హనుమంతునికి వడ మాల ఎందుకు వేస్తారు.. ప్రయోజనం ఏంటి?
Category : Behind the Scenes Daily Updates Features Sliders Spiritual
అంజనాదేవికి, వాయు భగవానునికి జన్మించిన ఆంజనేయుడు బాల్యంలో అకాశంలో ఉన్న సూర్యుడిని పండుగా భావించి ఎగిరి పట్టుకోవాలనుకున్నాడు. వాయుపుత్రుడు కావడంతో అకాశానికి ఎగిరాడు. సూర్యుడిని పట్టుకునేందుకు వాయుపుత్రుడు ఇలా ఆకాశానికి ఎగిరెళ్ళడం చూసిన దేవతలంతా విస్తుపోయారు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని విసిరి ఆంజనేయుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అపుడు వజ్రాయుధం హనుమంతుడి దవడ తాకింది. హనుమంతుని దవడ కి గాయమేర్పడింది. అందుచేత సుందరుడు అనే పేరుగల ఆంజనేయుడు హనుమంతునిగా పిలుస్తారు. బాల హనుమంతుడు సూర్యుడిని పట్టేందుకు వెళ్తున్న సమయం సూర్యగ్రహణం కావడంతో, సూర్యుడిని పట్టుకునేందుకు రాహువు కూడా ప్రయాణమయ్యాడు. అయితే వాయుపుత్రుని వేగానికి రాహువు తట్టుకోలేక సూర్యుడిని పట్టలేకపోయాడు. సూర్యగ్రహణాన్ని అడ్డుకొని వేగంతో తనను మించిన హనుమంతుడి సాహసాన్ని చూసి నివ్వెరపోయిన రాహువు ఆంజనేయుడికి ఒక వరం ఇచ్చాడు.
రాహువుకు ప్రీతికరమైన మినుములతో వడలు (గారెలు) చేసి వాటిని మాలగా తయారుచేసి ఎవరు హనుమంతునికి సమర్పిస్తారో వారికి రాహుగ్రహంతో ఏర్పడే బాధలు, దోషాల నుండి విముక్తుల్ని చేస్తానని వరమిచ్చి ఆశీర్వదిస్తాడు. రాహువుకు ప్రీతికరమైన మినుముతో వడలు (గారెలు) చేసి తన శరీరం పోలిక అంటే పాములాంటి ఆకారంలో మాలగా వడలను హనుమంతునికి సమర్పిస్తే రాహు దోషాలు పూర్తిగా తొలగిపోతాయని విశ్వాసం. అందుచేతనే మినప పప్పు వడలు తయారుచేసి 54, 108 లేదా 1008 అనే సంఖ్యలో హనుమంతునికి మాలగా సమర్పించిన వారికి రాహు దోషాలుండవని చెబుతారు.