X

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కు సీఎంగా పనిచేసిన రోశయ్య.. ఆర్థిక మంత్రిగా కూడా సేవలు అందించారు. అంతేకాకుండా తమిళనాడుకి గవర్నర్ గా పనిచేసిన ఆయన.. గతకొంతకాలంగా రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు. కాగా రోశయ్య మృతిపట్ల రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాల లో కామర్స్ చదివారు. ఆయన భారత జాతీయ కాంగ్రెసు పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో రోడ్డు రహదార్లు శాఖ, రవాణ శాఖల మంత్రిగా పనిచేసారు. ఆ తరువాత అనేక ముఖ్యమంత్రుల మంత్రివర్గాలలో పలు కీలకమైన శాఖలు నిర్వహించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా పనిచేసిన రోశయ్య 2009-10 బడ్జెటుతో కలిపి మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టారు. ఇందులో చివరి 7 సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం.. బడ్జెట్ కూర్పులో ఘనాపాటిగా రోశయ్యకి మంచి పేరుంది. వై.ఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందడంతో 2009, సెప్టెంబర్ 3న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. పద్నాలుగు నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం 2010 నవంబరు 24వ తేదీన తన పదవికి రాజీనామా చేసారు. ఆ తరవాత రోశయ్య 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు. ఆ తర్వాత గతకొంతకాలంగా రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు. కాగా రోశయ్య మృతిపట్ల రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Telugu BOX Office:
Related Post