X

‘విక్రాంత్ రోణ’ మూవీ రివ్యూ


చిత్రం: విక్రాంత్ రోణ‌; న‌టీన‌టులు: కిచ్చా సుదీప్, నిరూప్ భండారి, నీతాఅశోక్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌, ర‌విశంక‌ర్ గౌడ‌, మ‌ధుసూద‌న‌రావు త‌దిత‌రులు; సంగీతం: అజ‌నీష్ లోక‌నాథ్; కూర్పు: ఆశిక్ కుసుగొల్లి; ఛాయాగ్రహ‌ణం: విలియం డేవిడ్‌; క‌ళ‌: శివ‌కుమార్‌; ద‌ర్శక‌త్వం: అనూప్ భండారి; నిర్మాతలు: జాక్ మంజునాథ్‌, అలంకార్ పాండియ‌న్‌; విడుద‌ల తేదీ: 28-07-2022

కేజీయఫ్ తరువాత కన్నడ పరిశ్రమ మీద అందరి దృష్టి పడింది. మళ్లీ పాన్ ఇండియన్ స్థాయిలో కన్నడ సత్తా చాటాలని అక్కడి మేకర్లు, హీరోలు ప్రయత్నిస్తున్నారు. కానీ కేజీయఫ్ మేనియాను బీట్ చేయలేకపోతోన్నాయి. ఇక ఇప్పుడు కిచ్చా సుదీప్ విక్రాంత్ రోణ అంటూ నేడు (జూలై 28) వచ్చాడు. మరి ఈ చిత్రం ఆడియెన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో ఓ సారి చూద్దాం.

కొమ‌ర‌ట్టు అనే ఊరిలో జ‌రిగే క‌థ ఇది. ఆ ఊరిలో ఓ పాడుబ‌డ్డ ఇల్లు. ఆ ఇంట్లో ఓ బ్రహ్మరాక్షసుడు ఉంటున్నాడన్నది ఊరి ప్రజ‌ల న‌మ్మకం. ఆ ఇంటి ఆవ‌ర‌ణ‌లో ఉన్న బావిలో ఒక శ‌వం దొరుకుతుంది. అది ఆ ఊరి ఇన్‌స్పెక్టర్ శ‌వం. దానికి త‌ల ఉండ‌దు. ఈ హ‌త్యకు పాల్పడిన నేర‌స్థుల్ని ప‌ట్టుకోవ‌డం కోసం కొత్తగా వ‌చ్చిన ఇన్‌స్పెక్టర్‌ విక్రాంత్ రోణ (Sudeep) ఇన్వెస్టిగేష‌న్ మొద‌లుపెడ‌తాడు. ఈ క్రమంలో ఆ ఊరిలో అప్పటికే ప‌దుల సంఖ్యలో పిల్లలు హ‌త్యకు గురైన‌ట్లు తెలుసుకుంటాడు. మ‌రి వాళ్ల మ‌ర‌ణాల‌కు.. పోలీస్ హ‌త్యకు ఉన్న లింకేంటి? కొత్తగా ఊరికొచ్చిన సంజు (నిరూప్ భండారి) ఎవ‌రు? ఈ కేసుకు విక్రాంత్ వ్యక్తిగ‌త జీవితానికి ఉన్న లింకేంటి? అస‌లు ఆ ఊరిలో ఉన్న ఆ బ్రహ్మరాక్షసుడు ఎవ‌రు? అన్నది తెర‌పై చూడాల్సిందే.

విక్రాంత్ రోణ పాత్రలో కిచ్చా సుదీప్ మెప్పించాడు. అడ్వెంచర్లు, యాక్షన్ సీక్వెన్స్‌లో కిచ్చా సుదీప్ అందరినీ మెప్పిస్తాడు. సంజుగా నటించిన నిరూప్ భండారి పాత్ర చివరకు ఊహించినట్టే ముగుస్తుంది. ఆ కారెక్టర్‌లో నిరూప్ బాగానే నటించాడు. అపర్ణగా కనిపించిన నీతా అశోక్ పర్వాలేదనిపిస్తుంది. ఫక్రుగా కార్తీక్ రావు అంతో ఇంతో నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక ఇందులో పాత్రలు ఎక్కువగా ఉండటంతో.. అందరికీ సరైన ప్రాధాన్యం కల్పించినట్టు అనిపించదు. కానీ వారంతా కనిపించిన ప్రతీసారి మెప్పించేస్తారు.

ఇదొక యాక్షన్ అడ్వెంచర్‌ ఫాంటసీ థ్రిల్లర్‌. ఈ క‌థ చెప్పడం కోసం ద‌ర్శకుడు సృష్టించుకున్న ఊరు.. దాన్ని అందంగా చూపించిన విధానం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది. ఓ త‌ల్లి త‌న కూతురుతో క‌లిసి కొమ‌ర‌ట్టుకు రావ‌డం.. దారిలో ఊహించ‌ని ప్రమాదం ఎదుర‌వ‌డం.. ఓ ముసుగు రూపం వారిపై దాడిచేయ‌డం.. ఇలా ఉత్కంఠ‌భ‌రితంగా సాగే స‌న్నివేశాల‌తో సినిమా ఆస‌క్తిక‌రంగా ప్రారంభ‌మ‌వుతుంది. అక్కడి నుంచే అస‌లు ఆ ఊరిలో ఏం జ‌రుగుతోందా అని తెలుసుకోవాల‌న్న ఆస‌క్తి ప్రేక్షకుల్లోనూ మొద‌ల‌వుతుంది. కిచ్చా సుదీప్ ప‌రిచ‌య స‌న్నివేశాలు.. ఈ క్రమంలో వ‌చ్చే యాక్షన్ ఎపిసోడ్ చాలా స్టైలిష్‌గా ఉంటాయి. మ‌ధ్యలో సంజు కుటుంబ నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు మ‌రీ మెలోడ్రామాలా సాగుతున్నట్లు అనిపిస్తాయి. విక్రాంత్ ఇన్‌స్పెక్టర్ హ‌త్య కేసు గురించి ఇన్వెస్టిగేష‌న్ మొద‌లు పెట్టాకే కథ‌లో వేగం పెరుగుతుంది.

అయితే, థ్రిల్లర్ క‌థల్లో ర‌హ‌స్యాన్ని ఛేదించే క్రమం ఆస‌క్తిక‌రంగా సాగుతున్నప్పుడే ప్రేక్షకులు క‌థ‌తో క‌నెక్ట్ అవ్వగలుగుతారు. అయితే దీన్ని జాగ్రత్తగా తీర్చిదిద్దుకోవ‌డంలో ద‌ర్శకుడు త‌డ‌బ‌డ్డాడు. దీనికి తోడు సంజు ల‌వ్‌ ట్రాక్‌, జ‌నార్ధన్‌ గంభీర్ (మ‌ధుసూధ‌న్ రావు) స్మగ్లింగ్ ఎపిసోడ్ ప్రేక్షకుల్ని గంద‌ర‌గోళానికి గురిచేస్తాయి. మ‌ధ్య మ‌ధ్యలో వచ్చే కొన్ని భయంకరమైన ఎపిసోడ్‌లు ప్రేక్షకుల్లో ఉత్కంఠ‌త రేకెత్తిస్తాయి. విరామానికి ముందొచ్చే ఎపిసోడ్ థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఇక ద్వితీయార్ధమంతా రొటీన్ రివెంజ్‌ డ్రామాలా సాగుతుంది. హ‌త్యల‌కు పాల్పడుతున్న నేర‌స్థుడి ప్లాష్‌బ్యాక్‌లో బ‌ల‌మైన సంఘ‌ర్షణ క‌నిపించదు. ప‌తాక స‌న్నివేశాల్లో క‌నిపించే విజువ‌ల్స్.. సుదీప్ గ‌తానికి సంబంధించిన స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. అయితే, సినిమాని ముగించిన తీరు అంత‌గా మెప్పించ‌దు.

Telugu BOX Office:
Related Post