అలనాటి హాస్యనటుడు సారథి కన్నుమూత

అలనాటి హాస్యనటుడు సారథి కన్నుమూత

తెలుగు చిత్ర పరిశ్రమలో మరొ విషాదం చోటుచేసుకుంది. తన కామెడీతో తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్న ప్రముఖ కమెడియన్ సారధి సోమవారం(ఆగస్ట్ 1) కన్నుమూయడంతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాదఛాయలు అలముకున్నాయి. ఎన్నో వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకున్న సారథి అంటే తెలియని సినీ ప్రముఖులు ఉండరు. కేవలం ఒక నటుడిగానే కాకుండా ఆయన చిత్ర పరిశ్రమలో ఎన్నో సంక్షేమ కార్యకలాపాల్లో కూడా పాల్గొన్నారు. సినిమా పరిశ్రమకు ఆయన చేసిన సేవ ఎన్నటికీ మరువలేనిది అని చాలామంది సినీ ప్రముఖులు చెబుతూ ఉంటారు.

వయసు రీత్యా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సారథి సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్ లో కన్నుమూశారు. ఆయన పూర్తి పేరు కడలి జయ సారధి. ఇటీవల 83వ వసంతంలో అడుగుపెట్టిన ఆయన హఠాత్తుగా కన్నుమూయడం అందరిని షాక్ గురి చేసింది. సినిమాలకు స్వస్తి చెప్పిన అనంతరం ఆయన ఎక్కువగా తన సొంత గ్రామంలో వ్యవసాయం చేస్తూ ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు.

1960లో ‘సీతారామ కళ్యాణం’ అనే సినిమాతో వెండితెరకు పరిచయమైన సారథి ఆ తర్వాత అనేక సినిమాల్లో హాస్య పాత్రల్లో కనిపించి ఎంతగానో మెప్పించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు 372 సినిమాల్లో నటించారు. అప్పట్లో తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసులోనే ఉండేది. సీనియర్ నటీనటులు అందరూ ఎలాగైనా తెలుగు రాష్ట్రంలోనే తెలుగు చిత్ర పరిశ్రమ ఉండాలని చేసిన పోరాటంలో సారథి క్రియాశీలకంగా వ్యవహరించారు. మద్రాసు నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బలపడడంలో కూడా ఆయన పాత్ర ఎంతో ఉంది. ఆంధ్రప్రదేశ్ సినీ కార్మికుల సంస్థకు కూడా ఆయన వ్యవస్థాపక కోశాధికారిగా కూడా పనిచేశారు. నాటక రంగంలో ఎన్నో సేవలు చేశారు. నరసింహరావు, రేలంగి, వెంకట్రామయ్య, బి.పద్మనాభం వంటి మహానటులతో కూడా ఆయన నాటక రంగంలో కలిసి నటించారు.

సారధి కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా కొన్ని సినిమాలను నిర్మించారు. ధర్మాత్ముడు. అగ్గిరాజు, శ్రీరామచంద్రుడు అనే చిత్రాలను నిర్మించిన ఆయన మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజుతో ఆయన ఎంతో సన్నిహితంగా ఉండేవారు. కృష్ణంరాజుతో సోదర భావంతో కనిపించేవారు. కృష్ణంరాజు నిర్మించిన చాలా సినిమాలకు మ్యూజిక్ సిటింగ్స్‌‌లో పాల్గొంటూ పనులను దగ్గరుండి చూసుకునేవారు. తెలుగు చిత్ర పరిశ్రమలో పేద సినీ కార్మికులకు చాలాసార్లు అండగా నిలిచారు. ముఖ్యంగా చిత్రపురి కాలనీ నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు.