X

కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతోరణం.. ఇలా చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి

అన్ని మాసాల్లోనూ కార్తీక మాసానికి ఓ ప్రత్యేకత ఉంది. శివకేశవులకు ఇష్టమైన మాసం కావడంతో హిందువులు చాలా పవిత్రంగా భావిస్తారు. హరిహరులకు ప్రీతికరమైన ఈ నెలలో కార్తీక పౌర్ణమికి ఎంతో ‘ప్రాశస్త్యం’ ఉంది. ఇక కార్తీకపౌర్ణమి రోజు సాయంత్రం వెలిగించే జ్వాలా తోరణాన్ని దర్శనం చేసుకునేందుకు భక్తులు పోటీ పడుతుంటారు. కార్తీక మాసంలో నెలరోజులు పూజ చేయడం ఒకెత్తయితే.. పౌర్ణమి రోజు వెలిగించే దీపాలు, పూజ ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం వెలిగించే జ్వాలాతోరణం విశిష్టమైన అంశం. ఏ ఇతర మాసంలోనూ ఇటువంటి ఆచారం మనకు కనబడదు. పౌర్ణమి రోజు రాత్రి శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి.. ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు. అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకుని చుడతారు. దీనిని యమద్వారం అని అంటారు. అనంతరం..ఈ గడ్డి మీద నెయ్యి పోసి మంట పెడతారు. ఆ మంట కింద నుంచి పరమేశ్వరుడిని పల్లకిలో అటూ ఇటూ మూడు సార్లు ఊరేగిస్తారు.

జ్వాలా తోరణము పదం పురాణ ప్రసిద్ధమైంది. అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పడు మొదటగా హాలాహలం ఉద్భవించగా.. దాన్ని మహాశివుడు తీసుకుని ఆ విషాన్ని కంఠ మధ్యలో నిక్షేపించాడు. అప్పుడు పార్వతీ దేవి శివునికి ప్రమాద నివారణ కోసం ప్రతి సంవత్సరము అగ్ని జ్వాల క్రింది నుంచి తన భర్తతో సహా దూరి వెడతానని మ్రొక్కుకుందట. ఈ పురాణ కథ నేపథ్యంలోనే ఏటా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు రాత్రి శివాలయంలో ఎండు గడ్డితో చేసిన చేసిన తోరణాన్ని జ్వాలగా వెలుగిస్తుంటారు. ఆ జ్వాల క్రింది నుంచి శివపార్వతుల పల్లకీని మూడు సార్లు తీసుకొని వెడతారు.

మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశ పెట్టడం వెనుక ఒక కారణం ఉంది. యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం. యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష. కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి మూడుసార్లు అటూ ఇటూ వెళ్లి వస్తారో వారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుందని నమ్మకం. జ్వాలా తోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి ఇంటి చూరులోనో.. గడ్డివాములోనో.. ధాన్యాగారంలోనో పెడతారు. అది ఉన్న చోట్ల భూతప్రేత ఉగ్రభూతాలు ఇంటిలోకి రావని, ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం.

Telugu BOX Office:
Related Post