X

లోక్‌సభలో అడుగుపెట్టిన తొలి సినీనటుడు ఈయనే!

రాజ‌కీయాల్లో సినిమా వాళ్లు చ‌క్రం తిప్పడం స‌ర్వసాధార‌ణం. టాలీవుడ్ అయినా కోలీవుడ్ అయినా మేక‌ప్ వేసుకుని సినిమాలో రాణించిన‌వారు ఆ త‌ర‌వాత రాజీకీయాల్లో చ‌క్రం తిప్పారు. తమిళంలో ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి, తెలుగులో ఎన్టీఆర్.. ఇలా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకోవడంతో పాటు రాజకీయ నాయకులుగానూ రాణించారు. తెలుగు నాట పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ అతి త‌క్కువ కాలంలోనే సీఎం స్థాయికి ఎదిగారు. కానీ ఎన్టీఆర్ కంటే మందే ఓ తెలుగు న‌టుడు పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చి రాజ‌కీయాల్లో రాణించార‌న్న విష‌యం అతికొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆయ‌న ఎవ‌రో కాదు కొంగ‌ర జ‌గ్గయ్య. దేశంలో సినిమా రంగం నుండి వ‌చ్చి జాతీయ‌ రాజ‌కీయాల్లో స‌త్తా చాటిన తొలిన‌టుడు కూడా ఆయ‌నే. సినీ రంగం నుంచి వచ్చి లోక్‌సభకు ఎన్నికైన తొలినటుడిగా రికార్డు నెలకొల్పారు. కొంగ‌ర జ‌గ్గయ్య ఎన్టీఆర్‌కు సన్నిహితుడు కావ‌డం విశేషం.

కొంగర జగ్గయ్య గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ గ్రామంలో ధ‌న‌వంతుల కుటుంబంలో జ‌న్మించారు. గుంటూరులోని ఆంధ్రా క్రిస్టియ‌న్ కాలేజీలో చ‌దువుకున్నాడు. అదే కాలేజీలో ఎన్టీఆర్ కూడా విద్య అభ్యసించారు. అక్కడే వీరిద్దరి మ‌ధ్య ప‌రిచయం ఏర్పడింది. ఎన్టీఆర్‌తో క‌లిసి అనేక నాట‌కాలు వేశారు. విద్యార్థిగా ఉన్నప్పుడే జ‌గ్గయ్య రాజ‌కీయాల్లో చురుకుగా ఉండేవారు. అనంతరం ఆయన ప్రయాణం సినిమాల వైపు మళ్లింది. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన త‌ర‌వాత జ‌గ్గయ్య వ‌రుస‌గా మూడు సంవత్సరాల పాటు ఉత్తమ నటుడు పుర‌స్కారాన్ని అందుకున్నారు. జ‌య‌ప్రకాష్ స్థాపించిన ప్రజా సోష‌లిస్ట్ పార్టీతో జ‌గ్గయ్య రాజ‌కీయ ప్రస్థానం మొద‌లైంది. అనంతరం 1956లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1967లో ఒంగోలు నుండి పోటీ చేసి గెలుపొందారు. అప్పట్లోనే ఆయ‌న‌కు 80వేల మెజారిటీ రావ‌డం విశేషం. ఎంపీగా గెలిచిన త‌ర‌వాత ప్రజ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజల మనసుల్లో నటుడిగానే కాకుండా మంచి ప్రజానాయకుడిగా నిలిచిపోయారు.

Telugu BOX Office:
Related Post