‘అవతార్’ సినిమాతో ప్రేక్షకుల్ని ఓ కొత్త లోకంలోకి తీసుకెళ్లారు జేమ్స్ కామెరూన్. 2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రభంజనం సృష్టించింది. ప్రాంతాలతో సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడు మరోసారి ఆ మ్యాజిక్‌నే క్రియేట్ చేసేందుకు అవతార్2 (ది వే ఆఫ్ వాటర్)తో సిద్ధమయ్యారు మేకర్స్. ప్రపంచ సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్న ఈ హాలీవుడ్ చిత్రం 160 భాషల్లో ఈ ఏడాది డిసెంబర్ 16న విడుదలకు సిద్ధమైంది.
భారీ బడ్జెట్‌తో హై ఎండ్ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ సినిమా బిజినెస్ విషయంలో రికార్డు సృష్టిస్తోందని సమాచారం. ఈ సినిమాను కొనుగోలు చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆసక్తిగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు విపరీతమైన హైప్ నెలకొంది. అందుకే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్లకు పైగా ధర పలుకుతున్నట్లు టాక్. పలువురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి ఈ సినిమాను కొనే ఆలోచనలో ఉన్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వార్త గత కొన్ని రోజులుగా నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. మరి విడుదలకు ముందే ఇన్ని వండర్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి చరిత్ర సృష్టిస్తుందో వేచి చూడాలి. అయితే ఇన్నాళ్లుగా అవతార్ సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులు టిక్కెట్ ధర ఎంత పెట్టయినా చూసేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో ఎన్ని కోట్లకు సినిమా కొన్నా వారం రోజుల్లోనే రికవరీ కావడం ఖాయం.