X

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం – తిరుచానూరు

తిరుచానూరు పుణ్యక్షేత్రం తిరుపతి జిల్లా(ఉమ్మడి చిత్తూరు) తిరుపతి పట్టణం సమీపంలో ఉంది. దీన్ని అలమేలు మంగాపురమని కూడా పిలుస్తారు. ఇక్కడ వెంకటేశ్వరుని దేవేరి లక్ష్మీదేవి అవతారమైన అలమేలు మంగ ఆలయం ప్రసిద్ధి చెందింది.

పురాణ గాథ..


త్రిమూర్తులను పరీక్షించే యత్నంలో కోపిష్టియైన భృగు మహర్షి విష్ణువు వక్ష స్థలాన్ని కాలితో తన్నాడు. తన నివాస స్థానాన్ని అవమానించినందుకు అలిగి లక్ష్మీదేవి కొల్హాపూర్ వెళ్ళింది. సిరి లేని శ్రీనివాసుడు తిరుమల కొండల్లో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. ప్రసన్నురాలైన శ్రీదేవి తిరుచానూరులోని పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు శుక్రవారం, ఉత్తరాషాఢ నక్షత్రంలో బంగారు పద్మంలో అవతరించింది. ఆ పద్మావతినే శ్రీనివాసుడు లక్ష్మి అనుజ్ఞతతో పెండ్లాడాడు.

అలమేలు మంగ ఆలయ సన్నిధిలో లక్ష్మీదేవి చతుర్భుజ, రెండు చేతులలో పద్మాలు ధరించి ఉంటుంది. రెండు చేతులు వరద అభయ ముద్రలలో ఉంటాయి. ఈ ఆలయంలో ఉన్న మరి కొన్ని సన్నిధులు… శ్రీకృష్ణుడు, సుందరరాజస్వామి, సూర్యనారాయణ స్వామి. చారిత్రిక ఆధారాల ప్రకారం పల్లవ రాజుల కాలంలో ఇది “తిరువెంగడ కూటం”గా ఉంది. ఇంతకు ముందు కాలంలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఒకటుండేది. తరువాత ఆ విగ్రహాలను వేరే చోటికి తరలించారు.

తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తరువాత తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోకపోతే ఆ యాత్రకు ఫలం లభించదని ప్రతీతి. పదివేల జనాభా మాత్రమే ఉన్న తిరుచానూరులో 50కి పైగా కళ్యాణ మంటపాలున్నాయి. ఏటా వెయ్యికి పైగా వివాహాలు జరుగుతాయి. అమ్మవారి ఆలయంలో ప్రతిదినం ఉదయం సుప్రభాత సేవ జరుగుతుంది. తరువాత సహస్ర నామార్చన, కళ్యాణోత్సవము, ఊంజల్ సేవ ఉంటాయి. రాత్రి ఏకాంత సేవ అనంతరం ఆలయం మూసివేస్తారు.

ప్రతి సోమవారం “అష్టదళ పదపద్మారాధన” జరుగుతుంది. శుక్రవారం అభిషేకం జరుగుతుంది. గురువారం తిరుప్పావడ సేవ ఉంటుంది. శ్రావణ మాసంలోను, మరి కొన్ని దినాలలోను లక్ష్మీపూజ జరుగుతుంది. ఇక్కడ ప్రసాదంతో పాటు ఇచ్చే పసుపు కుంకుమలను భక్తులు అతి పవిత్రమైనవిగా స్వీకరిస్తారు. కార్తీక బ్రహ్మోత్సవాలు ఇక్కడి ముఖ్యమైన ఉత్సవం. అమ్మవారి అవతరణ దినమైన కార్తీక శుద్ధ పంచమి నాడు తిరుమల నుండి గజవాహనంపై వచ్చే చక్రత్తాళ్వార్‌తో అమ్మవారు స్నానమాచరించడం సంప్రదాయం. ఆ సుముహూర్తంలో లక్షలాది జన సందోహం భక్తితో పుష్కరిణిలో స్నానమాచరిస్తారు.

ఆనాడు ఆది శంకరాచార్యులు అమ్మవారికి అలంకరించినట్లు చెప్పబడే మంగళ సూత్రాలను దర్శిస్తారు. దసరాకు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఇంకా తెప్పోత్సవం, వసంతోత్సవం, రథ సప్తమి ముఖ్యమైన ఉత్సవాలు. సుందరరాజ స్వామి గుడిలో మూడు రోజుల పాటు అవతారోత్సవం జరుగుతుంది. అమ్మవారి ఆలయం వెనకాల ఉన్న కోనేరు, శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం, పద్మావతి గార్డెన్, శ్రీరామ ఆలయం, రామకృష్ణ తీర్థం, గోవిందరాజ స్వామి ఆలయం, శేష తీర్థం, ఆంజనేయస్వామి ఆలయం మొదలగునవి చూడదగ్గవి.

సందర్శించు వేళలు : ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు

అలమేలు మంగాపురం ఎలా చేరుకోవాలి ?

తిరుపతి బస్టాండ్ నుంచి తిరుచానూరు ఆలయానికి లోకల్ బస్సులు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, జీపులు రెగ్యులర్‌గా తిరుగుతుంటాయి. లోకల్ గా తిరిగే షేర్ ఆటోల్లో ఎక్కి ఆలయానికి చేరుకోవచ్చు. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి, రేణిగుంట ఎయిర్ పోర్ట్ నుంచి డైరెక్ట్‌గా క్యాబ్ లేదా టాక్సీ మాట్లాడుకొని కూడా అలమేలు మంగాపురం చేరుకోవచ్చు.

Telugu BOX Office:
Related Post