నన్ను సరికొత్తగా చూడాలన్న నాన్నగారి అభిమానుల, నా అభిమానుల కోరికను `సరిలేరు నీకెవ్వరు`తో
నెరవేర్చిన అనిల్ రావిపూడి గారికి థ్యాంక్యూ- సూపర్‌స్టార్ మహేశ్.
సూపర్‌స్టార్ మహేశ్ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌సమర్పణలోజి.ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్‌టైనర్ ’సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది.ఈ సందర్భంగా `సరిలేరు నీకెవ్వరు` బ్లాక్ బస్టర్ కా బాప్ సెలబ్రేషన్స్‌ను జనవరి 17 (శనివారం)న వరంగల్ హన్మకొండ జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో అశేష అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి వర్యులు ఎర్ర బెల్లి దయాకర్ రావు, ఎంఎల్ఏ వినయ్ భాస్కర్, వరంగల్ సిపి రవిందర్ పాల్గొన్నారు. ‘సరిలేరు నీకెవ్వరు` చిత్రం మొదటి వారంలోనే 100 కోట్ల షేర్ రాబట్టిన సందర్భంగా చిత్ర డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ సంయుక్తంగా
పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో…
యాక్షన్ కొరియోగ్రాఫర్స్ రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ మాట్లాడుతూ – “ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’ వరుసగా మూడు సినిమాలలో మాకు అవకాశం ఇచ్చిన మహేష్ బాబు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఫైట్ సీక్వెన్సులకి మంచి రెస్పాన్స్ వస్తోంది. మీరిచ్చే ప్రోత్సాహంతోనే ఇంత దూరం రాగలిగాము. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి ధన్యవాదాలు” అన్నారు.
నటుడు అజయ్ మాట్లాడుతూ – ” మహేష్ గారితో `ఒక్కడు` సినిమా నుండి అసోసియేట్ అవుతున్నాను. మళ్ళీ ఇన్నేళ్లకి కొండా రెడ్డి బురుజు దగ్గర సెట్ చూడగానే నోస్టాలజి ఫీలింగ్ వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి గారికి, నిర్మాత అనిల్ సుంకర గారికి ధన్యవాదాలు” అన్నారు.
దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ – “చాలా పాజిటివ్ వైబ్స్ మధ్య ఈ సినిమా ప్రారంభం అయింది. అన్ని ఎమోషన్ ని పర్ఫెక్ట్ గా కలగలిపి అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. హీరోయిజం కామెడీ అన్ని అంశాలు ఉండేలా చాలా శ్రద్ద తీసుకున్నారు. ఈ సినిమా స్టోరీ లైన్ వినగానే గుంటూరు ఏరియా డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని తీసుకొని పద్మాకర్ సినిమాస్ ద్వారా రిలీజ్ చేశాం. అక్కడ మహేష్ బాబు గారి కెరీర్ బిగ్గెస్ట్ కలెక్షన్ ని ఈ సినిమా క్రాస్ చేసింది. సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఇప్పుడే చెప్పలేము. తెలుగు సినీ పరిశ్రమకి ఈ సంక్రాంతికి గొప్ప వరం ‘సరిలేరు నీకెవ్వరు” అన్నారు.
నటుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ – “పండుగ అంటే అర్ధం ఏంటో నా కళ్లతో చూస్తున్నాను. ఈ పండుగకి పండుగ చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి, అలాగే సినిమా అంతా వారి పక్కనే ఉండి నటించే అవకాశం ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ గారికి మరియు చిత్ర నిర్మాతలకి నా ప్రత్యేక ధన్యవాదాలు. చాలా సంవత్సరాల తర్వాత విజయశాంతి గారితో నటించే అవకాశం దక్కింది. ఈ సినిమా ఇంత పెద్ద విజయవంతం కావడానికి కారణమైన ప్రేక్షకులకి ధన్యవాదాలు” అన్నారు.
డైరెక్టర్ వంశీ పైడిపల్లి మాట్లాడుతూ – “ఇంతకు ముందే డిస్ట్రిబ్యూటర్స్ చెప్పారు మొదటి వారంలోనే లాభాలు వస్తున్నాయని..ఈ సినిమా బ్లాక్ బస్టరా అంతకుమించా అనేది ఎంత చెప్పిన సరిపోదు. 13 ఏళ్ల తర్వాత విజయశాంతి గారు మంచి పాత్రలో నటించారు. అనిల్ సుంకర గారికి దిల్ రాజు గారు మంచి సపోర్ట్ ఇచ్చారు . దేవి మహేష్ గారికి వరుసగా మూడు సినిమాలకి బ్లాక్ బస్టర్ ఆల్భమ్స్ ఇచ్చారు. మహర్షి సక్సెస్ మీట్ లో అనిల్ చెప్పారు మహేష్ గారిలో ఒక హ్యాపినెస్ చూస్తున్నాను అది కంటిన్యూ చేస్తాను అని. దానికి మించి హ్యాపినెస్ ఇచ్చాడు అనిల్. దీనికి మించిన హ్యాపినెస్ ని కొనసాగించాల్సిన భాద్యత ఇప్పుడు నాది. తప్పకుండా కంటిన్యూ చేస్తాను” అన్నారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ – “ఈరోజు చాలా హ్యాపీ గా ఫీల్ అవుతున్నా..ఎందుకంటే వరంగల్ పట్టణంలో దిల్ రాజు గారు రెండవ ఫంక్షన్ ని నా మాట మీద ఏర్పాటు చేశారు. అందుకు ఆయనకు నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన మాస్ లీడర్, మా మిత్రులు కృష్ణ గారి కొడుకు మహేష్ గారికి స్వాగతం. మహేష్ స్వయంగా ఫోన్ చేసి వరంగల్ వస్తున్నాను. ఈవెంట్ ని సక్సెస్ చేయాలి అని కోరినప్పుడు చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాను. అలాగే డైనమిక్ లీడర్ విజయశాంతి గారికి దన్యవాదాలు. దాదాపు గా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్. మీరందరిని ఒక్కటే కోరుకుంటున్నాను హైదరాబాద్ తర్వాత వరంగల్ ని సినీ పరిశ్రమకు అడ్డాగా మీరు ఎన్నుకోవాలి. దానికి నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చినందుకు మహేష్ బాబు గారికి దన్యవాదాలు. మీరు కృష్ణ గారి కొడుకు.. మీరు వస్తానంటే మా వరంగల్ ప్రజలు పండుగ చేసుకుంటారు. మీరింకా సక్సెస్ అవుతారు. నెం1 హీరో అవుతారు” అన్నారు.
మొదటి వారంలోనే 100 కోట్ల షేర్ ని అనౌన్స్ చేయడం సంతోషంగా ఉంది!!
చిత్ర నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ – “అందరూ బాబు ఈ సినిమాలో మాస్ చేశారు బ్లాక్ బస్టర్ కావాలి అన్నారు. కానీ బ్లాక్ బస్టర్ సరిపోలేదు బ్లాక్ బస్టర్ కా బాప్ అయింది. మైండ్ బ్లాక్ ఒక్క సాంగ్ చాలు సినిమా ఏ రేంజ్ కి తీసుకువెళ్తుంది అనేదానికి. ఈరోజు ఏడవ రోజు డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ప్రాఫిట్స్ లోకి వచ్చారని వారి మోహంలో చిరునవ్వు కనిపిస్తుంది. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చి మొదటి రోజు నుండి మాకున్న నమ్మకాన్ని కలెక్షన్స్ రూపంలో తీసుకువచ్చారు. మహేష్ బాబు అభిమానిగా నాది ఒకటే కోరిక ప్రతి సినిమాలో ఒక మైండ్ బ్లాక్ సాంగ్ కావాలి. ఎందుకంటే థియేటర్ లో సినిమా చూస్తున్నప్పుడు సినిమా అంతా ఒక ఎత్తు మైండ్ బ్లాక్ సాంగ్ ఒకెత్తు. అన్ని వయసుల వారు డాన్స్ వేస్తున్నారు. అలాగే 13 ఏళ్ల తర్వాత విజయశాంతి గారు నటించారు. ఆమెకు ఇది పర్ఫెక్ట్ రీ ఎంట్రీ అని మేము భావిస్తున్నాము. దూకుడు సినిమాకి 100కోట్ల గ్రాస్ ని నేనే అనౌన్స్ చేశాను. ఇప్పుడు మొదటి వారంలోనే 100 కోట్ల షేర్ ని అనౌన్స్ చేయడం సంతోషంగా ఉంది. ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకి నా నమస్కారాలు” అన్నారు.
ఏడు రోజుల్లోనే ఒక సినిమా ప్రాఫిట్స్ లోకి వెళ్లడం చాలా అరుదు!!
చిత్ర సమర్పకులు దిల్ రాజు మాట్లాడుతూ – “మా సినిమా సక్సెస్ అయితే తిరుపతికి వస్తాము అని మొక్కుకున్నాం. మాములుగా తిరుపతి వెళ్లి ఇంటికి వెళ్తాము.. కానీ ఇదే మా ఇల్లు అనుకొని మా యూనిట్ మొత్తం తిరుపతికి వెళ్లి నేరుగా వరంగల్‌కే వచ్చాం. రెండు రోజుల్లోనే ఈ ఫంక్షన్ కి అన్ని ఏర్పాట్లు చేసిన ఎర్రబెల్లి దయాకర్ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ కి మా దన్యవాదాలు. ఆరు ఏడు రోజుల్లోనే ఒక సినిమా ప్రాఫిట్స్ లోకి వెళ్లడం అనేది చాలా అరుదు అది మా సినిమాకి వచ్చినందుకు హ్యాపీ. మా దర్శకుడు అనిల్ రావిపూడి చేసింది అయిదు సినిమాలు. అయిదు సినిమాలతో డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ ని హ్యాపీ గా ఉంచడం ఒక్క అనిల్ కే సాధ్యం అయింది. అనిల్ ఇలాగే సక్సెస్ ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. విజయశాంతి గారు 13 ఏళ్ల తరువాత మా సినిమాలో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది. మహేష్ గారు ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’తో హ్యాట్రిక్ సాధించారు. ఆయన సక్సెస్ లు ఇలానే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ – “మహేష్ బాబు గారితో ఇలాంటి జోనర్ చేయాలని చాలా రోజుల నుండి కోరిక ఉంది. అది మీ ద్వారా నెరవేరినందుకు అనిల్ రావిపూడి గారికి దన్యవాదాలు. నామీద నమ్మకంతో ప్రతి సినిమా నాకు ఇస్తున్న మహేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాలో ఎవరు ఊహించని విధంగా పెర్ఫామ్ చేశారు. మైండ్ బ్లాక్ సాంగ్ అదరగొట్టారు. ఈ అవకాశం ఇచ్చిన అనిల్ సుంకర గారికి, దిల్ రాజు గారికి నా కృతజ్ఞతలు” అన్నారు.
హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడుతూ – “నాకు ఈ సినిమాలో నటించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. ఈ అవకాశం ఇచ్చిన మహేష్ బాబు గారికి, అనిల్ రావిపూడి గారికి, అలాగే అనిల్ సుంకర, దిల్ రాజు గారికి ధన్యవాదాలు“అన్నారు.
నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సక్సెస్ చూస్తున్నాను!!
యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ – “ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులందరికీ నా పాదాభివందనం. మహర్షి సక్సెస్ మీట్లో అన్నాను.. మహేశ్ సర్ నా సినిమాతో మీ మోహంలో నవ్వు కావాలి, మిమ్మల్ని ఆనందంగా చూడాలి అని. సినిమా విడుదలైనప్పటి నుండి ఆయనతోనే ఉంటున్నాను. ఆయన ఎంతో సంతోషంగా ఉంటున్నారు. ఇంత పెద్ద ఫంక్షన్ ని ఏర్పాటు చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి, ఈ సినిమాలో నటించిన నటీనటులు, టెక్నీషన్స్ కి నా హృదయపూర్వక దన్యవాదాలు. విజయశాంతి గారిది వరంగల్. ఆమె మా ఒప్పుకొని నటించినందుకు ధన్యవాదాలు. బాబు బ్యాటింగ్ మొదలయింది. మొదటి వారం రోజుల్లోనే 100 కోట్ల షేర్ తెచ్చారు. ఇంకా ఎంత దూరం తీసుకెళ్తారో తెలీదు. ఇది నాకు ఐదవ సినిమా ప్రతి సినిమా హిట్ చేశారు. మీ వల్ల నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సక్సెస్ చూస్తున్నాను. అదేకాదు ఈ కథ విన్నప్పుడు మహేశ్ గారికి ఉన్న నమ్మకం, షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయనకున్న కాన్ఫిడెన్స్, డబ్బింగ్ జరిగాక ఆయనకున్న ప్రిడిక్షన్, సినిమా విడుదలైన మొదటి రోజు ఆయనిచ్చిన జడ్జి మెంట్ అన్ని నిజమయ్యాయి. మహేశ్ గారు మీ క్లారిటీకి, మీ విజన్ కి, మీ ఎక్స్పీరియన్స్ కి టేక్ ఏ బౌ..మా నిర్మాతలు దిల్ రాజు గారితో ఐదవ సినిమా. థాంక్స్ మీట్ లో కనివిని ఎరుగని రీతిలో బాక్స్ ఆఫీస్ రెవెన్యూ చూడబోతున్నారు అని చెప్పారు. అలాగే ఇచ్చారు. ఇక అనిల్ సుంకర గారు మొదటి రోజు ఒక మాట అన్నారు మా బాబు కి బ్లాక్ బస్టర్ సరిపోదు బ్లాక్ బస్టర్
కా బాప్ కావాలని. అలాగే జరిగింది. నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చిన ప్రతి హీరోకి నా కృతజ్ఞతలు. నాకు తెలిసిన సినిమా ఒకటే నా ప్రొడ్యూసర్ గల్లాలో డబ్బులు, ప్రేక్షకుల ఫేస్ లో నవ్వులు. నాకు తెలిసిన స్టేట్ మెంట్ ఇదే. దాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకి దన్యవాదాలు” అన్నారు.
మన ఓరుగల్లు..సరిలేరు సినిమాకి ప్రజలు అందిస్తున్న ఓరుజల్లు!!
లేడీ అమితాబ్ విజయశాంతి మాట్లాడుతూ – “మన ఓరుగల్లు..సరిలేరు సినిమాకి ప్రజలు నీరాజనం అందిస్తున్న ఓరుజల్లు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ‘సరిలేరు నీకెవ్వరు’సినిమాని బ్లాక్ బస్టర్ కా బాప్ గా నిలిపిన మీఅందరికి నా శిరసువంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 13 ఏళ్లకు ముందు మీ రాములమ్మ, మీ బిడ్డని ఏ రకంగా ఆదరించారో.. ఎంత గొప్ప స్థాయికి తీసుకెళ్లారో..నేను ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోవాలో తెలీట్లేదు. 13 ఏళ్ల తర్వాత సరిలేరు నీకెవ్వరు అనే మంచి సినిమా నాదగ్గరికి రావడానికి ముఖ్య కారణం అనిల్ రావిపూడి. కథ విన్నాను నచ్చింది.. చేశా.. హిట్ కొట్టాం అని తెలియజేసుకుంటున్నాను. భారతి ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచి పోయింది. సైనికుల తల్లి తండ్రుల భాద ఏంటి అనేది అనిల్ చక్కగా, సందేశాత్మకంగా చూపించారు.సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో ‘కొడుకు దిద్దన కాపురం’ సినిమాలో కలిసి నటించాను అది సూపర్ హిట్. ఇప్పడు `సరిలేరు నీకెవ్వరు` లో కలిసి నటించాను ఇది సూపర్ డూపర్ హిట్. బాబు తో పని చేయడం చాలా కంఫర్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారు. ఇంకా సినిమాలు చేయి రాములక్క అని అందరూ అడుగుతున్నారు. మీ అందరికి తెలుసు సబ్జెక్ట్ బాగుండాలి..పాత్ర దద్దరిల్లాలి అలాగైతేనే ఈ రాములక్క చేస్తుంది. ఎందుకంటే సినిమా ఒకటే కాదు రాజకీయం కూడా ఉంది. నేను ప్రజల మనిషిని ప్రజలకోసమే పనిచేస్తాను. మీరెప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
మీ ప్రేమకు, అప్యాయతకు, మీ అభిమానానికి టేక్ ఎ బౌ!!
సూపర్‌స్టార్ మహేష్ మాట్లాడుతూ – “అనిల్ రావిపూడి ఈ సినిమాలో ఎన్నో గొప్ప డైలాగ్స్ రాశాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు. కానీ రమణ లోడ్ ఎత్తాలిరా.. అనే డైలాగ్ మాత్రం బీభత్సంగా పేలింది. ఈరోజు స్వామి వారి దర్శనం తర్వాత వరంగల్‌కి వచ్చి ప్రేక్షకులకు కలుసుకోవడం ఆనందంగా ఉంది. మా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ 7 రోజుల్లో రూ.100 కోట్లు సాధించిందనే విషయాన్ని చెబుతూ ఓ పోస్టర్ విడుదల చేశారు. వారికి ఈ వేదికపై థ్యాంక్స్ చెబుతున్నాను. యాక్షన్ కంపోజ్ చేసిన రామ్ లక్ష్మణ్ మాస్టర్స్‌కి, సినిమాటోగ్రాఫర్ రత్నవేలుగారికి, ఈ సినిమాకు బెస్ట్ మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్‌కి థ్యాంక్స్. కథ వినగానే, మాస్ సాంగ్ చేయడానికి ఛాన్స్ ఉందని అప్పుడే దేవిశ్రీ చెప్పాడు. అలా వచ్చిందే మైండ్ బ్లాక్ సాంగ్. అలాగే శేఖర్ మాస్టర్ అద్భుతంగా ఈ సాంగ్‌ను కంపోజ్ చేశారు. నా 20 ఏళ్ళ కెరీర్‌లో ఇంత రెస్పాన్స్‌ను ఎప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. శేఖర్ మాస్టర్, దేవిశ్రీ , అనిల్ రావిపూడికి థ్యాంక్స్. విజయశాంతిగారితో `కొడుకు దిద్దిన కాపురం` చిత్రానికి పనిచేశాను. తర్వాత ఆవిడతో థర్టీ ఇయర్స్ తర్వాత పనిచేసే అవకాశం ఈ సినిమాకే కలిగింది. ఆవిడను కలిసినప్పుడు `కొడుకు దిద్దిన కాపురం` నిన్నే చేసినట్లు అనిపించింది. `కొడుకు దిద్దిన కాపురం` పెద్ద హిట్టు.. `సరిలేరు నీకెవ్వరు` ఎంత పెద్ద బ్లాక్ బస్టరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెతో పనిచేయడం మెమొరబుల్ ఎక్స్‌పీరియెన్స్. మళ్లీ ఆవిడతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను. రష్మిక స్వీటెస్ట్ కోస్టార్. రాజేంద్రప్రసాద్‌గారితో పనిచేయడం అమేజింగ్‌గా అనిపించింది. `సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు`, `మహర్షి` చిత్రాల తర్వాత దిల్‌రాజుగారితో ఈ సినిమాకు పనిచేయడం చాలా గొప్పగా ఉంది. హ్యాట్రిక్ హిట్ సాధించాం. దిల్‌రాజుగారు కేవలం నిర్మాత మాత్రమే కాదు.. మంచి డిస్ట్రిబ్యూటర్ కూడా. సినిమాను ప్రేక్షకులకు ఎలా రీచ్ చేయించాలో బాగా తెలిసిన నిర్మాత. ఆయనతో కలిసి మరో హ్యాట్రిక్ ఇవ్వబోతున్నాం. ఇక నిర్మాత అనిల్ సుంకర విషయానికి వస్తే .. అందరి కంటే ఆయన పెద్ద అభిమాని. ఈరోజు ఆయన కోరిక తీరినందుకు ఆనందంగా ఉంది. ఆయనతో జర్నీ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా డైరెక్టర్ అనిల్ .. తను ముందు 40 నిమిషాల నేరేషన్ మాత్రమే ఇచ్చాడు. తనలో ఎనర్జీ చూసి ఇది ముందు చేయడానికి కుదురుతుందా? అనగానే మొత్తం స్క్రిప్ట్‌ను రెండు నెలల్లోనే సిద్ధం చేసి ఇచ్చాడు. దానికి కారణం నాన్నగారి,నా అభిమానులే. నాలుగైదేళ్లుగా అందరూ కొత్త మహేష్ కోరుకుంటున్నారని తెలుసు. కంటెంట్ బేస్డ్ సినిమాలు, వేరే జోనర్ సినిమాలు చేశాను. సినిమా చేసేటప్పుడు అభిమానులు ఎప్పుడూ నా గుండెల్లోనే ఉంటారు. ప్రేక్షకులు, అభిమానులను దృష్టిలో పెట్టుకునే స్క్రిప్ట్‌ను ఎంచుకున్నాను. నా కెరీర్‌లో నేను తీసుకున్న బెస్ట్ డిసిషన్ ఇదేనని ఫీల్ అవుతున్నాను. నాన్నగారి అభిమానులు, నా అభిమానుల తరపున అనిల్‌కి థ్యాంక్స్. వారి కోరికను తీర్చాను. ఈ సంక్రాంతిని ఎప్పటికీ మరచిపోను. ప్రేక్షకుల అభిమానుల అభిమానం వల్లే ఇలా దొరికింది. మీ ప్రేమకు, అప్యాయతకు, మీ అభిమానానికి టేక్ ఎ బౌ.. థ్యాంక్యూ“ అన్నారు.
ఈ కార్యక్రమంలో నటుడు బాబు,కౌముది, రచ్చ రవి, అజయ్, చిట్టి, చిత్ర డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ తదితరులు పాల్గొన్నారు.