మోక్షాన్ని కలిగించే క్షేత్రం – వారణాసి
Category : Behind the Scenes Features Sliders Spiritual
సప్త మోక్ష క్షేత్రాలలో ఒకటైన కాశీ నగరంలో పవిత్ర గంగానదీ తీరంలో వెలసిన జ్యోతిర్లింగం కాశీవిశ్వేశ్వరుడు. వరణ, అసి అనే రెండు నదుల మధ్య ఉన్న నగరం కాబట్టే దీనికి వారణాశి అనే పేరొచ్చింది. ప్రపంచంలో అందరూ బ్రతకడం కోసం ఎన్నో కష్టాలు పడుతుంటే, చాలామంది హిందువులు మాత్రం ఈ వారణాశిలో మరణించి మోక్షాన్ని పొందాలని తాప్రతాయిపడుతుంటారు. కాశీలో మరణించిన వారు సరాసరి ఈశ్వర సాన్నిధ్యాన్ని చేరుకొంటారని ప్రతీతి.
పురాణ గాథ
కాశీ క్షేత్రానికి వారణాసి, మహాస్మశానం, ఆనందకాననం, రుద్రవాసం, ముక్తిభూమి, శివపురి మొదలైన పేర్లు చాలా ఉన్నాయి. వేదాలలో,పురాణాలలో కాశీక్షేత్రం మహిమ గురించి వివరించారు. సనాతనమైనటువంటి బ్రహ్మ సృష్టి మొదట్లో నిర్గుణం నుంచి సగుణమైన శివరూపాన్ని చేశాడు. తిరిగి ఆ శివశక్తితో స్త్రీ ,పురుష భేధంతో ప్రకృతి, పురుషులని సృష్టించాడు. వారిరువురిని ఉత్తమసృష్టి సాధనకై తపస్సు చేయమని ఆనతినిచ్చాడు. తపస్సు కోసం అనువైన స్థలం చెప్పమని వారు బ్రహ్మను ప్రార్ధించగా ఆయన శివుడు నించున్నచోటు నుండి ఎటుచూసినా అయిదు క్రోసుల దూరం ఉండేట్టు భూమిని సృష్టించి అత్యంత శోభాయమానమైన పంచకాశీ నగరాన్ని నిర్మించాడు.
అక్కడ ప్రకృతి, పురుషులు తపస్సు చేశారు. ఈ చోటనే విష్ణువు శివుని కోసం తపస్సు చేశాడు. ఆ తపము ఫలించి అక్కడ అనేక జలధారలు ప్రవహించాయి. ఆదృశ్యాన్ని చూసి విష్ణువు తలాడించగా, ఆయన చెవి నుండి ఒక మణి క్రిందపడింది. ఆ స్థానం మణికర్ణిగా గా పేరుగాంచింది. మహేశ్వరుడు ఈ కాశీ నగరమందు జ్యోతిర్లింగరూపంలో విశ్వేశ్వరుడు నామధేయుడై అవతరించాడు. ప్రళయకాలమందున ప్రపంచమంతా మునిగిపోయినా ఈ కాశీపట్టణంను మాత్రం పరమేశ్వరుడు తన త్రిశూలంతో పైకెత్తి పట్టుకొని రక్షించాడు. ఈ విధంగా కాశి అవినాశి అయ్యింది. ఈ కాశి నగరాన్ని దండపాణి, కాలబైరవుడు సంరక్షకులుగా కాపాడుతుంటారు. ఇక్కడ గంగానదిలో 84 ఘాట్ లున్నాయి. ఎన్నో తీర్ధకుండాలున్నాయి.
విశ్వేశ్వరుని మందిరం చుట్టుప్రక్కల వందలాది శివలింగాలు, ఆలయాలు, ఆలయం వెలుపుల విశాలాక్షి అమ్మవారి మందిరం, కాశీ అన్నపూర్ణేశ్వరి మాత మందిరం, వారాహి మాత మందిరం ఉన్నాయి. ఒకటేమిటి కాశీక్షేత్రమంతా పరమేశ్వరుని దివ్యధామం. ఉదయం గంగాస్నానాంతరం కేధార్ ఘాట్ లో పెద్దలకు నివాళి, కేధార్నాధుని మందిరంలో స్వామిని దర్శించడం, మిట్ట మధ్యాహ్నం సమంత్రయుక్తంగా మణికర్ణికఘాట్ లో స్నానం, తదుపరి కాశీ విశ్వేరుని, అమ్మవార్లను దర్శించడం, సాయంత్రం దశాశ్వమేధఘాట్ లో గంగాహరతిని చూడటం అనీర్వచనీయమైన దివ్యానుభూతి.