X

నాకు తెలుసు.. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనేది నా లాస్ట్ లవ్ స్టోరీ!

నాకు తెలుసు.. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనేది నా లాస్ట్ లవ్ స్టోరీ!
– ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ

“ఈ ప్రపంచంలో నిస్వార్థమైనది ఏదైనా ఉన్నదంటే అది ప్రేమ ఒక్కటే. ఆ ప్రేమలో కూడా నేను అనే రెండక్షరాలు ఓ సునామీనే రేపగలవు. ఐ వాంటెడ్ టు బి ద వరల్డ్ ఫేమస్ లవర్”
“నా గుండెకు తగిలిన దెబ్బకి ఆ పెయిన్ తెలవకుండా ఉండాలంటే ఫిజికల్ గా ఈ మాత్రం బ్లీడింగ్ ఉండాలి” … ఇవి ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ట్రైలర్‌లో విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్స్. గురువారం ఈ ట్రైలర్ రిలీజైంది. అందర్నీ ఈ ట్రైలర్ అలరిస్తోంది.

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ ‘వరల్డ్ ఫేమస్ లవర్’. క్రాంతిమాధవ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని కె.ఎస్. రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎ. వల్లభ నిర్మిస్తున్నారు. విజయ్ సరసన నలుగురు హీరోయిన్లు – రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్ ట్రెసా, ఇజాబెల్లే లెయితే నటిస్తున్నారు. గోపీ సుందర్ సంగీత దర్శకుడు.
ఈ మూవీ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని ఐటీసీ షెరటాన్ హోటల్లో జరిగింది.

చిత్ర సమర్పకులు కె.ఎస్. రామారావు మాట్లాడుతూ, “ఐ ఫీస్ట్ లా ఉండేలా ఈ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ను క్రాంతిమాధవ్ తీర్చిదిద్దాడు. నలుగురు హీరోయిన్లు సినిమాలో ఉండగా, వారికి ఈక్వల్ గా విజయ్ దేవరకొండ సినిమాలో డామినేట్ చేస్తాడు. డైనమైట్ లా విజయ్ ఎలా చెయ్యగలగుతాడో, నటుడిగా ఆయనలోని మరో డైమెన్షన్ ను ఈ సినిమా చూపిస్తుంది. ఆ క్యారెక్టర్ ను క్రాంతిమాధవ్ చాలా బాగా చిత్రించాడు. విజయ్, రాశీ ఖన్నా ఒకరికొకరు పోటాపోటీగా నటించారు. ఒక ఫ్రస్ట్రేటెడ్ లవర్ గా నలుగురు హీరోయిన్లతో విజయ్ దేవరకొండ నటించిన విధానం నిజంగా ఎక్సలెంట్. హీరోగా నటిస్తూనే డైరెక్టర్ క్రాంతిమాధవ్‌కు విజయ్ దేవరకొండ అసోసియేట్ డైరెక్టర్ తరహాలో సలహాలిస్తూ పనిచేశాడు. ఇది ఆంధ్రా ప్రేక్షకుల సినిమాలా ఉండదు. హాలీవుడ్ సినిమాలా ఉంటుంది, హిందీ సినిమాలా ఉంటుంది. ఒక మంచి సినిమా తీసిన ఒకప్పటి తమిళ్ డైరెక్టర్ తీసిన సినిమాలా ఉంటుంది. ప్రతి సినిమా లవర్ కి ఇది నచ్చుతుంది. రాశీ ఖన్నా ఈ సినిమా కోసం ఎంత కష్టపడిందో నేను చూశాను. అలాగే ఫ్రాన్స్ లో తీసిన సన్నివేశాల్లో విజయ్ తో ఇజాబెల్లా ఎంతో లవ్లీగా కనిపిస్తుంది. నల్లటి బొగ్గుగనిలో తెల్లటి డైమండ్ లా కేథరిన్ మెరిసిపోతుంది. ఐశ్వర్యా రాజేష్ నేచురల్ గా నటించింది. విజయ్ దైతే స్టన్నింగ్ పర్ఫార్మెన్స్. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారకులైన క్రాంతిమాధవ్, విజయ్ లకు థాంక్స్” అన్నారు.

డైరెక్టర్ క్రాంతిమాధవ్ మాట్లాడుతూ, “ఫిబ్రవరి 14న సినిమా రిలీజవుతోంది. సినిమాలో అందరూ తమ పాత్రల్లో జీవించారు. ట్రైలర్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. విజయ్ దేవరకొండను ఇదివరకు మనం చాలా సినిమాల్లో చూశాం. ఈ సినిమాలో అతన్ని ఒక భిన్న తరహాలో చూపించాను. కంటెంట్ కు తగ్గ విధంగా నలుగురు హీరోయిన్లు, విజయ్ నటించారు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి క్షణాన్ని నేను ఆస్వాదించాను. అదే సమయంలో ఈ సినిమాతో ఎంతో నేర్చుకున్నాను. జయకృష్ణ గుమ్మడి వండర్ఫుల్ సినిమాటోగ్రఫీ అందించాడు. రామజోగయ్య శాస్త్రి, శ్రేష్ఠ, రెహమాన్ చాలా బాగా పాటలకు లిరిక్స్ రాశారు. ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ తర్వాత క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌లో ఇది నా రెండో సినిమా. దానికంటే ఈ సినిమాని ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను” అని చెప్పారు.

హీరోయిన్ ఇజాబెల్లా మాట్లాడుతూ ఈ సినిమాలో నటించినందుకు సంతోషంగా ఉందనీ, విజయ్ గొప్ప సహనటుడనీ అన్నారు.

హీరోయిన్ కేథరిన్ ట్రెసా మాట్లాడుతూ, “ఇలాంటి స్క్రిప్ట్ నా దగ్గరకు తీసుకొచ్చినందుకు డైరెక్టర్ క్రాంతిమాధవ్ కు నా థాంక్స్. ఇది కొత్త తరహా కథ. పాత్రల్ని రిపీట్ చెయ్యకుండా కాన్షియస్ గా సినిమాలు చేసుకుంటూ వస్తున్నా. ఈ సినిమాలో స్మిత అనే భిన్నమైన పాత్ర చేశా. వేలంటైన్స్ డేకి అందరూ దాన్ని ఎక్స్ పీరియెన్స్ చేస్తారని ఆశిస్తున్నా” అన్నారు.

హీరోయిన్ రాశీ ఖన్నా మాట్లాడుతూ, “ఈ సినిమా టీజర్ రిలీజయ్యాక చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. విజయ్ డబుల్ రోల్ చేస్తున్నాడా, ట్రిపుల్ రోల్ చేస్తున్నాడా అని డౌట్ పడ్డారు. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో, చేసిన పాత్రల్లో ఇందులోని యామిని పాత్ర బెస్ట్ అని చెప్పగలను. యామిని క్యారెక్ట చెయ్యడం నాకొక ఎమోషనల్ జర్నీ. సినిమా చూశాక కచ్చితంగా ప్రేక్షకుల అభిప్రాయం మారుతుంది. నా ఫ్యాన్స్ హ్యాపీగా, బహుశా గర్వంగా ఫీలవుతారు, ఇలాంటి పాత్ర చేసినందుకు. నన్ను నమ్మండి. అందరూ సినిమా చూసి ఆశ్చర్యపోతారు. ఇప్పటివరకూ నేను పనిచేసిన డైరెక్టర్లలో క్రాంతి మోస్ట్ సెన్సిబుల్ అండ్ మోస్ట్ ఎమోషనల్ డైరెక్టర్. స్టోరీయే ఈ సినిమాకి హీరో. ఇంతదాకా ఇలాంటి స్క్రీన్ ప్లేను నేను చూడలేదు. కొత్తదనం కావాలని కోరుకునే ప్రేక్షకులకు ఇది ట్రీట్ లా ఉంటుంది. విజయ్ దేవరకొండ ఫెంటాస్టిగ్గా నటించాడు. నటుడిగా అతడిని ఈ సినిమా ఇంకో స్థాయిలో నిలబెడుతుంది. కె.ఎస్. రామారావు గారు నాకు ఈ సినిమాకే కాకుండా, నా లైఫ్ లో ఒక తండ్రిలా కనిపించారు” అని చెప్పారు.

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, “విజయ్ దేవరకొండ సినిమా అంటే హడావిడి, ఎగ్జైట్‌మెంట్ ఉంటాయి. మళ్లీ వీడు ఏం సినిమా చేశాడని పబ్లిక్ లో ఎగ్జైట్ మెంట్ ఉంటుంది. ప్రొడ్యూసర్స్ లో ఎగ్జైట్ మెంట్ ఉంటుంది. వీడితో నలుగురు హీరోయిన్లు ఎందుకు చేస్తున్నారని ఎగ్జిబిటర్స్ లో, డిస్ట్రిబ్యూటర్స్ లో ఎగ్జైట్ మెంట్ ఉంటుంది. నాలుగు రెట్లు రిటర్న్స్ ఇస్తారనుకుంటూ ఉంటారు. ఈసారి నేనేం చెయ్యలేదు. నేను చేసిన సినిమాలన్నింటిలో ఈ సినిమాలోనే ఎక్కువ కష్టపడ్డా. అందరం చాలా ఎఫర్ట్ పెట్టి చేశాం. ఈ సినిమాకి నేనేం హడావిడు చెయ్యలేదు. ట్రైలర్ లాంచ్ చేశాం. ఫిబ్రవరి 9న ప్రి రిలీజ్ ఈవెంట్ ఉంది. ఇప్పుడు ఈ ట్రైలర్ తో బయట హడావిడి స్టార్ట్ అవుతుంది. నాకు తెలుసు.. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనేది నా లాస్ట్ లవ్ స్టోరీ. మనిషిలా కొంచెం మారుతున్నా. టేస్టులు కొంచెం మారుతున్నాయి. బేసికల్ గా లైఫ్ లో కొత్త దశలోకి వెళ్తున్నా. ఇది చేసేప్పుడే నాకు తెలుసు.. ఇదే నా లాస్ట్ లవ్ స్టోరీ అవబోతోందని. నా లాస్ట్ లవ్ స్టోరీలో నలుగురు బ్యూటిఫుల్ విమెన్ తో కలిసి పనిచేయడం గర్వంగా ఉంది. ఇది కల నిజమవడం లాంటిది. నలుగురూ తమ నటనతో చంపేశారు. నా లాస్ట్ లవ్ స్టోరీ కాబట్టి ఈ సినిమాని పూర్తిగా ప్రేమతో నింపేశాం. అన్ని రకాల ప్రేమ నింపి ఈ స్క్రిప్టును నా దగ్గరకు క్రాంతిమాధవ్ తీసుకొచ్చాడు. ఫిబ్రవరి 14న ఈ కంప్లీట్ ప్యాకేజ్ లవ్ స్టోరీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మించిన ఈ 47వ చిత్రం బిగ్ సక్సెస్ కావాలని ఆశిస్తున్నా. క్రాంతిమాధవ్ కు ఈ సినిమాతో అతిపెద్ద సక్సెస్ రావాలని ఆశిస్తున్నా” అని చెప్పారు.

Telugu BOX Office:
Related Post