X

అప్పులోళ్ల నుంచి తప్పించుకుని తిరిగేవాణ్ణి – ‘కాంతార’ డైరెక్టర్ రిషబ్ శెట్టి

‘కాంతార’ కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఏ సినీ ప్రేక్షకుడి నోట విన్నా ఇదే మాట. కన్నడలో చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణతో పాన్ ఇండియా రేంజ్‌కి వెళ్లిపోయింది. ఇతర రాష్ట్రాల్లో క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు ఇతర భాషల్లోకి డబ్ చేసి విడుదల చేశారు. తెలుగులోనూ ఈ సినిమా ఏకంగ రూ.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. హీరోగా, దర్శకుడిగా ద్విపాత్రాభినయం చేసిన రిషబ్‌శెట్టి ఇప్పుడు ఆలిండియా స్టార్ అయిపోయాడు. ఈ స్టార్‌డమ్ ఆయనకు ఒక్కరోజులో వచ్చిందేమీ కాదు.. కెరీర్ ప్రారంభంలో ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు. జీవితం అతణ్ణి వాటర్‌ క్యాన్‌ బాయ్‌గా చేస్తే… తనదైన పట్టుదలతో హీరోగా, దర్శకుడిగా తన సత్తా చాటాడు రిషబ్‌ శెట్టి. నటనా, వ్యాపారమూ అంటూ రెండు పడవలపైన చేసిన తన ప్రయాణం ఒకేసారి ముంచేసింది. అలా మునిగిన వాడు ఒక్కో మెట్టు ఎక్కుతూ తాజా సంచలనం ‘కాంతార’తో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవిత గమనాన్ని వివరించాడు..

మాది కర్ణాటక రాష్ట్రం ఉడుపి జిల్లా కుందాపురలోని కెరాడి అనే చిన్న ఊరు. మా నాన్న భాస్కర శెట్టి జ్యోతిష్కుడు. పెద్ద ఆస్తులేమీ లేకపోయినా నాన్న ఆదాయం మా అవసరాలకు సరిపడా ఉండేది. అమ్మ రత్నావతి. నాకో అక్క, అన్న. అందరిలో నేనే చిన్నవాడిని కావడంతో నన్ను గారాబంగా పెంచారు. ఇంట్లోనే కాదు… స్కూల్లోనూ నేను అల్లరి పిల్లాడినే. పదోతరగతి వరకూ మా ఊళ్లోనే చదువుకున్నాను. ఆ తర్వాత కుందాపురలో ఇంటర్‌లో చేరాను. నా స్నేహితులూ అదే కాలేజీలో చేరడంతో ఇక అక్కడా మా అల్లరి కొనసాగేది. చదువు కన్నా అల్లరీ, ఆటల్లోనే ఫస్ట్‌ ఉండేవాణ్ణి. కుస్తీ, జూడో పోటీల్లో ఎన్నో పతకాలూ సాధించాను. అయితే ఇదంతా మా నాన్నగారికి అస్సలు నచ్చేది కాదు. ఇక్కడే ఉంటే జులాయిగా మారతానన్న భయంతో బెంగళూరుకు పంపేశారు. నాన్న ఆ పని కోపంతో చేసినా… నేను మాత్రం ఎగిరి గంతేశాను.

ఉపేంద్రను చూసి సినిమాల్లోకి
నా చిన్నప్పుడు మా ఊరు మొత్తంలో కరెంటూ, టీవీ ఉన్న ఇల్లు మాదే. దూరదర్శన్‌లో వచ్చే కన్నడ పాటల కోసం ఎదురుచూస్తుండేవాణ్ణి. అందులోనూ హీరో రాజ్‌కుమార్‌ పాటలంటే మరీ ఇష్టం. నేనూ ఆయనలా హీరో కావాలనేది నా ఆశ. దాంతో నన్ను నేను నిరూపించుకోవడానికి ఎలాంటి చిన్న అవకాశం వచ్చినా వదిలిపెట్టేవాడిని కాదు. దట్టమైన అడవుల మధ్యలో ఉండే మా ఊళ్లో… గ్రామ దేవతలూ, వాళ్లకి చెందిన రకరకాల ఆచారాలూ ఉండేవి. ఏటా యక్షగానం కార్యక్రమాల్లాంటివి నిర్వహిస్తుంటారు. నేనూ ఓ సారి మా ఊరి కళాకారులతో కలిసి ‘మీనాక్షి కల్యాణ’ అనే యక్షగాన ప్రదర్శనలో షణ్ముగ పాత్ర చేశాను. నా నటన చూసి ఊళ్లో వాళ్లందరూ బాగా మెచ్చుకున్నారు. ఆ కళాకారుల ద్వారానే నాకు మా ప్రాంతం వాడైన ఉపేంద్ర… ఓం, ష్‌- లాంటి సినిమాలతో కన్నడ తెరపైన సంచలనం సృష్టిస్తున్నాడని తెలిసింది. నేనూ అతనిలా కావాలనుకున్నాను. అప్పుడే నటనపైన మాత్రమే కాకుండా దర్శకత్వంపైనా నాకు ఆసక్తి కలిగింది. అటువైపు వెళ్లాలంటే నేను బెంగళూరులోనే శిక్షణ తీసుకోవాలి. సరిగ్గా అప్పుడే నాన్న నన్ను బెంగళూరుకి తీసుకెళ్లారు.

బెంగళూరులో బీహెచ్‌ఎస్‌ కాలేజీలో డిగ్రీలో చేరిపోయాను. అక్కడా నాకు మంచి స్నేహితులు దొరికారు. కాకపోతే ఈసారి అల్లరివైపు కాకుండా రంగస్థలం వైపు దృష్టిపెట్టాం. అలా మా కళాశాలలో ‘రంగసౌరభం’ అనే బృందంగా ఏర్పడి నాటకాలు వేసేవాళ్లం. ఆ పిచ్చి బాగా పెరిగి డిగ్రీ పూర్తవ్వకుండానే… ‘ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌’లో శిక్షణ కోసం డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో చేరిపోయాను. ఆ పని చేసినందుకు నాన్న నాపైన మండిపడ్డారు.ఆ సమయంలో నాకు మా అక్క ప్రతిభా శెట్టి అండగా నిలిచింది. నాన్నను అడిగే అవసరం రాకుండా నా ఖర్చులకు తనే డబ్బులు ఇస్తుండేది. కానీ ఇలా అక్కపైన ఆధారపడటం నచ్చక మినరల్‌ వాటర్‌ వ్యాపారం మొదలు పెట్టాను. ఉదయం అక్కని ఆఫీసులో దింపేసి ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లేవాడిని. తరగతులు పూర్తయ్యాక మళ్లీ అక్కను ఇంట్లో దింపేసి మినరల్‌ వాటర్‌ సప్లై చేసేందుకు ఎలక్ట్రానిక్‌ సిటీకి వెళ్లేవాడిని. రాత్రంతా నీళ్లు సప్లై చేసి వ్యానుల్లోనే నిద్రపోయి ఉదయాన్నే అక్క ఇంటికి చేరుకునేవాడిని. ఆ వ్యాపారంతో కాస్త కూడబెట్టాను, కానీ ఆ డబ్బూ ఎక్కువ కాలం నిలవలేదు…

రోజుకు 50 రూపాయలు
ఓ రోజు నేను వాటర్‌ సప్లై చేస్తున్న క్లబ్‌కు కన్నడ నిర్మాత ఎం.డి ప్రకాశ్‌ వస్తే… ఏదైనా అవకాశం ఇప్పించమని అడిగాను. వాటర్‌ సప్లై చేస్తున్న నేను అలా అడిగేసరికి… ఆయన వింతగా చూస్తుంటే నేను ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ విద్యార్థినని చెప్పాను. దాంతో ‘సైనైడ్‌’ అన్న చిత్రంలో సహాయ దర్శకుడిగా అవకాశం ఇప్పించారు. అక్కడ నాకు రోజుకు యాభై రూపాయలు ఇచ్చేవారు. ఆ చిత్రం స్పాట్‌కు వెళ్లేందుకే నాకు వంద రూపాయలు ఖర్చయ్యేది. అయితేనేం… అక్కడ ఎడిటర్‌, లైట్‌బాయ్‌, టచప్‌ మ్యాన్‌ ఇలా ఎవరు రాకపోయినా ఆ పని నేను చేస్తూ చాలా విషయాలు నేర్చుకున్నాను. దురదృష్టం వెన్నాడుతోందో ఏమో ఆ షూటింగ్‌ ఆగిపోయింది. చేసేదేమీ లేక మళ్లీ వాటర్‌ క్యాన్‌ వ్యాపారంలోకి దిగాను. ఒక్కసారి సినిమా ప్రపంచాన్ని రుచి చూశాక… ఆ వ్యాపారం చేయలేకపోయాను. ప్రముఖ దర్శకుడు రవి శ్రీవత్స తీస్తున్న చిత్రం ‘గండ హెండతి’ యూనిట్‌లో క్లాప్‌ బాయ్‌గా చేరాను. ఆ దర్శకుడికి కోపం చాలా ఎక్కువ. ఓ రోజు కెమెరామెన్‌ ఇచ్చిన సూచనతో ఓచోట నిలబడ్డాను. ఉన్నట్టుండి నా తలపైన ఎవరో గట్టిగా కొట్టారు. ఎవరా అని చూస్తే…దర్శకుడు. ‘ఇక్కడెవరు నిల్చోమన్నారు’ అని కోపంతో ఊగిపోతున్నాడు. కెమెరామెన్‌ చెప్పింది వినాలా…డైరెక్టర్‌ చెప్పినట్లు చేయాలా…అర్థం కాలేదు. చిరాకొచ్చి చెప్పా పెట్టకుండా ఆ చిత్రం నుంచి బయటకు వచ్చేశాను. ఏడాది పాటు ఆ షూటింగ్‌లో పని చేస్తే వచ్చింది రూ.1,500. ఆ డైరెక్టర్‌ దెబ్బకి సినిమాలవైపే వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను.

మారువేషాల్లో తిరిగాను…
అప్పటి వరకూ సినిమాలపైన ఉన్న ఆసక్తి కాస్తా విరక్తిగా మారిపోయింది. ఇక మినరల్‌ వాటర్‌ వ్యాపారాన్ని మానేసి ఏదైనా కొత్త వ్యాపారం చేద్దామనుకున్నాను. అప్పటిదాకా సంపాదించిన డబ్బుతో పాటు కొంత అప్పు చేసి 2009లో హోటల్‌ వ్యాపారం పెట్టాను. కానీ అది కేవలం అయిదు నెలల్లోనే నష్టాలు చూపించింది. పెట్టుబడి అంతాపోయి 25 లక్షల రూపాయల అప్పు మిగిల్చింది. ఆ అప్పులకు వడ్డీ కట్టేందుకు కొత్తగా అప్పులు చేయాల్సి వచ్చింది. అలా 2012 వరకూ ఈ అప్పులు కడుతూనే ఉన్నాను. మనసు మళ్లీ సినిమాల వైపు వెళ్లింది. వేషాల కోసం గాంధీనగర్‌లో తిరిగాను. చిన్న చిన్న చిత్రాల్లో అవకాశాలొచ్చాయి. ఆ సమయంలో అప్పులోళ్ల నుంచి తప్పించుకునేందుకు సినిమాల్లోని వేషాలతోనే బయటా తిరిగేవాణ్ణి. ఒక రోజు బేకరీకి వెళ్లాను. అక్కడ బిల్లు రూ.18లు అయితే నా జేబులో 17రూపాయలే ఉన్నాయి. ఇదివరకు మినరల్‌ వాటర్‌ వ్యాపారంలో లక్షల రూపాయల ఆదాయం చూసిన నేను ఒక్క రూపాయి లేక ఇబ్బంది పడటం నన్నెంతో కుమిలిపోయేలా చేసింది. అలా కాదనుకుని…సీరియల్లో అవకాశాలు వచ్చినా చేయడానికి సిద్ధమయ్యాను. ఓ సీరియల్‌లో రోజుకు రూ.500ల చొప్పున అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాను.

అసలు పేరు రిషబ్‌ కాదు!
ఇటు సినిమాలూ లేవూ, అటు వ్యాపారమూ కలిసిరాలేదు. ఏ ప్రయత్నమూ ఫలించక అయోమయంలో పడిపోయాను. అప్పుడే దర్శకుడు అరవింద్‌ కౌశిక్‌తో పరిచయమైంది. ఆ సమయంలో ఆయన రక్షిత్‌ శెట్టితో ‘తుగ్లక్‌’ సినిమా తీస్తున్నారు. ఆ సినిమాలో నటించేటప్పుడే ప్రశాంత్‌ శెట్టి అన్న నా పేరుని రిషబ్‌ శెట్టిగా మార్చుకున్నాను. ఆ సినిమాలో చిన్న పాత్రలో కనిపించాన్నేను. అప్పటి నుంచి నాలుగేళ్ల పాటు కొన్ని సినిమాల్లో చిన్న పాత్రలు చేస్తూ ఉండిపోయాను.

అలా దర్శకుణ్ణయ్యాను…
రక్షిత్‌ శెట్టి చేసిన తొలి సినిమా పరాజయం పాలైంది. దానిపైన ఎన్నో ఆశలు పెట్టుకున్న అతడు కుంగిపోయాడు. ‘తుగ్లక్‌’తో నాకు మంచి స్నేహితుడైన అతణ్ణి కుంగుబాటు నుంచి బయటపడేయాలనే ఇదివరకు నేను సిద్ధం చేసుకున్న ‘రిక్కీ’ కథను చెప్పాను. తనకి నచ్చడంతో నన్నే దర్శకత్వం కూడా చేయమన్నాడు. అనూహ్యంగా వచ్చిన అవకాశం అది. రూ.2 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం పెద్ద హిట్టయింది. హిట్‌ సాధించాం..ఇక ఓ కళాత్మకమైన సినిమా తీద్దామని ‘సర్కారి హిరియ ప్రాథమిక శాలే, కాసరగోడు’ కథ రాశాను. బడులు మూసివేస్తారన్న పత్రికల కథనాలు దానికి మూలం. కానీ నిర్మాతల చుట్టూ ఎంతగా కాళ్లరిగేలా తిరిగినా ఎవరూ ముందుకు రాలేదు. నాకు ఉక్రోషం వచ్చి నేనే నిర్మాతని కావాలనుకున్నాను. మరి డబ్బులు? మరో కమర్షియల్‌ సినిమాతో సంపాదిద్దామని ప్లాన్‌ చేశాను. అలా నా మిత్రులతో కలిసి 2016లో ‘కిరిక్‌ పార్టీ’ సినిమా తీస్తే అది పెద్ద హిట్టయింది. ఆ డబ్బుతోనే ‘సర్కారి హిరియ ప్రాథమిక శాలే, కాసరగోడు’ అన్న నా కలల ప్రాజెక్టుని ముగించాను. ఆ సినిమాకు జాతీయ అవార్డొచ్చింది. ఇక ‘బెల్‌బాటమ్‌’తో హీరో అవ్వాలన్న కోరికా తీరింది.

సొంత ఊరి కథే ‘కాంతార’…
ఉడుపి జిల్లాలోని మా కుందాపుర ప్రాంతం అన్ని రకాలా ప్రత్యేకమైంది. మాది ఒట్టి కన్నడ యాస కాదు… ఓ కొత్త భాషలాగే ఉంటుంది. ‘కాంతార’ సినిమాలో… ప్రేక్షకులందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్న భూతకోల దైవారాధన మా ప్రాంతంలో నిత్యం అనుసరించే సంప్రదాయమే. ఇక్కడున్న మా ప్రత్యేక జీవన శైలీ, సంస్కృతుల్ని ప్రతిబింబించే సినిమా తీయాలని నిర్ణయించుకున్నాను. అదే సమయంలో, ఈ చిత్రం పాన్‌ ఇండియా సినిమాగానూ ఉండాలనుకున్నాను. ఆ స్థాయిలో చేయాలంటే అందుకు తగ్గ నిర్మాణ సంస్థ కావాలి కదా. కేజీఎఫ్‌తో ఘన విజయం అందుకున్న ‘హోంబలే’ సంస్థని ఇందుకోసం ఒప్పించాను. ఈ చిత్రాన్ని ముందు పునీత్‌ రాజ్‌కుమార్‌తో తీయాలనే అనుకున్నాను. ఆయనతో చెబితే… సినిమాలో ఆ మట్టిపరిమళం చక్కగా రావాలంటే ‘నువ్వే నటించాలి’ అని సలహా ఇచ్చాడు. దాంతో నేనే అటు హీరోగానూ ఇటు దర్శకుడిగానూ అవతారమెత్తాను. ఈ చిత్రాన్ని పూర్తిగా మా ఊరిలోనే సెట్‌ వేసి తీశాం. అడవి కూడా ఊరి పక్కన ఉన్నదే. ఇందులోని నటుల్లో 80 శాతం మంది మా ఊరివాళ్లే. భాష ఏదైనా, సంస్కృతి వేరైనా ప్రకృతికీ, మానవుడికీ మధ్య సంఘర్షణ ప్రపంచ వ్యాప్తంగా ఒక్కటే కాబట్టి… ప్రతి ఒక్కరూ కనెక్ట్‌ అవుతారని దీన్ని దేశవ్యాప్తంగా విడుదలచేశాం. నా ఊహ నిజమై చిత్రం అందరికీ దగ్గరవడంతో పాటు… నేను ఊహించని స్థాయిలో కలెక్షన్‌లు రాబడుతోంది. 16 కోట్ల రూపాయలతో నేను నిర్మించిన ఈ చిత్రం… వారంలోనే వందకోట్లు దాటి పోవడం ఎవరు మాత్రం ఊహించగలరు చెప్పండి.

సెల్ఫీతో మొదలైన ప్రేమ…

‘రిక్కీ’ విజయోత్సవ కార్యక్రమం జరుగుతున్న సమయం అది. అప్పుడు నేనూ హీరో రక్షిత్‌ బెంగళూరులో ఓ మాల్‌కు వెళ్లాం. రక్షిత్‌ని చూసి అభిమానులంతా సెల్ఫీలు దిగుతుంటే… ఓ మూలన నిల్చున్న నన్ను ఒకమ్మాయి దగ్గరకొచ్చి పలకరించింది. ‘ఈయనే దర్శకుడు’ అంటూ తన స్నేహితురాళ్లకి పరిచయం చేసింది. తనని ఎక్కడో చూసినట్టు అనిపించింది… ఎవరా ఎవరా అని ఆలోచిస్తుంటే… మా ఊరమ్మాయని గుర్తొచ్చింది. తను నా ఫేస్‌బుక్‌లోనూ ఉన్న విషయం ఆ తర్వాత తెలిసింది. అలా మొదలైన మా పరిచయం పెద్దల సమక్షంలో పెళ్లిబంధంగా మారింది. ‘కాంతార’ షూటింగ్‌ సమయంలో ప్రగతి గర్భిణి. ప్రసవ సమయంలో ఆమెతో గడపలేకపోయాను. ఆ షూటింగ్‌ ముగించుకునే సమయానికి పాప పుట్టింది. అన్నట్టు…ఈ చిత్రానికి కాస్ట్యూమ్‌ డిజైనర్‌ కూడా తనే!

Telugu BOX Office:
Related Post