‘సీతారామం’కి సీక్వెల్.. దుల్కర్ సల్మాన్ ఏమన్నాడంటే..

‘సీతారామం’కి సీక్వెల్.. దుల్కర్ సల్మాన్ ఏమన్నాడంటే..

అన్ని పరిశ్రమల్లోనూ ప్రస్తుతం సీక్వెల్‌ చిత్రాలు విరివిరిగా తెరకెక్కుతున్నాయి. దాంతో, ఏదైనా చిత్రం మంచి విజయం అందుకుందంటే చాలు దాని కొనసాగింపుపై సినీ అభిమానుల నుంచి ప్రముఖుల వరకూ అంతా దృష్టి పెడుతున్నారు. ఇటీవల విడుదలై, హిట్‌ కొట్టిన ‘సీతారామం’ (Sita Ramam) విషయంలోనూ కొనసాగింపు ఉంటే బాగుండని చాలా మంది అనుకున్నారు. ఈ సినిమా సక్సెస్‌ మీట్‌ (హిందీ)లో ఓ విలేకరి ఇదే ప్రశ్నను హీరో దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) ముందు ఉంచగా ఆయన స్పందించారు. ‘‘ఏదైనా సినిమాకు విశేష ప్రేక్షకాదరణ లభించి, క్లాసిక్‌గా నిలిస్తే దాన్ని మళ్లీ టచ్‌ చేయకూడదనే విషయాన్ని నేను నటుడినికాకముందే తెలుసుకున్నా. మేం ఈ కథను బాగా నమ్మాం. ‘సీతారామం’ క్లాసిక్‌గా నిలుస్తుందని భావించాం. అనుకున్నట్టుగానే మీరంతా ఈ చిత్రాన్ని మీ హృదయాల్లో దాచుకున్నారు. అందుకే ఈ సినిమాకు కొనసాగింపు ఉండదనుకుంటున్నా. రీమేక్‌ విషయంలోనూ అంతే’’ అని దుల్కర్‌ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ అందమైన ప్రేమకథలో రామ్‌గా దుల్కర్‌, సీతామహాలక్ష్మిగా మృణాల్‌ ఠాకూర్‌ ఒదిగిపోయారు. రష్మిక, తరుణ్‌భాస్కర్‌, వెన్నెల కిశోర్‌ తదితరులు కీలక పాత్రల్లో మెప్పించారు. హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ రాకుమారి(సీత), లెఫ్టినెంట్‌(రామ్‌)ల లవ్‌స్టోరీ దక్షిణాది ప్రేక్షకులతోపాటు ఉత్తరాది వారినీ విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో స్ట్రీమింగ్‌ (తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో) అవుతోంది.