అత్యంత శక్తివంతమైన అష్టాదశ శక్తి పీఠాలు
Category : Behind the Scenes Daily Updates Features Sliders Spiritual
పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాథల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు అని పిలుస్తారు. ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అని కొందరు కాదు 51 అని మరికొందరు.. 52 అని, 108 అని ఎవరి లెక్కలు వారు చెబుతుంటారు. అయితే ప్రధానంగా హిందువులు 18 క్షేత్రాలను శక్తి పీఠాలుగా విశ్వసిస్తుంటారు. వీటినే అష్టాదశ శక్తిపీఠాలని పిలుస్తారు. పరమశివుడి భార్యయైన సతీదేవి శరీరం 18 ముక్కలై వివిధ ప్రదేశాల్లో పడిందని.. అవే అష్టాదశ శక్తి పీఠాలుగా వెలిశాయని హిందూ పురాణాలు చెబుతున్నాయి. పురాణ కథ శక్తి పీఠాల ఆవిర్భావం వెనుక ఓ విషాధ గాథ ఉంది. అదేంటంటే…
బ్రహ్మ దేవుడి కుమారుల్లో దక్షప్రజాపతి ఒకరు. అతనికి 53 మంది కుమార్తెలుండేవారు. వారిలో చంద్రునికి ఇరవై ఏడుగురిని, కశ్యప మహర్షికి 13 మంది, దుర్ముణకు 10 మందిని, పితురులకు ఒకరిని, అగ్నికి ఒకరిని ఇచ్చి వివాహం చేసారు. మిగిలిన సతీదేవికి మాత్రం చిన్నతనం నుంచి శివుడంటే అపారమైన భక్తి. అయితే శివుడంటే దక్షుడికి మాత్రం చిన్నచూపు. సతీదేవి శివుడిని ఇష్టపడుతోందని తెలిసి దక్షుడు అడ్డు చెప్పాడు. అతడిని పూజించడానికి వీల్లేదని.. కన్నెత్తి కూడా చూడొద్దని హెచ్చరించాడు. అయితే తండ్రి మాట పెడచెవిన పెట్టిన సతీదేవి శివుడిని పెళ్లాడింది. దీంతో దక్ష ప్రజాపతి శివుడిపై మరింత కోపం పెంచుకున్నాడు.
ఒకరోజు దక్షుడు బృహస్పతి యాగం చేసాడు. ఆ కార్యక్రమానికి దేవతలందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు. అయితే సతీదేవి పిలవని పేరంటానికి బయలుదేరగా.. వద్దని శివుడు వారించాడు. పుట్టింట్లో జరిగే శుభకార్యానికి పిలుపు అవసరం లేదని శివుడి మాట జవదాటి సతీదేవి వెళ్లింది. అక్కడ జరగబోయే అవమానాన్ని ఊహించిన శివుడు ఆమెకు తోడుగా తన వాహనమైన నందిని పంపించాడు. శివుడు ఊహించినట్లే సతీదేవికి పుట్టింట్లో ఘోర అవమానం ఎదురైంది. శివ నింద సహించలేక ఆత్మాహుతి చేసుకుంది. ఆగ్రహించిన శివుడు వీరభద్రుడిని పంపించి యాగశాలను ధ్వంసం చేయించాడు. సతీ వియోగ దుఃఖం తీరని శివుడు ఆమె మృత శరీరాన్ని అంటిపెట్టుకొని తన జగద్రక్షణా కార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని 18 ఖండాలుగా చేసి శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా వెలిసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని (శివుని) తోడుగా దర్శనమిస్తుంది.
అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్థనా శ్లోకం
లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే
అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా
ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే
హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా
వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్
సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్
అష్టాదశ శక్తిపీఠాలివే…
శాంకరి – శ్రీలంక
ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కాని ఒక వివరణ ప్రకారం ఇది దేశం తూర్పు తీరంలో ట్రిన్‌కోమలీలో ఉండొచ్చు. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందని చెబుతుంటా. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది. దగ్గరలో ‘త్రికోణేశహవర స్వామి’ అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్కోమలీ నగరంలో కాళీమందిరం ప్రసిద్ధమైనది.
కామాక్షి – కాంచీపురం
తమిళనాడు రాష్ట్రంలో కాంచీపురం జిల్లా శివకంచిలో కామాక్షి దేవి అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో అమ్మవారు మరెక్కడా లేని విధంగా యోగముద్రలో పద్మాసనంపై ఆసీనురాలై భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. శివ కంచిలో ఎన్నో వేల ఆలయాలు ఉన్నప్పటికీ ఎక్కడ కూడా అమ్మవారి ఆలయం అనేది లేదు. కేవలం కామాక్షి అమ్మవారి ఆలయం తప్ప మనకు శివకంచిలో మరే ఇతర అమ్మవారి ఆలయాలు కనిపించవు.పురాణాల ప్రకారం అమ్మవారు వివిధ శక్తి రూపాల్లోని శక్తి నంతటిని గ్రహించి మన్మధునిలో ఆవహింప చేసింది అని పురాణాలు చెబుతున్నాయి.
సాధారణంగా ప్రతి ఆలయంలో అమ్మవారి విగ్రహం స్వామివారి విగ్రహం పక్కనే ఉండి భక్తులకు దర్శనమిస్తుంటారు. కాని ఈ ఆలయంలో అమ్మవారు ఒక్కరే భక్తులకు దర్శనం ఇవ్వగా, అమ్మవారి ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఏకామ్రేశ్వరస్వామి ఆలయం ఉండటం విశేషం.అదేవిధంగా ఏ ఆలయంలోనైనా ఆ స్వామి వారికి సంబంధించిన బీజాక్షరాలను ఒక యంత్రం పై రాసి ఆ యంత్రాన్ని పీఠం కింద ఉంచి పైన స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. కానీ ఈ ఆలయంలో మాత్రం అమ్మ వారికి చెందిన బీజాక్షరాలతో రచించిన యంత్రం మాత్రం అమ్మవారి విగ్రహానికి ఎదురుగా ఉండటమే కాకుండా, యంత్రానికి పూజలను నిర్వహిస్తుంటారు. ఈ శక్తిపీఠం తమిళనాడు రాజధాని చెన్నైకి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.
శృంఖల దేవి – ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్
ఈ శక్తిపీఠం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే అక్కడ మందిరానికి సంబంధించిన ఎలాంటి గుర్తులు కనబడవు. అయితే కోల్‌కతాకు 135 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగాసాగర్ కూడా శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది.
శ్రీ చాముండేశ్వరి ఆలయం – మైసూరు, కర్ణాటక
అష్టాదశ శక్తి పీఠాల్లో నాలుగవదిగా చెప్పబడింది కర్ణాటకలోని మైసూర్లో శ్రీ చాముండేశ్వరి ఆలయం. ఇక్కడ అమ్మవారి శిరోజాలు పడి శక్తిపీఠంగా వెలిసినట్లు చెబుతారు. ఈ క్షేత్రంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అమ్మవారి దర్శనానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. కొండపై ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహానికి ఎదురుగా మహిషాసురుడి విగ్రహం ఉంటుంది. పూర్వం ఈ నగరాన్ని మహిషపురం అని పిలిచేవారి.. క్రమంగా ఇది మైసూరుగా మారిందని స్థల పురాణం.
జోగులాంబ – ఆలంపూర్, తెలంగాణ
తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ మహిమాన్విత క్షేత్రం ఉంది. ఆలయాల నగరంగా ప్రఖ్యాతి గాంచిన ఆలంపూర్ పట్టణ సిగలో మణిముకటమై వెలసింది జోగులాంబ ఆలయం. పరమ పవిత్ర అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా, పావన తుంగభద్రా నది తీరాన ఇక్కడ అమ్మవారు జోగులాంబగా వెలిసి భక్తులపై తన కరుణా కఠాక్షాలను చూపుతున్నారు.
భ్రమరాంబిక దేవి – శ్రీశైలం
ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో నల్లమల అటవీ ప్రాంతంలో శ్రీశైల క్షేత్రం కొలువై ఉంది. ఇక్కడ ఆది దంపతులు భ్రమరాంబ, మల్లికార్జున స్వామిగా దర్శనమిస్తుంటారు. ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా వెలుగొందుతోంది. గంగానదిలో రెండు వేల సార్లు మునిగినా, కాశీ పుణ్యక్షేత్రంలో లక్షల సంవత్సరాలు జీవించినా వచ్చే పుణ్యఫలం కేవలం శ్రీశైలంలో కొలువై ఉన్న భ్రమరాంబిక ఆలయాన్ని ఒక్కసారి దర్శిస్తే అంత పుణ్యఫలం కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతుంటారు. శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి కొలువై ఉన్న ఈ ఆలయాన్ని భూమిపై వెలసిన కైలాసంగా భావిస్తారు. ఈ క్షేత్రం కర్నూలు నుంచి 180కి.మీ, హైదరాబాద్ నుంచి 215 కి.మీ, గుంటూరు నుంచి 225 కిలోమీటర్ల దూరంలో ఉంది.
మహాలక్ష్మి – కొల్హాపూర్, మహారాష్ట్ర
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో వెలసిన శ్రీమహాలక్ష్మి అమ్మవారి ఆలయం శక్తిపీఠాల్లో ఒకటి. మహాలక్ష్మి అమ్మవారు కోలహాసురుడు అనే రాక్షసుడిని సంహరించి ఇక్కడ వెలసిందని అందుకే కొల్హాపూర్ అనే పేరు వచ్చిందని కొందరు చెబుతుంటారు. పద్మావతి పరిణయం వేళ తిరుమలేశుడిపైఅలిగిన అమ్మవారు ఇక్కడకు వచ్చి వెలిసిందని అంటుంటారు. ఇక్కడ సతీదేవి నయనాలు(కళ్లు) పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ అమ్మవారిని దర్శిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. మహాలక్ష్మీ దేవి మూల విరాట్టుపై ఫిబ్రవరి, నవంబర్ మాసాల్లో సూర్య కిరణాలు నేరుగా ప్రసరిస్తుంటారు. దీనినే కిరణోత్సవం అంటారు. ఆ సమయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.
ఏకవీరిక దేవి – నాందేడ్, మహారాష్ట్ర
ఇక్కడి అమ్మవారిని ‘రేణుకా మాత’గా కొలుస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీకి వెళ్లే భక్తులు ఇక్కడి అమ్మవారిని దర్శించుకుని వెళ్తుంటారు.
మహాకాళి – ఉజ్జయిని, మధ్య ప్రదేశ్
ఉజ్జయినిని ఒకప్పుడు అవంతీ నగరంగా పిలిచేవారు. ఇది క్షిప్రా నదీతీరాన ఉంది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించింది ఈ మహాకాళి అమ్మవారే.
పురుహూతిక దేవీ – పిఠాపురం, ఆంధ్రప్రదేశ్
పురుహూతికా అమ్మవారిని మొదటగా ఇంద్రుడు పూజించినట్లు పూరాణాలు చెబుతున్నాయి. గౌతమమహర్షి శాపం వల్ల బీజాలు కోల్పోయిన ఇంద్రుడు వాటిని తిరిగి పొందేందుకు ఈ క్షేత్రంలో జగన్మాత కోసం తపస్సు చేశాడట. ఇంద్రుడి తపస్సుకు మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమై ఇంద్రుడి బీజాలను, సంపదను ప్రసాదిస్తుంది. అందుకే ఇంద్రుడిచే పూజింపబడటం వల్ల ఇక్కడ కొలువైన అమ్మవారిని పురుహూతికా అని పిలుస్తారని పూజారులు చెబుతున్నారు. అగస్త్య మహాముని కూడా సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక్కడ అమ్మవారికి జరిగే కుంకుమార్చనలు ఎంతో ప్రసిద్ధి. పురుహూతికా శక్తి పీఠంలో చెప్పుకోదగ్గ మరో విశేషమేటింటే శ్రీ చక్రం. అమ్మవారి విగ్రహం కింద భాగంలో శ్రీ చక్రం భక్తలకు దర్శనమిస్తోంది. ఎప్పుడు కుంకుమతో కప్పబడి ఉండే ఈ శ్రీ చక్రాన్ని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయనేది భక్తుల నమ్మకం.
గిరిజా దేవి – ఓఢ్య, ఒడిశా
అష్టాదశ శక్తి పీఠాల్లో 11వ శక్తి పీఠంగా చెప్పుకునేది శ్రీ గిరిజా దేవీ శక్తి పీఠం. ఓఢ్య పట్టణంలో వెలిసిన ఈ శక్తిపీఠం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కి 113 కిలోమీటర్ల దూరంలో వైతరిణీ నదీ తీరంలో ఉంది. ఇక్కడి ప్రజలు అమ్మవారిని బిరిజాదేవి, గిరిజాదేవి, విరజాదేవి అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారి నాభి భాగం పడిన స్థలంగా చెప్తుంటారు. ఏటా ఇక్కడ జరిగే రథయాత్రను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివస్తారు.
మాణిక్యాంబ – ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్
ఆ శక్తిపీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ ద్రాక్షారామంలో పరమేశ్వరుడి ఆత్మలింగ సహితంగా భక్తులకు దర్శనమిస్తుంది. దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన నాటి ప్రదేశమే నేటి ద్రాక్షారామం. పూర్వం దీనిని దక్షారామం అని పిలిచేవారని, కాలక్రమంలో అది ద్రాక్షారామంగా మారినట్లు చెబుతారు. ఈ క్షేత్రానికి దక్షిణ కాశీగా, వ్యాస కాశీగా, అష్టాదశ శక్తి పీఠాల్లో ద్వాదశ పీఠంగా గుర్తింపు ఉంది.
కామాఖ్య దేవి – హరిక్షేత్రం, అస్సాం
అష్టాదశ పీఠాల్లో ఒకటైన ఈ శక్తిపీఠం అస్సాం రాజధాని గౌహతికి 8 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మపుత్రా నది ఒడ్డున, నీలాచలం పర్వతం మీద ఉంది. ఈ ఆలయ నిర్మాణం నాలుగు గదులుగా ఉంటుంది. తూర్పు నుంచి పశ్చిమానికి మొదటి మూడు, మండపాలు కాగా చివరిది గర్భగుడి. అద్భుతమైన శిల్ప కళాఖండాలతో, తేనెతుట్ట ఆకారంలో ఉన్న శిఖరంతో ఆలయం నిర్మించి ఉంటుంది. ఆలయంలో మూలవిరాట్టుకు విగ్రహం ఉండదు. శిలారూపంలో యోనిముద్రగా పూజలందుకుంటున్నది. ఇరుకైన గుహలో, జలధార నడుమ ఉందీ శక్తిపీఠం. ఆషాడ మాసంలో ఐదు రోజులపాటు జరిగే అంబుబాచి మేళా ఉత్సవానికి వేలాదిగా భక్తులు వస్తారు. మిగతా రోజులలో భక్తులు తక్కువ. కొండ కోనల్లో సాధన చేసుకునే సాధుసంతులు, అఘోరాలు, తాంత్రికులు కూడా అమ్మవారి దర్శనానికి వస్తారు.
అమ్మవారి యోని భాగం గౌహతీ వద్ద నీలాచలంపై పడటంతో ఆ పర్వతం నీలంగా మారిందంటారు. ఈ ప్రాంతంలోనే కామాఖ్యదేవి కొలువై ఉంటుందని ప్రతీతి. మానవ సృష్టికి మూలకారణమైన స్థానం కాబట్టి ఈ ప్రదేశం అన్ని శక్తిపీఠాల్లోకెల్లా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. జన్మలో ఒక్కసారైనా ఈ పర్వతం తాకితే అమరత్వం సిద్ధిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి.
మాధవేశ్వరి – ప్రయాగ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్
ప్రయాగలోని మాధవేశ్వరి ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో 14వది. ఇక్కడ దాక్షాయణి వేలు పడిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారిని శ్రీ మాధవేశ్వరీ పేరుతో కొలుస్తారు. అలోపి మాత, అలోపి శాంకరీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ విగ్రహారాధన లేదు. గర్భగుడిలో మీద కేవలం ఒక ఊయల మాత్రం ఉంటుంది. భక్తులు దానికే ప్రజలు పూజలు చేస్తారు. శక్తి పీఠాల్లో విగ్రహారాధన లేని ఏకైక క్షేత్రం ఇదే. పురాణాలను అనుసరించి శ్రీరామచంద్రుడు ఈ మాతను ఆరాధించినట్లు చెబుతారు. శ్రీరాముడు తన తమ్ముడైన లక్ష్మణుడు, భార్య సీతతో చిత్రకూటంలోని పర్ణశాల నిర్మించడానికి ముందు ప్రయాగలో కొద్ది రోజుల పాటు ఉన్నాడు. ఆ సమయంలోనే ఈ మాతను కొలిచాడని చెబుతారు.
వైష్ణవి – జ్వాలాక్షేత్రం, హిమాచల్ ప్రదేశ్
ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.
మంగళ గౌరి – గయ, బీహార్
బీహార్‌లోని గయలో ఉన్న మంగళగౌరి ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో 16వది ఈ ఆలయం కొండపైన తూర్పు ముఖంగా నిర్మించబడింది. ఈ ఆలయం లోపల చిన్న గుంటకి చుట్టూ చతురస్రాకారపు దిమ్మె లాగా వుంటుంది. ఆ దిమ్మె మీద భక్తులు వెలిగించే దీపాలు అఖండ దీపంలా భక్తులు ప్రకాశిస్తూ వుంటాయి. ఆలయం గుంటలో అమ్మవారి తొడ భాగానికి ప్రతీకగా సాలగ్రామంలాగా వుంటుంది. దీన్నే మంగళగౌరీ దేవిగా భక్తులు పూజిస్తారు. ఆ ఆలయంలో ఎలక్ట్రిక్ దీపాలు వుండక పోవటంతో చీకటిగా ఉంటుంది. సతీదేవి తొడ భాగం ఇక్కడ పడటంతోనే శక్తిపీఠంగా వెలిసినట్లు చెబుతారు. ఈ క్షేత్రం బీహార్ రాజధాని పాట్నాకు 74 కిలోమీటర్ల దూరంలో ఉంది.
విశాలాక్షి – వారాణాసి, ఉత్తర ప్రదేశ్
అష్టాదశ శక్తిపీఠాల్లో 17వ శక్తిపీఠం కాశీ విశాలాక్షి దేవి ఆలయం. ఇక్కడ అమ్మవారు గర్భాలయంలో రెండు రూపాలతో దర్శనమిస్తుంటుంది. ఒక రూపం స్వయంభువు, మరొక రూపం అర్చనామూర్తి. ఆలయంలోకి ప్రవేశించగానే మొదట అర్చామూర్తిని, తర్వాత స్వయంభువును దర్శించుకోవాలి. విశాలాక్షి అంటే విశాలమైన కన్నులు కలది అని అర్థం. విశాలాక్షి దేవి కొలువుదీరిన అత్యంత పుణ్యప్రదమైన క్షేత్రం వారణాసి. కాశీ పట్టణాన్నే వారణాసి అని పిలుస్తారు. వరుణ మరియు అసి అను నదులు కలసి ప్రవహించే ప్రదేశమే వారణాసి. వారణాసి భారతీయులందరికీ ఆరాధ్య పుణ్యక్షేత్రం. సప్తమోక్ష పురాణాలలో ఒకటిగా కాశికి విశిష్ట స్థానం ఉంది. ఈ క్షేత్రంలో కొలువుదీరిన విశ్వేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ముఖ్యుడు. అవిముక్త క్షేత్రంగా ఈ క్షేత్రం పేరుపొందింది.
సరస్వతి – జమ్మూకాశ్మీర్
అష్టాదశ శక్తిపీఠాల్లో చివరిది శ్రీసరస్వతీ దేవి శక్తిపీఠం. కాశ్మీర్ ప్రజలు అమ్మవారిని కీర్ భవాని అని పిలుస్తారు. ఈ ఆలయం శ్రీనగర్‌కు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. సరస్వతి అమ్మవారు పరమశాంతమూర్తి, శ్రీహరిప్రియ, నాలుగు చేతులతో వీణా, పుస్తక జపమాల ధరించి అభయ ముద్రతో ప్రకాశిస్తుంది. సతీదేవి కుడి చెంప భాగం కాశ్మీర్ ప్రాంతంలో పడినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ సరస్వతీ అమ్మవారిని శారికాదేవి అమ్మవారుగా స్థానికులు కొలుస్తారు. ఇక్కడ అమ్మవారు మౌన శిలలో ఒక మూలన గల గుంటలో నీరు ఉద్బవిస్తుంది. ఆ గుంటలో ఎంత నీరు తీసుకుంటే అంత నీరు మళ్ళీ పుడుతుంది. భక్తులు ఈ నీటిని అమ్మవారి తీర్థంగా తీసుకుంటారు. ప్రకృతి వైపరీత్యాలకి ఈ ఆలయం శిధిలం కావడంతో ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడ అమ్మవారి శక్తినీ సువర్ణ శారదాదేవి రూపంలో మరియు యంత్రంలో ఆవాహన చేసి కర్ణాటకలోని శృంగేరి క్షేత్రానికి తరలించారని పురాణాలు చెబుతున్నాయి.