కాకులు ఎగరని ప్రాంతం.. రంకె వేసే బసవన్న.. ఎన్నో విశేషాల ‘యాగంటి’ పుణ్యక్షేత్రం
Category : Behind the Scenes Daily Updates Features Sliders Spiritual
శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. గతంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం ప్రస్తుతం నంద్యాల జిల్లా పరిధిలోకి వచ్చింది. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి. ఈ గ్రామంలో ఉమామహేశ్వర స్వామి ఆలయం నెలకొనివుంది. సమీపంలోని కొండ గుహ ఒకదానిలో వేంకటేశ్వరస్వామి విగ్రహం ఉంది. అగస్త్య మహర్షి, వీరబ్రహ్మేంద్రస్వామి వంటివారి పేర్లతో ఇక్కడి చారిత్రక, పౌరాణిక గాథలు ముడిపడివున్నాయి.
యాగంటి ఆలయంలోని నంది విగ్రహానికి “యాగంటి బసవన్న” అని పేరు. ఈ విగ్రహం అంతకంతకూ పెరుగతూవుంటుందని, కలియుగం అంతమయ్యే నాటికి ఇక్కడి బసవన్న లేచి రంకె వేస్తుందని వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో వర్ణించారు. అగస్త్య మహర్షి శాపం వల్ల ఈ గ్రామంలో కాకులు ఉండవని ప్రతీతి.
యాగంటి దేవాలయం తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. ఇక్కడ వున్న నందీశ్వరునికి దేశవ్యాప్తంగా ప్రచారం ఉంది. యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరుని లింగం ఉంది. తొలుత ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కట్టారట. అయితే విగ్రహంలో చిన్న లోపం ఉన్నందున వెంకటేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదని, స్వయంభువుగా ఆ చుట్టు పక్కల వెలసిన ఉమా మహేశ్వరస్వామి వారిని తీసుకుని వచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారని ప్రచారంలో ఉంది. లోప భూయిష్టమైన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి ప్రక్కనే కొండపైన సహజ సిద్దంగా వున్న గుహలో ఇప్పటికీ దర్శించుకోవచ్చు. ఇక్కడున్న పుష్కరిణి లోనికి నీరు నంది నోటి నుండి వస్తూ వుంటుంది.
అగస్త్య పుష్కరిణి
ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో ప్రవహించి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది. ఈ కోనేరులో అగస్త్యుడు స్నానమాచరించిన కారణంగా దీనిని అగస్త్య పుష్కరిణి అని అంటారు. ఏ కాలంలో నైనా పుష్కరిణి లోని నీరు ఒకే మట్టంలో వుండడం విశేషం. ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వ రోగాలు నయమౌతాయని నమ్మకం. పుష్కరిణి నుండి ఆలయానికి వెళ్ళడానికి సోపాన మార్గం ఉంది.ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగి ఉంది. దీన్ని దాటగానే రంగ మంటపం, ముఖ మంటపం, అంతరాళం, ఉన్నాయి. గర్బాలయంలో లింగ రూపంపై ఉమామహేశ్వరుల రూపాలు కూడా ఉన్నాయి. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారు రచించిన కాలజ్ఞానంలో యాగంటి బసవన్న రోజు రోజుకి పెరుగుతున్నాడని రాశారు.
యాగంటి గుహాలయ దృశ్యం
యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండగుహలు ఆశ్చర్య చకితుల్ని చేస్తాయి. వెంకటేశ్వరస్వామి గుహలో అగస్త్య మహర్షి శ్రీ వేంకటేశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించాడు. ఇక్కడున్న వేంకటేశ్వరుడు భక్తుల పూజలనందు కొంటున్నాడు. ఆ ప్రక్కనే ఇంకో గుహలో బ్రహ్మం గారు కొంత కాలం నివసించి శిష్యులకు ఙ్ఞానోపదేశం చేసారని భక్తులు నమ్ముతారు. దీనిని శంకరగుహ, రోకళ్ళగుహ అనికూడా అంటారు.ః
యాగంటి బసవన్న
ఇక్కడి ముఖ మంటపంలో స్వయంభువుగా వెలసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. దానిని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తుంది. ఈ బసవన్న అంతకంతకు పెరిగిపోతూ ఉంటోందన్న మాటని పురావస్తు శాఖ కూడా నిర్ధారణ చేయడంతో మరింత మహిమాన్వితమైనదిగా వెలుగొందుతోంది. కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకె వేస్తాడని బ్రహ్మంగారి కాలజ్ఞానం లో ప్రస్తావించబడి ఉంది. యుగాంతంతో ముడిపడి ఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది.
కాకులకు శాపం
యాగంటిలో కాకులు కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇందుకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి అక్కడ వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తే బాగుంటుందని భావించాడు. ఆయన ఆ విగ్రహాన్ని మలుస్తూ వుండగా చేతి బొటనవేలుకి గాయమైందట. తన సంకల్పంలో లోపమేమో అనే సందేహం తలెత్తడంతో వెంకటేశ్వరస్వామి గురించి తపస్సు చేశాడు. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో, అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ శపించాడట. అందువల్లనే ఇక్కడ కాకులు కన్పించవని చెబుతుంటారు.
ఆలయ దర్శన వేళలు
ఉదయం 6:00 నుండి 11:00 వరకు, సాయంత్రం 3:00 నుండి 8:00 వరకు
ఎలా వెళ్లాలి…
ఈ క్షేత్రం కర్నూలుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నూలు, బనగానపల్లి, నంద్యాల నుండి యాగంటి క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది. యాగంటిలో వసతి సౌకర్యాలు లేవు. దగ్గర వున్న బనగానపల్లిలో వసతులున్నాయి.