‘కాంతార’ సర్‌ప్రైజ్.. ఈ అర్ధరాత్రి నుంచే ఓటీటీ స్ట్రీమింగ్
Category : Behind the Scenes Daily Updates OTT OTT Latest Movies Sliders
కన్నడలో చిన్న సినిమాగా విడుదలై దేశాన్ని ఓ ఊపు ఊపేసింది ‘కాంతార’. రూ.15కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.400 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. విడుదలై నెలన్నర రోజులు దాటినా థియేటర్లకు జనాలు వస్తూనే ఉన్నారు. అయితే ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఈ చిత్రం ఎప్పుడో ఓటీటీలోకి రావాల్సినా.. థియేటర్లలో వస్తున్న ఆదరణ కారణంగా వాయిదా వేసుకుంటూ వచ్చారు. అయితే చివరికి ‘కాంతార’ గురువారం(నవంబర్ 24) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
‘కాంతార’ లోని వరహరూపం పాటపై కోర్టులో కేసు దాఖలైన సంగతి తెలిసిందే. అందువల్ల యూట్యూబ్ నుంచి ఆ పాటను నిర్మాణసంస్థ హోంబలే ఫిలిమ్స్ తొలగించింది. ఆ పాట లేకుండా సినిమాను ఊహించలేం. కోర్టులో కేసు నడుస్తుండటంతో ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందా లేదా అని అభిమానులందరు ఎదురుచూశారు. ప్రేక్షకుల ఎదురు చూపులకు తెరదించుతూ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించింది. ‘‘ఎదురు చూపులకు తెరపడింది. ‘కాంతార’ రేపటి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది’’ అని ఓటీటీ ప్లాట్ ఫామ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది.
‘కాంతార’ లో రిషబ్ శెట్టి హీరోగా నటించాడు. దర్శకుడు కూడా ఆయనే. కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ నిర్మించింది. ఈ సినిమా ప్రేక్షకుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి రికార్డులను క్రియేట్ చేయడమే పనిగా పెట్టుకుంది. కర్ణాటకలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ మూవీకి సంబంధించి కన్నడ నాట కోటి టిక్కెట్స్ అమ్ముడయ్యాయి. ఐఏమ్‌డీబీలోను అత్యధిక రేటింగ్‌ను ఈ సినిమా సొంతం చేసుకుంది. ఐఏమ్‌డీబీ రేటింగ్‌లో ‘ఆర్ఆర్ఆర్’, ‘కెజియఫ్ 2’ లను బీట్ చేసింది. ఈ చిత్రంపై అనేక మంది సెలబ్రిటీలు ప్రశసంల వర్షం కురిపించారు. రజినీకాంత్, రామ్ గోపాల్ వర్మ, ప్రభాస్, పూజా హెగ్డే, శిల్పా శెట్టి తదితరులు ఈ మూవీని పొగిడారు. ఇన్ని రికార్డులు సొంతం చేసుకున్న కాంతార ఓటీటీలో ఎంతటి సంచలనం రేపుతుందో చూడాలి.