కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు ఎందుకు వెలిగించాలో తెలుసా?
Category : Behind the Scenes Daily Updates Features Sliders Spiritual
కార్తీక మాసంలో పౌర్ణమి రోజు శివాలయానికి వెళ్లి గాని ఇంటిలో తులసి చెట్టు దగ్గర కానీ ఉసిరి చెట్టు దగ్గర కానీ 365 వత్తులను వెలిగిస్తూ ఉంటాం. ఐతే చాలా మందికి 365 వత్తులను ఎందుకు వెలిగిస్తారో తెలియదు.
కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి పవిత్రమైనది. మహాశివరాత్రితో సమానమైన ఈ పుణ్యదినాన్ని ”త్రిపురి పూర్ణిమ”, ”దేవ దీపావళి” అని కూడా పిలుస్తారు. ఆశ్వయుజ అమావాస్య అంటే దీపావళి వెళ్ళిన మర్నాడు కార్తీకమాసం ప్రారంభమౌతుంది. ఇక ఆరోజు నుండి కార్తీకమాసం ముగిసేవరకూ ప్రతిరోజూ సాయంవేళ దీపాలు వెలిగిస్తారు. ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమిగా పేర్కొనబడింది. కార్తీక పౌర్ణమి అటు శివునికి, ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈరోజున దీపం వెలిగిస్తే మనం తెలిసీ తెలీక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి. కార్తీక సోమవారాల్లో, కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయానే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేస్తే మంచి ఫలితాలుంటాయి.
కార్తీక పౌర్ణమి నాడు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ వత్తులు. కొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేనివారు ఇంట్లోనే దేవునిముందు లేదా తులసికోట ఎదుట దీపం వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది.
నిత్యం ఇంటిలో ధూప,దీప నైవేద్యాలను పెడితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితం సాగుతుందని నమ్మకం. అయితే మనకు సంవత్సరంలో ప్రతి రోజు దీపం పెట్టే అవకాశం ఉండకపోవచ్చు. కొన్ని రోజులు దీపం పెట్టటానికి వీలు కాకపోవచ్చు. అందువలన కార్తీక మాసంలో పౌర్ణమి రోజు సంవత్సరంలో ఎన్ని రోజులు ఉన్నాయో అన్ని వత్తులను కలిపి ఆవునేతితో తడిపి ఒక కట్టగా వెలిగిస్తాం. ఇలా పౌర్ణమి రోజు 365 ఒత్తుల కట్టను వెలిగిస్తే సంవత్సరం పొడవునా దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది. అందువల్ల మన పెద్దలు కార్తీక పౌర్ణమి రోజు తులసి లేదా ఉసిరి చెట్టు కింద లేదా శివాలయంలో 365 వత్తుల కట్టను వెలిగించే సంప్రదాయాన్ని పెట్టారు.
కార్తీక పౌర్ణమి శ్లోకం
‘కార్తిక’ మాసం సంవత్సరంలోని సర్వమాసాలకంటే మహిమాన్వితమైనది. కార్తీక మాసం నెలరోజులూ రోజూ సాయం సంధ్య వేళ పూజా స్థలములో, తులసి కోటవద్ద, ఇంటిముందు దీపాలను వెలిగించి నమస్కరించే ఆచారం మన హిందువులకు అనాదిగా వస్తున్నది. రోజూ కుదరకపోయినా కార్తీక పూర్ణిమ నాడు తప్పక వెలిగిస్తారు. అలా వెలిగించిన దీపంలో దామోదరుని ఆవాహన చేసి, ఈక్రింది శ్లోకాన్ని చెప్పి ప్రార్థన చేయాలి.
కీటాఃపతంగాః మశకా శ్చ వృక్షాః
జలేస్థలే… ఫలే ఏ నివసంతి
జీవా దృష్ట్యా ప్రదీపం నచ జన్మ భాగినః
భవతింత్వ స్వపచాహి విప్రాః
చీమలు, ఈగలు, దోమలు, పురుగులు, వృక్షాలు, జలచరాలు, భూచరాలు ఒకటేమిటి ఈ భూమిమీద నివసించే ప్రతీ ఒక్కజీవికీ కూడా ఈదీపం వెలుతురుని దర్శించ గానే ఇక మరుజన్మ అంటూ లేని అనంత పుణ్యాన్ని పొందాలి. కార్తీక మాసమంతా స్నానం, దానం ఉపవాసం చేసే శక్తిలేని వారు కనీసం ఒక్క కార్తీక పౌర్ణమి నాడైనా వీటిని ఆచరిస్తే కార్తీక పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రోక్తి. ఈ మాసంలో ఉపవాసం పాటించేవారు ఏక భుక్తం, నక్తభోజనం చేస్తారు. నక్తం ఉండలేనివారు ఒక కార్తీక పౌర్ణమినాడు లేదా యేయైనా కార్తీక సోమవారాలు నక్తములున్నా పుణ్య ప్రదమే.
కార్తీక పౌర్ణమి నాడు బ్రాహ్మణుని ఆహ్వానించి భోజనం పెట్టి దీప దానం చేస్తూ…
”సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వ సంపచ్చుభావహం!
దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ”
అనే శ్లోకం పఠించాలి.
దీపం జ్యోతి పరబ్రహ్మ:” దీపం జ్ఞానానికి ప్రతీక. ఈ దీపదానం వలన జ్ఞానం, ఆయు:వృద్ధి, విద్య, సకల భోగాలు కలుగుతాయని శాస్త్రం. ఈ దీపదానం కార్తీక మాసంలో అన్నిటికంటే ప్రధానమైనది. ఎవరైతే దీప దానం చేస్తారో వారి పాపాలన్నీ నశించిపోతాయని వశిష్ఠ వచనం. ఒక ఒత్తితో దీపదానం సద్భుద్ధిని, తేజస్సుని ఇస్తుంది. నాలుగు వత్తుల దీపదానం రాజ సమానులను చేస్తుంది. పదివత్తుల దీపదానం రాజకీయ సిద్ధినిస్తుంది. 50 వత్తుల దీపదానం దేవత్వాన్నిస్తుంది. వెయ్యి వత్తుల దీపదానం ఈశ్వర కృపకు పాత్రుల్ని చేస్తుంది. వెండి, ప్రమిదలో పైడిపత్తి వత్తులు వేసి, ఆవు నేతితో వెలిగించిన దీపాన్ని దానం చేయడంవల్ల వచ్చే పుణ్యం అనంతమైనదిగా, వెండి ప్రమిదలో బంగారు వత్తులు వేసి, దానం చేస్తే జన్మరాహిత్యం పొందుతారని మన పురాణాలు తెల్పుతున్నాయి.