేమ కాకుండా రెండు వస్తువుల మధ్య ప్రేమ ఉంటే ఎలా ఉంటుంది? – ఈ కాన్సెప్ట్ నుంచి వచ్చిందే ‘5 ఫీట్ 8 ఇంచెస్’ సాంగ్. చంద్రబోస్ గారికి నేను ఈ కథ అనుకున్నాని చెబితే వెంటనే పాట రాసిచ్చారు. దానికి దేవి ట్యూన్ చేశారు. అదే ‘వయలెన్స్ ఈజ్ ప్యాషన్’. సినిమాలో ప్రతి పాట హిట్టే. అప్పట్లో ‘జగడం’ ఆల్బమ్ సెన్సేషన్. సినిమాకి తగ్గట్టు దేవి మౌల్డ్ అవుతాడు. మంచి నేపథ్య సంగీతం ఇస్తాడు. ‘జగడం’ పతాక సన్నివేశాల్లో నేపథ్య సంగీతాన్ని నేను ఇప్పటికీ హమ్ చేస్తూ ఉంటాను.

‘వయలెన్స్’ ఎందుకు ‘జగడం’గా మారిందంటే?

వయలెన్స్ ను ఎక్కువ ఎగ్జాగరేట్ చేస్తున్నారని, గ్లామరస్ గా చూపిస్తున్నారని సెన్సార్ సభ్యులు అభ్యంతరం చెప్పారు. అందువల్ల ‘వయలెన్స్ ఈజ్ ప్యాషన్’ పాటలో వయలెన్స్ బదులు ‘జగడం’ అని పెట్టాల్సి వచ్చింది. అప్పట్లో సెన్సార్‌లో చాలా పోయాయి. సినిమా కథనమే మిస్ అయింది. అప్పట్లో నాకు సెన్సార్ ప్రాసెస్ గురించి పూర్తిగా తేలికపోవడం వల్ల చాలా కట్స్ వచ్చాయి. కట్స్ లేకుండా సినిమా ఉంటే ఇంకా బావుండేది. సినిమాకు సరైన అప్రిసియేష‌న్‌ రాలేదేమో అని నాలో చిన్న బాధ ఇప్పటికీ ఉంది.

స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్‌… సూపర్35… సినిమాటోగ్రఫీ!

సినిమాటోగ్రాఫర్ రత్నవేలుగారు ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ది బెస్ట్ ‘జగడం’ అని చెప్పొచ్చు. ఎందుకంటే… అప్పుడే chooke s4 లెన్స్ వచ్చాయి. అప్పట్లో స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్‌ తన సినిమాలకు ఏ కెమెరా ఎక్విప్‌మెంట్ ఉపయోగించారో, మేమూ అదే ఎక్విప్‌మెంట్ ఉపయోగించాం. సూపర్ 35 ఫార్మాట్ లో షూట్ చేశాం. అప్పటివరకు మన దగ్గర ఎవరూ ఆ ఫార్మాట్ లో ఎవరూ చేయలేదు. కెమెరా యాంగిల్, లైటింగ్ మూడ్… రత్నవేలు ప్రతిదీ డిస్కస్ చేసి చేసేవారు. ప్రతిదీ పర్ఫెక్ట్ షాట్ అని చెప్పొచ్చు. ఇండియాలో సినిమాటోగ్రఫీ పరంగా చూస్తుంటే… వన్నాఫ్ ది బెస్ట్ ‘జగడం’ అని చెప్పొచ్చు. ఆ క్రెడిట్ మొత్తం రత్నవేలుగారిదే. సినిమాటోగ్రఫీనీ అప్రిషియేట్ చేయలేదు. ఆ సినిమా ఫొటోగ్రఫీ నాకు ఎంతో ఇష్టం.

ముంబైలో దర్శకుల దగ్గర… లైబ్రరీల్లో ‘జగడం’

ఈ సినిమాకి శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటింగ్ చేశారు. సినిమా విడుదలైన కొన్నాళ్లకు ఒకసారి మేమిద్దరం ఫ్లైట్‌లో కలిశాం. మాటల మధ్యలో ‘జగడం’ గురించి వచ్చింది. ‘ప్లాప్ సినిమా కదా. మాట్లాడుకోవడం ఎందుకు అండీ’ అన్నాను. అందుకు ‘అలా అనుకోవద్దు. నేను ముంబై నుంచి వస్తున్నాను. చాలామంది దర్శకుల దగ్గర, వాళ్ళ లైబ్రరీల్లో జగడం సినిమా ఉంది. నీకు అంతకన్నా ఏం కావాలి? చాలామంది నీకు ఫోనులు చేయలేకపోవచ్చు. నిన్ను కలవడం వాళ్ళకు కుదరకపోవచ్చు. కానీ, చాలా అప్రిసియేషన్ పొందిన సినిమా ఇది. టెక్నీషియన్స్ దానిని రిఫరెన్స్‌గా పెట్టుకున్నారు’ అని శ్రీకర్ ప్రసాద్ గారు చెప్పారు.

నిర్మాత గురించి…

చిత్రనిర్మాణంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ జేడీ సోంపల్లిగారు ఎంతో మద్దతుగా నిలిచారు. వాళ్ళ అబ్బాయి ఆదిత్యబాబు తరపున ఆయన సినిమా నిర్మించారు. ఆదిత్య ఇప్పటికీ నాతో టచ్ లో ఉంటాడు. నా ఫంక్షన్లకు తనను కూడా పిలుస్తాను.

ఆరు నెలలు ఆడిషన్స్ చేశాం!

అప్పట్లో ఆర్టిస్టులు చాలా తక్కువ మంది. ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ వస్తున్నాయి. వెబ్ సిరీస్ లు వచ్చాయి. చాలామంది ఆర్టిస్టులు దొరుకుతున్నారు. అప్పుడు అలా కాదు కాబట్టి ఎక్కువ ఆడిషన్స్ చేశాం. సుమారు ఆరు నెలలు ‘జగడం’ ఆడిషన్స్ జరిగి ఉంటాయి. తాగుబోతు రమేష్, వేణు, ధనరాజ్… ఇలా ఆ సినిమా నుంచి చాలామంది ఆర్టిస్టులు వచ్చారు. ఇప్పటికి వాళ్ళు అదే గౌరవం, ప్రేమతో చూస్తారు.

త్వరలో రామ్‌తో సినిమా చేస్తా!

రామ్‌తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. త్వరలో మళ్ళీ తప్పకుండా చేస్తా. మరో మంచి సినిమా చేయాలి. యాక్చువల్లీ… ఇప్పటి రామ్‌తో మళ్ళీ ‘జగడం’ రీమేక్ చేయాలని ఉంది. మళ్ళీ ఇప్పటి రామ్‌తో మళ్ళీ జగడం చూసుకోవాలని ఉంది.


సిక్స్ కొట్టాలనే ‘వరల్డ్ ఫేమస్ లవర్’గా చేశాను – ప్రి రిలీజ్ ఈవెంట్ లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ

సిక్స్ కొట్టాలనే ‘వరల్డ్ ఫేమస్ లవర్’గా చేశాను
– ప్రి రిలీజ్ ఈవెంట్ లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ హీరోగా కె.ఎస్. రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎ. వల్లభ నిర్మిస్తోన్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. క్రాంతిమాధవ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, క్యాథరిన్ ట్రెసా, ఇజాబెల్లా లెయితే హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 14న వేలంటైన్స్ డే సందర్భంగా విడుదలవుతున్న ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి నార్సింగిలో విజయ్ అభిమానుల కోలాహలం మధ్య అట్టహాసంగా జరిగింది.
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ, “అప్పట్లో చిరంజీవితో ఎన్ని సూపర్ హిట్స్ నాన్-స్టాప్ గా ఇచ్చారో మళ్లీ అంతకు మించిన హిట్స్ ఈ సినిమా నుంచి రామారావు గారు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎంతోమంది లవర్స్ ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయ్ దేవరకొండ ఫేమస్ లవర్. ఈ సినిమాతో నిజంగానే అతను వరల్డ్ ఫేమస్ లవర్ అవ్వాలని కోరుకుంటున్నా. ఈ సినిమాలోని హీరోయిన్లందరూ అతనితో, మిగతా హీరోలతో మరిన్ని సినిమాలు చెయ్యాలని ఆశిస్తున్నా. క్రియేటివ్ డైరెక్టర్ అయిన క్రాంతిమాధవ్ ఈ సినిమా నుంచి వండర్ఫుల్ సక్సెస్ లు చూడాలని కోరుకుంటున్నా” అన్నారు.
అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా మాట్లాడుతూ, “వరల్డ్ వైడ్ గా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సూపర్ హిట్ కావాలనీ, కేఎస్ రామారావు గారి బ్యానర్ కు ఈ సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ రావాలనీ కోరుకుంటున్నా” అన్నారు.
సీనియర్ ప్రొడ్యూసర్ సి. అశ్వినీదత్ మాట్లాడుతూ, “నేనూ, కేఎస్ రామారావు విజయవాడ నుంచి ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం. ఈ 46 సంవత్సరాల జర్నీలో రామారావు ఎన్నో గొప్ప చిత్రాలు నిర్మించారు. ఒక నిర్మాతగా ఆయనతో పోటీపడేవాడ్ని. విజయ్ దేవరకొండ మా సంస్థ నుంచి వచ్చిన ఒక ఆణిముత్యం. ఈ సినిమా కూడా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నా” అని చెప్పారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ, “విజయ్ తో నావి రెండు సినిమాలు అయ్యాయి. మూడో సినిమాకి సిద్ధంగా ఉన్నాం. రాత్రే నాకు మూడో సినిమా చెయ్యవా? అనడిగాను. మీరు ఎప్పుడు చెయ్యమంటే అప్పుడు వచ్చి చేస్తానని చెప్పాడు. ఇంతదాకా విజయ్ జర్నీ ఎలా సాగిందో చూస్తూ వచ్చాను. చాలామంది దగ్గర తెలివితేటలు, టాలెంట్ ఉంటాయి. కానీ స్వచ్ఛమైన టాలెంట్, మంచితనం, తెలివితేటలు కలిపి ఉన్న అరుదైన మనిషి విజయ్. అతను నిగర్వి. అతని జర్నీ ప్రారంభ దశలోనే ఉంది. ఫ్యూచర్ లో ఎంతో ఎత్తుకు ఎదుగుతాడని ఆశిస్తున్నా. కేఎస్ రామారావు ఒకనాడు నేను ఈర్ష్యపడేంత ప్రొడ్యూసర్. ఈ మనిషికి ఇంత తపనేంటి అని అప్పుడు ఆశ్చర్యపోయేవాడ్ని. ఎన్ని సినిమాలైనా ఇప్పటికీ ఆయనలో అదే ప్యాషన్ కనిపిస్తోంది. సినిమాని ఆయన ప్రేమించినంతగా నేను ప్రేమిస్తానా? అని నాకే ఒక్కోసారి సందేహం వస్తుంటుంది. సినిమాని అంతగా ప్రేమించేవాళ్లకి తప్పకుండా విజయం వరిస్తుంది. ట్రైలర్ చూస్తే డైరెక్టర్లో చాలా విషయం ఉందనే ఫీలింగ్ కలిగింది. సినిమా కూడా అంత బాగుంటుందని ఆశిస్తున్నా. రౌడీ బాయ్స్ ఈ సినిమాని పెద్ద హిట్ చేయిస్తారని అనుకుంటున్నా” అని చెప్పారు.
హీరోయిన్ ఇజాబెల్లా మాట్లాడుతూ, “ఈ సినిమాలో విజయ్ సరసన నటించడం గౌరవంగా భావిస్తున్నా. క్రాంతిమాధవ్ చాలా బాగా సినిమా తీశారు” అన్నారు.
హీరోఇన్ క్యాథరిన్ ట్రెసా మాట్లాడుతూ, “ఈ సినిమాలో చేసే అవకాశం ఇచ్చిన క్రాంతికి థాంక్స్. తెలుగులో చాలా రోజుల తర్వాత నాకు ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది. విజయ్ ఈ సినిమాకు వెన్నెముకగా నిల్చున్నారు. అతనితో కలిసి నటించడం గ్రేట్ ఎక్స్ పీరియెన్స్. ఆయనెప్పుడూ క్యారెక్టర్లోనే ఉండటం నాకు చాలా నచ్చింది. ఆ మంచి గుణం ఉండటం వల్లే ఆయన రోరోజుకూ ఎదుగుతున్నారు” అని చెప్పారు.
రాశీ ఖన్నా మాట్లాడుతూ, “ఇప్పుడు నన్ను చాలామంది యామినీ అని పిలుస్తున్నారు. చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనేది ప్రేమలో ఉన్నవాళ్ల కోసమూ, ప్రేమొలో లేనివాళ్ల కోసమూ కూడా. ప్రేమ అనేది ఒక యూనివర్సల్ ఎమోషన్. కథల్లో, సినిమాల్లో, పద్యాల్లో ఈ ఎమోషన్ గురించి వర్ణించారు. ఎన్నిసార్లు వర్ణించినా తక్కువే అనిపిస్తుంది. నాకు లవ్ స్టోరీస్ చాలా చాలా ఇష్టం. మన తరానికి చాలా ఇష్టం. ఈ సినిమా మిమ్మల్ని అసంతృప్తికి గురిచెయ్యదు. గౌతమ్ తో, యామినితో రిలేట్ అవుతారు. ఈ సినిమాతో కచ్చితంగా ప్రేమలో పడతారు. నేను ప్రేమను ప్రేమిస్తాను. ఇక లవ్ స్టోరీస్ చెయ్యనని విజయ్ చెప్పినప్పుడు నేను కూడా హర్ట్ అయ్యాను. అతన్ని లవ్ స్టోరీల్లో చూడ్డం నాకిష్టం. అతను లవర్ పోస్టర్ బాయ్. తన ఫ్యాన్స్ ను అతను హర్ట్ చేశాడు. నాకు అవకాశం వస్తే మళ్లీ మళ్లీ లవ్ స్టోరీస్ చేస్తాను. విజయ్ ను ఈ సినిమాలో ఒక కొత్త అవతారంలో చూస్తారు. ఈ తరానికి అతను ఇన్స్పిరేషన్. అతనితో మళ్లీ కలిసి నటించాలని కోరుకుంటున్నా. క్రాంతిమాధవ్ మంచి స్క్రిప్ట్, మంచి డైలాగ్స్ రాశారు. ఈ సినిమాతో ఆయన మంచి పేరు తెచ్చుకుంటారు. కేఎస్ రామారావు గారు మమ్మల్ని అందరినీ తన కుటుంబంలా చూసుకున్నారు” అని చెప్పారు.
ఐశ్వర్యా రాజేష్ మాట్లాడుతూ, “ఇది తెలుగులో నేను సంతకం చేసిన మొదటి సినిమా. నేను మొదట్ చూసిన విజయ్ సినిమా ‘ఎవడే సుబ్రమణ్యం’. ఆయన్ను చూడగానే చార్మింగ్ గా, స్పార్క్ గా ఉన్నాడనుకున్నా. పెద్ద స్టార్ అవుతాడనీ, జనం అతని గురించి మాట్లాడుకుంటారనీ అనుకున్నా. ఆయన గ్రేట్ ఇన్స్పిరేషన్. ఆయనతో కలిసి పనిచెయ్యడం గొప్ప అనుభవం. కేఎస్ రామారావు గారితో ఇది నాకు రెండో సినిమా. క్రాంతిమాధవ్ నాకు సువర్ణ అనే ఫెంటాస్టిక్ రోల్ ఇచ్చారు. నాది డీగ్లామర్ గా, చాలా డిఫరెంట్ గా ఉంది చాలామంది చెప్పారు. కానీ సువర్ణతో ప్రేక్షకులు ప్రేమలో పడతారు. ఈ సినిమాలోని అన్ని పాత్రల్నీ ప్రేమిస్తారు” అన్నారు.
హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ, “నువ్వు లక్కియెస్ట్ బ్రదర్ ఇన్ ద వరల్డ్ అని నాకు చాలామంది మెసేజ్ చేస్తుంటారు. నేను కూడా అలాగే ఫీలవుతుంటా. ఇప్పటికే సినిమా చూసినా. ఫుల్ గా ఎంజాయ్ చేశా. మనోడు ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అయితుండు. అందరూ ఫిబ్రవరి 14న థియేటర్లలోకు వెళ్లి ఎంజాయ్ చెయ్యాల్ని కోరుకుంటున్నా” అన్నారు.
నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ, “కేఎస్ రామారావు గారు కాలానికి తగ్గట్లుగా కథలను ఎంచుకొని తీయడం చాలా బాగుంది. నేను చూసిన కొన్ని సన్నివేశాల్లో రాశీ, ఐశ్వర్య, క్యాథరిన్, ఇజాబెల్లా గొప్ప నటన చూసి అమేజింగ్ అనిపించింది” అన్నారు.

‘పెళ్ళిచూపులు’ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ, “అందరికీ విజయ్ ఒక ఇన్ స్పిరేషన్ అయ్యాడు. అతను ఒక్కొక్క మెట్టే ఎక్కుతుంటే హ్యాపీగా ఉంది. అతనొక విప్లవం సృష్టించాడు. విజయ్ ఇప్పుడొక సూపర్ స్టార్. ట్రైలర్ చాలా బాగుంది. నలుగురు హీరోయిన్లతో అతను ఎలా చేశాడో చూడాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నా” అన్నారు.
సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి. సురేష్ బాబు మాట్లాడుతూ, “వేలంటైన్స్ డేకి ఎవరైనా ఒక అమ్మాయినే తీసుకెళతారు. ఇక్కడ విజయ్ నలుగురు అమ్మాయిల్ని తీసుకెళ్తున్నాడు. ఒక్క విజయ్ మాత్రమే నలుగురు అమ్మాయిల్ని హ్యాండిల్ చెయ్యగలుగుతాడనుకుంటున్నా. ఈ సినిమాతో విజయ్ మరోసారి అందర్నీ అలరిస్తాడని ఆశిస్తున్నా. కేఎస్ రామారావు గారికి బిగ్ హిట్ రావాలని కోరుకుంటున్నా” అన్నారు.
దర్శకుడు క్రాంతిమాధవ్ మాట్లాడుతూ, “విజయ్ దేవరకొండ ఎనిమిది సినిమాలు చేసిండు. నాది తొమ్మిదోది. ఎనిమిది సినిమాలు ఒకదానికొకటి పోలిక ఉండదు. విజయ్ ని తరుణ్ భాస్కర్ ‘పెళ్ళిచూపులు’తో హీరోగా పరిచయం చేసిండు. తర్వాత ‘అర్జున్ రెడ్డి’తో బిగ్గెస్ట్ హిట్ కొట్టిండు. దాంతో ‘అర్జున్ రెడ్డి’కి ముందు, ‘అర్జున్ రెడ్డి’కి తర్వాత అనేవిధంగా విజయ్ కెరీర్ నడుస్తోంది. అతనెప్పుడూ ఓ కొత్తదనాన్ని ఎంచుకుంటూ ఉంటాడు. తన ఫ్యాన్స్, ఆడిటోరియంకు వచ్చిన వాళ్లకు వినోదం కావాలని కోరుకుంటాడు. దాన్ని మైండ్ లో పెట్టుకొని ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కథ రాసినం. వేలంటైన్స్ డేకి రిలీజ్ అవుతోంది. నలుగురు హీరోయిన్లున్నారు, ఈ కథ ఏం రాసినవ్? అని నన్ను అడుగుతూ ఉన్నారు. ఒక్క అమ్మాయితో చేయడానికే కష్టపడతారు, నలుగురు అమ్మాయిలతో చెయ్యడం మజాక్ కాదు. విజయ్ చాలా కష్టపడ్డాడు. ఈ ప్రపంచంలో ఒక శిశువు జన్మించింది అంటే నేను ఒక కొత్త ప్రపంచం పుట్టింది అంటాను. ఆ ప్రపంచం ఎదిగి ఒక పెద్ద ప్రపంచం అయ్యాక, తనలాంటి ఇంకో ప్రపంచం కొరకు వెతుకుతుంది. ఆ ప్రపంచం ఎదురైనప్పుడు అందులో ఏకమవ్వాలనీ, మమేకమవ్వాలనీ శాయశక్తులా ప్రయత్నం చేస్తుంది. రెండు వేర్వేరు ప్రపంచాలు ఏకమవ్వాలనుకున్నప్పుడు అలజడి సృష్టింపబడుతుంది. ఈ అలజడినే నేను ప్రేమ అంటాను. ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో ఆ ప్రేమను ఎలా చూపించామో ఫిబ్రవరి 14న మీరు చూస్తారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లో ఇది నా రెండో సినిమా”అని చెప్పారు.

చిత్ర సమర్పకులు కె.ఎస్. రామారావు మాట్లాడుతూ, “ఈ సినిమా నేను మొదలుపెట్టానికి ప్రేరణ ఇచ్చింది క్రాంతిమాధవ్ చెప్పిన కథ. విజయ్ కూడా కథ విన్నాక ఇది చాలా గొప్ప సినిమా అవుతుందని చెయ్యడానికి ముందుకు వచ్చాడు. దానినే నమ్మి మాకు ఆద్యంతం సపోర్ట్ చేసిన వ్యక్తి గోవర్ధన్ దేవరకొండ. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత అంత గొప్ప సినిమా అవుతుందని ఆయన అన్నారు. అయితే మా అందరి కంటే ఈ సినిమాలో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యింది విజయ్. ఎడిటింగ్ రూములో ఉండి ఈ సినిమా 100 శాతం పర్ఫెక్టుగా వచ్చిందా, లేదా అని చూసుకున్న వ్యక్తి విజయ్. ప్రతి సీన్ అసాధారణంగా ఉండేలా ఆయన నటించి, నలుగురు హీరోయిన్ల పాత్రలూ బాగా వచ్చేలా చూసుకొన్నారు. ఆయన ఎనర్జీ ప్రతి ఫ్రేములో కనిపిస్తుంది. విజయ్, రాశీ ఎంత పోటాపోటీగా నటించారో చూసి అంతా ఆశ్చర్యపోతారు. నేను చూసిన అన్ని భాషల సినిమాల్లో ఒక హీరో, ఒక హీరోయిన్ ఇంత పోటాపోటీగా నటించిన గొప్ప సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’. చూస్తున్నంతసేపూ ఎమోషనల్ గా ఫీలవుతారు. చూశాక కూడా వెంటాడే సినిమా. ఈ సినిమాని ఒక మంచి నవల లాగా తయారుచేసిన క్రాంతిమాధవ్ కు థాంక్స్. తనలోని భావుకతను సినిమాల్లో చూపించగలుగుతాడు” అన్నారు.

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, “నాలుగేళ్ల క్రితం 2016లో ‘పెళ్ళిచూపులు’ అనే సినిమాతో తొలిసారి ఒక లీడ్ యాక్టర్ గా మీ ముందుకు వచ్చా. ఇప్పటికి ఏడు సినిమాలు రిలీజయ్యాయి. ఇది నా తొమ్మిదో సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్. ఈ నాలుగేళ్లలో హిట్లు కొట్టినం. చేతి నుంచి జారిపోయి మిస్సయిన సినిమాలున్నాయి. ఈ జర్నీలో రెండే రెండు స్థిరమైనవి ఉన్నాయ్. ఒకటి – మీరు (ఫ్యాన్స్). విజయ్ అంటే ఎవ్వడికీ తెల్వదు. అట్లాంటిది 2016 నుంచి ఇప్పుడు 2020 వరకు మీరు నాతోడు వస్తూనే ఉన్నారు. మనం కలిసి ఇంకా చాలా చాలా చెయ్యబోతున్నాం. ఇది జస్ట్ ప్రారంభమే. ఈ సంవత్సరం నుంచి కొత్త దశలోకి ఎంటరవుతున్నాం. రెండోది – నేను సిక్స్ కొట్టాలనే దిగుతా. ఈ సింగిల్, డబుల్ అనేది నాకు ఓపిక లేదు. కొడితే స్టేడియం బయటకు కొట్టాలని బ్యాట్ ఊపుతా. ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ చేసిన. తమిళ్ రాకున్నా నేర్చుకొని, ‘నోటా’ చేసిన. ‘డియర్ కామ్రేడ్’ సినిమాను ఐదు రాష్ట్రాల్లో రిలీజ్ చెయ్యాలని నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తూ, నేర్చుకున్నాం. ఊరూరూ తిరిగి మ్యూజిక్ కాన్సర్ట్స్ చేశాం. కొన్ని స్టేడియం బయట పడ్డాయి, కొన్ని బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ లు పడ్డాయి. కానీ భయమైతే లేదు. ఎప్పుడు దిగినా సిక్స్ కొట్టాలనే దిగుతా. ఇది నా లాస్ట్ లవ్ స్టోరీ అని మొన్న చెప్పిన. ఎందుకంటే నాకట్లా అనిపిస్తోంది. అంటే మనిషిలా మారుతున్నా. టేస్టులు మారుతున్నయి. సినిమాల్లో ఇంకో దశలోకి వెళ్తున్నా. లాస్ట్ లవ్ స్టోరీ చేసినప్పుడు అన్నీ కవర్ చెయ్యాలని మూడు రకాల మనుషుల్ని ఇందులో ప్లే చేసిన. మూడు రకాల ఆర్థిక స్థోమతలు, మూడు రకాల సిటీలు, నాలుగు రకాల ప్రేయసులు.. ఒక ఊరిలో ఉంటూ పెద్దగా చదువులేని బొగ్గుగనిలో పనిచేస్తూ భార్యాభర్తల ప్రేమకథ ఒకటైతే, దానికి పూర్తి విరుద్ధంగా వరల్డ్ బిగ్గెస్ట్ సిటీ ప్యారిస్ లో ఒక తెల్లపిల్లతో పైలెట్ గా ఇంకో ప్రేమకథ. హైదరాబాద్ లో కాలేజిలో ఒక అమ్మాయితో మరో ప్రేమకథ.. ఇన్ని విచిత్రమైన క్యారెక్టర్లు ఈ సినిమాలో చేసే స్క్రిప్టుతో క్రాంతిమాధవ్ నా దగ్గరకు వచ్చాడు. స్క్రిప్ట్ వినగానే ఇది నా ఫైనల్ లవ్ స్టోరీ అని ఫిక్సయి చేశా. ఇలాంటి క్యారెక్టర్ చేసే ఛాన్స్ నాకు మళ్లీ దొరకదు. ఎందుకంటే, బొగ్గుగనిలో శీనయ్య లాగా నేను ఉండను, అలా మాట్లాడలేను. అందుకే శీనయ్య రోల్ ను మస్తు ఎంజాయ్ చేశా. అలాగే ఒక ఫారిన్ పైలెట్ తో మనం రిలేషన్షిప్ లో ఉండం. అందుకే ప్యారిస్ ఎపిసోడ్ ను పూర్తిగా ఎంజాయ్ చేసిన. గౌతమ్ రోల్ మన లైఫ్ లో కొంచెం చూసినం. కానీ ఈ మూడు రోల్స్ ను ప్లే చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ఈ ఫిబ్రవరి 14న ఈ సినిమాకొచ్చి మీరందరూ ప్రేమలో పడతారనుకుంటున్నా. ఈ సినిమాతో మా ప్రొడ్యూసర్ కేఎస్ రామారావు గారికి సక్సెస్ వస్తుందని ఆశిస్తున్నా. ఇది క్రాంతిమాధవ్ సినిమా. మేమందరం యాక్టర్స్ అంతే. ఈ స్క్రిప్ట్, ఈ ఆత్మ, మొత్తం క్రాంతిది. ఈ సినిమా కోసం ఎంతో శ్రమించాడు. ఆయనకు అతిపెద్ద సక్సెస్ రావాలని ఆకాంక్షిస్తున్నా. గోపీసుందర్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాటోగ్రాఫర్ జయకృష్ణ గుమ్మడి చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఇకనుంచీ సిక్సులు కొట్టడానికే చూస్తా. ఫ్యాన్స్ అందరికీ థాంక్స్” అని చెప్పారు.


రాజ్‌తరుణ్‌, కొండా విజయ్‌కుమార్‌, కె.కె.రాధామోహన్‌ ల ‘ఒరేయ్‌ బుజ్జిగా…’ ఫస్ట్ లుక్ విడుదల

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా…’ ఈ చిత్రం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. సమ్మర్ స్పెషల్ గా విడుదల చేయనున్నారు. హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ మాళవిక నాయర్ లతో కూడిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఫిబ్రవరి 10 ఉదయం 10:10 లకు చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ ” మా ‘ఒరేయ్ బుజ్జిగా…’ ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నాం . ప్రస్తుతం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. రాజ్‌ తరుణ్‌ కి తగిన యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. సమ్మర్ స్పెషల్ గా చిత్రాన్ని విడుదల చేయనున్నాం. మా బ్యానర్ లో ‘ఏమైంది ఈ వేళ’, ‘అధినేత’, ‘బెంగాల్ టైగర్’, ‘పంతం’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ ఇది. రాజ్ తరుణ్, కొండా విజయ్ కుమార్, అనూప్ రూబెన్స్ లకు, మా బ్యానర్ కు తప్పకుండా మా ‘ఒరేయ్‌ బుజ్జిగా…’ చాలా మంచి కమర్షియల్ సినిమా అవుతుంది” అన్నారు.

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డాన్స్‌: శేఖర్‌, ఆర్ట్‌: టి.రాజ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌.


యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ టాలీవుడ్ ఎంట్రీ

యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ టాలీవుడ్ ఎంట్రీ
‘మా పల్లెలో గోపాలుడు, జెంటిల్‌మెన్, ఒకే ఒక్కడు, జైహింద్, పుట్టింటికి రా చెల్లి, హనుమాన్ జంక్షన్ వంటి సూపర్ సక్సెస్‌పుల్ చిత్రాలతో హీరోగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో సుస్థిరమైన స్థానం పొందిన నటుడు అర్జున్ సర్జా. హీరోగానే కాకుండా దేశభక్తి విషయంలోనూ అర్జున్ ప్రథమస్థానంలో నిలుస్తారు. కాగా, అర్జున్ పెద్ద కుమార్తె ఐశ్వర్య అర్జున్ పుట్టినరోజు నేడు (ఫిబ్రవరి 10). ఈ నేపథ్యంలో అర్జున్ తన కుమార్తె ఐశ్వర్య అర్జున్‌ను టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నారు. తన స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్ర పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు

Processed with VSCO with aga1 preset Processed with VSCO with al3 preset



Bheeshma: Sara Sari Song

* ‘భీష్మ’ నుంచి ‘సరాసరి’ గీతం విడుదల
* నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ‘భీష్మ’
* ఫిబ్రవరి 21 న విడుదల

‘భీష్మ’
నితిన్,రష్మిక మందన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం ‘భీష్మ’.
ఈ చిత్రంలోని మరో గీతం ఈరోజు అధికారికంగా సామాజిక మాధ్యమం అయిన ‘యు ట్యూబ్’ ద్వారా విడుదల అయింది. హీరో నితిన్, నాయిక రష్మిక మందన బృందంపై చిత్రీకరించిన ఈ గీతానికి శేఖర్ మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు. రాజమండ్రి పరిసర ప్రాంతాలలో ఈ పాట చిత్రీకరణ జరిగింది. గీత రచయిత శ్రీమణి సాహిత్యానికి, సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ స్వరాలు సమకూర్చగా, గాయకుడు అనురాగ్ కులకర్ణి గాత్రంలో ప్రాణం పోసుకుందీ పాట. ‘సరాసరి’ పేరుతో విడుదలయిన ఈ గీతానికి సంగీత ప్రియులనుంచి, అభిమానులనుంచి విశేష స్పందన లభించింది. నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం ఫిబ్రవరి 21 న విడుదల కానుంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ …ఈ చిత్రం లోని మరో గీతం ఈరోజు విడుదల అయింది. ‘సరాసరి’ పేరుతో విడుదల అయిన ఈ గీతానికి ప్రేక్షకాభిమానులనుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ గీతానికి శేఖర్ మాస్టర్ సమకూర్చిన నృత్య రీతులు అభిమానులను అలరిస్తాయి. ఈ చిత్రం నుంచి విడుదల అవుతున్న ప్రతి గీతానికి ప్రేక్షకాభిమానులనుంచే కాక, సామాజిక మాధ్యమాలలో సైతం విశేషమైన ప్రాచుర్యం లభిస్తోంది. ‘భీష్మ’ చిత్ర కధ,కధనాలు,సన్నివేశాలు,సంభాషణలు చాలా కొత్తగా ఉంటాయి. ‘భీష్మ’ ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్.. వినోద ప్రధానంగా సాగుతుంది అని తెలిపారు దర్శకుడు వెంకీ కుడుముల.

నటీ,నటులు :
నితిన్,రష్మిక మండన,నరేష్,సంపత్,రఘుబాబు,బ్రహ్మాజీ,నర్రా శ్రీనివాస్,వెన్నెల కిషోర్,అనంత నాగ్,శుభలేఖ సుధాకర్,జస్సెన్ గుప్త, సత్యన్, మైమ్ గోపి, సత్య, కల్యాణి నటరాజన్,రాజశ్రీ నాయర్,ప్రవీణ తదితరులు నటిస్తున్నారు.
మ్యూజిక్ : మహతి స్వర సాగర్ , డి .ఓ .పి : సాయి శ్రీరామ్ , ఆర్ట్ డైరెక్టర్ : సాహి సురేష్,
ఎడిటర్ : నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం(వెంకట్ ),
సమర్పణ : పి.డి .వి. ప్రసాద్ ,
ప్రొడ్యూసర్: సూర్యదేవర నాగ వంశి ,
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : వెంకీ కుడుముల.




లక్ష్ లోని ప్యాషన్ ‘వలయం’ ట్రైలర్ లో కనిపించింది- హీరో అడివి శేష్

లక్ష్ లోని ప్యాషన్ ‘వలయం’ ట్రైలర్ లో కనిపించింది
– హీరో అడివి శేష్

లక్ష్ హీరోగా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వరా ఫిలిమ్స్ బ్యానర్ పై పద్వామవతి చదలవాడ నిర్మిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘వలయం’. చదలవాడ బ్రదర్స్ సమ ర్పిస్తోన్న ఈ చిత్రం ద్వారా రమేష్ కడుముల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. దిగంగన సూర్యవంశీ నాయికగా నటించిన ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీత దర్శకుడు. ఫిబ్రవరి 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆదివారం ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్ లో జరిగిన కార్యక్రమంలో హీరో అడివి శేష్ ‘వలయం’ ట్రైలర్ ను ఆవిష్కరించారు.

సీనియర్ డైరెక్టర్ కె.ఎస్. నాగేశ్వరరావు మాట్లాడుతూ, “నేను 20 సినిమాలు డైరెక్ట్ చేస్తే, వాటిలో 5 సినిమాలు ఈ బ్యానర్ లోనే చేశాను. లక్ష్ బార్న్ ఆర్టిస్ట్. నేను డైరెక్ట్ చేసిన ‘రిక్షా రుద్రయ్య’లోనే తను తొలిసారి నటించాడు. ‘వలయం’ సూపర్ హిట్ కావాలని ఆశిస్తున్నా” అన్నారు.

నిర్మాత శోభారాణి మాట్లాడుతూ, “ఇంతకు ముందు రిలీజ్ చేసిన టీజర్ కొత్తగా అనిపించింది. ఇప్పుడు ట్రైలర్ చూశాక సినిమా మీద మరింత ఆసక్తి పెరిగింది. లక్ష్ కొత్తగా కనిపిస్తున్నాడు. అతని బాడీ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్ గా కనిపిస్తోంది. అతను డెడికేషన్ ఉన్న నటుడు. ‘వలయం’ బాగా ఆడి నిర్మాతలకు కనక వర్షం కురిపిస్తుందని ఆశిస్తున్నా” అన్నారు.

ఈ సినిమాకు డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు, హీరో లక్ష్ కు థాంక్స్ చెప్పుకుంటున్నానని డైరెక్టర్ రమేష్ కడుముల తెలిపారు.

నటుడు రవిప్రకాశ్ మాట్లాడుతూ అంతా తానే అయ్యి, ఈ సినిమాని లక్ష్ నిర్మించారనీ, ఒక జెన్యూన్ ఫిలింగా ‘వలయం’ను దర్శకుడు రూపొందించారనీ అన్నారు. లక్ష్ చాలా బాగా నటించాడన్నారు.

డైరెక్టర్ నాగు గవర మాట్లాడుతూ, లక్ష్ ఒక విజనరీ యాక్టర్ అనీ, ‘వలయం’ ఆయనకు కంబ్యాక్ లాంటి సినిమా అనీ అన్నారు.

డైరెక్టర్ చంద్రమహేష్ మాట్లాడుతూ ఒకవైపు నిర్మాతగా, మరోవైపు హీరోగా రెండు బాధ్యతల్ని ఈ సినిమాతో లక్ష్ చక్కగా నిర్వర్తించాడని చెప్పారు. టీజర్, ట్రైలర్ చాలా బాగున్నాయన్నారు.

సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర మాట్లాడుతూ, “ఇది సూపర్బ్ కాన్సెప్ట్ తో చేసిన సినిమా. సస్పెన్స్, థ్రిల్లింగ్, లవ్ ఎలిమెంట్స్ తో డైరెక్టర్ రమేష్ చాలా బాగా తీశారు. ఆయన చాలా క్లారిటీ, మ్యూజిక్ టేస్ట్ ఉన్న డైరెక్టర్. లక్ష్ క్యారెక్టర్ తో పాటు ప్రతి క్యారెక్టర్ కూ ఈ సినిమాలో ప్రాముఖ్యం ఉంటుంది. తప్పకుండా సినిమా ఆడుతుందని ఆశిస్తున్నా” అన్నారు.

చిత్ర సమర్పకుడు చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ, “పోసాని కృష్ణమురళికి రైటర్‌గా మా బేనర్‌లోనే ‘అడవి దొర’, ‘వాల్మీకి’ సినిమాలకు అడ్వాన్స్ ఇచ్చాను. కె.ఎస్. నాగేశ్వరరావు మేం నిర్మించిన ‘రిక్షా రుద్రయ్య’ సినిమాతో డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అయ్యాడు. అదే సినిమాలో మా అబ్బాయి హీరో తమ్ముడిగా నటించాడు. మేం రిలీజ్ చేసిన ‘బిచ్చగాడు’ 20 ఏళ్ల కాలంలో అత్యధిక మార్జిన్‌తో కలెక్షన్లు వసూలు చేసిన సినిమా. లక్ష్ పెద్ద హీరోగా పేరు తెచ్చుకుంటే సంతోషమే కానీ మంచి కొడుకుగా ఉంటే ఇంకా సంతోషం. అతను అడివి శేష్ లాగా సక్సెస్ అవుతాడని ఆశిస్తున్నా” అన్నారు.

హీరో లక్ష్ మాట్లాడుతూ, “నేను శశికాంత్ గా ప్రేక్షకులకు ఇంతదాకా తెలుసు. ఇప్పుడు లక్ష్ గా మీ ముందుకు వస్తున్నా. నేను స్పోర్ట్స్ ఆడేవాడ్ని కాబట్టి టీం ఎఫర్ట్ అనేది ఎంత ముఖ్యమో నాకు తెలుసు. ‘వలయం’ అనేది నా ఒక్కడి సినిమా కాదు. మా టీం అంతా ఎంతో కష్టపడితే వచ్చిన సినిమా. మా నాన్న నాకో చాన్స్ ఇచ్చారు. ఆయన సపోర్ట్ లేకపోతే మళ్లీ ఇలా వచ్చేవాడ్ని కాదు. ఈ నెల 21న సినిమాని విడుదల చేస్తున్నాం. ఈసారి సక్సెస్ అవుతానని ఆశిస్తున్నా. నా ఫ్రెండ్ శేష్ అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నా” అన్నారు.

హీరో అడివి శేష్ మాట్లాడుతూ, “లక్ష్ నాకు మొదట నైబర్. తర్వాత ఫ్రెండ్ అయ్యాడు. ఒక డ్రీమ్ ఉండటం, ఒక ప్యాషన్ తో పాటు ఒక పెయిన్ ఉండటం, ఆ పెయిన్ తో పనిచేయటం, వాటి ఫలితం, పడిపోవటం.. ఆ అనుభవాలన్నీ నాకు ఉన్నాయి. నిజం చెప్పాలంటే నేను ఫ్రెండ్షిప్, రిలేషన్స్ కన్నా కూడా ప్యాషన్ నే ఎక్కువ నమ్ముతాను. ఆ ప్యాషన్ ఉన్నప్పుడే మనందరం ఉంటాం అనేది నా నమ్మకం. ఆ ప్యాషన్ లక్ష్ లో ఉంది. అది ట్రైలర్ లో కనిపించింది. జెన్యూన్ గా ట్రైలర్ నాకు నచ్చింది. సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. అడ్వాన్స్ గా కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నా” అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో నటులు నోయల్, రఘురాం శ్రీపాద, సినిమాటోగ్రాఫర్ రామకృష్ణ కూడా మాట్లాడారు.

తారాగణం:

లక్ష్, దిగంగన సూర్యవంశీ, రవిప్రకాష్, నోయల్, రవివర్మ, చిత్రం శ్రీను, కిరీటి, రఘురాం శ్రీపాద, కృష్ణేశ్వరరావు

సాంకేతిక బృందం:

సంగీతం: శేఖర్ చంద్ర

సినిమాటోగ్రఫీ: రామకృష్ణ ఎస్.

ఎడిటింగ్: ఉపేంద్ర

ఆర్ట్: బ్రహ్మ కడలి

పీఆర్వో: వంశీ-శేఖర్

ప్రొడక్షన్ కంట్రోలర్: శ్రీనివాస్ అక్కినేని

సమర్పణ: చదలవాడ బ్రదర్స్

నిర్మాత: పద్మావతి చదలవాడ

దర్శకుడు: రమేష్ కడుముల

బ్యానర్: శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వరా ఫిలిమ్స్

రిలీజ్ డేట్: 21 ఫిబ్రవరి 2020