25న సూర్య గ్రహణం… ఏం చేయాలి?.. ఏం చేయకూడదు

25న సూర్య గ్రహణం… ఏం చేయాలి?.. ఏం చేయకూడదు

గ్రహణ సమయం: అక్టోబర్ 25వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 28 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల 32 నిమిషాల వరకు..

గ్రహణం అనేదానికి వేదాలకు ముఖ్యమైన ఆరు అంగాల్లో ఒకటైన జ్యోతిషం ప్రకారం సూర్య గ్రహాన్ని, చంద్రగ్రహాన్ని ఛాయాగ్రహాలైన రాహుకేతువులు పీడించడంగా చెప్పవచ్చు. గ్రహణానికి ముఖ్యమైనవి సమయాలు స్పర్శకాలం, మధ్య కాలం, మోక్షకాలం అంటారు. వీటిని అన్నింటినీ కలిపి ఆద్యంత పుణ్యకాలం అంటారు.

ఉదాహరణకు కేతువు ద్వారా రాబోతున్న ఆశ్వయుజ సూర్యగ్రహణం స్పర్శకాలం 25వ తేదీన సాయంత్రం గం 5.04నిమిషాలు. మధ్యకాలం సాయంకాలం 5.39. ఇక గ్రహణం విడిచేది మోక్షకాలం సాయంత్రం 6.28. అయితే ఈ గ్రహణంలో మోక్షం సూర్యాస్తమయం తర్వాత కలిగింది. భారత భూభాగంపై సూర్యుడు అస్తమించిన తరువాత గ్రహణం విడిచిపెడుతుంది గనుక దీన్ని కేత్ర గ్రస్తాస్తమయ గ్రహణంగా చెబుతారు. ఇది చాలా అరుదైన గ్రహణం. అక్టోబర్ 25వ తేదీని సూర్యాస్తమయం 5.36నకే జరుగుతుంది. కనుక దీన్ని గ్రహణం మిగిలి ఉన్న అస్తమయంగా చెబుతారు. దీని వలన మరునాడు సూర్య దర్శనం అయ్యేంత వరకూ గ్రహణదోషం వీడదు. ఈ కారణాల వలన గ్రహణకాల విధులు మారిపోతాయి.

చంద్రగ్రహణం నాడు మరో విచిత్రం జరుగుతోంది. ఈ ఏడాది చంద్రగ్రహణం నవంబర్ 8వ తేదీన కార్తీక పౌర్ణమి రోజున రానుంది. రాహు గ్రస్త చంద్ర గ్రహణం స్పర్శకాలం మధ్యాహ్నం 2.39 కాగా మధ్యకాలం సాయంత్రం 4.29 మోక్షకాలం సాయంత్రం 6.18 అవుతోంది. అంటే చంద్రగ్రహణంతోటే చంద్రోదయం కాబోతోంది కనుక దీన్ని రాహుగ్రస్తోదయ చంద్రగ్రహణంగా చెబుతారు. దీని వలన కూడా గ్రహణ విధులు మారిపోతాయి. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో గ్రహణ సమయంలో ఎలా విధులు నిర్వర్తించాలో అంతా తెలుసుకోవాలి.

ముందుగా ఈ గ్రహణ సమయంలో స్వాతీ నక్షత్రం వారు సూర్యగ్రహణం, భరణీ నక్షత్రం వారు చంద్రగ్రహణం చూడరాదు. తులారాశి వారు సూర్యగ్రహణం నాడు శాంతి చేయించుకోవాలి. మేషరాశి వారు చంద్రగ్రహణం నాడు శాంతి చేయించుకోవాలి.

గ్రహణం సమయం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి?

గ్రహణ కాలం చాలా ఉత్తమమైన సమయం. చాలా అరుదైన సమయం. చాలా యోగదాయకమైన సమయం. ఈ సమయంలో చేసే సాధనలు కోటిరెట్లు ఉత్తమ ఫలాలను ఇస్తాయి. జపాలు కోటి రెట్లు అవుతాయి. దానాలు లక్షల రెట్లు అవుతాయి. అంటే ప్రతీ రూపాయి లక్షరూపాయల దానంతో సమానం అవుతుంది. ధ్యానం, నిధిధ్యాసం, సమాధి, ప్రాణాయామాది సాధనలకు అనుకూలం. అందువల్ల అనవసరమైన సంభాషణలు చేయరాదు. వృథా పనుల్లో ఉండరాదు. ఇంద్రియ లోలత్వం కూడదు. నోటికీ నాలుకకూ విశ్రాంతి ఇవ్వాలి. అంటే మౌనం, నిరాహారం పాటించాలి. ఏదో ఒక నామాన్ని స్మరిస్తూ ఉండాలి. వృథాగా బయట తిరగడం సూర్య చంద్ర కిరణాలు పొందడం చేయరాదు. సూర్యచంద్రాదులను చూడడానికి ప్రయత్నించరాదు. గ్రహణ సమయంలో గాయత్రీ మంత్రం జపిస్తే మంచి ఫలితాలు వస్తాయి.

పితృ తర్పణాలు

గ్రహణాలు షణ్ణవతుల్లో భాగం. అంటే పితృదేవతార్చనలు చేయవలసిన తప్పనిసరి రోజుల జాబితా లోనిది. ఈ రోజున పెద్దల పేరిట దానాలు చేసినా తర్పణాలు విడిచినా పెద్దలు అపారంగా సంతోషించి మనసులోని కోరికలు అన్నీ తీరుస్తారు. ఆత్మహత్యలు చేసుకున్నవారు కూడా సంతృప్తి చెందుతారు. నిజానికి పితృశాపాలు, దోషాల నుంచీ విడుదల పొందడానికి జాక్ పాట్ వంటివి. జన్మదోషాలు జాతక దోషాలు కూడా ఈ సమయంలో పితృ దేవతార్చనల వలన పోతాయి. దానాలు, తర్పణాదులు చేయలేని వారు కనీసం గోసేవ చేసుకున్నా సమస్త దేవతలూ సంతోషిస్తారు. అన్ని కోరికలూ తీరుస్తారు.

గ్రహణ కాలంలో నీరు కూడా త్రాగకూడదు. గ్రహణ స్పర్శకాలానికి ముందే సంధ్యావందనాదులు ప్రారంభించి గాయత్రీ ధ్యానాదులు, అంగన్యాస కరన్యాసాదులు చేసేసుకొని జపం మొదలు మొదలు పెట్టాలి. గ్రహణ స్పర్శకాలంలోకి జపం చేస్తూ ప్రవేశించాలి. గ్రహణ మోక్షకాలం వరకూ జపం చేస్తూనే ఉండాలి. గ్రహణ మోక్ష స్నానం చేసిన తరువాత కాఫీ టీలు సేవించాలి.

గ్రహణ సమయంలో స్త్రీలు స్తోత్రాదులు మాత్రమే చదువుకోవాలి. వారికి జపతపాదులు చెప్పలేదు. అయితే నేడు అనేక మంది స్త్రీలకు కూడా మంత్రోపదేశాలు చేస్తున్నారు. కనుక మంత్రోపదేశం పొందిన వారు కూడా జపాలు చేసుకోవాలి. అయితే స్త్రీలు శివ సహస్రనామం, లలితా సహస్రనామం, లలితా సప్తశతి వంటివి గీతవంటివి చదువుకోవచ్చు. లేదా నామస్మరణను చేసుకోవచ్చు. అంటే బీజాక్షరాలు మంత్రాక్షరాలు లేకుండా కేవలం నామసాధన చేయవచ్చు. లేదా పురాణ గ్రంథాలు చదువుకోవచ్చు. గర్భిణీలు, రజస్వలలు ఏమీ చేయకుండా క్రీయాశూన్యంగా పడుకోవాలి.

గ్రహణం సమయంలో ఇంట్లో దీపం వెలిగించవచ్చా?

గ్రహణ సమయానికి ముందు, తరువాత జ్యోతి ప్రజ్వలనాలు చేయవచ్చు. కార్తీక మాసం వస్తోంది కనుక స్పర్శా కాలానికి పూర్వమే దీపప్రజ్వలన చేయాలి. మోక్షం తరువాత మరలా జ్యోతి ప్రజ్వలనం చేయవచ్చు.

గ్రహణం ఉండగానే సూర్యాస్తమయం అవుతుంది కనుక మరునాడు సూర్యుడిని చూసేంత వరకూ అశౌచం ఉంటుంది. అంటే మరునాడు సూర్యోదయం తర్వాతనే మడినీళ్ళు పట్టుకొని వండుకొని తినాలి. అప్పటి వరకూ ఏమీ తిన కూడదూ త్రాగరాదు. అలాగే చంద్రగ్రహణం గ్రస్తోదయం అవుతుంది. అంటే చంద్రోదయానికి పూర్వమే గ్రహణం ప్రారభమవుతుంది. అంటే చంద్రోదయానికి చంద్రుడు గ్రహణంలో ఉంటాడు. కనుక ఆరోజు పగలు భోజనాదులు చేయరాదు. సాయంత్రం చంద్రగ్రహణ మోక్షం తరువాతనే మడినీళ్ళు పట్టుకొని అశౌచ శుద్ధి చేసుకొని వండుకొని తినాలి.

అయితే ఈ నియమాలు అందరికీ వర్తించవు. ముఖ్యంగా పిల్లలకు బాలబాలికలకూ, గర్భవతులకు, దీర్ఘకాల ప్రాణాంతక వ్యాథులు ఉన్నవారికి, బీపీ, షుగర్ వంటి వ్యాధులున్నవారికి, వృద్ధులకూ, బాలింతలకు మినహాయింపులు ఉన్నాయి. వీరు పాటించాల్సిన అవసరం లేదు. అయితే గర్భవతులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. పాలుతాగే పిల్లలలకు మినహాయింపు ఉంది. తల్లిపాలకు దోషం లేదు. ఆకలికి ఆగలేని వారు దుంపలు, సగ్గుబియ్యంతో చేసినవి, అటుకులతో చేసిన పదార్థాలు పళ్ళు పాలు వంటివి తీసుకోవాలి. గృహస్థులకు శుష్కోపవాసాలు చెప్పలేదు. కనుక ఫలహారాలు సేవించవచ్చు.


అమావాస్య నాడు హనుమంతుని ప్రార్థన అమోఘం

అమావాస్య నాడు హనుమంతుని ప్రార్థన అమోఘం అంటున్నారు పండితులు. ప్రతి మాసంలో వచ్చే అమావాస్య రోజున హనుమంతునిని ప్రార్థిస్తే.. సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయుడిని సింధూరంతో అర్చించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. ప్రతి మాసంలో వచ్చే అమావాస్య రోజున నిష్టతో ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించుకోవడం ద్వారా అనుకున్న కార్యాలను దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం. అందుచేత అమావాస్య సాయంత్రం పూట మహిళలు, పురుషులు ఆంజనేయ స్వామికి నేతితో దీపమెలిగించి.. హనుమంతుడి ఆలయాన్ని 18 సార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా మనోధైర్యం, సకలసంపదలు, ఉన్నత పదవులు లభిస్తాయని పండితులు అంటున్నారు.

“అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిమ్ వదః
రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో “


అనే మంత్రాన్ని 9 సార్లు పఠించి.. కర్పూర హారతులు సమర్పించుకున్న వారికి ఈతిబాధలు, గ్రహదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పురోహితులు చెబుతున్నారు.

ఆపదుద్ధారక శ్రీ హనుమత్ స్తోత్రం..
ఆపన్నాఖిలలోకార్తిహారిణే శ్రీహనూమతే ।
అకస్మాదాగతోత్పాతనాశనాయ నమోస్తు తే ॥ ౧॥
సీతావియుక్తశ్రీరామశోకదుఃఖభయాపహ ।
తాపత్రయస్య సంహారిన్నాఞ్జనేయ నమోస్తు తే ॥ ౨॥
ఆధివ్యాధిమహామారిగ్రహపీడాపహారిణే ।
ప్రాణాపహన్త్రే దైత్యానాం రామప్రాణాత్మనే నమః ॥ ౩॥
సంసారసాగరావర్తాగతసమ్భ్రాన్తచేతసామ్ ।
శరణాగతమర్త్యానాం శరణ్యాయ నమోస్తు తే ॥ ౪॥
రాజద్వారే బిలద్వారే ప్రవేశే భూతసఙ్కులే ।
గజసింహమహావ్యాఘ్రచోరభీషణకాననే ॥ ౫॥
మహాభయేఽగ్నిసంస్థానే శత్రుసఙ్గసమాశ్రితే ।
శరణాగతమర్త్యానాం శరణ్యాయ నమో నమః ॥ ౬॥
ప్రదోషే వా ప్రభాతే వా యే స్మరన్త్యఞ్జనాసుతమ్ ।
అర్థసిద్ధియశఃకామాన్ ప్రాప్నువన్తి న సంశయః ॥ ౭॥
కారాగృహే ప్రయాణే చ సఙ్గ్రామే దేశవిప్లవే ।
యే స్మరన్తి హనూమన్తం తేషాం నాస్తి విపత్తయః ॥ ౮॥
వజ్రదేహాయ కాలాగ్నిరుద్రాయామితతేజసే ।
నమః ప్లవగసైన్యానాం ప్రాణభూతాత్మనే నమః ॥ ౯॥
దుష్టదైత్యమహాదర్పదలనాయ మహాత్మనే ।
బ్రహ్మాస్త్రస్తమ్భనాయాస్మై నమః శ్రీరుద్రమూర్తయే ॥ ౧౦॥
జప్త్వా స్తోత్రమిదం పుణ్యం వసువారం పఠేన్నరః ।
రాజస్థానే సభాస్థానే వాదే ప్రాప్తే జపేద్ధ్రువమ్ ॥ ౧౧॥
విభీషణకృతం స్తోత్రం యః పఠేత్ ప్రయతో నరః ।
సర్వాపద్భ్యో విముచ్యేత నాత్ర కార్యా విచారణా ॥ ౧౨॥


మంత్రం


మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక |
శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయ భో హరే ||
ఇతి శ్రీ విభీషణ కృతం సర్వాపదుద్ధాకర శ్రీ హనూమత్ స్తోత్రం ||