జూలై 14న `ఆటగదరా శివ` విడుదల
Category : Movie News Sliders
`పవర్`, `లింగా`, `బజరంగీ భాయీజాన్` వంటి భారీ చిత్రాల నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మిస్తోన్న తాజా చిత్రం `ఆటగదరా శివ`. రాక్‌లైన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందిస్తున్నారు. `ఆ నలుగురు`, `మధు మాసం`, `అందరి బంధువయ`తో ప్రేక్షకుల భావోద్వేగాలను స్పృశించిన సెన్సిటివ్ దర్శకుడు చంద్రసిద్ధార్థ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఉదయ్ శంకర్ కథానాయకుడు. జూలై 14న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. `సమయానికి వచ్చేది దేవుడు కాదు… యముడు` అనే డైలాగ్‌తో మొదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
హీరో ఉదయ్‌శంకర్ మాట్లాడుతూ “ఉరిశిక్ష నుంచి తప్పించుకుని ఓ ఖైదీ బయటపడతాడు. అనుకోకుండా తనను ఉరితీయాల్సిన తలారినే కలుస్తాడు. వాళ్లెవరన్న విషయం పరస్పరం తెలియకపోవడంతో కలిసి ప్రయాణం చేస్తారు. ఆ ప్రయాణంలో వాళ్లకు ఎదురయ్యే అనుభవాలు ఏంటి? వాళ్లు ఎవరెవరిని కలిశారు? అనేది మా సినిమాలో ఆసక్తికరమైన అంశం. కథానాయకుడిగా నా తొలి చిత్రమిది. చిన్నప్పటి నుంచి పుస్తకాలు బాగా చదివేవాడిని. నా ఊహలకి తగ్గ కథ ఇది. ఈ కథతో పరిచయమయ్యే అవకాశం లభించినందుకు ఆనందంగా ఉంది. నచ్చిన కథ దొరకడంతో పాత్ర కోసం పలు జాగ్రత్తలు తీసుకున్నా. ఖైదీగా కనిపించాలని 11 నెలల పాటు గడ్డం, మీసాలు పెంచా. దర్శకుడు చేసిన సపోర్ట్ ని మర్చిపోలేను. నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్‌గారు నన్ను హీరోని చేస్తానని మాటిచ్చారు. ఆ మాట ప్రకారం ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు. దొడ్డన్న కన్నడలో అగ్రనటుడు. ఆయనతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంతో కథానాయకుడిగా నాకు చాలా మంచి పేరు వస్తుంది. భావోద్వేగాలను పండించడంలో చంద్రసిద్ధార్థ్ శైలి వేరు. ఆయన తీర్చిదిద్దిన ఈ సినిమా తెలుగులో ప్రత్యేకంగా నిలిచిపోతుంది“ అని చెప్పారు.
దర్శకుడు చంద్రసిద్ధార్థ్ మాట్లాడుతూ “జీవితంలో గ్యారంటీ అంటూ ఉందంటే అది ఒక్క చావుకే. అది తెలిసి కూడా చావంటే చాలా మంది భయపడుతుంటారు. దాన్నుంచి తప్పించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు. మా చిత్రంలో కొద్దిసేపట్లో ఉరి కొయ్యకి వేలాడాల్సిన ఒక ఖైదీ జైలు నుంచి తప్పించుకుని పరారవుతాడు. ఆ తర్వాత ఏమైందన్నదే కథ. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ఒకరి నొకరు కలిసినా, విడిపోయినా దాని వెనుకున్నది శివుడి లీలే అని నమ్ముతాం. ఆ తాత్వికతని స్పృశిస్తూ అల్లుకున్న కథ ఇది. కన్నడలో విజయవంతమైన `రామ రామ రే` చిత్రాన్ని ఆధారంగా తీసుకుని మన నేటివిటీకి తగ్గట్టు తీర్చిదిద్దా. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది. కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులను రంజింపజేసే సినిమా అవుతుంది. జూలై 14న చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం“ అని చెప్పారు.
దొడ్డన్న, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, చలాకీ చంటి, దీప్తి కీలక పాత్రలు పోషించారు.