పుచ్చకాయలకే ఇళ్లు అమ్మేస్తున్నారు… చైనాలో వింత పరిస్థితి
Category : Behind the Scenes Daily Updates Features Lifestyle Sliders
సాధారణంగా ఊళ్లలో పాత ఇనుప సామాన్లకి మామిడి పండ్లు, బీరు సీసాలకు ఐస్ క్రీములు ఇవ్వడం చూస్తూనే ఉంటాం. కానీ చైనాలో మాత్రం ఏకంగా పుచ్చకాయలు గోధుమలు వెల్లుల్లికి ఇండ్లు అమ్మేస్తున్నారు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా..? అసలు ఇది నిజమా కాదా అని తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి..
ఓ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ పుచ్చకాయలకి ఇల్లు అమ్మిందన్న వార్త ఒకటి చైనా పత్రికల్లో కనిపించింది. “నాన్జింగ్లోని ఓ రియల్ ఎస్టేట్ డెవలపర్ కిలో పుచ్చకాయలకు 20 యువాన్ల చొప్పున లెక్క గట్టి గృహ కొనుగోలు చెల్లింపులుగా అంగీకరిస్తోంది” అంటూ చైనా ప్రభుత్వ రంగ పత్రిక గ్లోబల్ టైమ్స్ ఇటీవల గొప్పగా ఓ కథనం రాసింది. తూర్పు నగరమైన నాన్ జింగ్‌లోని ఒక డెవలపర్ స్థానిక రైతుల నుండి డౌన్‌పేమెంట్‌గా 100,000 యువాన్ల వరకు విలువైన ట్రక్కుల పుచ్చకాయలను స్వీకరిస్తున్నారు. 100,000 యువాన్ల విలువను 5000 కిలోల పుచ్చకాయలుగా లెక్కిస్తున్నారు. మరో చిన్న పట్టణమైన వుక్సీలో, మరొక డెవలపర్ పీచెస్ పళ్లను తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని ప్రధాన వెల్లుల్లి ఉత్పత్తి ప్రాంతమైన క్వి కౌంటీలోని గృహ కొనుగోలుదారులు తమ డౌన్ పేమెంట్‌లో కొంత భాగాన్ని మార్కెట్ ధర కంటే మూడు రెట్లు ఎక్కువ ధరకు తమ ఉత్పత్తులను మార్పిడి చేసుకుంటున్నారు.
కొత్త వెల్లుల్లి సీజన్ సందర్భంగా క్వి కౌంటీలోని వెల్లుల్లి రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుందని హోమ్‌బిల్డర్ సెంట్రల్ చైనా మేనేజ్మెంట్ మే చివరిలో సోషల్ మీడియాలో వెల్లడించింది. రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆదుకునేందుకు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా గృహ రుణాలపై కనీస వడ్డీ రేటును కూడా తగ్గించింది. 4.6 శాతం నుంచి 4.4 శాతం వరకు కోత పెట్టింది. ప్రస్తుతం చైనా గృహ రుణాల విలువ 10 ట్రిలియన్లకు డాలర్లకు చేరింది. చైనా ప్రగతిలో రియల్ ఎస్టేట్ రంగానిది అత్యంత కీలక పాత్ర అని చెప్పుకోవాల్సిందే.
చైనా జీడీపీలో నాలుగో వంతు రియల్ ఎస్టేట్ రంగం నుంచే వస్తోంది. తాజాగా ఆ దేశంలోని టాప్ 100 డెవలపర్ల విక్రయాలు తొలి నాలుగు నెలల్లో సగానికి పడిపోయాయి. ఈ రంగానికి ఇచ్చే రుణాల మొత్తం కూడా తగ్గింది. 2021లో నిర్మాణాల్లో ఏకంగా 14 శాతం తగ్గుదల నమోదైంది. మిలియన్ల కొద్దీ చదరపు అడుగుల నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఆరేళ్లలో తొలిసారి గత సెప్టెంబర్ నుంచి ఇళ్ల ధరల్లో పతనం మొదలైంది. ఫలితంగా ముందస్తుగానే నిర్మాణాలకు చెల్లింపులు చేసిన వినియోగదారులు నష్టపోయే పరిస్థితి వచ్చింది. దీంతో కొనుగోలుదారులు ఓ పట్టాన ముందుకు రావడంలేదు. చైనాలోని నగరవాసుల సంపద 70 శాతం గృహాలపై పెట్టుబడుల్లోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ సంస్థలను ఆదుకొనేందుకు కేంద్ర బ్యాంక్ రంగంలోకి దిగింది. భవిష్యత్తులో షీజిన్‌పింగ్ మూడోసారి అధికారం చేపట్టనున్న సమయంలో కమ్యూనిస్టు పార్టీకి ఇది పెను సవాలుగా మారింది.