విశాఖ కనకమహాలక్ష్మి.. ఇక్కడ భక్తులే పూజలు చేయొచ్చు
Category : Behind the Scenes Daily Updates Features Sliders Spiritual
సాధారణంగా ఏ గర్భగుడిలో అయినా భక్తులకు ప్రవేశం ఉండదు. కానీ ఈ కనకమహాలక్ష్మి ఆలయంలో మాత్రం భక్తులే నేరుగా అమ్మవారిని పూజించొచ్చు. ఓ వస్తువు లేదా కాసు బంగారం కొన్నా సరే… అమ్మవారికి నివేదించడం, అప్పుడే పుట్టిన పసిపిల్లల్ని ఈ గుడికి తీసుకురావడం… వంటివన్నీ ఈ ఆలయంలో కనిపిస్తాయి. భక్తుల పాలిట కొంగుబంగారంగా పూజలందుకుంటున్న కనకమహాలక్ష్మి ఆలయం విశాఖపట్నం పాత నగరంలోని బురుజుపేటలో ఉంటుంది. ఈ ఆలయంలోని గర్భగుడికి పైకప్పు ద్వారాలు ఉండవు. ఎవరైనా నేరుగా గర్భగుడిలోకే వెళ్లి అమ్మవారిని పూజించొచ్చు. 126 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలోని అమ్మవారికి ఎడమచేయి ఉండదు.
స్థల పురాణం
పూర్వం ఈ రాజ్యాన్ని పాలించిన విశాఖ రాజులు అమ్మవారిని తమ ఇలవేల్పుగా కొలిచేవారు. ఇక్కడ వారి కోట బురుజు ఉండటం వల్ల ఈ ప్రాంతానికి బురుజుపేట పేరు వచ్చిందని అంటారు. ఓసారి శత్రువులు ఈ రాజ్యం మీద దండెత్తినప్పుడు విశాఖ రాజులు తమ ఇలవేల్పును భద్రపరిచే ఉద్దేశంతో అమ్మవారి విగ్రహాన్ని బావిలో వదిలేశారట. ఇది జరిగిన కొన్నాళ్లకు కాశీకి బయలుదేరిన ఓ బ్రాహ్మణుడు పూజా కార్యక్రమాలు చేసుకునేందుకు ఈ ప్రాంతంలో ఆగాడట. స్నానమాచరించి, సూర్యుడికి అర్ఘ్యం వదులుతున్న సమయంలో అమ్మవారు తన ఉనికిని తెలియజేసి బావి నుంచి బయటకు తీసి ప్రతిష్ఠించమని చెప్పిందట. అయితే కాశీకి వెళ్లే తొందరలో ఆ బ్రాహ్మణుడు అమ్మవారి కోరికను సున్నితంగా తిరస్కరించాడు. దాంతో అమ్మవారు ఆగ్రహించి తన ఎడమచేతిలో గల ఫరిఘ అనే ఆయుధంతో అతణ్ని సంహరించేందుకు సిద్ధమవ్వడంతో ఆ బ్రాహ్మణుడు శివుడిని శరణుకోరాడట. పరమేశ్వరుడు ప్రత్యక్షమై అమ్మవారి ఆగ్రహాన్ని తగ్గించేందుకు దేవి ఎడమ చేతిని మోచేయి వరకు ఖండించాడట. అలా ఆమెలోని ఆగ్రహం మాయమై శాంత స్వరూపిణిగా మారిపోయింది. ఆ తరువాత ఆమె కనకమహాలక్ష్మిగా పూజలు అందుకుంటుందని చెప్పి శివుడు అంతర్థానమయ్యాడట. అలా అమ్మవారు బురుజుపేటలో రోడ్డు మధ్యలో వామహస్తం లేకుండానే వెలసి పూజలు అందుకుంటోందని కథనం.
అయితే1917 ప్రాంతంలో ఇక్కడ చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అమ్మవారి విగ్రహాన్ని ఓ మూలకు జరిపారు. ఆ తరువాత ఇక్కడ ప్లేగువ్యాధి ప్రబలి చాలామంది చనిపోవడంతో… ఇందుకు కారణం అమ్మవారి విగ్రహాన్ని జరపడమేనని భావించిన భక్తులు మళ్లీ దేవి విగ్రహాన్ని రోడ్డుమధ్యలోనే ప్రతిష్ఠించారట.ఆ తరువాతే ప్లేగు వ్యాధి తగ్గి ప్రజలు ఆరోగ్యవంతులయ్యారని చెబుతారు. కనకమహాలక్ష్మిని సేవించే విషయంలో ఎలాంటి వివక్షా ఉండకూడదనే ఆలోచనతోనే ఆలయానికి వచ్చే భక్తుల్ని గర్భగుడిలోకీ అనుమతిస్తారు. అలా వచ్చే భక్తులు అమ్మవారిని నేరుగా పసుపు-కుంకుమలతో పూజించి, కొబ్బరికాయల్ని కొట్టి నివేదించుకుంటారు. దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించాక.. గర్భగుడి పై కప్పు, ద్వారాలు నిర్మించేందుకు ప్రయత్నించినా విఫలం కావడం వల్ల ఆ ఆలోచననూ విరమించుకున్నారని చెబుతారు ఆలయ నిర్వాహకులు. అందుకే గర్భగుడి పైకప్పును కొబ్బరిమట్టలతో కప్పి ఉంచుతారు. తలుపులకు బదులు కర్టెన్లు ఉంటాయి.
కనకమహాలక్ష్మిని చుట్టుపక్కల ప్రాంతాల వారు తమ ఇలవేల్పుగా భావిస్తారు. అందుకే అప్పుడే పుట్టిన పసిబిడ్డల్నీ, కొత్తగా కొన్న వాహనాలనూ, బంగారాన్నీ మొదట అమ్మవారి వద్దకే తీసుకొస్తారు. దగ్గర్లోని బంగారం దుకాణాల యజమానులు సైతం తాళంచేతుల్ని అమ్మవారికి చూపించి మరీ తీసుకెళ్తుంటారు. దేవికి రోజువారీ చేసే పూజలతోపాటు ప్రత్యేక పర్వదినాల్లోనూ విశేష పూజా కార్యక్రమాలను జరిపిస్తారు. ముఖ్యంగా మార్గశిరమాసంలోనే విగ్రహం వెలుగు చూడటం వల్ల ఇక్కడ ఏటా మార్గశిరంలో నెలరోజులపాటు అంగరంగవైభవంగా మాసోత్సవాలను నిర్వహిస్తారు.
ఇలా చేరుకోవచ్చంటే…
ఈ ఆలయం విశాఖపట్నంలోని బురుజుపేటలో ఉంటుంది. దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా విశాఖపట్నం వరకూ విమానం, రైలు, బస్సుల్లో చేరుకోవచ్చు. విమానాశ్రయం నుంచి ఆలయానికి 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్ నుంచి ఆలయానికి వెళ్లేందుకు ఆటోలు అందుబాటులో ఉంటాయి.