సంతానాన్ని ప్రసాదించే వెంకన్న.. పాలకొండ్రాయుడు

సంతానాన్ని ప్రసాదించే వెంకన్న.. పాలకొండ్రాయుడు

కలియుగ దైవమైన వేంకటేశ్వరుడు… భూమిపైన తొలిసారి అడుగుపెట్టి స్థిర నివాసం ఏర్పరుచుకున్న ప్రాంతమే పాలకొండ్రాయుడి క్షేత్రం. పిల్లల్ని ప్రసాదించే సంతాన ప్రభువుగా పూజలు అందుకుంటున్న ఈ స్వామి ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల క్రితం వెలిశాడని చెబుతారు. వేంకటేశ్వరస్వామే పాలకొండ్రాయుడిగా ఇక్కడ వెలిశాడని అంటారు. కడప నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో కొలువైన స్వామిని చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లు… తమ ఇంటి ఇలవేల్పుగా భావిస్తారు.

స్థల పురాణం
ఓసారి భృగు మహర్షి త్రిమూర్తులను దర్శించుకోవాలనుకున్నాడు. మొదట బ్రహ్మ-సరస్వతి దగ్గరకు వెళ్తే ఆ ఇద్దరూ మహర్షిని పట్టించుకోలేదు. ఆ తరువాత కైలాసానికి వెళ్లినా అదే అవమానం ఎదురుకావడంతో ఆగ్రహానికి గురైన భృగు చివరకు వైకుంఠానికి చేరుకున్నాడు. అక్కడా విష్ణుమూర్తి లక్ష్మీదేవి సేవలను అందుకుంటూ శేషతల్పంపైన విశ్రాంతి తీసుకుంటున్నాడట. ఎన్నిసార్లు పిలిచినా స్వామి స్పందించకపోవడంతో కోపోద్రిక్తుడైన భృగు మహర్షి మహావిష్ణువు వక్షస్థలంపైన తన్నాడు. దాంతో నారాయణుడు భృగుని శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తూనే ఆ రుషి పాదాలను నొక్కడం ప్రారంభించాడట. ఆ రుషి అరిపాదంలో మూడో కన్ను ఉండటం వల్లే భృగుకి అహంకారం ఎక్కువని అంటారు. అందుకే అతని అరి పాదంలోని మూడోకంటిని చిదిమేశాడు. దాంతో భృగులోని అహంకారం పూర్తిగా తొలగిపోవడంతో విష్ణుమూర్తిని క్షమాభిక్ష అర్థించి, తాను నిత్యం స్వామి సేవలో తరించేందుకు వీలుగా నదిలా మార్చమని కోరి వెళ్లిపోయాడట.

ఆ తరువాత లక్ష్మీదేవి… తాను నివసించే వక్షస్థలంపైన ఓ మహర్షి తన్నడాన్ని సహించలేక వైకుంఠాన్ని వదిలి వెళ్లిపోయింది. దాంతో శ్రీహరి దేవిని వెతుక్కుంటూ భూలోకం బయలుదేరాడు. అలా స్వామి మొదటిసారి ఈ ప్రాంతంలో పాదం మోపి శిలగా మారాడని కథనం. తన దేవేరిని వెతుకుతూ అడవులన్నీ తిరిగిన స్వామి ఓ లోయలో పడిపోవడంతో మహావిష్ణువు కోసం బ్రహ్మ, శివుడు ఆవు-దూడ రూపాల్లో వచ్చి స్వామికి పాలు అందించి ఆకలి తీర్చారనీ… అందుకే ఈ ప్రాంతానికి పాలకొండలు అనే పేరు వచ్చిందనీ అంటారు. అప్పటినుంచీ నారాయణుడిని పాలకొండ్రాయుడిగా పిలుస్తున్నారు. అలాగే క్షీరసాగర మథనం సమయంలో కొన్ని పాల చుక్కలు ఈ కొండపైన పడటం వల్ల ఈ ప్రాంతానికి క్షీరశైలమనే పేరు వచ్చిందని మరో కథనం ఉంది. ఈ ఆలయానికి సమీపంలో భృగుమహర్షి నదిలా ఏర్పడి భృగువంకగా మారాడని అంటారు. క్రమంగా అదే బుగ్గవంకగా మారిందనీ.. ఆ నది నీళ్లే అటు దేవుని కడపలో రాయుడినీ, ఇటు పాలకొండ్రాయుడినీ అభిషేకిస్తున్నాయనీ చెబుతారు.

ఇక్కడ పాలకొండ్రాయుడి మూర్తితో పాటు పద్మావతీదేవినీ, నవగ్రహాలనూ, ఉగ్ర నారసింహుడినీ దర్శించుకోవచ్చు. సంతానం లేనివారు పుష్కరిణిలో స్నానం చేసి తడి వస్త్రాలతో స్వామిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని నమ్మకం. అలా పుట్టిన పిల్లలకు పాలకొండ్రాయుడు, పాలకొండన్న, కొండయ్య, పాలకొండమ్మ, కొండమ్మ అనే పేర్లు పెడుతుంటారనీ చెబుతారు.

ఇలా చేరుకోవచ్చు
కడప వరకూ రోడ్డు, రైలు, విమాన మార్గాలున్నాయి. ఈ పట్టణం నుంచి ఆలయం పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కడప పట్టణం నుంచి రాజంపేటకు వెళ్లే బైపాస్‌ రహదారి మీదుగా పాలకొండలకు చేరుకోవచ్చు. కొండపాదం వరకూ వాహనాల్లో అక్కడి నుంచి నడకమార్గాన ఆలయానికి వెళ్లాల్సి ఉంటుంది.