సంతానాన్ని ప్రసాదించే వెంకన్న.. పాలకొండ్రాయుడు

సంతానాన్ని ప్రసాదించే వెంకన్న.. పాలకొండ్రాయుడు

కలియుగ దైవమైన వేంకటేశ్వరుడు… భూమిపైన తొలిసారి అడుగుపెట్టి స్థిర నివాసం ఏర్పరుచుకున్న ప్రాంతమే పాలకొండ్రాయుడి క్షేత్రం. పిల్లల్ని ప్రసాదించే సంతాన ప్రభువుగా పూజలు అందుకుంటున్న ఈ స్వామి ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల క్రితం వెలిశాడని చెబుతారు. వేంకటేశ్వరస్వామే పాలకొండ్రాయుడిగా ఇక్కడ వెలిశాడని అంటారు. కడప నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో కొలువైన స్వామిని చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లు… తమ ఇంటి ఇలవేల్పుగా భావిస్తారు.

స్థల పురాణం
ఓసారి భృగు మహర్షి త్రిమూర్తులను దర్శించుకోవాలనుకున్నాడు. మొదట బ్రహ్మ-సరస్వతి దగ్గరకు వెళ్తే ఆ ఇద్దరూ మహర్షిని పట్టించుకోలేదు. ఆ తరువాత కైలాసానికి వెళ్లినా అదే అవమానం ఎదురుకావడంతో ఆగ్రహానికి గురైన భృగు చివరకు వైకుంఠానికి చేరుకున్నాడు. అక్కడా విష్ణుమూర్తి లక్ష్మీదేవి సేవలను అందుకుంటూ శేషతల్పంపైన విశ్రాంతి తీసుకుంటున్నాడట. ఎన్నిసార్లు పిలిచినా స్వామి స్పందించకపోవడంతో కోపోద్రిక్తుడైన భృగు మహర్షి మహావిష్ణువు వక్షస్థలంపైన తన్నాడు. దాంతో నారాయణుడు భృగుని శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తూనే ఆ రుషి పాదాలను నొక్కడం ప్రారంభించాడట. ఆ రుషి అరిపాదంలో మూడో కన్ను ఉండటం వల్లే భృగుకి అహంకారం ఎక్కువని అంటారు. అందుకే అతని అరి పాదంలోని మూడోకంటిని చిదిమేశాడు. దాంతో భృగులోని అహంకారం పూర్తిగా తొలగిపోవడంతో విష్ణుమూర్తిని క్షమాభిక్ష అర్థించి, తాను నిత్యం స్వామి సేవలో తరించేందుకు వీలుగా నదిలా మార్చమని కోరి వెళ్లిపోయాడట.

ఆ తరువాత లక్ష్మీదేవి… తాను నివసించే వక్షస్థలంపైన ఓ మహర్షి తన్నడాన్ని సహించలేక వైకుంఠాన్ని వదిలి వెళ్లిపోయింది. దాంతో శ్రీహరి దేవిని వెతుక్కుంటూ భూలోకం బయలుదేరాడు. అలా స్వామి మొదటిసారి ఈ ప్రాంతంలో పాదం మోపి శిలగా మారాడని కథనం. తన దేవేరిని వెతుకుతూ అడవులన్నీ తిరిగిన స్వామి ఓ లోయలో పడిపోవడంతో మహావిష్ణువు కోసం బ్రహ్మ, శివుడు ఆవు-దూడ రూపాల్లో వచ్చి స్వామికి పాలు అందించి ఆకలి తీర్చారనీ… అందుకే ఈ ప్రాంతానికి పాలకొండలు అనే పేరు వచ్చిందనీ అంటారు. అప్పటినుంచీ నారాయణుడిని పాలకొండ్రాయుడిగా పిలుస్తున్నారు. అలాగే క్షీరసాగర మథనం సమయంలో కొన్ని పాల చుక్కలు ఈ కొండపైన పడటం వల్ల ఈ ప్రాంతానికి క్షీరశైలమనే పేరు వచ్చిందని మరో కథనం ఉంది. ఈ ఆలయానికి సమీపంలో భృగుమహర్షి నదిలా ఏర్పడి భృగువంకగా మారాడని అంటారు. క్రమంగా అదే బుగ్గవంకగా మారిందనీ.. ఆ నది నీళ్లే అటు దేవుని కడపలో రాయుడినీ, ఇటు పాలకొండ్రాయుడినీ అభిషేకిస్తున్నాయనీ చెబుతారు.

ఇక్కడ పాలకొండ్రాయుడి మూర్తితో పాటు పద్మావతీదేవినీ, నవగ్రహాలనూ, ఉగ్ర నారసింహుడినీ దర్శించుకోవచ్చు. సంతానం లేనివారు పుష్కరిణిలో స్నానం చేసి తడి వస్త్రాలతో స్వామిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని నమ్మకం. అలా పుట్టిన పిల్లలకు పాలకొండ్రాయుడు, పాలకొండన్న, కొండయ్య, పాలకొండమ్మ, కొండమ్మ అనే పేర్లు పెడుతుంటారనీ చెబుతారు.

ఇలా చేరుకోవచ్చు
కడప వరకూ రోడ్డు, రైలు, విమాన మార్గాలున్నాయి. ఈ పట్టణం నుంచి ఆలయం పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కడప పట్టణం నుంచి రాజంపేటకు వెళ్లే బైపాస్‌ రహదారి మీదుగా పాలకొండలకు చేరుకోవచ్చు. కొండపాదం వరకూ వాహనాల్లో అక్కడి నుంచి నడకమార్గాన ఆలయానికి వెళ్లాల్సి ఉంటుంది.


హరిహరులు ఒకేచోట కొలువైన క్షేత్రం ‘పుష్పగిరి’

హరిహరులు ఒకేచోట కొలువైన పుణ్యక్షేత్రం పుష్పగిరి. దక్షిణకాశీగా పిలిచే ఈ ఆలయాన్ని శైవ, వైష్ణవ భక్తులందరూ దర్శించుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏకైక అద్వైతపీఠంగా గుర్తింపుపొందిన ఈ ఆలయం పినాకిని నదికి ఎదురుగా పచ్చని ప్రకృతి మధ్య కనిపిస్తూ… శిల్పకళావైభవానికి ప్రతీకగా నిలుస్తూ… భక్తులను ఆకట్టుకుంటుంది పుష్పగిరి చెన్నకేశవస్వామి ఆలయం. ఇక్కడ విష్ణుమూర్తి చెన్నకేశవస్వామిగా, పరమేశ్వరుడు చంద్రమౌళీశ్వరుడిగా పూజలు అందుకుంటూ భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విలసిల్లుతున్నారు. ఏడో శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని పల్లవులు, చోళులు, చాళుక్యులు, విజయనగర రాజులు దర్శించుకున్నారని చెబుతారు. నిత్యపూజలతో కళకళలాడే ఈ ఆలయం కడపలోని పుష్పగిరిలో ఉంది.

స్థల పురాణం


కశ్యప మహర్షి ఓసారి భార్యలైన కద్రువ, వినత కలిసి ఆడుకుంటూ.. పందెంలో ఓడిపోయినవారు గెలిచినవారికి దాసిలా పని చేయాలని షరతు పెట్టుకున్నారట. ఆ పందెంలో వినత ఓడిపోవడంతో కద్రువకు దాసిలా పని చేసేదట. వినతకు జన్మించిన గరుత్మంతుడు తన తల్లికి ఆ బానిసత్వం నుంచి విముక్తి కలిగించమని కద్రువను కోరాడట. అప్పుడు కద్రువ తనకు అమృతాన్ని తెచ్చిస్తే వినతకు స్వేచ్ఛను ఇస్తానని చెప్పిందట. దేవేంద్రుడి దగ్గరున్న ఆ అమృతాన్ని గరుత్మంతుడు తెచ్చే క్రమంలో జరిగిన పోరులో రెండు అమృతం చుక్కలు ఈ ప్రాంతంలోని పినాకిని నదిలో పడటంతో ఇందులో స్నానాలు చేసిన వారందరూ మరణం లేకుండా, యుక్తవయస్కుల్లా మారిపోయారట. అది చూసి దేవతలంతా కలిసి విష్ణుమూర్తిని సంప్రదించారు. విష్ణుమూర్తి ఆ నీటిలో పెద్ద పర్వతం ముక్కను వేసినా అమృతం ప్రభావం వల్ల ఆ నీటిలో రాయి మునగకుండా పుష్పం ఆకారంలో పైకి తేలిందట. దాంతో శివకేశవులు తమ పాదాలతో ఆ రాయిని నీటిలోనే ఉండిపోయేలా తొక్కేశారనీ ఆ తరవాతే హరిహరులు ఇక్కడ వెలిశారనీ… అలా ఈ ప్రాంతానికి పుష్పగిరి అనే పేరు వచ్చిందనీ అంటారు. ఈ ఆలయాన్ని విద్యారణ్యస్వామి నెలకొల్పినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. ఇక్కడున్న పంచనదీ సంగమంగా గుర్తింపు పొందిన పినాకిని నది… ఉత్తరం నుంచి దక్షిణం దిశగా కాశీశ్వరాలయం వైపు పయనించడం వల్లే పుష్పగిరిని దక్షిణకాశీగా పిలుస్తారు.

నిత్య పూజలు…


ఈ ఆలయానికి చెన్నకేశవస్వామే క్షేత్రపాలకుడు. ఇక్కడున్న స్వామి నిలువెత్తు విగ్రహం తిరుమలలోని శ్రీవారి విగ్రహం కంటే ఎత్తుగా ఉంటుంది. ఇక్కడ ఏడాది మొత్తం జరిగే పూజలు కాకుండా ధనుర్మాసంలో, కార్తికంలో విశేష అభిషేకాలూ, ఉత్సవాలూ జరిపిస్తారు. కొండ మీద ఒకే ఆవరణలో ఉన్న చెన్నకేశవాలయం, సంతాన మల్లేశ్వరాలయం దర్శించుకున్నాక రాజ్యలక్ష్మి, రుద్రపాద, యోగాంజనేయ ఉపాలయాలనూ చూడొచ్చు.

ఎలా చేరుకోవాలంటే


పుష్పగిరి క్షేత్రాన్ని దర్శించుకోవాలనుకునే వారు కడప వరకూ బస్సు లేదా రైల్లో చేరుకోవాలి. అక్కడి నుంచి బస్సు లేదా ప్రైవేటు వాహనాల్లో కర్నూలుకు వెళ్లే రహదారి మార్గంలో ఉప్పరపల్లె మీదుగా 16 కి.మీ. ప్రయాణిస్తే ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు.


ఆంధ్రా అయోధ్య.. హనుమంతుడి లేని రామాలయం.. ఒంటిమిట్ట

రామాలయం లేని ఊరూ రామాయణం వినని వారూ మన దేశంలోనూ ఉండరంటారు. ఏ రామాలయానికి వెళ్లినా రాముడి కుడివైపున లక్ష్మణుడు, ఎడమ వైపున సీతాదేవి, పాదాల దగ్గర నమస్కార భంగిమలో హనుమంతుడి విగ్రహాలు దర్శనమివ్వడం సాధారణమే. కానీ హనుమంతుడి విగ్రహమే ఉండని రామాలయం మన దగ్గరే ఉందని మీకు తెలుసా.. అలాంటి అరుదైన రామాలయం ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ఒంటిమిట్టలో ఉంది. సీతారామలక్ష్మణ విగ్రహాలు ఏకశిలపై దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. ఈ ఆలయంలో రాముడు యోగముద్రలో దర్శనమివ్వడం విశేషం. ఆంధ్రా అయోధ్యగా గుర్తింపు పొందిన ఒంటిమిట్ట రామాలయంలోని గర్భగుడిలో ఏకశిలపైన సీతారామలక్ష్మణ విగ్రహాలు కనిపిస్తాయి తప్ప హనుమంతుడి విగ్రహం ఉండదు. ఈ ఆలయం బయట హనుమంతుడికి విడిగా ఆలయం ఉంటుంది. కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో ఏటా జరిగే సీతారామ కల్యాణాన్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవు.

స్థలపురాణం
ఒకప్పుడు ఒంటిమిట్ట కీకారణ్యంలా ఉండేదట. పద్నాలుగేళ్ల వనవాస సమయంలో రాముడు సీతా లక్ష్మణ సమేతుడై ఈ అరణ్యంలోనూ కొంతకాలం గడిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో మృకండు, శృంగి అనే మహర్షుల ఆశ్రమం ఇక్కడే ఉండేది. వాళ్లు చేసే యజ్ఞయాగాలకు రాక్షసులు ఆటంకం కలిగించడంతో రాముడు వాళ్లను హతమార్చి యాగరక్షణ చేశాడట. అందుకు ప్రతిగా ఈ మహర్షులు ఏకశిలపైన సీతారామ లక్ష్మణుల విగ్రహాలను చెక్కించారనీ… అయితే ఆ తరువాత రాముడి భక్తుడైన జాంబవంతుడు ఆలయం నిర్మించి ఆ విగ్రహాలను అందులో ప్రతిష్ఠించాడనీ చెబుతారు. ఈ ఆలయానికి సంబంధించి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఈ ప్రాంతంలో ఒంటడు, మిట్టడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారట. బోయవారైప వీళ్లు ఈ అటవీ ప్రాంతానికి రక్షణగా ఉండేవారు. ఓసారి ఈ ప్రాంతానికి ఉదయగిరిని పాలించే కంపరాజు వచ్చాడు, ఈ అన్నదమ్ములు రాజుకు అన్నిరకాల సేవలు చేయడమే కాక చుట్టూ ఉన్న ప్రాంతాలనూ చూపించారు. ఆ రాజు ఆనందించి ఏదయినా కోరుకోమని చెప్పగా, ఇక్కడ రామాలయం కట్టించమని అడిగారట. రాజు ఈ ప్రదేశాన్ని మొత్తం పరిశీలించి గుడి కట్టేందుకు అవసరమైన నిధుల్ని అందించి ఆ బాధ్యతను వీళ్లకే అప్పగించి వెళ్లిపోయాడు. దాంతో వీళ్లిద్దరూ ఎంతో భక్తిశ్రద్ధలతో కొన్నేళ్లు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారట. వాళ్లిద్దరూ కట్టించడం వల్లే ఈ ఆలయానికి ఒంటిమిట్ట రామాలయం అనే పేరు వచ్చిందని అంటారు.

ఆ తరువాత ఉదయగిరి రాజు సోదరుడైన బుక్కరాయలు తన దగ్గరున్న నాలుగు సీతారామలక్ష్మణ ఏకశిల విగ్రహాల్లో ఒకదాన్ని ఈ ఆలయంలో ప్రతిష్ఠించాడని చెబుతారు. అలాగే ఈ ఆలయ నిర్మాణ సమయానికి రాముడికి హనుమంతుడు పరిచయం కాలేదనీ.. అందుకే ఇక్కడ హనుమంతుడి విగ్రహం లేదనే కథ కూడా ప్రచారంలో ఉంది. ఈ ఆలయంలోని రామతీర్థాన్ని రాముడే సీతకోసం ఏర్పాటు చేశాడని అంటారు. మొదట ఆ తీర్థాన్ని రామబుగ్గ అనేవారనీ.. క్రమంగా అదే రామతీర్థం అయ్యిందనీ చెబుతారు. ఎందరో రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినా… ఆంధ్రా వాల్మీకిగా గుర్తింపు పొందిన వావిలికొలను సుబ్బారావు అనే రామభక్తుడు ఈ రామాలయాన్ని పునరుద్ధరించినట్లు చరిత్ర చెబుతోంది. స్వామికి విలువైన ఆభరణాలను సమకూర్చేందుకు ఆయన కొబ్బరి చిప్పను పట్టుకుని భిక్షాటన చేసి సుమారు పది లక్షల రూపాయలు సేకరించాడట.

విశేష పూజలు
మూడు గోపుర ద్వారాలున్న ఈ ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులుంటుంది. ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహించడంతో పాటూ శ్రీరామనవమి సమయంలో తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలను చేస్తారు. చతుర్దశి నాడు కల్యాణం, పౌర్ణమిరోజు రథోత్సవం నిర్వహిస్తారు. అదేవిధంగా నవమి రోజున పోతన జయంతి పేరుతో కవిపండితులను సత్కరించడం సంప్రదాయంగా వస్తోంది.

తిరుపతికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ఆలయానికి బస్సులు, ప్రైవేట్ వాహనాల ద్వారా చేరుకోవచ్చు. విమానంలో వచ్చేవారు రేణిగుంట విమానాశ్రయంలో దిగి రోడ్డుమార్గంలో ఒంటిమిట్ట చేరుకోవచ్చు. రైల్లో వచ్చిన వారు కడపలో దిగితే అక్కడి నుంచి బస్సులు, క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి.