‘అవతార్‌-2’… తెలుగు రైట్స్‌కి కళ్లుచెదిరే ధర

‘అవతార్‌-2’… తెలుగు రైట్స్‌కి కళ్లుచెదిరే ధర

‘అవతార్‌’ సినిమాతో ప్రేక్షకుల్ని ఓ కొత్త లోకంలోకి తీసుకెళ్లారు జేమ్స్‌ కామెరూన్‌. 2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రభంజనం సృష్టించింది. ప్రాంతాలతో సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడు మరోసారి ఆ మ్యాజిక్‌నే క్రియేట్‌ చేసేందుకు అవతార్‌2 (ది వే ఆఫ్‌ వాటర్‌)తో సిద్ధమయ్యారు మేకర్స్‌. ప్రపంచ సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్న ఈ హాలీవుడ్‌ చిత్రం 160 భాషల్లో ఈ ఏడాది డిసెంబర్‌ 16న విడుదలకు సిద్ధమైంది.

భారీ బడ్జెట్‌తో హై ఎండ్‌ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ సినిమా బిజినెస్‌ విషయంలో రికార్డు సృష్టిస్తోందని సమాచారం. ఈ సినిమాను కొనుగోలు చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆసక్తిగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు విపరీతమైన హైప్‌ నెలకొంది. అందుకే ఈ సినిమా థియేట్రికల్‌ రైట్స్‌ తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్లకు పైగా ధర పలుకుతున్నట్లు టాక్‌. పలువురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి ఈ సినిమాను కొనే ఆలోచనలో ఉన్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వార్త గత కొన్ని రోజులుగా నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. మరి విడుదలకు ముందే ఇన్ని వండర్స్‌ క్రియేట్‌ చేస్తున్న ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి చరిత్ర సృష్టిస్తుందో వేచి చూడాలి. అయితే ఇన్నాళ్లుగా అవతార్ సీక్వెల్‌ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులు టిక్కెట్ ధర ఎంత పెట్టయినా చూసేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో ఎన్ని కోట్లకు సినిమా కొన్నా వారం రోజుల్లోనే రికవరీ కావడం ఖాయం.


మళ్లీ వస్తున్న ‘అవతార్’… మూడు నెలల ముందే పండగ

అవతార్.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గురించి తెలియని ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. 2009లో జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రం ఈ విజువల్ వండర్‌గా వచ్చి సృష్టించిన రికార్డులు అన్నీఇన్నీ కావు. ఈ సినిమా కోసం పత్యేకంగా ఓ గ్రహాన్నే సృష్టించాడు కామెరూన్. దాంతో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ ఈ సినిమాకి అభిమానులుగా మారిపోయి వేల కోట్లను కట్టబెట్టారు. అంతేకాకుండా.. అప్పట్లో వివిధ విభాగాల్లో ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. అలాగే.. ఈ సినిమాకి పలు సీక్వెల్స్ ఉంటాయనే అప్పట్లోనే కామెరూన్ ప్రకటించాడు. దీంతో అప్పటి నుంచే ఈ మూవీ సీక్వెల్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఈ తరుణంలో అవతార్ సీక్వెల్ అయిన.. ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్(Avatar The Way Of Water)’ చిత్రాన్ని గ్రాండ్‌గా డిసెంబర్ 16, 2022న విడుదల చేసేందుకు మూవీ టీం సిద్ధమవుతోంది. ఇటీవలే విడుదలైన ఈ మూవీ టీజర్ మంచి రెస్సాన్స్‌ని అందుకుంది. ఈ సినిమా మొదటి పార్ట్ కంటే గ్రాండియర్‌గా ఉంటుందనే భావనని ప్రేక్షకుడి మదిలో కలిగించింది. దీంతో అవతార్ 2పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ తరుణంలో అవతార్‌ 1ని మళ్లీ విడుదల చేయనున్నట్లు మూవీ టీం ప్రకటించింది. అది కూడా అవతార్ 2 విడుదలకి దాదాపు మూడు నెలల ముందు అంటే సెప్టెంబర్ 23 విడుదల చేసేందుకు సిద్ధమైంది. అది కూడా లిమిటెడ్ థియేటర్స్‌లో మాత్రమే. దీనికి సంబంధించిన కొత్త ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఈ పోస్ట్‌పై పలువురు స్పందిస్తూ.. పెద్ద స్ర్కీన్‌లో చూడడం మిస్ అయినా ఎంతోమంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోడానికి ఎదురుచూస్తున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు.