శివుడిని మూర్తి రూపంలో పూజిస్తే మంచిదా?… లింగ రూపంలో పూజిస్తే మంచిదా?

శివుడిని మూర్తి రూపంలో పూజిస్తే మంచిదా.. లింగరూపంలో ప్రణమిస్తే మంచి ఫలితాలు కలుగుతాయా? అన్న అనుమానం చాలామందిలో కలుగుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ పరమాత్మ మహాభారతంలో చెప్పారు. శివుడిని మూర్తి రూపంలో కంటే లింగరూపంలో ఆరాధించడం వల్ల కలిగే ఫలితాలు విశేషంగా ఉంటాయని శ్రీకృష్ణుడు చెప్పాడు. పరమేశ్వరుడి విగ్రహాన్ని పూజించేవారి కంటే, శివలింగారాధన చేసేవారిలో తేజస్సు, శక్తి అధికంగా ఉంటాయని స్పష్టం చేశారు. మనకు లోకంలో అనేక రకాల లింగాలు కనిపిస్తాయి. అందులో రెండు లింగాల గురించి చెప్పుకుందాం….

లింగం అంటే గుర్తు, ప్రతిరూపం అని అర్దం. అన్నిటియందు ఆ పరమశివుడు అంతర్యామిగా ఉన్నాడు. ఈ సృష్టి అంతా లింగమే. అందుకే రుద్రం ఈ జగత్తు అంతా వ్యాపించి ఉన్న శివతత్వాన్ని ప్రకటించింది. కొండలు, పర్వతాలు, నదులు, శిలలు, మొక్కలు, చెట్లు ….. ఇలా కదలని వాటిని స్థావరములు అంటారు. ఈ స్థావరములన్నీ శివస్వరూపం అంటున్నది శివ పురాణం. అందుకే ఇవన్నీ స్థావర లింగాలు అంటున్నది శివ పురాణం. మనం మొక్కలకు నీరు పోస్తే అది కూడా శివార్చనగా భావించి అనుగ్రహం ప్రసాదిస్తాడు పరమశివుడు. అట్లాగే ప్రకృతి వనరులను విచ్చలవిడిగా దోచుకోవడం స్థావర లింగ రూపంలో ఉన్న శివుడికి చేసే అపచారం. అలాగే ప్రకృతి వనరులను సంరక్షించుకోవడం, అవసరమైనంత మేర, వృధా చేయకుండా వాడుకోవడం శివుడికి ఇచ్చే గౌరవం. ఇంకా చెప్పాలంటే నీరు వృధా చేయడం కూడా శివుడికి అపచారమే.

రెండవది జంగమ లింగం. జంగమాలంటే కదిలేవి అని అర్దం. జంతువులు, మనుష్యులు, పక్షులు, క్రిమి కీటకాలు లాంటివి. ఇవి కూడా శివుడి స్వరూపాలే. వీటిని జంగమ లింగాలు అంటారు. ఆపదలో ఉన్నవారికి పవిత్ర భావనతో, ఏ ఉపకారం ఆశించకుండా చేసే సాయం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, దైవభావంతో పెద్దలకు, దీనులకు సేవ చేయడం జంగం లింగానికి చేసే అర్చన. ఇక ఇది చలికాలం, అనేకమంది చలికి వణుకుతూ రోడలపై పడుకుంటారు. అటువంటి వారికి దుప్పట్లు పంచడం, ముష్టివారికి కాసింత అన్నం పెట్టడం, చదువు యందు ఆసక్తి ఉన్న పేద విద్యార్ధులకు పుస్తకాలు పంచిపెట్టడం, పీజు కట్టడం కూడా ఈ జంగమ లింగానికి అర్చన క్రిందే వస్తుంది. మనకు శివ పూజ చేయాలన్న తపన ఉండాలి కానీ.. అందుకు అనేక మార్గాలు చూపించాడు మహాశివుడు.


సైన్స్‌కే అంతుబట్టని శివాలయాలు.. ఎన్నో వింతలు

మహానంది.. శివలింగ అడుగునుండి వచ్చే నీటితో కొన్నివేల ఎకరాలు పంటభూమి పండుతున్నది. బయట ఉండే కొనేరులో గుండుసూది వేసినా కనపడుతుంది. ఎంత చలికాలంలో అయినా కొనేరులో నీరు గోరు వెచ్చగానే ఉంటుంది.

ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం (కందుకూరు – కనిగిరి మధ్య)
కె. అగ్రహారంలోని కాశీవిశ్వేశ్వర దేవాలయంలోని శివలింగం క్రింద నుంచి నీరు ఊరుతూ ఉంటుంది. ఈ నీరు 14గ్రామాలకు తాగునీరుగా వాడుతున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీ బుగ్గా రామేశ్వరాలయంలో శివలింగంనుండి నీరు ఊరుతూ ఉంటుంది.

కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం దేవాలయంలో నంది ఉత్తరాయణంలో ఉత్తరముఖంగాను దక్షిణాయణంలో దక్షిణ వైపు తిరుగుతాడు. ఇది అద్భుతం.

అలంపూర్ బాల బ్రహేశ్వర లింగానికి ఎన్ని నీళ్ల ట్యాకులతోనైనా అభిషేకం చెయ్యండి .కానీ ఆనీరు ఎటుపోతుందో ఎవ్వరికీ తెలియదు.

వరంగల్ జిల్లా వెయ్యిస్తంభాల గుడిలో సంగీత స్తంభాలు ఉన్నాయి. ఇక్కడ నందిని మీటితే కంచు శబ్దం వస్తుంది.

ద్రాక్షారామంలో శివలింగాన్ని నిత్యం ఉదయం, సాయత్రం సూర్య కిరణాలు తాకుతాయి.

భీమవరంలో సోమేశ్వరుడు. ఇక్కడ శివలింగం అమావాస్యకు నల్లగా పౌర్ణమికి తెల్లగా రంగులు మారుతుంది.

కోటప్పకొండలో ఎటుచూసినా మూడు శిఖరాలే కనిపిస్తాయి. ఇక్కడికి కాకులు అసలు రావు.

గుంటూరు జిల్లా చేజర్లలో కపోతేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. ఇక్కడి లింగానికి దక్షిణ భాగంలో ఉన్న రంధ్రంలో నీళ్లుపోస్తే శవం కుళ్లిన వాసన వస్తుంది. ఉత్తర భాగంలో నీరుపోస్తే అవి ఎక్కడికి పోతాయో ఎవ్వరికీ తెలీదు.

బైరవకోన: ఇక్కడికి కాకులు రావు. అలాగే ఇక్కడ ఉన్న కొనేరులో ఎంత నీరు వరదలా వచ్చినా గుడిలోకి నీరురాదు.

యాగంటి: ఇక్కడ రోజురోజుకు నంది పెరుగుతూ ఉంటాడు

శ్రీశైలం భ్రమరాంబిక దేవాలయము వెనుక ఒకప్పుడు “జుం”తుమ్మెద శబ్దం వినపడేదట

కర్నూలు జిల్లా సంగమేశ్వరంలో వేపచెట్టు మొద్దు శివలింగంగా మారింది. ఈ ఆలయంలో ఏడాదిలో ఆరు నెలలు నీటిలోనే మునిగి ఉంటుంది.

శ్రీకాళహస్తిలో వాయు రూపములో శివలింగం ఉంటుంది.

అమర్‌నాథ్‌లో శ్రావణ మాసంలో ఇక్కడ స్వయంగా మంచు శివలింగం ఏర్పడుతుంది.

కర్ణాటకలోని శివగంగ ఇక్కడ శివలింగంపై నెయ్యివుంచితే వెన్న అవుతుంది. ఇక్కడ ఒక్క మకర సంక్రాంతి రోజు మాత్రమే గంగాజలం ఉద్భవిస్తుంది. మిగిలిన రోజుల్లో ఒక్క చుక్క కూడా కనిపించదు.

మహారాష్ట్రలో కోపినేశ్వర్ అనే దేవాలయంలో ప్రతి సంవత్సరము శివలింగము పైకి పెరుగుతుంది. నంది విగ్రహము శివలింగం వైపు జరుగుతూ ఉంటుంది.

తమిళనాడులోని తిరు నాగేశ్వరములో శివ లింగానికి పాలు పోస్తే నీలం రంగులోకి మారుతాయి.

చైనాలో కిన్నెర కైలాసము
ఇక్కడ ఉన్న శివలింగము ఉదయం తెల్లగా.. మధ్యాహ్నం పసుపుగా.. సాయంత్రం తెలుపుగా.. రాత్రి నీలంగా మారుతుంది.


తెలుగింటి అత్తగారు.. సూర్యకాంతం


(అక్టోబర్ 28, 1924 – డిసెంబర్ 18, 1996) గారి జయంతి నేడు

ప్రసిద్ధ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు ఓసారి టెలివిజన్ ఇంటర్వ్యూలో తాను హాస్యానికి సూర్యకాంతంతో స్వయంగా ఇలా అన్నానని చెప్పాడు – “నువ్వు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటుంది. ‘సూర్యకాంతం’ అనే చక్కని పేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావు”..ఆవిడ నవ్వుతూ నేనంటే అందరికీ ఉన్న భయ భక్తులు అలాంటివి అనేవారట..

సూర్యకాంతం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని వెంకట కృష్ణరాయపురంలో 1924 అక్టోబర్ 28న తన తల్లితండ్రులకు 14వ సంతానంగా జన్మించింది. ఆరేళ్ళ చిన్న వయసులోనే పాడటం, నాట్యమాడటం, నాటకాలలో నటించడం నేర్చుకొంది. పెరిగే వయసులో హిందీ సినిమా పోస్టర్లు బాగా ఆకర్షించాయి. సినిమాల్లో నటించాలనే కోరికతో చెన్నై చేరుకొంది. మొదట జెమిని స్టూడియో నిర్మించిన చంద్రలేఖ సినిమాలో డాన్సర్ గా అవకాశం వచ్చింది. అప్పట్లో నెలకు 65 రూపాయల జీతం ఇవ్వబోతే నిర్మాతతో తన అసంతృప్తిని తెలియజేసి 75 రూపాయలు తీసుకున్నారట. తర్వాత ధర్మాంగద (1949)లో ఆమెది మూగవేషం. ధర్మాంగద టైములో చిన్నా చితకా వేషాలువేసినా తరువాత లీలా కుమారి సాయంతో మొదటిసారిగా ‘నారద నారది’ సినిమాలో సహాయ నటిగా అవకాశం వచ్చింది. చిన్న చిన్న పాత్రలు నచ్చక జెమినీ స్టూడియో నుంచి బయటకు వచ్చేసింది. మనసులో బొంబాయికి వెళదామని ఉన్నా అందుకు ఆర్థిక స్తోమత సరిపోక ఆ ఆలోచనను విరమించుకొంది.

ఆ పరిస్థితిలో సహాయ నటిగా గృహప్రవేశం సినిమాలో మంచి అవకాశం వచ్చింది. తరువాత తన కల అయిన హీరోయిన్ వేషం సౌదామిని చిత్రం ద్వారా వచ్చింది. కానీ ఆ సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం అవడంతో ఆ అవకాశం తప్పిపోయింది. మెరుగైన తరువాత సంసారం చిత్రంలో మొట్టమొదటి సారిగా గయ్యాళి అత్త పాత్ర వచ్చింది. తరువాత తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర సినీ అభిమానుల గుండెల్లో నిలిపోయేలా జీవితాంతం అవే పాత్రలలో నటించింది.

అసలు సంసారం చిత్రం తరువాత బొంబాయికి చెందిన ఒక నిర్మాత ద్వారా హీరోయిన్ గా అవకాశం వచ్చింది. కానీ తనకు అవకాశం రాకముందే ఇంకొక హీరోయిన్‌ను పెట్టుకొని తీసేసారని తెలియడంతో.. ‘ఒకరి బాధను నా సంతోషంగా తీసుకోలేను’ అని ఆ సినిమాను నిరాకరించింది. కోడరికం సినిమా ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చింది. బి.నాగిరెడ్డి, చక్రపాణిలు ఆమె లేకుండా సినిమాలు తీసేవారు కారు. ఆ రోజుల్లోని అనేక సాంఘిక చిత్రాల్లో రేలంగి – సూర్యకాంతం, రమణారెడ్డి – సూర్యకాంతం, ఎస్.వి.రంగారావు – సూర్యకాంతం- జంటలు, వాళ్ల దృశ్యాలు గుర్తుకు తెచ్చుకుని ఇవాళ కూడా హాయిగా నవ్వుకోవడం కద్దు.

అప్పట్లో కొత్త సినిమా వస్తూంటే అందులో సూర్యకాంతం వుందా? అని ప్రేక్షకులూ, తారాగణంలో సూర్యకాంతం వున్నట్టేగదా? అని సినిమా డిస్ట్రిబ్యూటర్లూ – ఎదురు చూసేవారట. చక్రపాణి(1954), దొంగరాముడు (1955), చిరంజీవులు (1956), తోడికోడళ్లు (1957), అత్తా ఒకింటి కోడలే (1958), ఇల్లరికం (1959), భార్యాభర్తలు (1961), గుండమ్మకథ(1962), కులగోత్రాలు (1962), దాగుడుమూతలు(1964), అత్తగారు-కొత్తకోడలు, మూహూర్తబలం(1969) లాంటి మరపురాని ఎన్నో సినిమాలలో నటించింది. సూర్యకాంతం సుమారు 600 సినిమాల్లో నటించారు.

సూర్యకాంతాన్ని హాస్యనటీమణిగా ముద్ర వెయ్యడానికి లేదు. ఆమె ప్రత్యేకంగా హాస్యం చెయ్యకపోయినా ఆమె సంభాషణ చెప్పే తీరు, నవ్వు తెప్పిస్తుంది, చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి. అలా అని ఆమె దుష్టపాత్రధారిణి అని కూడా అనలేం. సహాయ నటి అనే అనాలి. గయ్యాళి అత్తకి మారుపేరు సూర్యకాంతం అనిపించుకుంది. ఓర చూపులు చూస్తూ, ఎడంచెయ్యి విసుర్తూ కుడిచెయ్యి నడుం మీద నిలబెట్టి ఆమె చెప్పిన సంభాషణా చాతుర్యం, అంతలోనే వెక్కిరిస్తూ, అంతలోనే కల్లకబుర్లతో బొల్లిడుపులు ఏడుస్తూ ఆమె ధరించిన అత్త పాత్రలు సజీవ శిల్పాలు.

వ్యక్తిగా సూర్యకాంతం గయ్యాళి కానేకాదు – మామూలు మనిషే. ఏ సమావేశాలకో, సినిమా ఉత్సవాలకో ఆమె వెళ్లినప్పుడు ఆటోగ్రాపులకోసం వెళ్లే స్త్రీలు సూర్యకాంతం దగ్గరకి వెళ్లడానికి భయపడేవారు. ఐతే ఆమె నికార్సయిన మనిషి, కచ్చితమైన మనిషి, సహృదయం గల మనిషి, సహాయపడే మనిషి. ఆమె శుభ్రంగా కడుపునిండా తినేది, పదిమందికీ పెట్టేది. షూటింగ్‌కి వచ్చినప్పుడల్లా – తనతో ఏవో తినుబండారాలు తీసుకురావడం, అందరికీ పెట్టడం అలవాటు. ఇలాంటి అలవాటు సావిత్రి, కృష్ణకుమారి, జానకి వంటి నటీమణులకీ వుండేది. విశేష దినాలూ, పండగపబ్బాలూ వస్తే సరేసరి! షూటింగుల్లో జోకులు చెప్పడం, సూర్యకాంతం సరదాల్లో ఒకటి. ఒక షూటింగులో బయట కేకలు వినిపిస్తున్నాయని ‘సైలెన్స్‌! అవుట్‌సైడ్‌’ అని ప్రొడక్షన్‌ మేనేజర్‌ గట్టిగా అరిచాడు. ఫ్లోర్‌లో వున్న సూర్యకాంతం ‘ఓ!’ అని అంతకన్నా గట్టిగా అరిచింది. ‘ఏమిటమ్మా?’ అని అడిగితే, ‘సైలెన్స్‌ అవుట్‌ సైడ్‌ – అని గదా అన్నారు!’ అందామె నవ్విస్తూ. అలాంటి అల్లరి వుండేది ఆమెలో.

ఓ సినిమాలో నాగయ్యను నానామాటలూ అని, నోటికొచ్చిన తిట్లు తిట్టాలి. షాట్‌ అయిపోయాక ఆయన కాళ్లమీద పడి క్షమించండని వేడుకున్నారట. ‘పాత్ర తిట్టిందమ్మా, నువ్వెందుకు బాధపడతావూ? లే!-’ అని నాగయ్య లేవనెత్తితే, కన్నీళ్లు తుడుచుకున్న భక్తీ, సెంటిమెంటూ ఆమెవి. దబాయింపూ, కచ్చితత్వమూ ఉన్న మనిషే అయినా, మనసు మాత్రం వెన్న, సున్నితం. దాన ధర్మాలు చాలా చేసేవారు. అవసరమైన వాళ్లకి ఆర్థికసహాయం చేసేదిగాని అనవసరం అనిపిస్తే మాత్రం ‘పూచికపుల్ల’ కూడా విదిలించేది కాదు. మొహమాటపడకుండా తనకి రావాల్సిన పారితోషికాన్ని అడగవలసిన నిర్మాతల్ని గట్టిగా అడిగేది. ఆమె అందర్నీ నమ్మేది కాదు. తన కారు రిపేరుకొస్తే ఎంత పెద్ద రిపేరైనా, మెకానిక్‌ ఇంటికొచ్చి తన కళ్లముందు చెయ్యవలసిందే – ఎంత ‘ఎక్స్‌ట్రా మనీ’ అయినా తీసుకోనీగాక! పూజలు వ్రతాలు, వేరే వాళ్ళకి బాగోకపోతే వాళ్ళు త్వరగా కోలుకోవాలని మొక్కుకోవడం, అవకాశాలు రాకపోతే దేవుడిని నేను నీకు రోజూ పూజ చేస్తున్నా మరి డబ్బులు ఏవి అని సరదాగా అడిగేవారట. ఆ రోజుల్లోనే పాత కార్లు పాత ఇళ్ళు కొని బాగు చేసి మళ్ళీ అమ్మడం, విదేశాల నుండి మేకప్ సామాను తెప్పించి అమ్మడం చేసేవారట.. చివరి దశలో వేషాలు తగ్గిపోయినా, చివరిదాకా నటిస్తూ ఉండాలనే కోరుకునేది. తన ఆరోగ్యం బాగులేకపోయినా, ‘నటిస్తాను’ అని ధైర్యంగా చెప్పేది.

సూర్యకాంతం వంటలు చేయడములో ఎంతో నేర్పరి . ఎన్నో రకాల వంటలు రుచికరంగా శుచిగా చేయడములో ఆమెకు సాటి ఎవరు లేరు. సూర్యకాంతం గారు తాను చేసిన వంటలు తాను మాత్రమే తినకుండా పెద్ద పెద్ద క్యారియర్ లకు పెట్టించుకుని అరటి ఆకులూ శుభ్రంగా కోయించుకుని అన్నీ తన కారులో పెట్టుకుని ఆమె సినిమా షూటింగ్‌లకు వెళ్లేవారు. అక్కడ తాను నటించాల్సిన దృశ్యాలు అవగానే సెట్లో మహా సందడి చేసేవారు. ఆవిడ నిర్మాత చక్రపాణి గారికి తప్ప వేరెవరికీ ఆమె భయపడేవారు కాదు. రకరకాల వంటలు అందరికీ కొసరి కొసరి లైట్ బాయ్స్ నుండీ అందరికీ వడ్డించేవారు. సావిత్రి అయితే మా అత్తగారు వంట ఉంటే నాకింక వేరే భోజన సదుపాయాలు వద్దని చెప్పేసేవారట నిర్మాతలకు. అందరికీ మొహమాట పడకుండా తినమని మరి కొంత రుచి చూడమంటూ పెట్టేవారు. ఆమె తన వంటలన్నీ ఓ ఐదొందల పేజీ పుస్తకంగా కూడా అచ్చు వేయించారు మరి.

శ్రీమతి సూర్యకాంతం గారికి సాహితీ సేవలు , సాహిత్యం అన్నా మహా మక్కువ ఎక్కువ. ఎప్పుడు ఆమె బుట్టలో నవలలు పట్టుకుని వెళ్ళేది. అందులో ఎక్కువగా డిటెక్టివ్ నవలలు మరియు కొవ్వలి వారి నవలలు అంటే ఆమెకు ప్రాణం. వారి తల్లిగారి పేరుతో ఓ పత్రిక కూడా స్థాపించారు అప్పట్లో. ఓసారి ఆంధ్ర రచయితల సంఘం సభలు జరపడానికి కాస్త పెద్దమొత్తం కావలసి వచ్చేసరికి సినిమా వాళ్ళను చిన్న మొత్తం 250 రూపాయల చొప్పున విరాళం అడిగితే బాగుంటుందని ఆరుద్ర గారు అనిసెట్టి సుబ్బారావు గారు సూర్యకాంతం గారి ఇంటికి వెళ్లారు. ఏమిటీ 250 రూపాయలే ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఇంతకీ ఎంతవసరం పడుతుంది అని అడిగి.. సాహితీ సేవకు అయితే కేవలం 250 రూపాయలు అడుగుతారా. అంత మొత్తం ఇవ్వడం ఎంత అవమానం ఎంతవమానం .. నాకే చిన్నతనంగా ఉంది. నేనిచ్చినంత తీసుకుని వెళ్లి ఘనంగా సభ చేయండి అంటూ ఓ పెద్దమొత్తమే చెక్ వ్రాసిచ్చారు. మళ్ళీ వేరెవరినీ అడగాల్సిన అవసరం లేకపోయింది ఆరుద్ర గారికీ మరియు అనిసెట్టి గారికి. గయ్యాళి అత్త, బహుముఖ నటనా ప్రవీణ, హాస్య నట శిరోమణి, సహజ నట కళా శిరోమణి లాంటి బిరుదులు మహానటి సావిత్రి మెమోరియల్ అవార్డు, పద్మావతి కళాశాల నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.


కార్తీక మాసంలో ఏ తిథి రోజున ఏం చేయాలి

దీపావళి మరుసటి రోజు నుంచి మొదలయ్యే కార్తీక మాసం అన్ని మాసాల్లో కెల్లా విశిష్టమైనదని మొట్టమొదట వశిష్ట మహర్షి జనక మహారాజుకు చెప్పాడని పురాణోక్తి.

న కార్తీక సమో మాసో
న శాస్త్రం నిగమాత్పరమ్
నారోగ్య సమముత్సాహం
న దేవః కేశవాత్పరః


అంటే కార్తీక మాసంలోని ప్రతిరోజూ పుణ్యప్రదమే. ఒక్కోరోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది.. ఈ మాసంలో ఏ తిథిలో ఏమి చేయాలో తెలుసుకుందాం…


కార్తీక శుద్ధ పాడ్యమి: తెల్లవారుజామునే లేచి స్నానం చేసి గుడికి వెళ్లాలి.. కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేట్టుగా అనుగ్రహించమని ప్రార్థించి, సంకల్పం చెప్పుకొని, ఆకాశదీపాన్ని సందర్శించుకోవాలి.
విదియ: సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి, కానుకలు ఇచ్చి రావాలి. ఇలాంటివారికి యమగండం తప్పుతుందంటారు.
తదియ: అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి.
చవితి : నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి. పుట్టలో పాలు పోయాలి.
పంచమి : దీనిని జ్ఞాన పంచమి అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే జ్ఞానవృద్ధి కలుగుతుంది.
షష్ఠి : ఈరోజున బ్రహ్మచారి అర్చకునికి ఎర్ర గడుల కండువాను దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది.
సప్తమి : ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి అర్చకునికి దానం ఇస్తే ఆయుఃవృద్ధి ప్రాప్తిస్తుంది.
అష్టమి : ఈరోజున చేసే గోపూజ మంచి ఫలితాలను ఇస్తుంది. దీన్ని గోపాష్టమి అని కూడా అంటారు.
నవమి : నేటి నుంచి మూడు రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి.
దశమి : నేడు రాత్రిపూట విష్ణుపూజ చేయాలి.
ఏకాదశి : దీన్నే బోధనైకాదశి అంటారు. ఈరోజున విష్ణుపూజ చేస్తే సద్గతులు కలుగుతాయి.
ద్వాదశి : ఈరోజు క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. సాయంకాలం ఉసిరి, తులసి మొక్కల వద్ద విష్ణుపూజ చేసి, దీపాలను వెలిగించాలి. దీంతో సర్వపాపహరణం అవుతుంది.
త్రయోదశి : సాలగ్రామ దానం చేస్తే కష్టాలు దూరమవుతాయి.
చతుర్దశి : పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిది.

కార్తీక పూర్ణిమ: కార్తీక మాసంలోకెల్లా అతి పవిత్రమైన రోజు. ఈరోజున నదీ స్నానం చేసి, శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవాలి. ఈరోజున సత్యనారాయణ వ్రతం చేస్తే సర్వపాపాలూ తొలగిపోతాయి.


కార్తీక బహుళ పాడ్యమి: ఆకుకూర దానం చేస్తే మంచిది.
విదియ : వనభోజనాలు చేయడానికి అనువైన రోజు.
తదియ : పండితులు, గురువులకు తులసిమాలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయి.
చవితి : రోజంతా ఉపవాసం చేసి, సాయంకాలం గరికతో గణపతిని పూజించాలి. ఆ గరికను దిండు కింద పెట్టుకుని పడుకుంటే పీడకలలు పోతాయి.
పంచమి: చీమలకు నూకలు చల్లడం, శునకాలకు అన్నం పెట్టడం మంచిది.
షష్ఠి : గ్రామదేవతలకు పూజ చేయాలి.
సప్తమి : జిల్లేడు పూల దండను శివునికి సమర్పించాలి.
అష్టమి : కాలభైరవాష్టకం చదివి, గారెల దండను భైరవుడికి (శునకం) సమర్పిస్తే ధనప్రాప్తి కలుగుతుంది.
నవమి : వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి, పండితునికి దానమిస్తే పితృదేవతలు సంతోషిస్తారు.
దశమి : అన్నదానం చేస్తే విష్ణువు సంతోషించి, కోరికలు తీరుతాయి.
ఏకాదశి : విష్ణు ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ చేస్తే మంచి ఫలితాలుంటాయి.
ద్వాదశి : అన్నదానం లేదా స్వయంపాకం సమర్పిస్తే శుభం.
త్రయోదశి : ఈరోజున నవగ్రహారాధన చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి.
చతుర్దశి : ఈరోజున మాస శివరాత్రి. కాబట్టి శివారాధన, అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు, గ్రహబాధలు తొలగుతాయి.
అమావాస్య : పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరక బాధలు తొలగుతాయి.


యమవిదియ…భగినీ హస్త భోజనం

భారతీయ సంప్రదాయంలో రక్తసంబంధాలకీ, అనుబంధాలకీ ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ప్రాధాన్యతను ఇవ్వడమే కాదు, వాటిని కలకాలం నిలుపుకొనేందుకు చక్కటి ఆచారాలను కూడా అందించారు మన పెద్దలు. అందుకు గొప్ప ఉదాహరణే యమవిదియ. ఇది దీపావళి నుంచి రెండోరోజున వస్తుంది.

చారిత్రక గాథ
ఓసారి యమ ధర్మరాజు సోదరి యమునా నదికి తన అన్నను చూడాలని అనిపించింది. త‌న ఇంటికి వ‌చ్చి చాలా రోజులైంది కాబ‌ట్టి, ఓసారి వ‌చ్చి వెళ్లమ‌ని గంగాన‌ది ద్వారా య‌ముడికి క‌బురుపెట్టింది. ఆ క‌బురు వినగానే యముడు.. య‌మునాదేవి ఇంటికి వెళ్లాడు. తన అన్నను సాద‌రంగా ఆహ్వానించి, క‌డుపునిండా భోజ‌నం పెట్టింది. చెల్లెలి అనురాగానికి సంతోషించిన య‌ముడు, ఏం వ‌రం కావాలో కోరుకోమ‌న్నాడ‌ట‌. అందుకు య‌మున నువ్వు ఏటా ఇదే రోజున మా ఇంటికి వస్తే చాలు… అదే గొప్ప వ‌రం అని చెప్పింది.

యముడు ఆ వ‌రానికి త‌థాస్తు చెప్పడ‌మే కాకుండా ఎవ‌రైతే ఆ రోజున త‌న సోద‌రి ఇంట్లో భోజ‌నం చేస్తారో వాళ్లు అకాల‌మృత్యువు నుంచి, న‌ర‌క‌ లోకం నుంచీ శాశ్వతంగా త‌ప్పుకుంటార‌ని చెప్పాడ‌ట‌. ఆ రోజున తన సోదరులని సేవించుకున్న సోదరికి వైధవ్యం ప్రాప్తించదని కూడా వరాన్ని అందించాడు. అందుకే ఈ రోజుని యమద్వితీయం అని పిలుస్తారు. నరకాసురుని సంహరించి వచ్చిన శ్రీకృష్ణుని అతని సోదరి సుభద్ర సాదరంగా ఈ రోజునే ఆహ్వానించిందనీ, అందుకు గుర్తుగా భాతృ విదియ మొదలైందని కూడా చెబుతారు.

ఆడపిల్లలకి పెళ్లి అయిపోగానే తమ పుట్టింటి నుంచి దూరం అవుతారు. పురుళ్లూ పుణ్యాలకు హడావిడిగా రావడమే కానీ, తల్చుకున్నప్పుడు ఓసారి తన పుట్టింటివాళ్లను చూసుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఇక వాళ్ల సోదరుల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. బావమరదులుగా ఎంత బతకకోరినా, వీలైనప్పుడల్లా సోదరి ఇంటికి వెళ్లే స్వాతంత్ర్యం, అవకాశం ఉండకపోవచ్చు. తన సోదరి కాపురం ఒక్కసారి చూడాలని వారికీ, తన సోదరునికి ఒక్కసారి కడుపారా భోజనాన్ని పెట్టాలన్న తపన వీరికీ తీరని కోరికగానే మిగిలిపోతుంది. అందుకే ఈ భాతృ విదియను ఏర్పరిచారు మన పెద్దలు. దక్షిణాదిన ఈ పండుగను కాస్త తక్కువగానే ఆచరిస్తారు కానీ, ఉత్తరాదికి వెళ్లే కొద్దీ ఈ పండుగ ప్రాముఖ్యం మరింతగా కనిపిస్తుంది. నేపాల్‌లో అయితే ఆ దేశ ముఖ్య పండుగలలో దీన్ని కూడా ఒకటిగా ఎంచుతారు. ఉత్తరాదిన ఈ పండుగను భాయిదూజ్‌, భాయిటీకా, భాయితిహార్‌… వంటి భిన్నమైన పేర్లతో పిలుచుకుంటారు. దీపావళి పండుగ వీరికి భాతృ విదియతోనే ముగుస్తుంది.


పంచారామ క్షేత్రాలు.. ఆంధ్రాలో మాత్రమే ఉన్న అరుదైన శివాలయాలు

మహాశివరాత్రి, కార్తీక మాసంతో పాటు అనేక పర్వదినాల్లో హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పరమశివుణ్ణి పూజిస్తుంటారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో ఉన్న మహిమాన్విత శివ లింగ క్షేత్రాలను దర్శించేందుకు ఆసక్తి చూపిస్తారు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ క్షేత్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని

పంచారామాలు ప్రముఖమైనవి. పేరుకు తగినట్లుగానే పరమేశ్వరుడికి సంబంధించిన ఐదు పవిత్ర దేవాలయాలు ఇవి. దేశంలో ఎన్నో శివలింగ క్షేత్రాలు ఉన్నా పంచారామాలకు ఉన్న విశిష్టత మాత్రం ప్రత్యేకం. ఈ ఐదు దేవాలయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో వివిధ పట్టణాల్లో ఉన్నాయి. ఇంతకీ ఈ క్షేత్రాల విశిష్టతలు ఏమిటి? ఎక్కడ ఉన్నాయి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పంచారామాల చరిత్ర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచారామాల పుట్టుకకు సంబంధించి అనేక పురాణ గాధలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీనాధుడు రచించిన భీమేశ్వర పురాణం ప్రకారం.. క్షీరసాగర మధనంలో ఉద్భవించిన అమృతాన్ని మహా విష్ణువు మోహినీ రూపం ధరించి దేవతలకు, రాక్షసులకు పంపిణీ చేశాడు. అయితే త్రిపురాసురులు మాత్రం (రాక్షసులు) ఈ పంపిణీలో తమకు అన్యాయం జరిగిందంటూ అసంతృప్తి వ్యక్తం చేసి శివుని కోసం ఘోర తప్పసును ఆచరిస్తారు. రాక్షసుల తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు వారికి వివిధ వరములను అనుగ్రహిస్తాడు. ఆ శక్తులతో రాక్షసులు దేవతలను అనేక ఇబ్బందులకు గురి చేస్తారు. దీంతో దేవతలు మహాశివుని వద్దకు వెళ్లి తమను రాక్షసుల బారి నుంచి రక్షించాలని వేడుకుంటారు. దేవతల మొర ఆలకించిన మహాశివుడు త్రిపురాంతకుడి రూపంలో ఆ రాక్షసులను, వారి రాజ్యాన్ని బూడిద చేస్తాడు. అయితే ఈ యుద్ధంలో త్రిపురాసురులు పూజించిన అతిపెద్ద శివలింగం మాత్రం చెక్కుచెదరకుండా ఉంటుంది. ఈ శివలింగాన్నే దేవతలు భూమిపై ఐదు చోట్ల ప్రతిష్టించారు. అవే పంచారామాలుగా ప్రసిద్ధి చెందినట్లు చెబుతారు.

అయితే స్కాంధ పురాణంలోని తారకాసుర వధ ఘట్టం ప్రకారం పంచారామాల పుట్టుక ఈ విధంగా ఉంది. హిరణ్య కశిపుడి మనుమడైన తారకాసురుడు శివుని కోసం ఘోర తపస్సు చేసి పరమేశ్వరుడి ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. ఒక బాలుడి చేతిలో తప్ప తనకు మరెవ్వరి చేతిలో మరణం ఉండకూడదని కోరుతాడు. బాలలు ఎవ్వరూ తనను ఏమీ చేయలేరు కాబట్టి తారకాసురుడు ఈ వరాన్ని కోరుకుంటాడు. పరమేశ్వరుడు తథాస్తు అనడంతో ఆ వరగర్వంతో దేవతలను ముప్పతిప్పలు పెట్టడం ప్రారంభిస్తాడు.

దీంతో తారకాసురున్ని నిలువరించేందుకు పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామికి జన్మనిస్తారు. దేవతలతో కలిసి బాలుడైన కుమారస్వామి తారకాసుడిపై యుద్ధానికి దిగుతాడు. ఆ భీకర యుద్ధంలో తారకాసురుడి కంఠంలో ఉన్న ఆత్మలింగాన్ని కుమారస్వామి ఛేదించడంతో అతడు మరణిస్తాడు. ఆ సమయంలో ఐదు భాగాలుగా ముక్కలైన ఆత్మలింగాన్ని ఐదు చోట్ల ప్రతిష్ట చేశారు. అవే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పంచారామ క్షేత్రాలు.

  1. ద్రాక్షారామం

దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన కారణంగా ఈ ప్రాంతాన్ని ద్రాక్షారామంగా పిలుస్తారు. ఈ పంచారామ క్షేత్రం కోనసీమ జిల్లాలో కొలువై ఉంది. రెండు అంతస్తుల్లో 60 అడుగుల ఎత్తులో స్వామి వారి శివలింగం సగం తెలుపు, సగం నలుపు రంగులో ఉంటుంది. రెండో అంతస్తు పై భాగం నుంచి అర్చకులు, భక్తులు అభిషేకాలు నిర్వహిస్తారు. ఇక్కడి స్వామి వారిని భీమేశ్వరుడిగా కొలుస్తారు. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారు స్వామి వారితో కలిసి కొలువై ఉండడం విశేషం. భారతదేశంలోని అత్యంత అరుదైన దేవాలయాల్లో ఇది ఒకటి.

అద్భుతమైన శిల్పకళతో అలరారే ఈ దేవాలయాన్ని సందర్శించడం ప్రతి ఒక్కరికీ ఓ మధురమైన అనుభూతిగా మిగిలిపోతుంది. క్రీస్తు శకం 892-922 మధ్య చాళుక్యుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా స్పష్టమవుతుంది. కార్తీక మాసం, మహాశివరాత్రి పర్వదినాల్లో ఆలయం భక్తులతో పోటెత్తుతుంది. కాకినాడ నగరానికి 32 కిలోమీటర్ల దూరంలో ద్రాక్షారామం ఆలయం ఉంది. అమలాపురం నుంచి వెళ్లేవారు ముక్తేశ్వరం వద్ద గోదావరి నది దాటి కోటిపల్లి నుంచి రోడ్డు మార్గంలో చేరుకుంటారు.

  1. అమరారామం

ఈ క్షేత్రం పల్నాడు జిల్లా అమరావతిలో ఉంది. పరమేశ్వరుడు ఇక్కడ అమరేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. రెండు అంతస్తుల్లో 16 అడుగుల ఎత్తుతో ఈ స్పటిక శివలింగం ఉంటుంది. రెండవ అంతస్తుపై నుంచి స్వామి వారికి అభిషేకాలు నిర్వహిస్తారు. అమ్మవారు బాలచాముండి, క్షేత్ర పాలకుడు వేణుగోపాల స్వామి ఆలయాలు కూడా ఇక్కడ ఉంటాయి. తారకాసురుడి సంహారం తరువాత చెల్లాచెదురైన ఆత్మలింగంలో ఒక భాగాన్ని ఇంద్రుడు ఇక్కడ ప్రతిష్టించినట్లు స్థల పురాణం. ఈ ఆలయం మొత్తం మూడు ప్రాకారాలతో నిర్మితమై ఉంటుంది. ఈ ప్రాకారాల్లో అనేక దేవాలయాలు కనిపిస్తాయి. భక్తుల్లో ఆధ్యాత్మిక చింతనను ఇవి రెట్టింపు చేస్తాయి. గుంటూరు నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఈ పంచారామ క్షేత్రం ఉంది.

  1. క్షీరారామం

పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు పట్టణంలో క్షీరారామం ఉంది. శివుడు భూమిపై తన బాణాన్ని వదిలినప్పుడు అది ఈ ప్రదేశంలో పడి భూమి నుంచి క్షీరదార వచ్చినట్లు కధనం. దీని కారణంగానే ఈ ప్రాంతం క్షీరపురిగా, కాలక్రమంలో పాలకొల్లుగా మార్పు చెందినట్లు చెబుతారు. క్షీరారామం ఆలయాన్ని 11వ శతాబ్ధంలో చాళుక్యులు నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. తెల్లని రంగులో రెండున్నర అడుగుల ఎత్తులో ఉండే ఇక్కడి శివలింగాన్ని రామలింగేశ్వర స్వామిగా కొలుస్తారు. త్రేతా యుగంలో సీతారాములు ఈ లింగాన్ని ప్రతిష్టించినట్లు ప్రతీతి. మొత్తం 125 అడుగుల ఎత్తులో 9 గోపురాలతో ఎంతో సుందరంగా ఈ ఆలయం తీర్చిదిద్దబడింది. ఏటా ఉత్తరాయణ దక్షిణాయన ప్రారంభంలో సూర్యోదయాన పెద్ద గోపురం నుంచి సూర్య కిరణాలు శివలింగంపై పడే దృశ్యం ఎంతో మనోహరంగా ఉంటుంది.

  1. సోమారామం

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి రెండు కిలోమీటర్ల దూరంలో గునిపూడిలో ఈ క్షేత్రం ఉంది. తూర్పు చాళుక్య రాజైన చాళుక్య భీముడు 3వ శతాబ్ధంలో ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఇక్కడి శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్టించిన కారణంగా దీనికి సోమారామం అని పేరొచ్చింది. స్వామి వారి చెంత రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు ఉంటారు. ఈ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. మామూలు రోజుల్లో తెలుగు, నలుపు రంగులో ఉండే ఈ శివలింగం అమావాస్య రోజున మాత్రం గోధుమ వర్ణంలో ప్రకాశిస్తుంది. పౌర్ణమి నాటికి తిరిగి యథారూపంలోకి వస్తుంది. ఈ ఆలయంలో సోమేశ్వర స్వామి కింది అంతస్తులోనూ, అన్నపూర్ణా దేవి అమ్మవారు పైఅంతస్తులో ఉంటారు.

  1. కుమార భీమారామం

కాకినాడ జిల్లా సామర్లకోటలో ఈ ఆలయం ఉంది. సున్నపురాయి రంగులో 60 అడుగుల ఎత్తైన రెండస్తుల మండపంలో ఇక్కడి శివలింగం ఉంటుంది. ద్రాక్షారామం క్షేత్రాన్ని నిర్మించిన చాళుక్య రాజైన భీమునిచే ఈ ఆలయం నిర్మించబడింది. అందుకే ఈ రెండు క్షేత్రాల నిర్మాణ శైలి ఒకే విధంగా అనిపిస్తుంది. ఆలయ ద్వారాల నుంచి కొలను వరకూ ప్రతి నిర్మాణంలోనూ పోలిక కనిపిస్తుంది. క్రీస్తు శకం 892 నుంచి 922 మధ్య ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు.


షోలింగర్‌.. ముక్తినిచ్చే యోగ నరసింహుడు

దుష్ట శిక్షణ చేసిన శ్రీ నారసింహుడు ఉగ్రరూపాన్ని ఉపసంహరించి, యోగ ముద్రలో దర్శనమిచ్చిన చోటుగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం షోలింగర్‌. మానసిక సమస్యల నుంచి విముక్తి కలిగించే దైవంగా ఇక్కడి యోగ నరసింహుడు పూజలు అందుకుంటున్నాడు.

తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో ఉన్న షోలింగర్‌.. ప్రసిద్ధ నారసింహ క్షేత్రాల్లో ఒకటి. దీనికి ‘తిరుక్కడిగె’.. ‘కడిగాచలం’ అనే ప్రాచీన నామాలున్నాయి. రాజుల కాలంలో చోళసింహపురంగా ఖ్యాతి చెందిన ఈ ప్రాంతం పేరు క్రమేపీ షోలింగర్‌గా స్థిరపడింది. వెల్లూరు జిల్లా కేంద్రానికి సుమారు 50 కి.మీ., కంచికి 65 కి.మీ., ఆర్కోణానికి 30 కి.మీ. దూరంలో ఈ ఆలయం ఉంది.

ముక్తినిచ్చే యోగ నరసింహుడు పురాణ గాథల ప్రకారం… హిరణ్యకశిపుణ్ణి నరసింహావతారంలో మహా విష్ణువు వధించిన సందర్భంలో ఆ భీకరాకృతిని చూసి ప్రహ్లాదుడు భయపడ్డాడు. ప్రహ్లాదుడి ప్రార్థన మేరకు ఉగ్రరూపాన్ని ఉపసంహరించుకొని, యోగముద్రలో దర్శనమిచ్చిన నృసింహ స్వామి ఇక్కడ కొలువయ్యాడు. సప్త ఋషులు తనను సేవించుకోగా ముక్తిని అనుగ్రహించాడు. ఈ యోగ నరసింహుణ్ణి సేవించి విశ్వామిత్రుడు బ్రహ్మర్షిత్వాన్ని పొందాడనీ, ఈ ఆలయంలో 24 నిమిషాలు ఉన్నట్టయితే జనన మరణ చక్రం నుంచి విముక్తులవుతారనీ స్థలపురాణం చెబుతోంది. అందుకే ఈ ప్రదేశాన్ని ‘తిరుక్కడిగై’ అని కూడా పిలుస్తారు. అంటే ఇరవై నాలుగు నిమిషాలు దర్శనమిచ్చే నరసింహుడని అర్థం.

ఈ ఆలయానికి కార్తీక మాసంలోని శుక్ర, ఆదివారాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. చక్ర తీర్థంలో స్నానం చేసి, స్వామిని దర్శించుకుంటారు. వైష్ణవులకు పవిత్రమైన 108 దివ్య క్షేత్రాల్లో ఇదొకటి. ప్రధాన ఆలయానికి వెళ్ళే దారిలో బ్రహ్మతీర్థం అనే పుష్కరిణి ఉంది. 108 తీర్థాలు ఇక్కడికి వచ్చి కలుస్తాయంటారు. దీని ఒడ్డున వరదరాజస్వామి ఆలయం ఉంటుంది. ఈ ఆలయానికి సమీపంలోని మరో కొండ మీద ఆంజనేయస్వామి ఆలయం ఉంది. ఆ గుడిలో హనుమంతుడు కూడా యోగముద్రలోనే కనిపించడం విశేషం. సుమారు 230 మీటర్ల ఎత్తయిన కొండ మీద ఉన్న ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే 1,300కు పైగా మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. రాజగోపురం ఐదు అంతస్తుల్లో సమున్నతంగా ఉంటుంది.

ప్రధాన ఆలయంలో యోగ నరసింహ స్వామి మూలవిరాట్‌ ఉంటుంది. యోగముద్రలో కూర్చున్న నారసింహుడి కాళ్ళకు యోగ బంధం (పట్టీ) ఉంటుంది. ఆయన దేవేరి అమృతవల్లి అమ్మవారి మందిరం ప్రధాన ఆలయానికి కుడివైపు ఉంటుంది. ఈ ఆలయాన్ని క్రీస్తుశకం ఆరు నుంచి ఎనిమిదో శతాబ్దం మధ్య చోళరాజులు కట్టించారని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. మానసిక సమస్యలతో, నయంకాని వ్యాధులతో బాధపడేవారు, నిరాశ, నిస్పృహలకు గురైనవారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు ఈ ఆలయాన్ని దర్శించి, ముక్తిప్రదాత అయిన స్వామిని పూజిస్తే ఆ సమస్యలు పరిష్కారం అవుతాయని భక్తుల విశ్వాసం.


నవ్య నివేదన అష్టముఖ షోడశ బాహు నారసింహుడు

‘ధ్యాయో యధా మహత్కర్మ తథా షోడశహస్తవాన్‌
నృసింహః సర్వలోకేశః సర్వాభరణభూషితః’
అంటుంది ‘విష్ణుకోశం’ లోని నరసింహ ధ్యాన శ్లోకం. దాన్ని ప్రతిబింబించేలా నారసింహడు దర్శనమిచ్చే ప్రదేశం తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా కోట్ల నరసింహులపల్లె.

శ్రీ నారసింహుడు బహురూపాల్లో పూజలందుకుంటూ ఉంటాడు. దేశ వ్యాప్తంగా రెండు చేతుల నుంచి ముప్ఫై రెండు చేతుల వరకూ ఉన్న నృసింహ మూర్తులు కనిపిస్తాయి. లక్ష్మీ సహితంగా, యోగానందరూపుడిగా, హిరణ్యకశ్యప సంహారమూర్తిగా, ఉపాసనమూర్తిగా… ఇలా వివిధ రూపాల్లో ఆయన కొలువుతీరి ఉంటాడు. వీటిలో… ఎనిమిది ముఖాలతో, పదహారు చేతులతో ఉండే అరుదైన శిల్పం.. కోట్ల నరసింహులపల్లెలో దర్శనమిస్తుంది.

నరహరి, చెంచులక్ష్మి కథ సుప్రసిద్ధం. శ్రీ నారసింహుణ్ణి గిరిజనులు అమితమైన భక్తితో ఆరాధిస్తారు. కొండల్లో, గుహల్లో, రాతిగుండ్లమీద వ్యక్తమైన రూపాలను నరసింహస్వామిగా వారు పూజిస్తారు. కరీంనగర్‌ ప్రాంతంలో అనేక నారసింహ క్షేత్రాలున్నాయి. కోట్ల నరసింహులపల్లెలోని దేవునిగుట్టమీద ఉన్న నృసింహ శిల్పం … శిల్పకళా శైలి రీత్యా… రాష్ట్రకూటుల (క్రీస్తు శకం ఏడు నుంచి పదో శతాబ్దం మధ్య) కాలానికి చెందినది. ఈ గ్రామంలోని కోట ఆనవాళ్ళని పరిశీలిస్తే… వివిధ కాలాల్లో నిర్మించిన వేర్వేరు కట్టడాలు కనిపిస్తాయి. కాగా, ఇదే చోట రాష్ట్రకూటుల కాలానివిగా పరిగణిస్తున్న లక్ష్మీ నరసింహ, విశ్వనాథ ఆలయాలు, కళ్యాణీ చాళుక్యులు, కాకతీయుల కాలాల్లో నిర్మించిన మల్లికార్జున, సోమనాథ, వీరభద్ర ఆలయాలు ఉన్నాయి. అయితే, దేవునిగుట్ట మీద నరసింహస్వామి అపురూప శిల్పం వల్లా, ఇక్కడ ఉన్న కోటల కారణంగా ఈ గ్రామానికి కోట్ల నరసింహులపల్లె అనే పేరు వచ్చింది.

కాలక్రమేణా కొండమీద ఉన్న ఆ శిల్పం దెబ్బతింటూ వస్తోంది. కొన్ని తలలు మాత్రమే స్పష్టంగా దర్శనమిస్తున్నాయి. రెండు చేతులు హిరణ్యకశ్యపుని పొట్ట చీల్చుతున్నట్టూ, మిగిలిన చేతుల్లో ఆయుధాలున్నట్టూ కనిపిస్తోంది. ఆయుధాల వివరాలు స్పష్టంగా లేవు. ఎల్లోరాలోని దశావతార గుహలో, కాంచీపురంలోని వైకుంఠ పెరుమాళ్‌ గుడిలో ఉన్న శిల్పాలకూ దీనికీ పోలికలు ఉన్నట్టు పరిశీలకులు చెబుతున్నారు. కోట్ల నర్సింహులపల్లెలో శాసనాధారాలు దొరక్కపోవడం వల్ల…. ఇక్కడి దేవాలయ నిర్మాణాలను ఆధారం చేసుకొనే కాలనిర్ణయం చేయాల్సి వస్తోంది.

నరసింహాలయానికి ఎదురుగా సీతారామాలయం, దానికి అవతల 16 స్తంభాల అర్థమండపం, శంకరాచార్యులు దర్శించినట్టు స్థానికులు విశ్వసించే విశ్వనాథాలయం, దాని పక్కన పూల కోనేరు ఉన్నాయి. జైన మతం కూడా ఈ ప్రాంతంలో వర్థిల్లింది. ఇరువైపులా యక్ష, యక్షిణులతో, ఏడు పడగల సర్పం గొడుగుపట్టిన పార్శ్వనాథుడి దిగంబర శిల్పం, ఋషభనాథుడి ధ్యానాసన శిల్పం, ఇటీవలే ధ్యానముద్రలోని వర్ధమాన మహావీరుడి శిల్పం ఈ ప్రాంతంలోని పొలాల్లో బయటపడ్డాయి. 1885లో కల్వకోట కృష్ణయ్య (రామడుగు) దేశపాండ్యకు నరసింహస్వామి కలలో దర్శనమిచ్చి, తనకు గుడి కట్టాలని ఆదేశించినట్టు గుడి దగ్గర కల్వకోట కీర్తికుమార్‌ వేయించిన శిలాఫలకం మీద ఉంది. ఆ వంశస్తులే ధర్మకర్తలుగా ఉన్నారు. ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి నుంచి మూడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలను ఇక్కడ నిర్వహిస్తారు. శ్రీరామనవమి, వైకుంఠ ఏకాదశి, నృసింహ జయంతి ఉత్సవాలు కూడా జరుగుతాయి.


‘తులసి’ వల్ల ఎన్నో ఉపయోగాలు.. తెలిస్తే ఆశ్చర్యపోతారు

భారతీయ సంస్కృతిలో తులసి మొక్కకి ప్రత్యేక స్థానం ఉంది. తులసిలేని హిందువుల ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదేమో. తులసి లక్ష్మీ స్వరూపం. అసలు తులసి మొక్కకు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారు… దాని ప్రత్యేకత ఏంటో తెలుసుకుందా…

మన పూర్వీకులు దేనినైనా పూజించండి అని చెప్పారంటే అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. సాధారణ మొక్కలు, చెట్లు ఉదయం మొత్తం కార్బన్-డై-ఆక్సయిడ్ పీల్చుకుని, ఆక్సిజెన్ వదులుతాయి, రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్వన్-డై-ఆక్సైడ్ మొత్తాన్నీ పర్యావరణంలోనికి విడిచిపెడతాయి. కానీ తులసి మొక్క మాత్రం రోజులో 22 గంటల పాటు ఆక్సిజన్ విడిచిపెడుతుందని పరిశోధనల్లో తేలింది. వృక్షజాతిలో మరే మొక్కకు ఈ ప్రత్యేకత లేదు.

తులసి ఔషధాల గని. తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతారు. తులసి కున్న ఘాటైన వాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు, దోమలు, పాములు రావు. అందుకే మనం సంప్రదాయంలో ఇంటి ముందు, వెనుకా కూడా తులసిమొక్కను పెట్టి పూజించమన్నారు, ఫలితంగా ఇంట్లోకి పాములు రాకుండా ఉంటాయి. తులసిలో విద్యుఛ్చక్తి అధికంగా ఉందని ఆధునిక వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. వేదంలో కూడా వృక్షాల్లో ఉన్న విద్యుత్ గురించి ప్రస్తావన ఉంది. తులసి మొక్క ఉన్న ఇంటి సమీపంలో పిడుగులు పడవని పరిశోధనల్లో తేల్చారు.

తులసిలో ఉన్న ఈ విద్యుత్ శక్తిని మనం శరీరం గ్రహిస్తే ఆరోగ్యం చేకూరుతుంది, అందుకోసమే తులసి మొక్కకి నీరు పోసి, చుట్టు ప్రదక్షిణం చేయాలి. అప్పుడు తులసిలో ఉన్న శక్తి భూమి ద్వారా ఆరికాళ్ళలోకి చేరి నాడీ మండలాన్ని ప్రభావితం చేస్తుంది. తులసి ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం ఎంతకాలమైనా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంధాలు చెప్పాయి. దీన్ని ఆధునిక శాస్త్రవేత్తలు కూడ అంగీకరించారు. ప్రపంచాన్ని హడలెత్తించిన స్వైన్‌ప్లూ భారత్‌లో స్వైరవిహారం చేయకుండా అడ్డుకున్నది తులసి మొక్కేనని తేలింది. తులసి గాలి కారణంగా జనంలో స్వైన్‌ప్లూను తట్టుకునే రోగనిరోధక శక్తి పెరిగిందట. ఏ ఇంట్లో అధికంగా తులసిమొక్కలు ఉంటాయో, ఆ ఇంట్లో జనం ఆరోగ్యంగా ఉంటారు
.
తులసి చెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. తాజ్‌మహల్ కాలుష్యం బారినపడి మసకబారకుండా ఉండడం కోసం, తాజ్‌మహల్ పక్కనే, లక్ష తులసి మొక్కల వనాన్ని ప్రత్యేకంగా పెంచారు. తులసి చెట్టు దగ్గర చేసే ప్రాణాయామం, ధ్యానం, యోగా మరిన్ని మంచి ఫలితాలని ఇస్తాయి. కాలుష్య జీవనంలో కనీసం మనిషి ఒక తులసి మొక్కైనా పెంచాలి. మనం పెరటి తులసిని సక్రమంగా వాడుకుంటే, రూపాయి ఖర్చు లేకుండా అనేక మంది జీవితాల్లో వెలుగు నింపవచ్చు. ఇది తులసి మహాత్యం. తులానాం నాస్తి ఇతి తులసి అన్నారు. దేని గురించి ఎంత చెప్పుకున్నా, ఇంకా చెపుకోవలసినది మిగిలి ఉంటుందో దాన్ని తులసి అంటారని అర్దం. తులసి ప్రాధాన్యత గుర్తించారు కాబట్టే జపాన్‌లో కూడా ప్రతి ఇంట్లో తులసి చెట్టు తప్పక పెంచుతారు.


25న సూర్య గ్రహణం… ఏం చేయాలి?.. ఏం చేయకూడదు

గ్రహణ సమయం: అక్టోబర్ 25వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 28 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల 32 నిమిషాల వరకు..

గ్రహణం అనేదానికి వేదాలకు ముఖ్యమైన ఆరు అంగాల్లో ఒకటైన జ్యోతిషం ప్రకారం సూర్య గ్రహాన్ని, చంద్రగ్రహాన్ని ఛాయాగ్రహాలైన రాహుకేతువులు పీడించడంగా చెప్పవచ్చు. గ్రహణానికి ముఖ్యమైనవి సమయాలు స్పర్శకాలం, మధ్య కాలం, మోక్షకాలం అంటారు. వీటిని అన్నింటినీ కలిపి ఆద్యంత పుణ్యకాలం అంటారు.

ఉదాహరణకు కేతువు ద్వారా రాబోతున్న ఆశ్వయుజ సూర్యగ్రహణం స్పర్శకాలం 25వ తేదీన సాయంత్రం గం 5.04నిమిషాలు. మధ్యకాలం సాయంకాలం 5.39. ఇక గ్రహణం విడిచేది మోక్షకాలం సాయంత్రం 6.28. అయితే ఈ గ్రహణంలో మోక్షం సూర్యాస్తమయం తర్వాత కలిగింది. భారత భూభాగంపై సూర్యుడు అస్తమించిన తరువాత గ్రహణం విడిచిపెడుతుంది గనుక దీన్ని కేత్ర గ్రస్తాస్తమయ గ్రహణంగా చెబుతారు. ఇది చాలా అరుదైన గ్రహణం. అక్టోబర్ 25వ తేదీని సూర్యాస్తమయం 5.36నకే జరుగుతుంది. కనుక దీన్ని గ్రహణం మిగిలి ఉన్న అస్తమయంగా చెబుతారు. దీని వలన మరునాడు సూర్య దర్శనం అయ్యేంత వరకూ గ్రహణదోషం వీడదు. ఈ కారణాల వలన గ్రహణకాల విధులు మారిపోతాయి.

చంద్రగ్రహణం నాడు మరో విచిత్రం జరుగుతోంది. ఈ ఏడాది చంద్రగ్రహణం నవంబర్ 8వ తేదీన కార్తీక పౌర్ణమి రోజున రానుంది. రాహు గ్రస్త చంద్ర గ్రహణం స్పర్శకాలం మధ్యాహ్నం 2.39 కాగా మధ్యకాలం సాయంత్రం 4.29 మోక్షకాలం సాయంత్రం 6.18 అవుతోంది. అంటే చంద్రగ్రహణంతోటే చంద్రోదయం కాబోతోంది కనుక దీన్ని రాహుగ్రస్తోదయ చంద్రగ్రహణంగా చెబుతారు. దీని వలన కూడా గ్రహణ విధులు మారిపోతాయి. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో గ్రహణ సమయంలో ఎలా విధులు నిర్వర్తించాలో అంతా తెలుసుకోవాలి.

ముందుగా ఈ గ్రహణ సమయంలో స్వాతీ నక్షత్రం వారు సూర్యగ్రహణం, భరణీ నక్షత్రం వారు చంద్రగ్రహణం చూడరాదు. తులారాశి వారు సూర్యగ్రహణం నాడు శాంతి చేయించుకోవాలి. మేషరాశి వారు చంద్రగ్రహణం నాడు శాంతి చేయించుకోవాలి.

గ్రహణం సమయం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి?

గ్రహణ కాలం చాలా ఉత్తమమైన సమయం. చాలా అరుదైన సమయం. చాలా యోగదాయకమైన సమయం. ఈ సమయంలో చేసే సాధనలు కోటిరెట్లు ఉత్తమ ఫలాలను ఇస్తాయి. జపాలు కోటి రెట్లు అవుతాయి. దానాలు లక్షల రెట్లు అవుతాయి. అంటే ప్రతీ రూపాయి లక్షరూపాయల దానంతో సమానం అవుతుంది. ధ్యానం, నిధిధ్యాసం, సమాధి, ప్రాణాయామాది సాధనలకు అనుకూలం. అందువల్ల అనవసరమైన సంభాషణలు చేయరాదు. వృథా పనుల్లో ఉండరాదు. ఇంద్రియ లోలత్వం కూడదు. నోటికీ నాలుకకూ విశ్రాంతి ఇవ్వాలి. అంటే మౌనం, నిరాహారం పాటించాలి. ఏదో ఒక నామాన్ని స్మరిస్తూ ఉండాలి. వృథాగా బయట తిరగడం సూర్య చంద్ర కిరణాలు పొందడం చేయరాదు. సూర్యచంద్రాదులను చూడడానికి ప్రయత్నించరాదు. గ్రహణ సమయంలో గాయత్రీ మంత్రం జపిస్తే మంచి ఫలితాలు వస్తాయి.

పితృ తర్పణాలు

గ్రహణాలు షణ్ణవతుల్లో భాగం. అంటే పితృదేవతార్చనలు చేయవలసిన తప్పనిసరి రోజుల జాబితా లోనిది. ఈ రోజున పెద్దల పేరిట దానాలు చేసినా తర్పణాలు విడిచినా పెద్దలు అపారంగా సంతోషించి మనసులోని కోరికలు అన్నీ తీరుస్తారు. ఆత్మహత్యలు చేసుకున్నవారు కూడా సంతృప్తి చెందుతారు. నిజానికి పితృశాపాలు, దోషాల నుంచీ విడుదల పొందడానికి జాక్ పాట్ వంటివి. జన్మదోషాలు జాతక దోషాలు కూడా ఈ సమయంలో పితృ దేవతార్చనల వలన పోతాయి. దానాలు, తర్పణాదులు చేయలేని వారు కనీసం గోసేవ చేసుకున్నా సమస్త దేవతలూ సంతోషిస్తారు. అన్ని కోరికలూ తీరుస్తారు.

గ్రహణ కాలంలో నీరు కూడా త్రాగకూడదు. గ్రహణ స్పర్శకాలానికి ముందే సంధ్యావందనాదులు ప్రారంభించి గాయత్రీ ధ్యానాదులు, అంగన్యాస కరన్యాసాదులు చేసేసుకొని జపం మొదలు మొదలు పెట్టాలి. గ్రహణ స్పర్శకాలంలోకి జపం చేస్తూ ప్రవేశించాలి. గ్రహణ మోక్షకాలం వరకూ జపం చేస్తూనే ఉండాలి. గ్రహణ మోక్ష స్నానం చేసిన తరువాత కాఫీ టీలు సేవించాలి.

గ్రహణ సమయంలో స్త్రీలు స్తోత్రాదులు మాత్రమే చదువుకోవాలి. వారికి జపతపాదులు చెప్పలేదు. అయితే నేడు అనేక మంది స్త్రీలకు కూడా మంత్రోపదేశాలు చేస్తున్నారు. కనుక మంత్రోపదేశం పొందిన వారు కూడా జపాలు చేసుకోవాలి. అయితే స్త్రీలు శివ సహస్రనామం, లలితా సహస్రనామం, లలితా సప్తశతి వంటివి గీతవంటివి చదువుకోవచ్చు. లేదా నామస్మరణను చేసుకోవచ్చు. అంటే బీజాక్షరాలు మంత్రాక్షరాలు లేకుండా కేవలం నామసాధన చేయవచ్చు. లేదా పురాణ గ్రంథాలు చదువుకోవచ్చు. గర్భిణీలు, రజస్వలలు ఏమీ చేయకుండా క్రీయాశూన్యంగా పడుకోవాలి.

గ్రహణం సమయంలో ఇంట్లో దీపం వెలిగించవచ్చా?

గ్రహణ సమయానికి ముందు, తరువాత జ్యోతి ప్రజ్వలనాలు చేయవచ్చు. కార్తీక మాసం వస్తోంది కనుక స్పర్శా కాలానికి పూర్వమే దీపప్రజ్వలన చేయాలి. మోక్షం తరువాత మరలా జ్యోతి ప్రజ్వలనం చేయవచ్చు.

గ్రహణం ఉండగానే సూర్యాస్తమయం అవుతుంది కనుక మరునాడు సూర్యుడిని చూసేంత వరకూ అశౌచం ఉంటుంది. అంటే మరునాడు సూర్యోదయం తర్వాతనే మడినీళ్ళు పట్టుకొని వండుకొని తినాలి. అప్పటి వరకూ ఏమీ తిన కూడదూ త్రాగరాదు. అలాగే చంద్రగ్రహణం గ్రస్తోదయం అవుతుంది. అంటే చంద్రోదయానికి పూర్వమే గ్రహణం ప్రారభమవుతుంది. అంటే చంద్రోదయానికి చంద్రుడు గ్రహణంలో ఉంటాడు. కనుక ఆరోజు పగలు భోజనాదులు చేయరాదు. సాయంత్రం చంద్రగ్రహణ మోక్షం తరువాతనే మడినీళ్ళు పట్టుకొని అశౌచ శుద్ధి చేసుకొని వండుకొని తినాలి.

అయితే ఈ నియమాలు అందరికీ వర్తించవు. ముఖ్యంగా పిల్లలకు బాలబాలికలకూ, గర్భవతులకు, దీర్ఘకాల ప్రాణాంతక వ్యాథులు ఉన్నవారికి, బీపీ, షుగర్ వంటి వ్యాధులున్నవారికి, వృద్ధులకూ, బాలింతలకు మినహాయింపులు ఉన్నాయి. వీరు పాటించాల్సిన అవసరం లేదు. అయితే గర్భవతులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. పాలుతాగే పిల్లలలకు మినహాయింపు ఉంది. తల్లిపాలకు దోషం లేదు. ఆకలికి ఆగలేని వారు దుంపలు, సగ్గుబియ్యంతో చేసినవి, అటుకులతో చేసిన పదార్థాలు పళ్ళు పాలు వంటివి తీసుకోవాలి. గృహస్థులకు శుష్కోపవాసాలు చెప్పలేదు. కనుక ఫలహారాలు సేవించవచ్చు.