X

దిగ్గజ నటి కన్నాంబ… దురదృష్టం వెంటాడిన అదృష్ట దేవత

టాకీలు మొదలైన కొత్తల్లో… అంటే 1935 నుంచి 1964 వరకు దాదాపు 29 సంవత్సరాలు చలనచిత్ర రంగంలో ఒక వెలుగు వెలిగిన అద్భుత నటీమణి పసుపులేటి కన్నాంబ. కన్నాంబ చిత్రరంగానికి వచ్చిన కొత్తల్లోనే మరొక అందాల నటి కాంచనమాల కూడా సినీరంగ ప్రవేశం చేసింది. కాంచనమాలకు దీటుగా కన్నాంబ సౌందర్యంలో ఆమెతో పోటీపడింది. అయితే రాశిలో కన్నాంబ చిత్రసీమలో వెలుగొందిన కాలం కాంచనమాల కన్నా ఎక్కువ. కాంచనమాల కేవలం పది సినిమాల్లో మాత్రమే నటించగా కన్నాంబ ఏకంగా 170 సినిమాల్లో నటించి రాణించింది. అప్పటి సినీరంగంలో కన్నాంబ అత్యంత ధనవంతురాలని పేరుంది. ఏడువారాల నగలతో ఇంట్లో ఎక్కడ చూసినా బంగారం కనిపిస్తూ వుండేది. నిలువెత్తు విగ్రహంతో, అద్భుతమైన, విస్పష్టమైన వాచకంతో, అంతే అద్భుతమైన నటనా పటిమతో అలరారిన నటీమణి కన్నాంబ. కరుణరసం ఉట్టిపడే పాత్రల్లో గాని, వీరరసం ఉప్పొంగే పాత్రల్లో గాని కన్నాంబ నటన వర్ణనాతీతంగా వుండేది. ఆమె కేవలం తెలుగు చిత్రసీమకు మాత్రమే పరిమితం కాలేదు. తెలుగు వాళ్లు ఎంతగా ఆమెను ఆదరించారో అంతే సమానంగా తమిళ ప్రేక్షకులు కూడా ఆదరించారు.

బాలతారగా నాటక రంగంలో…
కన్నాంబ 5 అక్టోబర్‌ 1911న కడప పట్టణంలో జన్మించింది. ఆమె తండ్రి వెంకట నరసయ్య, తల్లి లోకాంబ. తండ్రి ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా పనిచేస్తుండేవారు. వారికి కన్నాంబ ఒక్కటే కూతురు. కన్నాంబ ఎక్కువ కాలం వాళ్ల అమ్మమ్మ గారింట ఏలూరులోనే పెరిగింది. కన్నాంబ తాత నాదముని నాయుడు వైద్యవృత్తిలో వుండేవారు. కన్నాంబ చిన్నతనంలోనే సంగీతం మీద ఆసక్తి కనబరచడంతో తాతగారు ఆమెకు సంగీతంలో శిక్షణ ఇప్పించారు. తన 13వ ఏటనే కన్నాంబ నాటకాల్లో నటించడం ప్రారంభించింది. ఆమెకు పదహారు సంవత్సరాల వయసులో ఒక చిన్న సంఘటన జరిగింది. ఏలూరు పట్టణంలో సత్యహరిశ్చంద్ర నాటకం జరుగుతోంది. ఆ నాటకానికి కన్నాంబ కూడా వెళ్లింది. చంద్రమతి పాత్రధారి శోకరసంతో పాడాల్సిన పద్యాలను పాడలేకపోవడంతో ప్రేక్షకులు గేలి చేయడం మొదలెట్టారు. ప్రేక్షకుల మధ్య నుంచి కన్నాంబ లేచి రంగస్థలం మీదకు వెళ్లి చంద్రమతి పాత్రను తను పోషిస్తానని ప్రకటించి, వేగంగా ముఖానికి రంగుపూసుకొని వచ్చి పద్యాలు పాడుతూ వుంటే, ప్రేక్షకులు నిశ్చేష్టులై చూస్తూ వన్స్‌ మోర్లు కొట్టడం ఆరంభించారు. దాంతో కన్నాంబ నాటక ప్రస్థానం మొదలైంది. ఇదే నాటక సమాజం వారు కన్నాంబకు సావిత్రి, సత్యభామ, అనసూయ, చంద్రమతి వంటి మంచి మంచి పాత్రలు ఇచ్చి వారి నాటకాలను రక్తికట్టించే ప్రయత్నం చేశారు. కన్నాంబ సత్యవంతుడు, భక్త కబీరు వంటి మగ పాత్రలు పోషించడం కూడా కద్దు. దొమ్మేటి సూర్యనారాయణతో కలిసి ‘రంగూన్‌ రౌడీ’ అనే నాటకాన్ని ఆమె దేశవ్యాప్తంగా ప్రదర్శించి మన్ననలు పొందింది. ఆ రోజుల్లో ప్రసిద్ధ రంగస్థల నటీనటులచేత రికార్డింగ్‌ కంపెనీలు నాటక పద్యాలు పాడించి వాటిని రికార్డులుగా విడుదల చేసేవారు. వాటిలో కన్నాంబ పాడిన ‘కృష్ణం భజే రాధా’ అనే ప్రైవేట్‌ రికార్డు శ్రోతల్ని వుర్రూత లూగించింది.

‘హరిశ్చంద్ర’ సినిమాతో ఎంట్రీ
1935లో దర్శక నిర్మాత పి.పుల్లయ్య మరికొందరు మిత్రులతో కలిసి స్టార్‌ కంబైన్స్‌ అనే సంస్థను నెలకొల్పి ‘హరిశ్చంద్ర’ అనే సినిమా నిర్మాణానికి నడుం బిగించారు. పేరుకి ఆ సినిమాకు టి.ఎ.రామన్‌ దర్శకత్వం వహించారని క్రెడిట్స్‌లో వేసినా ఆ బాధ్యతలు నిర్వహించింది పి.పుల్లయ్య. అందులో అద్దంకి శ్రీరామమూర్తి హరిశ్చంద్రుడుగా నటించగా చంద్రమతి పాత్రకు కన్నాంబకు పిలుపొచ్చింది. అప్పుడు బళ్లారిలో ఆమె హరిశ్చంద్ర నాటకంలో చంద్రమతిగా నటిస్తుండగా దర్శకుడు పుల్లయ్య కన్నాంబను కలిసి తమ సినిమాలో నటించమని ఆహ్వానించారు. అయితే కన్నాంబ ఒక షరతు మీద నటించేందుకు ఒప్పుకుంది. అప్పటికే వాటి బృందంలో 22 మంది కళాకారులు నాటకాల్లో వివిధపాత్రలు పోషిస్తూ వస్తున్నారు. తను సినిమాల్లోకి వెళ్లిపోతే వారంతా ఆర్ధిక ఇబ్బందులకు గురికావలసి వుంటుంది కనుక వారందరికీ ‘హరిశ్చంద్ర’ సినిమాలో నటించే అవకాశం కలిపిస్తే నటిస్తానని కన్నాంబ చెప్పడంతో అందుకు పుల్లయ్య అంగీకరించారు. అలా భీమారావు, పులిపాటి వెంకటేశ్వర్లు, బందరు నాయుడు, ఆకుల నరసింహారావు వంటి రంగస్థల నటులు సినిమా స్టార్లైపోయారు. ఈ సినిమాని కొల్హాపూరులో నిర్మించారు. ఆ చిత్రం బాగా విజయవంతమైంది. బందరు ‘బాలమిత్ర నాటక సమాజం’లో పనిచేస్తున్నప్పుడు వారు ప్రదర్శించే నాటకాలకు కడారు నాగభూషణం ప్రయోక్తగా వ్యవహరిస్తుండేవారు. అప్పుడే నాగభూషణానికి కన్నాంబతో పరిచయం కలిగింది. వారి పరిచయం పెరిగి ప్రణయంగా మారి ఇద్దరూ దంపతులయ్యారు. కన్నాంబ అతణ్ణి ఇష్టపడి పెళ్లాడింది. అయితే నాగభూషణం అప్పటికే వివాహితుడు కావడంతో ఈ వివాహ వార్తను 1941 వరకు వారిద్దరూ అధికారికంగా ప్రకటించలేదు. అలా వారి వైవాహిక జీవితం కడదాకా సాఫీగా సాగిపోయింది.

కన్నాంబ నటించిన రెండవ సినిమా బెజవాడ సరస్వతి టాకీస్‌ వారు నిర్మించిన ‘ద్రౌపదీ వస్తాప్రహరణము’ (1936). ఈ చిత్రాన్ని కొల్హాపూర్‌ మహారాజా వారి కంపెనీలో బ్రిటీష్‌ ఎకోస్టిక్‌ ఫొటోఫోన్‌ యంత్రం మీద చిత్రీకరించారు. మల్లాది అత్యుతరామ శాస్త్రి నాటకాన్ని యధాతధంగా సినిమాగా నిర్మించడం జరిగింది. హెచ్‌.ఎం.రెడ్డి పర్యవేక్షణలో ఈ చిత్రానికి అతని కుమారుడు హెచ్‌.వి.బాబు దర్శకత్వం నిర్వహించారు. సి.ఎస్‌.ఆర్‌.ఆంజనేయులు శ్రీకృష్ణుడుగా నటించగా, ద్రౌపదిగా కన్నాంబ నటించింది. ఇతర పాత్రల్ని దొమ్మేటి సూర్య నారాయణ, దొమ్మేటి సత్యనారాయణ, కొచ్చెర్లకోట సత్యనారాయణ, యడవల్లి సూర్యనారాయణ, నెల్లూరి నాగరాజరావు, కడారు నాగభూషణం, పి.సూరిబాబు, రామతిలకం, నాగరాజకుమారి మొదలగువారు పోషించారు. అదే సమయంలో ‘ద్రౌపదీ మానసంరక్షణం’ పేరుతో మరొక సినిమా విడుదలైంది. అయితే కన్నాంబ నటించిన చిత్రాన్నే ప్రేక్షకులు ఆదరించారు. ఈ చిత్ర విజయంతో బెజవాడ సరస్వతి టాకీస్‌ వారు 1937లో ‘కనకతార’ సినిమా నిర్మించారు. అది కన్నాంబ నటించిన మూడవ సినిమా. అందులో కన్నాంబ కమల పాత్ర ధరించింది. దొమ్మేటి, ఆరణి, సూరిబాబు, కడారు నాగభూషణం, కమల కుమారి ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. చందాల కేశవదాసు నాటకాన్ని దర్శకుడు హెచ్‌.వి.బాబు సినిమాగా నిర్మించారు. సముద్రాల రాఘవాచార్య ఈ సినిమా తోనే రచయితగా పరిచయం కాగా, గాలి పెంచల నరసింహారావు సంగీతం అందించారు. ఈ సినిమా కూడా బ్రహ్మాండంగా ఆడడంతో కన్నాంబ పేరు తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితమైంది.

1938లో హెచ్‌.ఎం.రెడ్డి ‘గృహలక్ష్మి’ చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రంలో కన్నాంబ పతాక సన్నివేశంలో ‘సత్యం జయిస్తుంది… ధర్మం జయిస్తుంది’ అని అరుస్తూ పిచ్చిదానిలా రోడ్డు వెంబడి పరుగెడుతుంది. ఈ సన్నివేశ చిత్రీకరణ మద్రాసులో జరుగుతున్నప్పుడు కన్నాంబ నిజంగానే పిచ్చిదానిలా ట్రామ్‌ బండ్లకు అడ్డంగా పరుగెడుతుంటే, నిజమేననుకొని పోలీసులు ఆమెను అరెస్టు చేసేందుకు ఉద్యుక్తులయ్యారు. తరువాత అది షూటింగ్‌ అని తెలిసి తప్పుకున్నారు. కన్నాంబ నటన అంత సహజంగా ఉండేదని చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. ఈ సినిమాల కన్నా అత్యంత మంచిపేరు కన్నాంబకు తెచ్చిపెట్టిన చిత్రం శ్రీ భవాని పిక్చర్స్‌ వారు నిర్మించిన ‘చండిక’ (1940). అందులో చండిక పాత్రను కన్నాంబ పోషించగా, వేమూరి గగ్గయ్య, ఆరణి, బళ్ళారి రాఘవ, లలితాదేవి ముఖ్యపాత్రలు పోషించారు. అందులో కన్నాంబ గుర్రపు స్వారి చేయడం, సాహసకృత్యాలు, కత్తి యుద్ధాలు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పులిపిల్లలతో నటించే సన్నివేశంలో కూడా కన్నాంబ ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించిందని ఆ రోజుల్లో చెప్పుకున్నారు. అలా తెలుగు వీరవనితగా కన్నాంబను హిందీ హంటర్వాలీ నాడియాతో పోల్చారు.

సొంత నిర్మాణ సంస్థ ఆవిర్భావం…
ముందుగా చెప్పుకున్నట్లు బందరు ‘బాలమిత్ర నాటక సమాజం’లో పనిచేస్తున్నప్పుడు కడారు నాగభూషణానికి కన్నాంబతో పరిచయం కలిగింది. ఆ పరిచయం పెరిగి ప్రణయంగా మారి ఇద్దరూ దంపతులయ్యారు. అప్పుడే ‘శ్రీరాజరాజేశ్వరీ నాట్య మండలి’ నెలకొల్పి ‘కనకతార’, ‘హరిశ్చంద్ర’ వంటి పలు నాటకాలను ప్రదర్శించారు. తరువాత మద్రాసు చేరుకొని ‘శ్రీరాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ’ స్థాపించి సినిమా నిర్మాణానికి పూనుకొన్నారు. 1941లో తొలి సినిమా ‘తల్లిప్రేమ’ నిర్మించారు. దానికి జ్యోతిష్‌ సిన్హా దర్శకత్వం వహించారు. ‘తల్లిప్రేమ’ సినిమా విజయవంతమైంది. దాని తరువాత కడారు నాగభూషణం స్వీయ దర్శకత్వంలో ‘సతీసుమతి’ (1942) చిత్రం నిర్మించి విజయం సాధించారు. ఈ సినిమా తరువాత కన్నాంబ అనారోగ్యం పాలవడంతో రెండేళ్లు సినిమా నటనకు ఆమె దూరం జరిగారు.

తరువాత 1945లో బయటి సంస్థలు నిర్మించిన ‘మాయాలోకం’, ‘మాయా మశ్చీంద్ర’, ‘పాదుకా పట్టాభిషేకం’ అనే మూడు చిత్రాల్లో కన్నాంబ నటించారు. ఆ తరువాత వరసగా హరిశ్చంద్ర’, ‘తులసీజలంధర’, ‘సౌదామిని’, ‘పేదరైతు’, ‘లక్ష్మి’, ‘సతీ సక్కుబాయి’, ‘దక్షయజ్ఞం’ వంటి సినిమాలు స్వంతంగానే నిర్మించి మంచి పేరు సంపాదించారు. కానీ చిత్ర వైఫల్యాలు ఆర్ధిక కష్టాలు తెచ్చిపెట్టాయి. కన్నాంబ ఈ సినిమాలలో నటిస్తూవుంటే, నాగభూషణం దర్శకత్వ బాధ్యతలు చేపట్టేవారు. తరువాత ‘శ్రీవరలక్ష్మీ ఫిలిమ్స్‌’ అనే అనుబంధ సంస్థను నెలకొల్పి ‘వీరభాస్కరుడు’, ‘సతీసావిత్రి’ వంటి మరికొన్ని సినిమాలను నిర్మించారు. అప్పుడు చిత్తజల్లు పుల్లయ్య తనయుడు సి.యస్‌.రావు, నాగభూషణం సంస్థలో పనిచేస్తూ వుండేవారు. సి.యస్‌.రావు పనితనం, కార్యదీక్ష నాగభూషణాన్ని బాగా ఆకట్టుకుంది.

కలకత్తా కాళీ ఫిలిమ్స్‌ వారి ‘శ్రీకృష్ణ తులాభారం’ సినిమా వచ్చిన ఇరవయ్యేళ్ల తరువాత కడారు నాగభూషణం అదే సినిమాను ‘శ్రీకృష్ణ తులాభారం (1955) పేరుతో మరలా నిర్మించారు. చిత్రం అఖండ విజయాన్ని సాధించింది. నాగభూషణం స్వయంగా దర్శకుడైవుండి కూడా ఈ సినిమాకు సి.యస్‌.రావును దర్శకునిగా పరిచయం చేశారు. దర్శకునిగా తెలుగులో రావుకు ఇది తొలి సినిమా. తొలి సినిమాతోనే సి.యస్‌.రావుకు మంచి పేరొచ్చింది. ఈ చిత్ర విజయం సి.ఎస్‌.రావుని ఒక ఇంటివాణ్ణి చేసింది. కన్నాంబ-నాగభూషణంల దత్త పుత్రిక రాజేశ్వరిని సి.ఎస్‌.రావుకు ఇచ్చి పెళ్లి జరిపించారు. అంతకుముందు 1950లో వచ్చిన ‘పల్నాటి యుద్ధం’ సినిమాలో నాయకురాలు నాగమ్మ పాత్రను కన్నాంబ పోషించగా, బ్రహ్మనాయుడిగా డాక్టర్‌ గోవిందరాజుల సుబ్బారావు నటించారు. కన్నాంబకు ఈ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాను పండిత జవహర్‌ లాల్‌ నెహ్రు చూసి మెచ్చుకొని, ఇందిరా గాంధికి చూపించడం కోసం మరలా ప్రదర్శింపచేయించుకున్నారట.

సొంత సినిమాల పరాజయ పర్వం…
1951 తరువాత కన్నాంబ సొంత చిత్ర నిర్మాణ సంస్థ నిర్మించిన సినిమాలు వరసగా పరాజయం పాలవుతూ వచ్చాయి. ఆ సంవత్సరం కడారు నాగభూషణం దర్శకత్వంలో ‘సౌదామిని’ చిత్రాన్ని నిర్మించారు. అందులో కన్నాంబ, అక్కినేని, సియ్యస్సార్, రేలంగి, సూరిబాబు, ఆరణి, దొరస్వామి, ఎస్‌.వరలక్ష్మి నటించారు. సముద్రాల రాఘవాచార్య రచన చేసిన ఈ సినిమా ఆడలేదు. 1952లో నాగభూషణం దర్శకత్వంలోనే ‘పేదరైతు’ అనే సాంఘిక చిత్రాన్ని నిర్మించారు. అందులో కన్నాంబ, అంజలీదేవి, శ్రీరామమూర్తి, రేలంగి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకూడా పరాజయంపాలై అప్పులను మిగిల్చింది. ఎ.వి.ఎం సంస్థకు పోటీగా ‘నాగులచవితి’ అనే సినిమాను నిర్మించి వారికి పోటీగా విడుదల చేసి నష్టపోయిన సంఘటనలు వీరి కుటుంబానికి ఎన్నోసార్లు అనుభవమయ్యాయి. సంవత్సరం విరామం తరువాత కన్నాంబ స్వయంగా ‘సతీసక్కుబాయి’(1954) చిత్ర నిర్మాణానికి పూనుకున్నారు. అయితే అప్పటికే ‘సతీసక్కుబాయి’ కథ హక్కులు దర్శకులు కె.వి.రెడ్డి వద్ద వున్నాయి. ఆ సంగతి కన్నాంబకు తెలియదు. ‘సతీ సక్కుబాయి’ చిత్రాన్ని రాజేశ్వరి ఫిలిం కంపెనీ వాళ్లు తీస్తున్నారని తెలిసి కె.వి.రెడ్డి కన్నాంబను కలిసి విషయం ఆరాతీశారు.

కన్నాంబ కన్నీళ్లు పెట్టుకొని ‘రెడ్డి గారూ ఈ సినిమా హక్కులు మీవద్ద వున్న విషయం నాకు తెలియదు. మేము రెండు సినిమాలు నిర్మించి అప్పులపాలయ్యాం. నాగభూషణం గారు చెబితే వినకుండా పేదరైతు, సౌదామిని సినిమాలు నిర్మించారు. మేము అప్పులబారి నుంచి బయటపడాలంటే వేరే మార్గం లేదు. సక్కుబాయి సినిమాకు జనాదరణ లభిస్తుందనే ధైర్యంతో సినిమా మొదలు పెట్టాము. సహకరించండి’ అంటూ ప్రాధేయపడింది. దాంతో దర్శకుడు కె.వి.రెడ్డి ఆ హక్కులు కన్నాంబకు ఇచ్చివేశారు. ‘సతీ సక్కుబాయి’ సినిమా బాగా ఆడింది. సినిమా నిర్మాణంలో కష్టనష్టాలు వచ్చినా గాని కన్నాంబ కళాకారులకు, సాంకేతిక సిబ్బందికి టంచనుగా నిబద్ధతతో పారితోషికాలు, జీతాలు అందజేసేవారు. కన్నాంబ దాతృత్వం గురించి ఆరోజుల్లో ఎన్నో కథలు చెప్పుకునేవారు. హాస్యనటుడు పద్మనాభం కూడా మద్రాసులో అడుగు పెట్టినప్పుడు భోజనంపెట్టి, వసతి కల్పించిన సాధ్వీమణి కన్నాంబ. వీరి కంపెనీలో భోజనం చెయ్యని కళాకారుడు ఆ రోజుల్లో వున్నారంటే ఎవరూ నమ్మేవారు కాదు. రాజరాజేశ్వరి దేవిని కన్నాంబ నిష్టతో పూజించేవారు. ఆ దేవి పూజ చేయకుండా షూటింగుకు వెళ్లిన దాఖలాలు లేవు.

తమిళంలోనూ అగ్రస్థానమే…
కన్నాంబకు తమిళంలో మంచి మార్కెట్‌ వుండేది. 1940లోనే ఆమె ‘కృష్ణన్‌ తూట్టు’ సినిమాలో ద్రౌపదిగా నటించింది. ఆమె తమిళ ఉచ్చారణకి స్థానికులే విస్తుపోయేవారు. 1942లో కన్నాంబ నటించిన ‘కణ్ణగి’ చిత్రం సూపర్‌ డూపర్‌ హిట్టయింది. ఆ చిత్రంలో కన్నాంబ నటించేనాటికి ఆమెకు 31 సంవత్సరాలు. తొలుత ఆమె సరసన కోవలన్‌ పాత్ర పోషణకు త్యాగరాయ భాగవతార్‌ను తీసుకుందామని అనుకొని, వీరి జంట మధ్య వయోభేదం ప్రస్పుటంగా కనిపిస్తుందేమోనని ఆ పాత్రకు చిన్నప్పను తీసుకున్నారు. కన్నాంబ నటన ముందు తను తేలిపోతానేమోనని చిన్నప్ప దర్శకుడు మణి వద్ద వాపోతే కన్నాంబే ధైర్యం చెప్పి అతని చేత నటింప జేసింది. ఈ సినిమాను ఆరోజుల్లో కోటి మంది ప్రేక్షకులు చూశారని పత్రికలు రాశాయి. 110 సెంటర్లలో ఈ సినిమా వందరోజులు ఆడి రికార్డు సృష్టించడం ఒక విశేషం. ఈ సినిమా కన్నాంబకు తమిళంలో కేవలం మూడవది మాత్రమే. దాంతోనే తమిళంలో కూడా కన్నాంబకు స్టార్డం లభించింది.

తమిళులు కన్నాంబను కణ్ణగి అనే పిలుస్తుంటారు. ఆమె 1944-63 మధ్య కాలంలో చాలా తమిళంలో సినిమాల్లో నటించారు. ‘మహామాయ’, ‘తులసి జలంధర’, ‘దైవనీతి’, ‘నవజీవనం’, మంగైయర్కరాశి’, ‘సుదర్శన్‌’, ‘ఎలైవుళవాన్‌’, ‘మూండ్రు పిళైగళ్’, ‘పెన్నరాశి’, ‘తికుప్పిన్‌ తరం’, ‘మక్కలైపేట్ర మగరాసి’ సినిమాలు మచ్చుకు కొన్ని మాత్రమే. ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే అంజలీ పిక్చర్స్‌ వారి ‘అనార్కలి’ చిత్రంలో జోదాబాయిగా నటించి మెప్పు ప్పొందింది. ‘వదిన’, ‘చరణదాసి’, ‘ఉమాసుందరి’, ‘తోడికోడళ్ళు’, ‘ఆడపెత్తనం’, ‘శ్రీకృష్ణమాయ’, ‘కార్తవరాయని కథ’, ‘మాంగల్య బలం’, ‘రాజమకుటం’, ‘రేచుక్క-పగటిచుక్క’, ‘అభిమానం’, ‘మాబాబు’, ‘పెళ్లి తాంబూలం’, ‘ఉషాపరిణయం’, ‘లవకుశ’, ‘పరువు-ప్రతిష్ట’ వంటి సినిమాల్లో చక్కటి నటనా పటిమను ప్రదర్శించి ప్రేక్షకుల ఆదరణకు పాత్రురాలయ్యింది. తెలుగులో కన్నాంబ నటించిన ఆఖరి చిత్రం నాగయ్య నిర్మించిన ‘భక్తరామదాసు’. అందులో రామదాసు భార్యగా కన్నాంబ నటించింది. టాకీ సినిమాలు వచ్చిన కొత్తల్లో కన్నాంబ తన పాత్రలకు అవసరమైన పాటలు తనే పాడుకునేవారు. తల్లిప్రేమ చిత్రంలో ‘జోజో నందబాల’, ‘ముగ్గురు మరాఠీలు’ చిత్రంలో ‘స్త్రీ భాగ్యమే భాగ్యము’, ‘పల్నాటి యుద్ధం’ చిత్రంలో ‘తెర తీయగరాద’ వంటి పాటలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. సొంత బ్యానర్‌ మీద కన్నాంబ 30 సినిమాల దాకా నిర్మించారు. ‘నవజీవనం’ అనే సినిమాకు రాష్ట్ర బహుమతి లభించింది. రెండు భాషల్లో ‘దక్షయజ్ఞం’ చిత్రం నిర్మించి భారీగా నష్టపోయారు. కన్నాంబ 7మే 1964న 52 ఏళ్ల పిన్న వయసులోనే చెన్నైలో కాలధర్మం చెందారు. ఆమె అంతిమయాత్రకు ఎమ్జీఆర్‌తో సహా తెలుగు, తమిళ చిత్రపరిశ్రమలో వున్న ప్రతి ఒక్కరూ హాజరై అంజలి ఘటించడం…ఆ అదృష్టం ఒక్క కన్నాంబకే దక్కడం ఆమె పుణ్యఫలం. అయితే కన్నాంబ భర్త మాత్రం అతి దయనీయమైన స్థితిలో ఒక చిన్న హోటల్‌ గదిలో ఉంటూ 1976లో చనిపోయారు.

Telugu BOX Office:
Related Post