‘త్వరలో వెంకీ పింకీ జంప్’కి క్లాప్ కొట్టిన మంత్రి హరీశ్‌రావు

‘త్వరలో వెంకీ పింకీ జంప్’కి క్లాప్ కొట్టిన మంత్రి హరీశ్‌రావు


‘ప్రేమ పిలుస్తోంది’ సినిమాతో ద‌ర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అజ‌య్ నాత‌రి, శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వర ఫిలింస్ కాంబినేషన్లో శ్రీమ‌తి ల‌క్ష్మీరేసు స‌మ‌ర్పణ‌లో వెంక‌ట్ ఆర్ నిర్మిస్తోన్న చిత్రం ‘త్వర‌లో వెంకీ పింకీ జంప్‌’. విక్రమ్, దేవ‌కి ర‌మ్య, హ‌ర్సిత హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రం ప్రారంభోత్సవం ఇటీవ‌ల ఘనంగా జ‌రిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీష్ రావు తొలి స‌న్నివేశానికి క్లాప్ కొట్టగా, మెద‌క్ ఎంపీ కొత్త ప్రభాక‌ర్ రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. మున్పిప‌ల్ ఛైర్మన్ రాజ‌న‌ర్సు‌, క‌ళాంజ‌లి రాజేష్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

అనంత‌రం మంత్రి హ‌రీష్ రావు మాట్లాడుతూ…‘పూర్తిగా తెలంగాణ యాస‌, భాష‌ల‌తో తెలంగాణ క‌ళాకారుల‌తో ఈ చిత్రం రూపొందుతోంది . సిద్దిపేట‌లోనే షూటింగ్ మొత్తం జ‌రుపుకోనుంది. టైటిల్ ఆస‌క్తిక‌రంగా ఉంది. నిర్మాత వెంక‌ట్‌కు, ద‌ర్శకుడు అజ‌య్‌కి ఈ సినిమా మంచి పేరు తీసుకురావాల‌ని కోరుకుంటున్నా’ అని అన్నారు.

నిర్మాత వెంక‌ట్ ఆర్ మాట్లాడుతూ…‘ప్రేమ పిలుస్తోంది’ చిత్రంతో ద‌ర్శకుడుగా పేరు తెచ్చుకున్న అజ‌య్ డైరెక్షన్లో రెండో సినిమాగా ఈ చిత్రాన్ని ప్రారంభించామని తెలిపారు. ల‌వ్ అండ్ రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నామని, రెండు నెల‌ల పాటు సింగిల్ షెడ్యూల్‌లో ఈ చిత్రాన్ని సిద్దిపేట ప‌రిస‌ర ప్రాంతాల్లో పూర్తి చేస్తామని దర్శకుడు తెలిపారు.