ఎన్నో విశేషతల పుణ్యక్షేత్రం.. ద్వారకా తిరుమల(చిన్న తిరుపతి)

ఎన్నో విశేషతల పుణ్యక్షేత్రం.. ద్వారకా తిరుమల(చిన్న తిరుపతి)

ద్వారకా తిరుమల ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా(గతంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా)కు చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇది విజయవాడకు 98 కిలోమీటర్లు, రాజమహేంద్రవరానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. భారత దేశంలోని అతిపురాతన పుణ్యక్షేత్రాల్లో ద్వారకా తిరుమల ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రంలో శేషాద్రి కొండ మీద కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. స్వయంభూవుగా వెలిసిన వెంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుండి వెలికి తీసిన ద్వారకా అనే ముని పేరు మీద ఈ ప్రదేశమునకు ద్వారకా తిరుమల అన్న పేరు వచ్చిందని స్థల పురాణం. ఈ ఆలయంలో అనేక విశేషతలున్నాయి.

మాములు ప్రతి ఆలయంలోని గర్భగుడిలో మూల విరాట్( దేవుని విగ్రహం ) ఒక్కటే ఉంటుంది. కానీ ఇక్కడ గర్భాలయంలో రెండు మూల విరాట్‌లు ఉండి నిత్యం పూజలు అందుకోవడంతో పాటు ప్రతి సంవత్సరం రెండు సార్లు బ్రహ్మోత్సవాలు జరగడం ద్వారకా తిరుమల ప్రత్యేకతగా చెప్పుకొవచ్చు. ద్వారకా మహర్షి ఘోర తపస్సు చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రసన్నం చేసుకోగా… అయన తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమైన స్వామి వారు ఏ వరం కావాలి అని అడగగా ద్వారకా మహర్షి స్వామి నీ పాద సేవ చాలు అని కోరారట. దీంతో ఆ మహర్షి కోరిక మేరకు స్వామివారు అక్కడ స్వయంభుగా వెలిశారు. అయితే ద్వారకా మహర్షి చాలాకాలం తపస్సు చేసిన కారణంగా ఆయన చుట్టూ పుట్ట ఏర్పడటంతో స్వామివారి పాదాలు పుట్టలో ఉండిపోయి ఉదరం నుండి పైభాగం మాత్రమే దర్శనం ఇచ్చేవారట. దాంతో ఆలయానికి వచ్చే భక్తులు అసంతృప్తిగా వెనుదిరిగేవారట. దీంతో స్వామీ నీకు పాదపూజ చేయడం కుదరడం లేదు.. దీనికి పరిష్కారం చెప్పమని ఋషులు వేడుకోగా.. తిరుమలలో ప్రత్యేక పూజలు చేసిన విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించాలని సూచించారట. దీంతో అక్కడి నుంచి తీసుకొచ్చిన విగ్రహాన్ని స్వయంభూ వెలిసిన స్వామి వారి విగ్రహం వెనుక భాగంలో పాద సేవ కోసం ప్రతిష్టించారు. అలా ద్వారకా తిరుమల గర్భాలయంలో రెండు ధృవ మూర్తులుగా స్వామి వారు మనకు దర్శనమిస్తారు.

ద్వారకా మహర్షి తపస్సు వలన ఆవిర్భవించిన విగ్రహం ఒకటి కాగా తిరుమల నుండి తెచ్చిన విగ్రహం మరొకటి ఉండటం వలన రెండు పేర్లతో ఈ క్షేత్రం ద్వారకా తిరుమలగా ప్రసిద్ధి చెందింది. రెండు మూల విరాట్ లు ఉండటం వలన ఇక్కడ రెండు సార్లు బ్రహ్మోత్సవాలు చేస్తారు. మాములుగా దేవాలయాల్లో విగ్రహాలు తూర్పు లేదా పశ్చిమ ముఖంగా ఉంటాయి. కానీ ద్వారకా తిరుమలలో స్వామి వారు దక్షిణ ముఖంగా ఉంటారు. అలా ఎందుకు అంటే ద్వారకా మహర్షి ఉత్తర దిక్కుగా ఉండి తపస్సు చేయడం వలన ఆయనకు ఎదురుగా స్వామి వారు ప్రత్యక్షం అయ్యారు. దీంతో స్వామి వారు దక్షిణ ముఖంగా దర్శనమిస్తారు. మాములుగా ప్రతి దేవాలయంలో విగ్రహానికి అభిషేకం చేస్తారు. కానీ ఇక్కడ ఎప్పుడు స్వామి వారికీ అభిషేకం చేయరు. స్వామి వారి విగ్రహం కింద ద్వారకా మహర్షి తపస్సు చేసిన పుట్ట ఇప్పటికి ఉందట. అందుకే మూలవిరాట్‌కు అభిషేకం చేయరు. అనుకోకుండా అక్కడ చిన్న నీటి చుక్క పడినా ఎర్ర చీమలు విపరీతంగా బయటకు వచ్చేస్తాయట. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ద్వారకా తిరుమలను మీరూ ఓ సారి సందర్శించండి.