నవగ్రహ దోష నివారణ: ఎలాంటి పూజలు, హోమాలు చేయాలంటే..

నవగ్రహ దోష నివారణ: ఎలాంటి పూజలు, హోమాలు చేయాలంటే..

“పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరూపేణ పీడ్యతే
తచ్చాంతిఃఔషధైఃదానైఃజపహోమ క్రియాదిభిః”

అంటూ శారీరక, మానసిక లోపాలకు శాంతిగా ఔషధులు, దానాలు, జపాలు, హోమాలు చేయడం భారతీయ సంప్రదాయంగా ఉంది. వానిలో ముఖ్యమైనవి హోమ ప్రక్రియ జ్యోతిర్వైద్యంగా వినియోగ పడుతుంది. హోమంలో నవగ్రహ సమిధలు ఉపయోగించటంవలన ఒక్కో సమిధ వలన ఒక్కో రోగం నివారించబడుతుంది. హోమ పొగ కంటిలోకి పోవడం వలన కంటిలో ఉండే నలత కంటిలో నుండి నీరు రూపంలో వెళ్లిపోతుంది. హోమాగ్ని సెగ మోకాళ్ళకు తాకటం వలన మోకాళ్ళ నొప్పులు రాకుండా నివారించుకోవచ్చు. గ్రహాలకు వేర్వేరు వృక్షాల సమిధలతో హోమం చేస్తే పరిశుద్ధమైన ఆరోగ్యవంతులవుతారు.

రవి
తెల్లజిల్లేడు వాత, కఫ వ్యాదులను తగ్గిస్తుంది. తెల్లజిల్లేడు సమిధలతో ఇంట్లో హోమం చేస్తే వాస్తుదోషాలు నివారణ అవుతాయి. కళ్ళకి సంబంధించిన అనారోగ్యాలు నయమవుతాయి. కోప స్వభావాలు తగ్గుతాయి. తలనొప్పి భాధలు ఉండవు. ఆయుర్వేదం ప్రకారం అర్కలో కుష్టు వ్యాధిని నయం చేసే శక్తి వుంది.

చంద్రుడు
మోదుగ సమిధలతో హోమం చేస్తే మానసిక సమస్యలు ఉండవు. ఆలోచనా విధానంలో మార్పులు వస్తాయి. సుఖవ్యాధులు దరిచేరవు. మోదుగాకును మెత్తగా నూరి పాలతో తాగిన స్త్రీలకు రుతు సంబంధ సమస్యలు, గర్భ సంబంధ సమస్యలు ఉండవు. మోదుగ పువ్వులు, గింజలు ఎండబెట్టి నీటిలో ఒక పావు చెంచా వేసి కాగబెట్టుకొని తాగితే లావుగా ఉన్నవారు సన్నగా అవుతారు. వైద్యపరంగా చూస్తే జీర్ణ వ్యవస్థను అద్భుతంగా పునరుజ్జీవింప చేసే శక్తి మోదుగకు ఉంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది.

కుజుడు
చండ్ర సమిధతో హోమం చేస్తే ఎర్రరక్త కణాల ఇబ్బందులు, ఎముకల బలహీనత ఇబ్బందులను అరికడుతుంది. పచ్చి పోక చెక్కలు కషాయం పెట్టి సేవిస్తే మధుమేహం, కోప స్వభావాలు తగ్గుతాయి.

బుధుడు
ఉత్తరేణి సమిధను హోమంలో ఉపయోగిస్తే చర్మవ్యాధులు తగ్గుతాయి. జీర్ణ సంబంధ సమస్యలు ఉండవు. ఉత్తరేణి పూలతో గాని, వేరుతోగాని రోజూ దంతధావనం చేసుకుంటే దంతదోషాలు తొలగిపోతాయి. ఉత్తరేణి ఆకులు, గింజలు పొగ వేసి పీలిస్తే దీర్ఘ కాలంగా ఉన్న దగ్గు, జలుబు, ఆయాసం తగ్గుతాయి.

గురువు
రావి సమిధలతో హోమం చేస్తే సంతాన దోషాలు తొలగిపోతాయి. రావి చెక్క కాషాయాన్ని తేనెలో కలిపి తీసుకుంటే వాటా రక్త దోషాలు తగ్గుతాయి. నోటి పూత పోతుంది. రావి చెక్క కషాయాన్ని నిత్యం తీసుకుంటే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. కాలేయ సమస్యలు ఉండవు. వివిధ కఫ దోషాలను రూపుమాపుతుందని ఆయుర్వేదంలో ఉంది.

శుక్రుడు
మేడి చెట్టు సమిదలతో హోమం చేస్తే వివాహ సమస్యలు, వైవాహిక సంబంధ సమస్యలు ఉండవు. గురు దత్తాత్రేయుల వారికి అత్యంత ప్రీతికరమైన వృక్షం ఔదుంబర వృక్షం (మేడి చెట్టు). దత్తాత్రేయుల వారు ఎల్లప్పుడు సుక్ష్మ రూపంలో సుప్రతిష్టితులై ఈ వృక్ష మూలమునందు ఉంటారు. దీని కాయలు, చెట్టు మొదలు నుండి తీసిన రసం వాడితే మధుమేహ వ్యాధి నివారించబడుతుంది. దీని విత్తనాలు పొడి చేసి, తేనెతో కలిపి తీసుకున్నా మధుమేహం దరిదాపుల్లో కనిపించకుండా పోతుంది.

శని
జమ్మి సమిధలతో హోమం చేస్తే అప మృత్యుభయం తొలగిపోతుంది. దీర్ఘకాల అనారోగ్యాలు తొలగిపోతాయి. శమీ వృక్ష గాలి శరీరానికి తగిలిన శారీరక ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రతి రోజు శమీ వృక్షానికి ప్రదక్షిణ చేసిన దీర్ఘకాల అనారోగ్యాలు తొలగిపోతాయి.

రాహువు
గరికలతో హోమం చేస్తే ఇంటిలో నర దృష్టి తొలగిపోయి సర్ప సంబంధ దోషాలు తొలగిపోతాయి. గరిక రసాన్ని గజ్జి, కురుపులపై రాస్తే నివారించబడతాయి. దెబ్బ తగిలి రక్తం కారిపోతుంటే గరిక రసాన్ని పిండితే రక్తం ఆగి పోతుంది.

కేతువు
దర్భాలతో హోమంచేస్తే కాలసర్పదోషాలు తొలగిపోతాయి. మూర్ఛ రోగాలను తగ్గిస్తుంది.

జాతకంలో ఏదైనా సమస్యలు ఉంటే శాంతి ప్రక్రియలో భాగంగా హోమం చేసుకోవాలి. తరచుగా హోమాలను చేసినట్లయితే ఏ రకమైన ప్రమాదాలు, ఇబ్బందులు ఎదురుకావు. హోమం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ప్రత్యక్షంగా మన ఆరోగ్యానికి పరోక్షంగా నవగ్రహాలపై ప్రభావం చూపుతుంది.