నా వారసుడు వచ్చేస్తున్నాడు.. నందమూరి బాలకృష్ట

నా వారసుడు వచ్చేస్తున్నాడు.. నందమూరి బాలకృష్ట

నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ గురించి కొన్నేళ్లుగా చ‌ర్చ న‌డుస్తుంది. రేపో మాపో మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయ‌మ‌ని అభిమానులు ముచ్చటించుకుంట‌ున్న స‌మ‌యంలో ఇటీవ‌ల బాల‌కృష్ణ త‌న త‌న‌యుడి వెండితెర ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. గోవా ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొన్న ఆయన.. మోక్షజ్ఞ ఎంట్రీపై స్పందించారు. తన కుమారుడిని వచ్చే ఏడాది టాలీవుడ్‌లోకి పరిచయం చేయనున్నట్లు చెప్పారు. ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్‌‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడని తెలిపారు. అయితే, ఆ చిత్రానికి దర్శకుడు ఎవరనేది మాత్రం బాలయ్య చెప్పలేదు. మోక్షజ్ఞను బోయపాటి శ్రీనుతో లాంచ్‌ చేయనున్నారంటూ వస్తోన్న వార్తలపై ఆయన మాట్లాడుతూ.. ‘‘అంతా దైవేచ్ఛ’’ అని నవ్వి ఊరుకున్నారు. అయితే క్లాసిక్ మూవీతో త‌న త‌న‌యుడిని బాల‌య్య ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేస్తున్నాడ‌ని తెలుసుకొని ఫ్యాన్స్ ఖుసీ అయిపోతున్నారు.

ఆదిత్య 369 చిత్రం ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుందో, ఎప్పుడు మోక్షజ్ఞను వెండితెర‌పై చూస్తామా అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న స‌మ‌యంలో బాల‌య్య మ‌రోసారి స్పందించాడు. ఆదిత్య 369 చిత్రం 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా బాల‌య్య మాట్లాడుతూ.. ఈ సినిమాను 2023లో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నామని అన్నారు. ఇక ఈ సినిమాకు ‘ఆదిత్య 999 మాక్స్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశామని చెప్పిన ఆయన, ఇంకా దర్శకుడిని ఫైనల్ చేయలేదని చెబుతూ తాను డైరెక్ట్ చేసే ఛాన్స్ కూడా లేకపోలేదన్నట్లు చెప్పుకొచ్చారు.

అలాగేఅఖండ-2 ప్రాజెక్టుపైనా బాలయ్య స్పందించారు. ‘అఖండ-2’ తప్పకుండా ఉంటుందని… సబ్జెక్ట్ కూడా సిద్ధం చేశామన్నారు. ఈ సినిమాను ప్రకటించడం ఒకటే మిగిలింది. సమయం చూసి ప్రకటిస్తామని బదులిచ్చారు. గోవాలో నిర్వహిస్తోన్న 53వ అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఇటీవల ‘అఖండ’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ మేరకు చిత్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి సందడి చేశారు. ఇక, బాలయ్య ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ‘వీర సింహా రెడ్డి’ సినిమా చేస్తున్నారు. ఫ్యాక్షన్‌ నేపథ్యంలో ఇది తెరకెక్కుతోంది. సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.