X

శ్రీకృష్ణ జన్మాష్టమి… శ్రీ కృష్ణుడు జపించిన ఉత్తమ మంత్రమేమిటో తెలుసా?

శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి, హిందూ ఇతిహాసాలలో ఎనిమిదో అవతారం శ్రీకృష్ణుడు. శ్రీ కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని, లేదా జన్మాష్టమి, లేదా గోకులాష్టమి, లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడు.. వసుదేవుడి భార్య అయిన దేవకి ఎనిమిదో గర్భంగా, శ్రావణమాసం కృష్ణపక్షం అష్టమి తిథి రోజు చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదేరోజు రోహిణి నక్షత్రము కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది.

చేతవెన్న ముద్ద చెంగల్వపూదండ౹
బంగారు మొలతాడు పట్టుదట్టి౹
సందె తావీదులు సరిమువ్వ గజ్జెలు౹
చిన్ని కృష్ణ నిన్ను చేరికొలుతు౹౹

కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణమాసంలో లభించే పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ, స్వామికి నైవేద్యం పెడతారు. ఉయ్యాల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. పురవీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి, పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని ‘ఉట్ల పండుగ’ లేదా ‘ఉట్ల తిరునాళ్ళు’ అని పిలుస్తారు. శ్రీకృష్ణ జయంతిని వ్రతంగా భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినమనికూడా వివరించింది.

దుష్టశిక్షణ.. శిష్ట రక్షణ… అన్న గీతోపదేశంతో మానవాళికి దిశానిర్ధేశం చేశారు శ్రీ కృష్ణభగవానుడు. మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి ఆయన. మహా భాగవతం కథలను విన్నా… దృశ్యాలను తిలకించినా జీవితానికి సరిపడా విలువలెన్నో బోధపడతాయి. ఆ కావ్యం ఇప్పటి పరిస్థితులకు ఒక మార్గదర్శకంగా ఉండటం, కృష్ణుడి మహోన్నత వ్యక్తిత్వానికి, ఆయన లీలలకు అద్దం పడుతోంది. ద్వాపరయుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే ఆయన్ను అందరూ తమ ఇష్టదైవంగా కొలుస్తున్నారు. వివిధ రూపాల్లో, సంప్రదాయాలతో భక్తిప్రపత్తులతో కృష్ణుడిని కొలుస్తున్న ఆయా రాష్ట్రాల వారి సంస్కృతి, సంప్రదాయాలు మన భారతీయ సంస్కృతికి విలక్షణమైన అందాన్ని తెస్తాయి.

శ్రీ కృష్ణుడు జపించిన ఉత్తమ మంత్రమేమిటో తెలుసా?

జగన్నాటక సూత్రధారిగా కీర్తి చెందిన శ్రీ కృష్ణ భగవానుడు ఓ ఉత్తమ మంత్రాన్ని జపించి తనకు కావలసిన వరాలను పొందినట్లు శివపురాణం చెబుతోంది. పూర్వం శ్రీ కృష్ణ భగవానుడు తనకు కావలసిన కోరికలను సిద్ధింప జేసుకోవడం కోసం ముక్కంటిని తలచి తపస్సు చేయాలనుకున్నాడు. వెంటనే హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్న పరమ శివభక్తుడైన ఉపమన్యు మహర్షి దగ్గరకు వెళ్ళి తన మనస్సులోని మాటను చెప్పాడు. అప్పుడు ఆ మహర్షి అధర్వ వేద ఉపనిషత్తులోని “నమశ్శివాయ” అనే పంచాక్షర మంత్రాన్ని ఉపదేశించి, 16నెలల పాటు ఆ మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేయమన్నాడు. ఇలా నమశ్శివాయ మంత్రముతో 16 నెలల పాటు తపస్సు చేసి పార్వతీ పరమేశ్వరులను కృష్ణుడు ప్రత్యక్షం చేసుకున్నాడు. కృష్ణుడి తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ఏం వరాలు కావాలో? కోరమంటాడు. అప్పుడు కృష్ణుడు 8 వరాలను కోరుకుంటానని చెప్పి వాటిని శివుడి ముందుంచాడు. అచంచలమైన గొప్పకీర్తి, స్థిరమైన శివసన్నిధి లభించాలి. నిత్యం శివధర్మంలో బుద్ధి నిలవాలి. నిత్యం తాను శివభక్తితో ఉండాలి. శత్రువులంతా సంగ్రామంలో నశించాలి. ఎక్కడా శత్రువుల వల్ల తనకు అవమానం కలుగకూడదు. తనకు తొలిగా జన్మించిన కుమారులకు ఒక్కొక్కరికి పదిమంది పుత్రులు కలగాలి. యోగులందరికీ తాను ప్రియుడు కావాలి. ఈ వరాలను తనకిమ్మని కృష్ణుడు కోరగానే ముక్కంటి వాటినన్నింటిని అనుగ్రహిస్తాడు.

ఇదేవిధంగా శ్రీ కృష్ణ పరమాత్మ చేసిన తపస్సుకు పార్వతీదేవి సంతసించి కావలసినన్ని వరాలను కోరమని అడుగుతుంది. అప్పుడు కృష్ణుడు.. బ్రాహ్మణుల మీద ఎప్పటికీ ప్రజలకు ద్వేషం కలగకూడదు. తన తల్లిదండ్రులు సర్వకాలాలలోను సంతోషంగా ఉండాలి. తానెక్కడ ఉన్నా సర్వ ప్రాణుల మీద తనకు అనురాగం కలగాలి. మంగళకరమైన బ్రాహ్మణ పూజను తాను సర్వదా చేస్తుండాలి. తాను వంద యజ్ఞాలను చేసి ఇంద్రుడు లాంటి దేవతలను సంతోష పెట్టాలి. తన గృహంలో ఎల్లప్పుడూ వేల సంఖ్యలో యతులకు, అతిథులకు శ్రద్ధతో పవిత్రమైన భోజనాన్ని సమర్పించే అవకాశం కలగాలి. అలాగే తాను వేలసంఖ్యలో భార్యలకు ప్రియమైన భర్త కావాలి. తనకు వారంటే ఎప్పటికీ అనురాగం ఉండాలి. వారి తల్లిదండ్రులంతా లోకంలో సత్య వాక్యాలను పలుకుతూనే ఉండాలి. అనే వరాలను కృష్ణుడు శక్తిమాతను అడిగాడు. వాటిని శ్రీ కృష్ణుడికి వెంటనే అనుగ్రహించి ఆ మరుక్షణంలోనే పార్వతీ పరమేశ్వరులిద్దరు అంతర్ధానమయ్యారని శివపురాణం చెబుతోంది.

“నమశ్శివాయ” మంత్రంచే కృష్ణుడు సిద్ధింప చేసుకున్న వరాలలో కొన్ని మాత్రమే ఆయనకు సంబంధించినవి. మిగతా వరాలను పరిశీలిస్తే సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కోరుకున్నవే అవుతాయి. అందుచేత శ్రీ కృష్ణ భగవానుడు కొంతవరకు తమ స్వార్థాన్ని ఆకాంక్షిస్తూ వరాలు కోరినా.. ఎంతో కొంత సామాజిక శ్రేయస్సును కూడా అభిలాషించాలన్న ఓ ఉత్తమ ప్రబోధం ఈ కథలో కనిపిస్తుంది. లోక కళ్యాణార్థం భూమిపై అవతరించిన శ్రీ కృష్ణ భగవానుడిని శ్రీ కృష్ణాష్టమి రోజున నిష్టతో పూజించి ఆయన ఆశీస్సులు పొందుదాం..

సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు…

Telugu BOX Office:
Related Post