ఆది దంపతులు కొలువైన క్షేత్రం ‘శ్రీశైలం’

ఆది దంపతులు కొలువైన క్షేత్రం ‘శ్రీశైలం’

గంగా నదిలో రెండు వేల సార్లు మునిగినా.. కాశీ క్షేత్రంలో లక్షలాది సంవత్సరాలు నివసించినా లభించేంత పుణ్యం శ్రీశైలం క్షేత్రాన్ని దర్శిస్తే లభిస్తుందని ధార్మికుల విశ్వాసం. శ్రీభ్రమరాంబ మల్లిఖార్జునులు కొలువైన ఈ పుణ్యక్షేత్రం నంద్యాల జిల్లా(ఉమ్మడి కర్నూలు జిల్లా) లో ఉంది. భువిపై వెలసిన కైలాశంగా పేరొందిన శ్రీశైలం.. దేశంలోని పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటిగా వెలుగొందుతోంది. శ్రీశైల క్షేత్రం… శైవక్షేత్రాల్లోనే తలమానికమైనది.

మనదేశంలో పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాలు ఉన్నాయి. ‘సౌరాష్ట్రే సోమనాథంచ..’ అని ఆరంభమయ్యే శ్లోకంలో ‘శ్రీశైలే మల్లికార్జునం’ అంటూ భ్రమరాంబికా సతీ హృదయేశ్వరుడి ప్రస్తుతి కనిపిస్తుంది. దేవీ నవరాత్రుల్లో ఆదిపరాశక్తికి నవమరూపంగా భ్రమరాంబను ఆరాధించడం శాక్తేయులకు పరమ పవిత్రం. ఆదిశక్తి కొలువుదీరిన 18 శక్తి పీఠాల్లో భ్రమరాంబ వెలసిన ప్రాంతంగానూ శ్రీశైలానికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే, శ్రీశైలం ‘భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి’ క్షేత్రంగా పేరొందింది. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుంచి ఈ క్షేత్రానికి ప్రాముఖ్యత ఉంది. ఇక్ష్వాకులు, శాతవాహనులు, విష్ణుకుండినులు, పల్లవులు, విజయనగర సామ్రాజ్యాధీశులు, కాకతీయులు, రాష్ట్రకూటులు, చాళుక్యులు, రెడ్డిరాజులు ఈ ఆలయాన్ని దర్శించి, ఆలయ ప్రాకారాలు నిర్మించారు. పూర్వం అరుణుడనే రాక్షసుడు గాయత్రిని విస్మరించిన ఫలితంగా భ్రమర రథాంకృతులతో ఆదిశక్తి అతణ్ణి సంహరించిన గాథ ప్రాచుర్యంలో ఉంది.

మల్లెల రాయుడు
కృష్ణానది తీరంలో బ్రహ్మగిరి రాజధానిగా చంద్రకేతుడనే రాజు పాలించేవాడు. సంతానం కోసం పరితపిస్తున్న ఆ రాజుకు లేకలేక ఓ అమ్మాయి జన్మించింది. ఆమెకు చంద్రమతి అని నామకరణం చేశారు. ఆమె పుట్టిన తర్వాత రాజపురోహితులు జైత్రయాత్ర ముహూర్తం పెట్టారు. చంద్రకేతుడు బ్రహ్మగిరి నుంచి మొదలుపెట్టిన జైత్రయాత్రను రాజ్య విస్తరణ కాంక్షతో కొన్నేళ్లపాటు అలా కొనసాగిస్తూనే ఉన్నాడు. అలా కొన్నేళ్లు గడిచిన తర్వాత చంద్రకేతుడు జైత్రయాత్ర ముగించి, తిరిగి బ్రహ్మగిరికి చేరుకున్నాడు. అంతఃపురంలో ఓ అందమైన కన్యను చూసి చంద్రకేతుడు మనసు పారేసుకున్నాడు. ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని వెంటపడ్డాడు. అది చూసిన అతని భార్య.. ఆమె మీ కూతురు చంద్రమతి అని చెప్పినా చంద్రకేతుడు పట్టించుకోలేదు. చంద్రమతి చేతులు జోడించి ‘నేను మీ కుమార్తెను. వదిలిపెట్టండి’ అని వేడుకున్నా.. చంద్రకేతుడు కామకాంక్షతో ఆమెను లోబరుచుకోడానికి ప్రయత్నించాడు. దీంతో చంద్రమతి బ్రహ్మగిరిని వదిలి కృష్ణానది దాటి కొండల్లోకి పరుగు తీసింది. అక్కడ ఓ గుహలో తలదాచుకుంది. దీంతో ఆమె కోసం చంద్రకేతుడు ఆ గుహ బయటే మాటువేశాడు. శివ భక్తురాలైన చంద్రమతి మరో దారిలేక.. తండ్రి నుంచి తనను కాపాడాలని శివుడిని ప్రార్థించింది. ఆమె మొరాలకించిన శివుడు చంద్రకేతుడిని ఆకుపచ్చ శిలగా మార్చేశాడు. ఆ శిల దొర్లుకుంటూ పాతాళగంగలో పడింది. అందువల్లే అక్కడి నీరు పచ్చగా ఉంటుందని భక్తులు నమ్ముతారు. గుహ నుంచి బయటకు వచ్చిన చంద్రమతి.. అక్కడో అద్భుతాన్ని చూస్తుంది. ఓ గోవు పొదుగు నుంచి కారుతున్న పాలధారతో అభిషిక్తమవుతున్న శివలింగాన్ని చూసి ఆశ్చర్యపోయింది. దీంతో అక్కడే ఆమె శివాలయాన్ని నిర్మించింది. స్వామివారిని నిత్యం మల్లె పూలతో అర్చించేది. ఆమె భక్తిని మెచ్చిన శివుడు.. చంద్రమతి సమర్పించిన మల్లెదండను తన సిగలోని నెలవంక, సురగంగకు నడుమ అలంకరించుకున్నారట. అందుకే ఆ ఆలయానికి మల్లిఖార్జున స్వామి ఆలయంగా పేరొందిందని పూర్వికులు చెబుతారు.

జ్యోతిర్లింగ, శక్తి పీఠాలు ఒకే గిరిశృంగం మీద వెలసిన పుణ్యక్షేత్రమైన శ్రీశైలం సకల లోకారాధ్యంగా భాసిల్లుతోంది. ఇది వేదాలకు ప్రాణాధారమని ధార్మికులు భావిస్తారు. చతుర్వేదాల్లోనూ యజుర్వేదానిది హృదయస్థానమనీ, అందులోని రుద్ర నమక మంత్రాలు ఆ వేదానికే హృదయం లాంటివనీ, అందులోని ‘నమశ్శివాయ’ పంచాక్షరి ఆ నమకానికే హృదయమనీ, దానికి ఆత్మలా శోభిల్లే శివనామం సకల వేదాలకూ మూలాధారమనీ వేదవిదులు ప్రవచించారు. అలాంటి శక్తిమంతమైన నామాన్ని అడుగడుగునా స్మరిస్తూ, భక్తులు చేసే శ్రీశైల యాత్ర, వేద దర్శనంతో సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి. మరే క్షేత్రానికీ లేని ప్రత్యేకత శ్రీశైల క్షేత్రానికి ఉంది. పూజారంభంలో సంకల్పంలో శ్రీశైల క్షేత్రానికి ఏ దిశలో కూర్చొని తాము భగవదారాధన చేస్తున్నదీ విధిగా పేర్కొనడం ఈ క్షేత్ర ప్రామాణికతకు నిదర్శనం. బ్రహ్మగిరి, విష్ణుగిరి, రుద్రగిరి అనే మూడు పర్వతాలకు పాదాభివందనం చేస్తూ తన చరణ కింకిణుల సవ్వడితో వేదఘోషను స్ఫురింపజేసే కృష్ణవేణి పాతాళగంగ పేరుతో ఉత్తరవాహినిగా ప్రవహిస్తోందిక్కడ.

శ్రీశైలం ఎప్పుడు వెలసిందీ స్పష్టంగా తెలియజేసే ఆధారాల్లేవంటారు. అష్టాదశ పురాణాల్లోనూ భారత రామాయణాది ఇతిహాసాల్లోనూ శ్రీశైల వైభవం స్తుతుల్ని అందుకొంది. సంస్కృత, ఆంధ్ర, కన్నడ, మరాఠీ గ్రంథాల్లో ఈ క్షేత్ర వర్ణనలున్నాయి. ఆయా భాషల కవులు శ్రీగిరిని కీర్తిస్తూ వ్యోమకేశ, హైమవతుల సంధ్యా సుందర నృత్యాన్ని సమనోజ్ఞంగా అభివర్ణించారు. అరవై నాలుగు అధ్యాయాలున్న స్కాందపురాణంలోని శ్రీశైల ఖండం, ఈ క్షేత్ర మహత్తును వివరిస్తోంది.ఈ క్షేత్ర ప్రశాంతతకు ముగ్ధులైన ఆదిశంకరులు కొంతకాలం ఇక్కడ తపస్సు చేసి, ‘శివానంద లహరి’ని రచించి, మల్లికార్జునుడికి పూజాసుమాలు అర్పించారు. భ్రమరాంబ సన్నిధిలో శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించారు. దత్తావతార పరంపరలో భక్తుల పూజలందుకొనే నృసింహ సరస్వతీ స్వామి శ్రీశైల మహత్యాన్ని వివరిస్తూ తన పాదుకల్ని పట్టుకొన్న తంతుడు అనే భక్తుడికి ఈ క్షేత్ర దర్శన భాగ్యాన్ని కలిగించినట్లు ‘గురు చరిత్ర’ చెబుతోంది. ఆ స్వామీజీ తన అవతారాన్ని సైతం ఇక్కడి పాతాళగంగలో పరిసమాప్తి గావించి, కదలీవనంలో గుప్తరూపంలో ఉన్నట్లు దత్తభక్తులు విశ్వసిస్తారు.

కృతయుగంలో హిరణ్యకశిపుడు శ్రీశైలాన్ని తన పూజా మందిరంగా చేసుకొన్నాడనీ, త్రేతా యుగంలో రామ చంద్రుడు రావణుణ్ణి వధించిన తరవాత బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టుకోవడానికి సతీసమేతంగా ఈ క్షేత్రాన్ని దర్శించి, సహస్రలింగాల్ని ప్రతిష్ఠించి, ఆర్చించాడనీ ప్రతీతి. ద్వాపరయుగంలో పాండవులు సైతం వనవాస కాలంలో ఈ గిరిని దర్శించి లింగప్రతిష్ఠ చేసినట్టు ప్రాచుర్యంలో ఉంది.

భ్రమర మోహనుడు

మల్లికార్జునుడి హృదయ పద్మంలో భ్రమరాంబ కొలువుదీరిన వైనం గురించి ఓ అపురూప గాథ ప్రాచుర్యంలో ఉంది. ఆమె మల్లికార్జునుణ్ణి తొలిసారి చూసినప్పుడే శ్మశాన వాసిలా, విరాగిలా కనిపించే ఈశ్వరుడు భువనైక మోహనుడునీ, సత్యశివ సుందరుడనీ గ్రహించి, వరించింది. శివుడి ఆలోచనలు మరోలా ఉన్నాయి. శక్తిని పరీక్షించడం కోసం తన సంకల్పం చేత ఓ భ్రమరాన్ని సృష్టించాడాయన. ఆ భ్రమర పథాన్ని అనుసరిస్తూ అది ఆగిన చోట ఆమెను వివాహమాడగలనని చెప్పాడు. శక్తీ అంగీకరించి, మాయా భ్రమరాన్ని అనుసరించింది. కొంతకాలం తరవాత అది అగిన చోటుకు శక్తి చేరుకొంది. అక్కడ వృద్ధ రూపుడైన వృషభ వాహనుడు ఆమెకు కనిపించాడు. ఆమె భ్రమరాన్ని అనుసరించడంతో యుగాలు గడిచిపోయాయనీ, తనను వార్థక్యం ఆవరించిందనీ శివుడు తెలిపాడు. వృద్ధమూర్తి అయినా అన్యుణ్ణి ఆరాధించే ప్రసక్తే లేదని ఆదిశక్తి ఖండితంగా చెప్పేసింది. అప్పుడు శంకరుడు ఆమెను తన హృదయపద్మంలో నిలిపి భ్రమరాంబికగా స్వీకరించాడని అంటారు.

చరిత్రలోకి వెళ్తే
క్రీస్తుపూర్వం నుంచి అనేక రాజవంశాలు శ్రీశైలాన్ని సేవించినట్లు శిలాశాసనాలు, ఇతర చారిత్రక ఆధారాలు వర్ణిస్తున్నాయి. ఇక్ష్వాకులు, శాతవాహనులు, విష్ణుకుండినులు, పల్లవులు, రాష్ట్రకూటులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగర సామ్రాజ్యాధీశులు, భ్రమరాంబికా సమేతుడైన మల్లికార్జునుణ్ణి దర్శించి, ఆలయ ప్రాకారాలు నిర్మించి, అశేష వస్తుసంపదలు సమర్పించినట్లు ఆధారాలున్నాయి. బౌద్ధయుగంలో మహాయానానికి పూర్వం నుంచీ ఈ ఆలయం ప్రాచుర్యంలో ఉందని తెలుస్తోంది. చైనా యాత్రికుడు హ్యూయన్‌త్సాంగ్‌ గ్రంథంలో శ్రీశైలం ప్రసక్తి ఉంది. ఆలయ పూర్వ చరిత్రకు సంబంధించి 14 శతాబ్దానికి చెందిన కాకతీయ ప్రతాప రుద్రుడి శాసనమే ప్రాచీనమైనది. అది ప్రస్తుతం చెన్నైలోని మ్యూజియంలో ఉంది.

ఆరో శతాబ్దంలో కదంబ మయూర వర్మ ఈ ప్రాంతాన్ని పాలించారు. ఏడో శతాబ్దంలో చాళుక్యులూ, ఆ తరవాత పదో శతాబ్దం వరకూ రాష్ట్రకూటులూ శ్రీశైల ప్రాంతాన్ని పరిపాలించారు. తరచూ సంభవించిన యుద్ధాల తరవాత ఈ క్షేత్రం వెలనాటి ప్రభువుల అధీనంలోకి వచ్చింది. 11వ శతాబ్దంలో ఆరో విక్రమాదిత్యుని మరణానంతరం ఇక్కడ కాకతీయుల ఏలుబడి ఆరంభమైంది. తెలుగు మాట్లాడే ప్రాంతాలు ఏకీకృతమై కాకతీయ సామ్రాజ్యం వెలసిన తరవాత, శ్రీశైల ప్రభ ప్రవర్ధమానమైంది. గణపతి దేవుడు, రుద్రమాంబ, ప్రతాపరుద్రుల కాలంలో ఈ క్షేత్రం అభివృద్ధి చెందింది. అనంతరం రెడ్డి రాజుల కాలంలో పోలయ వేమారెడ్డి ప్రాభవంలో శ్రీశైలం మరింత అభివృద్ధి చెందింది. తరవాత విజయనగర రాజుల కాలంలో రెండో హరిహరరాయలు ఆలయానికి దక్షిణ గోపుర ద్వారాన్నీ, ముఖమంటపాన్నీ నిర్మించారు. శ్రీకృష్ణదేవరాయలు శ్రీశైలానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించి, తన దేవేరులైన తిరుమల దేవి, చిన్నమదేవిలతో ఈ క్షేత్రాన్ని దర్శించారు. దేవాలయ ప్రధాన ద్వారం వద్ద గాలిగోపురాన్ని నిర్మించారు. 1677లో మరాఠా వీరకిశోరమైన ఛత్రపతి శివాజీ ఉత్తరం వైపున గాలిగోపురాన్ని నిర్మించారు. ఇక్కడే ఆయనకు జగన్మాత దర్శనమిచ్చి వీరఖడ్గాన్ని ప్రసాదించిందని ప్రతీతి. 1996లో దేవస్థానం వారు పడమట గోపురాన్ని నిర్మించి, దీనికి బ్రహ్మానందరాయ గోపురమని పేరు పెట్టారు.

నాలుగు ద్వారాలు

అనేక ప్రత్యేకతలున్న శ్రీశైల ఆలయానికి నాలుగు ప్రధాన ద్వారాలున్నాయి. ప్రకాశంజిల్లాలో త్రిపురసుందరి వెలసిన త్రిపురాంతకాన్ని తూర్పు ద్వారంగానూ, మహబూబ్‌నగర్‌ జిల్లాలో జోగులాంబ విరాజిల్లే శక్తిపీఠమైన ఆలంపూర్‌ పశ్చిమ ద్వారంగానూ, కడప జిల్లాలో సిద్ధేశ్వరుడు కొలువుతీరిన సిద్ధవటం దక్షిణద్వారం గానూ, మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఉమామహేశ్వరాన్ని ఉత్తర ద్వారంగానూ భావిస్తారు. ఇవి కాకుండా – ఆగ్నేయంలో పుష్పగిరి క్షేత్రం, నైరుతిలో సోమశిల క్షేత్రం, వాయువ్యంగా సంగమేశ్వర క్షేత్రం, ఈశాన్యంలో ఏకేశ్వర క్షేత్రం ఉన్నాయి.

ధూళిదర్శనం
శ్రీశైల ఆలయాన్ని వీరశైవులు అత్యంత పవిత్రమైందిగా భావిస్తారు. కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన లింగధారులు ఇక్కడి విభూతి సుందరుణ్ణి విధిగా అర్చిస్తారు. అంతేకాదు, ఏ ఆలయంలోనూ లేని మరో ప్రత్యేకత శ్రీశైలంలో కనిపిస్తుంది. మల్లికార్జునుడికి పూజాదికాలు నిర్వహించే పవిత్ర బాధ్యతను వీరశైవార్చకులు, భ్రమరాంబను అర్చించే పుణ్యవిధిని బ్రాహ్మణులు నిర్వర్తించడం ఈ ఆలయంలో మాత్రమే గోచరించే సంప్రదాయం. శివపార్వతుల కల్యాణాన్ని ఆరాధ్యులు జరిపించడం మరో విశేషం. పరివార దేవతలకూ, ఉత్సవమూర్తులకూ వస్త్రాలంకరణ చేసే విధిని చెంచులు నిర్వహిస్తారు. శ్రీశైలంలో మరో ప్రత్యేకత ‘ధూళి దర్శనం’ పాదప్రక్షాళనతో పనిలేకుండా ఆలయంలోకి నేరుగా ప్రవేశించి, ఆర్తితో శివుణ్ణి ఆలింగనం చేసుకొనే ఆత్మీయ దృశ్యం ఈ ఆలయంలో కనిపిస్తుంది.

ఎలా చేరుకోవాలి
శ్రీశైల క్షేత్రం హైదరాబాద్‌ నుంచి సుమారు 220 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 270కిలోమీటర్లు, విశాఖపట్నం నుంచి 610 కిలోమీటర్లు, తిరుపతి నుంచి 370 కిలోమీటర్ల దూరంలో ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి పలు బస్సు సర్వీసులు ఉన్నాయి.