రివ్యూ: నేను మీకు బాగా కావాల్సిన వాడిని

చిత్రం: నేను మీకు బాగా కావాల్సిన వాడిని; న‌టీన‌టులు: కిర‌ణ్ అబ్బ‌వ‌రం, సంజ‌న ఆనంద్‌, సోనూ ఠాకూర్, సిద్ధార్థ్‌ మీన‌న్‌, ఎస్వీ కృష్ణారెడ్డి, బాబా భాస్క‌ర్‌, స‌మీర్‌, సంగీత‌, నిహారిక, ప్ర‌మోదిని, భరత్ రొంగలి త‌దిత‌రులు; సంగీతం: మ‌ణిశ‌ర్మ‌; కూర్పు: ప్ర‌వీణ్‌ పూడి; ఛాయాగ్ర‌హ‌ణం: రాజ్ నల్లి; స్క్రీన్‌ప్లే, మాట‌లు: కిర‌ణ్ అబ్బ‌వ‌రం; ద‌ర్శ‌క‌త్వం: శ్రీధ‌ర్ గాదె; నిర్మాత‌: కోడి దివ్య దీప్తి; విడుద‌ల తేదీ: 16-09-2022

‘రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులను పలకరించిన యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం. తర్వాత వచ్చిన ‘SR కళ్యాణ మండపం’ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించారు. యూత్‌లో కాస్త క్రేజ్ సంపాదించుకున్నారు. దీంతో ఆయనకు వరుస సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. కమర్షియల్ అంశాలతో పాటు వైవిధ్యమైన కాన్సెప్ట్ మూవీస్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ సినిమా రిలీజైంది. మరి ఆ సినిమా ఎలా ఉందనేది తెలుసుకోవాలంటే ముందు కథ గురించి తెలుసుకుందాం…

క‌థేంటంటే: తేజు (సంజ‌నా ఆనంద్‌) ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. ఓ కుర్రాడిని ప్రేమించి మోస‌పోతుంది. ఇంట్లో వాళ్ల‌కు ముఖం చూపించుకోలేక భారంగా జీవితాన్ని గ‌డిపేస్తుంటుంది. ఈ క్ర‌మంలోనే మ‌ద్యానికి బానిస‌వుతుంది. అలాంటి ఆమె జీవితంలోకి క్యాబ్ డ్రైవ‌ర్‌ వివేక్ (కిర‌ణ్ అబ్బ‌వ‌రం) ఎంట్రీ ఇస్తాడు. తేజు తాగి ప‌డిపోయిన ప్ర‌తిసారీ ఆమెను త‌న రూంలో డ్రాప్ చేసేది అత‌నే. ఓసారి ఆమెను ఓ గ్యాంగ్‌ కిడ్నాప్ చేయ‌బోతే కాపాడ‌తాడు. దీంతో ఆమెకు వివేక్‌పై మంచి అభిప్రాయం ఏర్ప‌డి.. త‌న విషాద గాథ‌ను అత‌నితో పంచుకుంటుంది. అదే స‌మ‌యంలో వివేక్ కూడా త‌న విఫ‌ల ప్రేమ‌క‌థ‌ను ఆమెతో పంచుకుంటాడు. మ‌రి ఆ త‌ర్వాత ఏమైంది? ఇద్ద‌రి ప్రేమ‌క‌థ‌ల‌కు ఉన్న లింకేంటి? ఒక‌రి క‌థ మ‌రొక‌రు తెలుసుకున్నాక ఇద్ద‌రూ క‌లిసి ఏం చేశారు? అన్న‌ది తెర‌పై చూసి తెలుసుకోవాలి.

హీరోయిన్‌ ప్రేమ‌లో మోస‌పోతుంది. దాంతో అబ్బాయిలంటేనే ద్వేషం పెంచుకుంటుంది. ఫ్ర‌స్టేష‌న్‌తో ఉంటుంది. అలాంటి అమ్మాయికి ఓ క్యాబ్ డ్రైవ‌ర్ అయిన హీరో పరిచ‌యం అవుతాడు. ఆమె మ‌న‌సు మారుస్తాడు. కానీ హీరోకి, హీరోయిన్‌కి ఓ రిలేష‌న్ ఉంటుంది. అదేంట‌నేదే క‌థ‌. దాని చుట్టూనే క‌థంతా న‌డుస్తుంది. కిర‌ణ్ అబ్బ‌వ‌రం మ‌న ప‌క్కింటి కుర్రాడిలాంటి పాత్ర‌లో న‌టించి మ‌రోసారి మెప్పించాడు. త‌నే స్క్రీన్ ప్లే.. మాట‌లు రాసుకున్నాడు. అలాగే సినిమాలో త‌న పాత్ర‌కు కావాల్సిన హీరోయిజం ఎలివేష‌న్ సీన్స్‌, ఫైట్స్ కూడా ఇన్‌క్లూడ్ చేసుకున్నాడు.

త‌న పాత్ర ప‌రంగా త‌న న‌ట‌న ఓకే. ఇక హీరోయిన్ సంజ‌నా ఆనంద్ పాత్ర చుట్టూనే సినిమా అంతా ర‌న్ అవుతుంది. ఆమె న‌ట‌న ప‌రంగా ఓకే అనించిందే త‌ప్ప‌.. ఆ పాత్ర‌లోని ఎమోష‌న్స్‌ను ఇంకా బాగా చేసుండ‌వ‌చ్చు అనే భావ‌న క‌లిగింది. ఇక బాబా భాస్క‌ర్ పాత్ర‌లో కాస్తో కూస్తో కామెడీ క‌నిపించింది. అది త‌ప్ప సినిమాలో ఎంట‌ర్‌టైనింగ్ పార్ట్ వెతికినా క‌న‌ప‌డ‌దు. సిద్ధార్థ్ మీన‌న్ చుట్టూనే ఫ‌స్టాఫ్ అంతా న‌డుస్తుంది. నిజానికి ఫ‌స్టాఫ్‌లో అత‌నే హీరో అనిపిస్తాడు. ఇక సినిమాలోని ఇత‌ర తారాగ‌ణంగా న‌టించిన ఎస్‌.వి.కృష్ణారెడ్డి, స‌మీర్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు.

ఎవ‌రెలా చేశారంటే: వివేక్ పాత్ర‌లో కిర‌ణ్ అబ్బ‌వ‌రం న‌ట‌న బాగుంది. నిజానికి ఈ చిత్రంలో ఆయ‌న త‌న న‌ట‌న‌పైన కంటే మాస్ ఎలివేష‌న్ల‌పైనే ఎక్కువ దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలోనే క‌థ‌ను ప‌క్క‌కు నెట్టి మ‌రీ బ‌ల‌వంతంగా యాక్ష‌న్ ఎపిసోడ్స్ ఇరికించేశారు. వాటిని డిజైన్ చేసిన విధానం బాగున్నా.. అవి కిర‌ణ్ ఇమేజ్‌కు మించిన స్థాయిలో ఉన్నాయి. ఐటెం పాట‌లో.. న‌చ్చావ‌బ్బాయ్ గీతంలో కిర‌ణ్ వేసిన స్టెప్పులు ఆక‌ట్టుకుంటాయి. తేజు పాత్ర‌లో సంజ‌నా ఆనంద్ ఫ‌ర్వాలేద‌నిపించింది. వాస్తవానికి క‌థ‌లోనే స‌రైన బ‌లం లేక‌పోవ‌డం వ‌ల్ల తెర‌పై ప్ర‌తి పాత్రా తేలిపోయింది. సోనూ ఠాకూర్‌, బాబా భాస్క‌ర్‌, ఎస్వీ కృష్ణారెడ్డి త‌దిత‌రుల పాత్ర‌లు ప‌రిధి మేర‌కు ఉంటాయి. శ్రీధ‌ర్ గాదె రాసుకున్న క‌థ‌లో ఏమాత్రం కొత్త‌ద‌నం లేదు. కిర‌ణ్ అబ్బ‌వరం అందించిన స్క్రీన్‌ప్లే, సంభాష‌ణ‌లు అందుకు తగినట్లుగానే ఉన్నాయి. సినిమా మొత్తంలో కాస్త కాల‌క్షేపాన్నిచ్చింది మ‌ణిశ‌ర్మ సంగీతం మాత్ర‌మే. అదే చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.


పెళ్లి చేసుకోను.. కానీ బిడ్డని కనాలని ఉంది.. సీతారామం నటి

బ్యూటీఫుల్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పెళ్లి, పిల్లలు కనడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తను నటించిన ‘సీతా రామం’ మూవీ ఇటీవల హిందీలో విడుదలవగా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్న ఆమె తాజాగా ప్రముఖ యూట్యూబ్ చానెల్‌ ‘డేటింగ్ దిస్ నైట్స్’ ఎపిసోడ్‌లో మాట్లాడుతూ.. 30ఏళ్ల వయసులో ఉన్న స్త్రీలు డేటింగ్ చేయడం, ప్రేమలో పడటం, బిడ్డను కనడం వల్ల కలిగే ఒత్తిడి తాను ఎదుర్కొలేనని చెప్పింది. అలాగే పాత సిద్ధాంతాలను బద్దలు కొట్టి ప్రేమలో పడకుండానే బిడ్డను కనాలని ఉందన్న బ్యూటీ.. ఈ తరం అమ్మాయిలు కాలం చెల్లిన ఆలోచనలనుంచి బయటపడాలని సూచించింది.

ఈ మేరకు ‘నేను ఎక్కడి నుంచి వస్తున్నానో.. నా మనసులో ఏముందో గమనించి, చేస్తున్న వృత్తిని అర్థం చేసుకునే భాగస్వామి కావాలి. ప్రస్తుతం మన చుట్టు చాలా అభద్రతాభావం ఉంది. కాబట్టి నాకు కావల్సిందల్లా ప్రొటెక్టెడ్ పర్సన్. ఇలాంటి వ్యక్తులు దొరకడం చాలా అరుదు. అలాగే నేను బిడ్డను కనాలని భావించిన సందర్భాలు ఉన్నాయి. కానీ, అది సెక్స్ ద్వారా కాదు. ఒంటరి తల్లిగా ఉండాలనుకున్నా. దానికి మా అమ్మ సరే అని చెప్పడం ఆశ్చర్యకరంగా ఉంది. నిజంగా అలా ఉండటం అద్భుతమైనది’ అని ముగించింది మృణాల్.


‘గాడ్ ఫాదర్’ సాంగ్ ప్రోమో.. మెగా ఫ్యాన్స్‌కి పండ‌గే

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ . మోహ‌న్ రాజా ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను రామ్ చ‌ర‌ణ్‌, ఆర్‌.బి.చౌద‌రి, ఎన్‌.వి.ప్రసాద్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ స‌ల్మాన్ ఖాన్ ఇందులో ఓ కీల‌క పాత్రలో న‌టించ‌టం విశేషం. చిరంజీవి – స‌ల్మాన్ ఖాన్ క‌లిసి చేసిన ‘థార్ మార్..’ అనే సాంగ్‌ను సెప్టెంబ‌ర్ 15న రిలీజ్ చేయ‌బోతున్నారు. ఆ సాంగ్ ప్రోమోను మంగ‌ళ‌వారం చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ప్రోమో చూస్తుంటే చిరు, స‌ల్మాన్ మాస్ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టేశార‌ని క్లియ‌ర్‌గా అర్థమ‌వుతోంది. అక్టోబ‌ర్ 5న సినిమా థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌నుంది.


‘ఆదిపురుష్’ టీజర్ డేట్ ఫిక్స్!

సినీ ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘ఆదిపురుష్’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. కృతి సనన్ , సైఫ్‌అలీ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తికాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందుతుంది.

చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ కూడా ఇప్పటి వరకు విడుదల కాలేదు. అభిమానులందరూ అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులకు తెర పడినట్టే కనిపిస్తుంది. ‘ఆదిపురుష్’ ప్రమోషన్స్ అక్టోబర్ మొదటి వారం నుంచి ప్రారంభం కానున్నాయని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది.

‘ఆదిపురుష్’ టీజర్‌ను అక్టోబర్ 3న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. రాముని జన్మస్థలం అయోధ్యలో టీజర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారని సమాచారం. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారనే సంగతి తెలిసిందే. ఈ మైదానంలో అక్టోబర్ 5న జరిగే రావణ దహన కార్యక్రమానికి ప్రభాస్‌ను ముఖ్య అతిథిగా నిర్వహకులు ఆహ్వానించారని బీ టౌన్ మీడియా తెలుపుతోంది. రావణుడ్ని దహనం చేయాలని నిర్వహకులు కోరారట.

ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించడనుండటంతోనే ఈ కార్యక్రమానికి పిలిచారని తెలుస్తోంది. గతంలో రావణ దహన కార్యక్రమానికి అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్, జాన్ అబ్రహాం హాజరయ్యారు. కాగా, ‘ఆదిపురుష్’ ను భూషణ్ కుమార్ భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. ఈ మూవీలో రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్, రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ‘ఆదిపురుష్’ ఫస్ట్‌లుక్ సెప్టెంబర్ 26న విడుదలయ్యే అవకాశం ఉంది.


గురితప్పిన ‘బ్రహ్మాస్తం’.. బాలీవుడ్ ఆశలు మళ్లీ గల్లంతు

బాలీవుడ్ ఆశలు అడియాశలు అయ్యాయి. ఇండస్ట్రీకి పూర్వ వైభవం అన్నమాటే ఇప్పుడు ఉత్తి మాటగా మారిపోయింది. దిక్కుతోచని స్థితిలో ఉన్న బీ టౌన్‌ ఎట్ ప్రపజెంట్‌ దిక్కులు చూస్తూ కూర్చింది. ఏం చేయాలో అర్థం కాక.. ఎలాంటి సినిమాలు తీయాలో తెలియక తల్లడిల్లుతోంది. సౌత్ ముందు చిన్నబోవడం పై మదన పడుతోంది.పాన్ ఇండియన్ సినిమాలంటూ నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేశాయి సౌత్ సినిమాలు.! అందులోనూ ప్రత్యేకించి టాలీవుడ్ సినిమాలు! ఇక వీటికి ఎదుర్కొనేందుకు.. మునుపటి బాలీవుడ్ను ఆవిష్కరించేందుకు ఓ రేంజ్లో నడుంబింగారు బాలీవుడ్ మేకర్స్. పాన్ ఇండియా సినిమా కాన్సెప్ట్ ను ఎత్తుకుని మరీ.. భారీ బడ్జెట్ తో రాజమౌళి రేంజ్లో బ్రహ్మాస్త్ర సినిమాను తెరకెక్కించారు. టాలీవుడ్ స్టార్ హీరో నాగ్‌ను కూడా ఈ సినిమాలో నటింపజేసి సౌత్‌లో ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేశారు. మన పాన్ ఇండియన్ డైరెక్టర్ రాజమౌళితో ఈ సినిమాను ప్రజెంట్ చేపించే ప్లాన్ చేశారు. ఆయన్ను ఈ సినిమా ప్రమోషన్లకు హెడ్‌ గా మార్చేశారు. సినిమా పై ఎన్నో అంచనాలు పెంచారు.

బాలీవుడ్ ను మునుపటి ట్రాక్ పై ఎక్కించేందుకు బ్రహ్మాస్త్ర నే సరైనా సినిమాని అందరూ అనుకునేలా చేశారు.కాని కట్‌ చేస్తే.. సెప్టెంబర్ 9న రిలీజైన ఈ సినిమా పెద్దగా పాజిటివ్‌ టాక్ తెచ్చుకోవడంలో ఫెయిల్ అయింది. దాదాపు 65 పర్సెంట్ అడ్వాన్స్ బుకింగ్స్ తో సినిమా రిలీజ్ ముందు చిన్న వైబ్రేషన్ క్రియటే చేసినా.. రిలీజ్ తరువాత మాత్రం ఆ వైబ్రేషన్ను కంటిన్యూ చేయలేక పోయింది బ్రహ్మాస్త్ర. దీంతో ఈ సినిమా కూడా బాలీవుడ్‌ ఫేట్ మార్చేలా కనిపించడం లేదంటూ.. కామెంట్స్ చేస్తున్నారు ఫిల్మీ అనలిటిక్స్. రణ్‌బీర్ వల్ల కాలేదు మరే హీరో వల్ల అవుతుందో చూడాలని అంటున్నారు.


హనుమంతుడికి తమలపాకులతో పూజ ఎందుకు చేస్తారు.. ఫలితం ఏంటి?

ఒకసారి సీతాదేవి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన హనుమంతుడు శ్రీరాముడిని ”స్వామీ ఏమిటది ? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది? అని అడిగాడు. అప్పుడు రాముడు ‘తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది. అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే హనుమంతుడు అక్కడి నుండి వెళ్లిపోయి కొంత సేపటికి ఒళ్లంతా తమల పాకులను కట్టుకొని గంతులు వేస్తూ ఆనందంగా వచ్చాడట. హనుమంతుడు ఎక్కువగా తమలపాకు తోటలలోనూ,అరటి తోటలలోనూ విహరిస్తాడు. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి, సుఖము లభిస్తాయి. తమలపాకులకు మరోపేరు నాగవల్లీ దళాలు. తమలపాకులతో పూజించడంవలన నాగదోష పరిహారం అవుతుంది.

మరో కథ ప్రకారం, అశోక వనంలో ఉన్న సీతాదేవికి హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట దగ్గరలో పువ్వులు కనిపించక. అందుకే హనుమంతునికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు.

ప్రయోజనాలు..!

  1. లేత తమలపాకుల మాలను వేస్తే రోగాలతో ఉన్న వారికి త్వరగా గుణం కనిపడుతుంది.
  2. హనుమంతుని(ఆంజనేయస్వామి)కి తమల పాకుల మాల వేస్తే మంత్ర సంబందమైన పీడలు తొలగిపోతాయి.
  3. సంసారంలో ప్రశాంతత లేని వారు తమల పాకుల మాల వేస్తే సంసారంలో సుఖం లభిస్తుంది.
  4. చిన్న పిల్లలు కొందరు ఎంత ఆహారాన్ని తిన్నప్పటికీ సన్నగానే ఉంటారు. ఇలాంటి వారు తమలపాకుల మాల వేస్తే ఆరోగ్యం బాగుపడి చక్కగా ఎదుగుతారు.
  5. వ్యాపారంలో చాల నష్టాలు వస్తుంటే తమలపాకుల మాల వేయించి తమలపాకులు, పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది
  6. శనైశ్చర స్వామి వల్ల ఇబ్బంది ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది
  7. సుందర కాండ పారాయణం చేసి తమలపాకుల మాల వేస్తే అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుంది.
  8. వాద ప్రతివాదాల్లో స్వామిని ప్రార్ధించి తమలపాకుల మాల సమర్పించి, ప్రసాదం తీసుకుంటే విజయం మీదే అవుతుంది.
    9.హస్త, మృగశిర నక్షత్రములతో కూడిన ఆదివారాలు మారుతికి ఇష్టమైన రోజులు. భూత, ప్రేత పిశాచాది బాధలు, రోగాలు, కష్టాలు తొలగడానికి అభీష్టసిద్ధికి ఆంజనేయ ప్రదక్షిణములు శ్రేష్ఠం.
  9. అరటి తోటలో హనుమంతునికి పూజ కోటి రెట్లు ఫలితం వస్తుందని పెద్దలు చెబుతారు. శతవృద్ధ జిల్లేడు, తెల్లజిల్లేడు వేరు చెక్కతో హనుమంతుని ప్రతిమను చేయించి అరటితోటలో పూజించుట వలన సత్వరం హనుమంతుడు అనుగ్రహిస్తాడు. అరటి తోటలో హనుమంతునికి పూజ కోటిరెట్లు ఫలితాలను ఇస్తుంది.

హనుమంతుడికి సింధూరం ఎందుకంత ఇష్టమో తెలుసా

ఆంజనేయునికి సింధూరం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే.. సీతమ్మ పాపిట బొట్టు పెట్టుకోవడం చూసిన ఆంజనేయుడు ఓసారి ఎందుకలా పెట్టుకుంటున్నావని సీతాదేవిని అడుగుతాడు. అందుకు సీతమ్మ నవ్వుతూ ఈ పాపిట బొట్టువలన నేను రామప్రేమను పొందానని చెప్పింది. ఈ బొట్టు రాముల వారికి చాలా ఇష్టమని చెప్పారు. దాంతో వెంటనే హనుమంతుడు సిందూరాన్ని తన శరీరమంతా పూసుకున్నాడు. ఆయనకు ఆపాదమస్తకం రోమాలు ఉండడం చేత ఆ సిందూరం వెంటనే రాలిపోయేది. అప్పుడు హనుమంతుడు నూనెతో కలిపిన గంగ సిందూరాన్ని శరీరమంతా రాసుకున్నాడు. ఇలాంటి అమాయకపు పనిచేసిన హనుమంతుని చూసిన రాముల వారు, నిన్ను సింధూర రూపంతో ఎవరైతే సేవిస్తారో వారికి నేను ప్రసన్నుడును అవుతానని వరమిచ్చారట. అటువంటి భక్తులకు సమస్త దోషాలు తొలగి సుఖశాంతులు పొందుతారని వరం ఇచ్చారు. అందుకే హనుమంతుని శరీరమంతా సిందూరం రాసి ఉంటుంది.


హనుమంతునికి వడ మాల ఎందుకు వేస్తారు.. ప్రయోజనం ఏంటి?

అంజనాదేవికి, వాయు భగవానునికి జన్మించిన ఆంజనేయుడు బాల్యంలో అకాశంలో ఉన్న సూర్యుడిని పండుగా భావించి ఎగిరి పట్టుకోవాలనుకున్నాడు. వాయుపుత్రుడు కావడంతో అకాశానికి ఎగిరాడు. సూర్యుడిని పట్టుకునేందుకు వాయుపుత్రుడు ఇలా ఆకాశానికి ఎగిరెళ్ళడం చూసిన దేవతలంతా విస్తుపోయారు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని విసిరి ఆంజనేయుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అపుడు వజ్రాయుధం హనుమంతుడి దవడ తాకింది. హనుమంతుని దవడ కి గాయమేర్పడింది. అందుచేత సుందరుడు అనే పేరుగల ఆంజనేయుడు హనుమంతునిగా పిలుస్తారు. బాల హనుమంతుడు సూర్యుడిని పట్టేందుకు వెళ్తున్న సమయం సూర్యగ్రహణం కావడంతో, సూర్యుడిని పట్టుకునేందుకు రాహువు కూడా ప్రయాణమయ్యాడు. అయితే వాయుపుత్రుని వేగానికి రాహువు తట్టుకోలేక సూర్యుడిని పట్టలేకపోయాడు. సూర్యగ్రహణాన్ని అడ్డుకొని వేగంతో తనను మించిన హనుమంతుడి సాహసాన్ని చూసి నివ్వెరపోయిన రాహువు ఆంజనేయుడికి ఒక వరం ఇచ్చాడు.

రాహువుకు ప్రీతికరమైన మినుములతో వడలు (గారెలు) చేసి వాటిని మాలగా తయారుచేసి ఎవరు హనుమంతునికి సమర్పిస్తారో వారికి రాహుగ్రహంతో ఏర్పడే బాధలు, దోషాల నుండి విముక్తుల్ని చేస్తానని వరమిచ్చి ఆశీర్వదిస్తాడు. రాహువుకు ప్రీతికరమైన మినుముతో వడలు (గారెలు) చేసి తన శరీరం పోలిక అంటే పాములాంటి ఆకారంలో మాలగా వడలను హనుమంతునికి సమర్పిస్తే రాహు దోషాలు పూర్తిగా తొలగిపోతాయని విశ్వాసం. అందుచేతనే మినప పప్పు వడలు తయారుచేసి 54, 108 లేదా 1008 అనే సంఖ్యలో హనుమంతునికి మాలగా సమర్పించిన వారికి రాహు దోషాలుండవని చెబుతారు.


ఒకే ఒక జీవితం.. రివ్యూ

చిత్రం: ఒకే ఒక జీవితం; నటీనటులు: శర్వానంద్‌, అమల, రీతూవర్మ, వెన్నెల కిషోర్‌, ప్రియదర్శి, నాజర్‌; సినిమాటోగ్రఫీ: సుజిత్‌ సారంగ్‌; ఎడిటింగ్‌: శ్రీజిత్‌ సారంగ్‌; మాటలు: తరుణ్‌ భాస్కర్‌; నిర్మాత: ప్రకాశ్‌బాబు, ప్రభు; కథ, కథనం, దర్శకత్వం: శ్రీ కార్తిక్‌; విడుదల తేదీ: 9-9-2022

శర్వానంద్ కొన్ని సంవత్సరాల నుండీ మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. అతని దురదృష్టం ఏంటి అంటే కొన్ని సార్లు సినిమా ఎంత బాగున్నా, కమర్షియల్ గా ఆడకపోవడం, లేదా సినిమా బాగోలేకపోవటం జరుగుతూ వున్నాయి. అందువల్ల అతనికి హిట్ వచ్చి చాలా కాలం అవుతోంది. చాలా సినిమాలు కూడా చేశాడు. నిజం చెప్పాలి అంటే, 2016లో వచ్చిన శతమానం భవతి తరువాత అతనికి అంత పెద్ద హిట్ రాలేదు. ఇప్పుడు ఒకే ఒక జీవితం అనే సినిమాతో మన ముందుకు వచ్చాడు. చాలా కాలం తరువాత అమల అక్కినేని మళ్ళీ కెమెరా ముందుకు వచ్చారు. ఇందులో ఆమె శర్వానంద్ తల్లిగా నటించారు. శ్రీ కార్తీక్ అనే అతను ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇది తమిళ్ లో కూడా విడుదలయింది. ఈ సినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో, భావోద్వేగాలతో కూడిన డ్రామా. మరి ఇది ఎలా ఉందో చూద్దాం.

క‌థేంటంటే: ఆది (శ‌ర్వానంద్‌), శ్రీను (వెన్నెల‌ కిషోర్‌), చైతూ (ప్రియ‌ద‌ర్శి) మంచి స్నేహితులు. చిన్నప్పట్నుంచీ క‌లిసి పెరిగిన వీళ్లు ఒకొక్కరూ ఒక్కో స‌మ‌స్యతో స‌త‌మ‌త‌మ‌వుతూ ఉంటారు. ఎవ‌రిలోనూ సంతృప్తి ఉండదు. ఈ ముగ్గురికీ పాల్ (నాజ‌ర్‌) అనే ఓ శాస్త్రవేత్త ప‌రిచ‌యం అవుతాడు. అతడు ఇర‌వ‌య్యేళ్లుగా టైమ్ మెషిన్‌ క‌నిపెట్టడం కోసం కష్టప‌డుతుంటాడు. చివ‌రికి తాను క‌నిపెట్టిన టైమ్ మెషిన్‌తో గ‌తంలోకి వెళ్లి త‌మ త‌ప్పుల్ని స‌రిదిద్దుకునే అవ‌కాశాన్ని ఆది, శ్రీను, చైతూల‌కి ఇస్తాడు. మ‌రి వాళ్లు గ‌తంలోకి వెళ్లి ఏం చేశారు? త‌ప్పుల్ని స‌రిదిద్దుకున్నారా ? భ‌విష్యత్తుని గొప్పగా మార్చుకున్నారా? విధి వారికి ఏం చెప్పింద‌నేది మిగ‌తా క‌థ‌.

టైం మెషిన్ లో కాలం వెనక్కి ముందుకి వెళ్ళటం అనే కాన్సెప్ట్ తో సినిమాలు మన తెలుగులో కూడా వచ్చాయి. బాలకృష్ణ నటించిన ఆదిత్య369 ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. తమిళంలో సూర్య నటించిన 24 కూడా ఇదే జోనర్‌లో వచ్చిన సినిమానే. అలాగే, ఈమధ్యే వచ్చిన బింబిసార సినిమా కూడా అటువంటిదే. అదీ సక్సెస్ అయింది. అయితే దర్శకుడు శ్రీ కార్తీక్ అదే టైం మెషిన్ కాన్సెప్ట్ తో ఒక కొత్త కథని ఎంచుకున్నాడు. అతను దాంట్లో చాలా భావోద్వేగాలను, చిన్న కామెడీ.. రెండూ కలిపి చూపించాడు. చాలా వరకు విజయం సాధించాడని చెప్పాలి. ముగ్గురు స్నేహితులు వాళ్ళ మధ్య చిన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకు వున్న అనుబంధం బాగా చూపించాడు. అలాగే, కథ అంతా ఒక హీరో చుట్టూనే కాకుండా, మిగతా వాళ్ళ పాత్రలకి కూడా మంచి ఇంపార్టెన్స్ ఇవ్వటం వల్ల సినిమా ఆసక్తి కరంగా ముందుకు వెళుతూ ఉంటుంది. అలాగే ఈ స్నేహబంధంతో పాటు, అమ్మ సెంటిమెంట్ కూడా దర్శకుడు జోడించడంతో సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా భావోద్వేగంగా ఉంటూ వస్తుంది. టైం మెషిన్, వెనక్కి వెళ్ళడమే కాకుండా, ఇక్కడ దర్శకుడు ఇంకో ఆసక్తికర విషయం జోడించాడు.

స్నేహితులు ముగ్గురూ 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చిన్నప్పుడు ఎలా వున్నారో వాళ్ళని ఈ పెద్దయిన ముగ్గురూ కలవటం. వాళ్ళతో వాళ్ళే ఎలా మాట్లాడుకుంటారో అన్నది కొంచెం సరదాగా బాగా చిత్రీకరించారు. మొత్తం మీద దర్శకుడు ఒక రకంగా సఫలీకృతుడు అయ్యాడనే చెప్పాలి. కొత్త దర్శకుడు అయినా, సినిమా మీద మంచి పట్టు ఉన్నట్టు కనపడుతోంది. దీంతో సెంటిమెంట్ సన్నివేశాలు బాగా వచ్చాయి. విధిని ఎవరూ ఆపలేరు, భగవంతుడు రాసిన గీతని మానవుడు చెరపలేడు అన్న విషయం కూడా. దర్శకుడు బాగా చూపించాడు. అమ్మని బతికిద్దామనుకుంటాడు ఆది. కానీ విధి ముందు తలవంచాల్సిందే ఎవరయినా అని చెప్పాడు దర్శకుడు.

శ‌ర్వానంద్‌, వెన్నెల‌కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి తమ పాత్రల్లో ఒదిగిపోయారు. వీళ్ల బాల్యాన్ని గుర్తు చేసే పాత్రల్లో నటించిన చిన్నారులు కూడా ఆకట్టుకున్నారు. శ‌ర్వానంద్ సెంటిమెంట్ ప్రధానంగా సాగే స‌న్నివేశాల్లో తన‌లో ఎంత గొప్ప న‌టుడు ఉన్నాడో మ‌రోసారి చాటి చెప్పాడు. అమ‌ల త‌న అనుభ‌వాన్నంతా రంగ‌రించి న‌టించారు. చాలా రోజుల త‌ర్వాత ఆమె తెర‌పై ఓ బ‌ల‌మైన పాత్రలో క‌నిపించారు. ఆమె కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా ఇది. శ‌ర్వానంద్‌కి కూడా అంతే. రీతూవ‌ర్మ పాత్ర‌, ఆమె అభిన‌యం కూడా ఆక‌ట్టుకుంటుంది. నాజ‌ర్ త‌న‌కి అల‌వాటైన పాత్రలోనే క‌నిపించారు. సాంకేతికత విష‌యానికొస్తే ప్రతీ విభాగం చ‌క్కటి ప‌నితీరుని క‌న‌బ‌రిచింది. ముఖ్యంగా సంగీతంతో సినిమాకి ప్రాణం పోశారు జేక్స్ బిజోయ్‌. సుజీత్ సారంగ్ కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. ద‌ర్శకుడు శ్రీకార్తిక్‌ క‌థ‌ని తెరపైకి తీసుకొచ్చిన విధానంలోనూ ఓ ప్రత్యేక‌త క‌నిపించింది. నిర్మాణం బాగుంది.


పూరీ జ‌గ‌న్నాథుడిని గ‌ణ‌ప‌తి రూపంలో ఎందుకు పూజిస్తారో తెలుసా?

వైష్ణవ ఆలయాల్లో విష్ణుమూర్తి, ఆయన అవతారాల ఉత్సవ విగ్రహాలను వివిధ వాహనాల మీద ఊరేగించడం ఆచారం. వీటిలో గజవాహన సేవ ఒకటి. అయితే, భారతదేశంలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాల్లో ఒకటైన పూరీలో మాత్రం జగన్నాథుడిని, ఆయన అన్న బలభద్రుడిని ఏకంగా ఏకదంతుడి రూపంలోనే ముస్తాబుచేయడం ఆసక్తికరం. ఈ వేడుకనే ‘హాథీబేష’ (ఏనుగు వేషం) అని పిలుస్తారు.

ఆషాఢ శుద్ధ విదియనాడు మొదలయ్యే ప్రపంచ ప్రసిద్ధ ‘జగన్నాథ రథయాత్ర’కు ముందే, జ్యేష్ఠ పౌర్ణమినాడు ఈ వేడుక జరుగుతుంది. ఇక హాథీబేషకు ముందు జగన్నాథుడు, ఆయన అన్న బలభద్రుడు, సోదరి సుభద్రను అభిషేకించడానికి ‘స్నానయాత్ర’కు తీసుకువెళ్తారు. గణపతి వేషంలో జగన్నాథుడిని అలంకరించడానికి స్వామి గణపతిని మాత్రమే ఆరాధించే గాణాపత్య మార్గ అనుయాయులను అనుగ్రహించడం కోసమే ఓ సందర్భంలో ఏనుగు ముఖంతో దర్శనం ఇచ్చాడని ఒక కథ ప్రచారంలో ఉంది.

ఒకానొక సమయంలో పూరీ రాజు దగ్గరికి గణపతి భట్ట అనే గొప్ప పండితుడు వచ్చాడు. ఆ సమయంలో పూరీలో జగన్నాథుడిని స్నానయాత్ర వేడుకకు సిద్ధం చేస్తున్నారు. ఆ వేడుకకు హాజరవ్వాలని గణపతి భట్టను ఆహ్వానించాడు రాజు. దానికి ఆయన తాను గణపతిని మాత్రమే ఆరాధిస్తానని, వేడుకకు రాలేనని అంటాడు. రాజు బలవంతపెట్టేసరికి, అన్యమనస్కంగానే జగన్నాథుడి స్నానయాత్రకు వెళ్లడానికి గణపతి భట్ట ఒప్పుకొంటాడు. అయితే, అక్కడికి వెళ్లేసరికి అద్భుతం జరుగుతుంది.

జగన్నాథుడి రూపంలో ఉన్న కృష్ణుడు గణపతి భట్టకు గణేశుడి రూపంలో సాక్షాత్కరిస్తాడు. అంతేకాదు, బలభద్రుడు కూడా ఏకదంతుడి రూపంలోనే కనిపిస్తాడు. దాంతో బలభద్ర, జగన్నాథులు సాక్షాత్తూ శివకేశవులనే సంగతి గణపతి భట్ట తెలుసుకుంటాడు. అలా తనకు కండ్లు తెరిపించడానికే వాళ్లిద్దరూ గణపతి రూపాన్ని ధరించారని ఆయనకు అర్థమవుతుంది. అంతేకాదు గణపతి, విష్ణువు, శివుడు, గౌరి ఇలా భేదాలెన్ని ఉన్నా పరమాత్ముడు ఒక్కడే అని కూడా గుర్తిస్తాడు.

అప్పటినుంచి రథయాత్రకు ముందు, జ్యేష్ఠ పౌర్ణమి నాడు జరిపే ‘స్నానయాత్ర’ సమయంలో జగన్నాథ ఆలయ పూజారులు జగన్నాథ, బలభద్రుల ముఖాలకు ఏనుగు తొడుగులు ధరింపజేస్తారు. అలా బలరాముడు తెల్ల ఏనుగు రూపంలో, జగన్నాథుడు (కృష్ణుడు) నల్ల ఏనుగు రూపంలో దర్శనమిచ్చే సందర్భాన్ని పూరీ ఆలయ సంప్రదాయంలో ‘హాథిబేష’ అని పిలుచుకుంటారు. గణపతి వేషంలో దేవుళ్లను దర్శిస్తే మంచి జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే స్నానయాత్ర రోజున జగన్నాథుడి మందిరాన్ని వేలాది మంది భక్తులు దర్శిస్తారు