కొత్తపేట అష్టలక్ష్మీ ఆలయం
Category : Behind the Scenes Daily Updates Features Sliders Spiritual
విశాలమైన ప్రాంగణంలో అష్టలక్ష్ములూ కొలువుదీరి కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పూజలు అందుకుంటున్న క్షేత్రం.నిత్య పూజలూ… ప్రత్యేక ఉత్సవాలతో ఏడాది మొత్తం కళకళలాడే ఈ ఆలయాన్ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలూ కలుగుతాయని ప్రతీతి. ఈ అష్టలక్ష్మీ ఆలయం హైదరాబాద్‌లోని కొత్తపేటలో ఉంది. శ్రీమన్నారాయణుడు ఆదిలక్ష్మి సమేతంగా మూలవిరాట్టుగా కొలువుదీరితే ఆ విగ్రహమూర్తుల చుట్టూ సంతానలక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, వీరలక్ష్మి, మహాలక్ష్మి ఆశీనులై దర్శనమిచ్చే క్షేత్రమే అష్టలక్ష్మి దేవాలయం.
కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఉన్న ముప్ఫై ఎకరాలను వాసవీ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అమ్మడంతో 300 పైగా కుటుంబాలు ఇక్కడ సొంత ఇళ్లు నిర్మించుకున్నాయి. క్రమంగా ఈ ప్రాంతం వాసవీ కాలనీగా మారింది. ఆ ఇళ్ల మధ్యలో ఖాళీగా ఉన్న కొండభాగాన్ని వదిలేయకుండా అక్కడ ఏదో ఒక ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్న కాలనీ వాసులు ప్రముఖ శిల్పి గణపతి స్తపతి సలహాతో… అష్టలక్ష్మి దేవాలయాన్ని కట్టించాలనుకున్నారు. చివరకు కంచికామ కోటి పీఠాధిపతులైన జయేంద్ర సరస్వతీ, విజయేంద్ర సరస్వతులు శంకుస్థాపన చేయడమే కాకుండా… వాళ్ల సలహాలూ సూచనలతో నిర్మాణం మొదలైందనీ ఇరవై ఆరేళ్లక్రితం ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరిగిందనీ చెబుతారు ఆలయ నిర్వాహకులు.
రెండు అంతస్తుల్లో నిర్మించిన ఈ మందిరంలో మొదటి అంతస్తులో అష్టలక్ష్ములను దర్శించుకోవచ్చు. ఈ ప్రాంగణంలోనే నిత్య ప్రవచన మండపం, యాగశాల, చక్రతీర్థం, రథశాల, భోజనశాల… ఇలా అన్నీ ఉంటాయి. ఇవి కాకుండా సనాతన ధర్మాన్ని బోధించేందుకు శారదా శిశు విద్యాలయం పేరుతో ప్రత్యేక పాఠశాలనూ నిర్వహిస్తోందీ ఆలయం. ఈ ఆలయంలో శ్రీమన్నారాయణుడూ అష్టలక్ష్ములూ కాకుండా… అభయ గణపతి, కృష్ణుడు, గోదాదేవి, గరుడస్వామి, సుదర్శన లక్ష్మీనరసింహస్వామి…. తదితర విగ్రహాలను కూడా దర్శించుకోవచ్చు. కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నడిచే ఈ ఆలయాన్ని సందర్శిస్తే కీర్తి, జ్ఞానం, ఐశ్వర్యం, ధైర్యం, ఆనందం… వంటివన్నీ పొందవచ్చని భక్తుల నమ్మకం. ఇక్కడ రోజువారీ పూజా కార్యక్రమాలూ, రెండుపూటలా నిత్యహోమాలూ జరుగుతాయి. ఇవి కాకుండా వైశాఖమాసంలో బ్రహ్మోత్సవాలు, శ్రావణంలో పవిత్రోత్సవాలు, వరలక్ష్మి వ్రతాలు… దీపావళి నాడు అష్టలక్ష్ములకు విశేష పూజలు… కార్తికంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు, ఆకాశ దీపోత్సవం… ధనుర్మాసంలో గోదారంగనాథస్వామి కల్యాణం… ఇలా ఏడాది మొత్తం జరిగే విశేష పూజల్లో పాల్గొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు… తదితర ప్రాంతాల నుంచీ భక్తులు వస్తారు. ప్రతిరోజూ ఆలయంలో పూజా కార్యక్రమాలను చేశాక అర్చకులు గోమాతనూ పూజిస్తారు. తరవాత ఆ గోమాతను ఆలయ ప్రాంగణం చుట్టూ తిప్పాకే… భక్తులను అనుమతిస్తారు.
ఎలా చేరుకోవచ్చు
అష్టలక్ష్మి దేవాలయం హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌కు దగ్గర్లో కొత్తపేటలో ఉంటుంది. కొత్తపేట వరకూ వచ్చేందుకు వివిధ ప్రాంతాల నుంచి బస్సులూ ఆటోలూ అందుబాటులో ఉంటాయి. మెట్రో రైలులో వెళ్లేవారు విక్టోరియా మెమోరియల్ స్టేషన్‌లో దిగి నడుచుకుంటూ వెళ్లొచ్చు.