X

పూరీ జ‌గ‌న్నాథుడిని గ‌ణ‌ప‌తి రూపంలో ఎందుకు పూజిస్తారో తెలుసా?

వైష్ణవ ఆలయాల్లో విష్ణుమూర్తి, ఆయన అవతారాల ఉత్సవ విగ్రహాలను వివిధ వాహనాల మీద ఊరేగించడం ఆచారం. వీటిలో గజవాహన సేవ ఒకటి. అయితే, భారతదేశంలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాల్లో ఒకటైన పూరీలో మాత్రం జగన్నాథుడిని, ఆయన అన్న బలభద్రుడిని ఏకంగా ఏకదంతుడి రూపంలోనే ముస్తాబుచేయడం ఆసక్తికరం. ఈ వేడుకనే ‘హాథీబేష’ (ఏనుగు వేషం) అని పిలుస్తారు.

ఆషాఢ శుద్ధ విదియనాడు మొదలయ్యే ప్రపంచ ప్రసిద్ధ ‘జగన్నాథ రథయాత్ర’కు ముందే, జ్యేష్ఠ పౌర్ణమినాడు ఈ వేడుక జరుగుతుంది. ఇక హాథీబేషకు ముందు జగన్నాథుడు, ఆయన అన్న బలభద్రుడు, సోదరి సుభద్రను అభిషేకించడానికి ‘స్నానయాత్ర’కు తీసుకువెళ్తారు. గణపతి వేషంలో జగన్నాథుడిని అలంకరించడానికి స్వామి గణపతిని మాత్రమే ఆరాధించే గాణాపత్య మార్గ అనుయాయులను అనుగ్రహించడం కోసమే ఓ సందర్భంలో ఏనుగు ముఖంతో దర్శనం ఇచ్చాడని ఒక కథ ప్రచారంలో ఉంది.

ఒకానొక సమయంలో పూరీ రాజు దగ్గరికి గణపతి భట్ట అనే గొప్ప పండితుడు వచ్చాడు. ఆ సమయంలో పూరీలో జగన్నాథుడిని స్నానయాత్ర వేడుకకు సిద్ధం చేస్తున్నారు. ఆ వేడుకకు హాజరవ్వాలని గణపతి భట్టను ఆహ్వానించాడు రాజు. దానికి ఆయన తాను గణపతిని మాత్రమే ఆరాధిస్తానని, వేడుకకు రాలేనని అంటాడు. రాజు బలవంతపెట్టేసరికి, అన్యమనస్కంగానే జగన్నాథుడి స్నానయాత్రకు వెళ్లడానికి గణపతి భట్ట ఒప్పుకొంటాడు. అయితే, అక్కడికి వెళ్లేసరికి అద్భుతం జరుగుతుంది.

జగన్నాథుడి రూపంలో ఉన్న కృష్ణుడు గణపతి భట్టకు గణేశుడి రూపంలో సాక్షాత్కరిస్తాడు. అంతేకాదు, బలభద్రుడు కూడా ఏకదంతుడి రూపంలోనే కనిపిస్తాడు. దాంతో బలభద్ర, జగన్నాథులు సాక్షాత్తూ శివకేశవులనే సంగతి గణపతి భట్ట తెలుసుకుంటాడు. అలా తనకు కండ్లు తెరిపించడానికే వాళ్లిద్దరూ గణపతి రూపాన్ని ధరించారని ఆయనకు అర్థమవుతుంది. అంతేకాదు గణపతి, విష్ణువు, శివుడు, గౌరి ఇలా భేదాలెన్ని ఉన్నా పరమాత్ముడు ఒక్కడే అని కూడా గుర్తిస్తాడు.

అప్పటినుంచి రథయాత్రకు ముందు, జ్యేష్ఠ పౌర్ణమి నాడు జరిపే ‘స్నానయాత్ర’ సమయంలో జగన్నాథ ఆలయ పూజారులు జగన్నాథ, బలభద్రుల ముఖాలకు ఏనుగు తొడుగులు ధరింపజేస్తారు. అలా బలరాముడు తెల్ల ఏనుగు రూపంలో, జగన్నాథుడు (కృష్ణుడు) నల్ల ఏనుగు రూపంలో దర్శనమిచ్చే సందర్భాన్ని పూరీ ఆలయ సంప్రదాయంలో ‘హాథిబేష’ అని పిలుచుకుంటారు. గణపతి వేషంలో దేవుళ్లను దర్శిస్తే మంచి జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే స్నానయాత్ర రోజున జగన్నాథుడి మందిరాన్ని వేలాది మంది భక్తులు దర్శిస్తారు

Telugu BOX Office:
Related Post