X

అత్యంత మహిమాన్వితం కార్తీక మాసం.. ఆచరించాల్సిన పద్ధతులివే!

తెలుగు మాసాల్లో విశిష్టమైనది కార్తీకమాసం. ముఖ్యంగా కైలాస నిలయుడైన పరమశివునికి ప్రీతిపాత్రం ఇది. ఆధ్యాత్మికపరంగా ఆరోగ్యప్రదమైన మాసం. ఈ మాసంలో సోమవారంనాడు ఉపవాసం చేసి, రాత్రి నక్షత్ర దర్శనం చేసి భోజనం చేస్తారు. తద్వారా అష్టైశ్వర్యప్రాప్తి కలుగుతుందని ‘ధర్మసింధువు’ గ్రంథం తెలుపుతున్నది. ఈ మాసంలో ప్రతిరోజూ పర్వదినమే!. అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పర్వదినాలు మరింత ఫలప్రదమైనవి. అవే భగినీ హస్తభోజనం, నాగులచవితి, నాగపంచమి, ఉత్థాన ఏకాదశి, క్షీరాబ్ధి ద్వాదశి, కార్తీక పౌర్ణమి మొదలైనవి.

శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీకం. ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలం నుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు.

సూర్యోదయానికి ముందే స్నానం


కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేసి దానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. ఆ తర్వాత శివుడిని పూజిస్తే పుణ్యఫలం లభిస్తుంది. దైవచింతన అవసరం. ఈ మాసంలో ముఖ్యమైన రోజు ద్వాదశి క్షీరాబ్ది. ద్వాదశి నాడు పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు కనబడుతుంది. కార్తీక మాసంలో ప్రతి రోజూ దీపం వెలిగిస్తే మంచి జరుగుతుంది. ప్రతిరోజూ పూజ చేయలేనివారు క్షీరాబ్ది ద్వాదశి రోజు దీపాలు వెలిగించుకుని పూజ చేస్తే పుణ్యఫలం పొందుతుంది.

కార్తీకమాసంలో సోమవారాలు అత్యంత పవిత్రమైనవి. శివుడిని ఆరాధించడం.. పంచామృతాలతో అభిషేకించడం.. నదీ స్నానాలు చేయడం.. చాలా మంచిది. కార్తీక పౌర్ణమి రోజున శివుడిని పూజించి జ్వాలాతోరణం దర్శించుకోవాలి. అలాగే కార్తీక మాసంలో వనభోజనాలు కూడా నిర్వహిస్తారు. కార్తీక సోమవారం రోజున ఉదయాన్నే శివాలయానికి వెళ్లి దీపారాధన చేసి పగలంతా ఉపవాసం ఉండాలి. ఆ తర్వాత సాయంత్రం నమకం, చమకం. పురుష, శ్రీ సూక్తాదులతో మహాదేవుడికి రుద్రాభిషేకం చేయాలి. కార్తీక శుద్ద ద్వాదాశి రోజున తులసి కోట వద్ద ఉసిరి కొమ్మ ఉంచాలి. తులసి కోటను లక్ష్మీ స్వరూపంగా .. ఉసిరిని మహా విష్ణువుగా భావించి క్షీరాబ్ది ద్వాదశి వ్రతం ఆచరించాలి.

కార్తీక మాసంలో ఏం చేయాలి?


కార్తీక మాసంలో స్నానం, దానం, దీపారాధన, జపం, అభిషేకం చేయాలి. ప్రత్యేకించి సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు, ఆ తర్వాత చేసే దానాలు, ఉపవాసాలకు గొప్ప శక్తి ఉందని స్కంద పురాణ అంతర్గతంగా ఉన్న కార్తీక పురాణం వివరిస్తోంది. దీపారాధన చేయడం వల్ల పాపాలు తొలగి పుణ్యఫలం లభిస్తుంది. ఈ మాసంలో ప్రదోషకాలమనందు చేసే శివారాధన అనంతకోటి పుణ్యఫలాల్ని ఇస్తాయి. ఈ మాసంలో నక్తం లేదా ఉపవాసం ఆచరించడం వల్ల ఆరోగ్యం, దైవచింతన పరంగా శుభాలు కలుగుతాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

సత్యనారాయణస్వామి వ్రత ప్రాధాన్యం


సత్యనారాయణ స్వామి వ్రత కథా విధానం ప్రకారం.. సత్యనారాయణ వ్రతం జీవితంలో ఎప్పుడైనా ఆచరించవచ్చు. కానీ.. వ్రత కథ ప్రకారం కొన్ని ముఖ్యమైన విశేష దినములు/స్వామికి ప్రీతికరమైన దినములుగా పేర్కొంటారు. అందులో ప్రతిమాసంలో వచ్చే ఏకాదశి/ద్వాదశి/ పౌర్ణమి తిథుల యందు, రవి సంక్రమణములు (సూర్యుడు ఒక రాశి నుంచి మరోరాశికి ప్రవేశించి పుణ్య సమయం), మాఘ, ఫాల్గుణ, శ్రావణ కార్తీక ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిథుల యందు చేసేటువంటి సత్యనారాయణస్వామి పూజలు అత్యంత ఇష్టమైనటువంటివిగా వ్రతకల్పనలో పేర్కొనబడినది.

కార్తీక పౌర్ణమి


కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో ఈశ్వరుడిని అభిషేకం చేసుకొని శివారాధన చేసి జ్వాలా తోరణాన్ని దర్శించవలెను. ఈ పుణ్య మాసంలో కార్తీక సోమవారాలు అత్యంత పవిత్రమైనవిగా శివపురాణం చెబుతోంది. సోమవారాల రోజు శివారాధన చేయడం, ఈశ్వరుడిని పంచామృతాలతో అభిషేకించడం, ఉపవాసం వంటివి ఆచరించడం, నదీస్నానం ఆచరించి దీపారాధన చేయడం వల్ల హరిహరుల అనుగ్రహం కలుగుతుందని కార్తీక పురాణం స్పష్టంగా చెబుతోంది. ఈ మాసంలో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఆయుస్సు, ఆరోగ్యం కలిగి కష్టాలు తొలగుతాయి. ఆవు నెయ్యితో దీపారాధన చేయడం లక్ష్మీప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి.

శివాలయాలలో ప్రార్థన, లింగార్చన, మహాలింగార్చన, సహస్ర లింగార్చన ఉత్తమోత్తమైన అర్చన. ఈ మాసంలో తులసి దళాలతో శ్రీమహావిష్ణువును పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్రం చెపుతున్నది. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలువబడతాడు. ‘కార్తీక దామోదర ప్రీత్యర్థం అని ఈ మాసాన వ్రత దీక్ష ఆచరించాలి. సత్యనారాయణ స్వామి వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణ, రుద్రాభిషేకాలు చేయడం శ్రేష్టం. శివానుగ్రహానికి, విష్ణువు అనుగ్రహానికి ఈ మాసం ఉత్కృష్టమైంది. కార్తీకమాసంలో ఏ మంత్ర దీక్ష చేసినా మంచి ఫలితాలనిస్తుంది.

Telugu BOX Office:
Related Post