మోకాళ్లపై వంగి శివుడికి దండం పెట్టిన మేక.. నోరెళ్లబెట్టిన భక్తులు
Category : Behind the Scenes Daily Updates Features Sliders Spiritual

భక్తి. దేవుడి పట్ల ఆరాధన. ఇది కొంతమందికి స్వతహాగా రావచ్చు. మరికొంత మందికి భయం వలన రావచ్చు. ఇంకా కొంతమందికి అవసరం వలన కూడా భక్తి భావన కలగవచ్చు. ఎలా కలిగినా భక్తి అనేది మానవులకు మాత్రమే సొంతమని అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే పశు పక్ష్యాదులు, జంతువులు కూడా అప్పుడప్పుడూ భక్తి తన్మయత్వంలో తరిస్తుంటాయి. దానికి ఉదాహరణే ఈ మేక.
ఉత్తరప్రదేశ్ కాన్పూర్ నగరంలోని బాబా ఆనందేశ్వర్ ఆలయం. శనివారం సాయంత్రం వేళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ సమయంలో ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఒక మేక స్వామివారికి వంగి నమస్కరించింది. ఇతర భక్తులతో కలసి శివుడిని ప్రార్థించింది. అచ్చం భక్తుల తరహాలో మోకాళ్లపై పడి ఆ పరమశివుడిని వేడుకుంది ఈ మేక. పాపం ఎన్ని కష్టాలున్నాయో.. ఏమో. మిగతా భక్తులను ఏ మాత్రం పట్టించుకోకుండా భక్తి తన్మయత్వంతో ఆ శివుడికి తన కష్టాలేవో మొరపెట్టుకున్నట్లుంది. మేక భక్తిని గుళ్లో ఉన్నవారంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. తర్వాత తమ సెల్‌ఫోన్లలో ఆ దృశ్యాన్ని బంధించారు. ఈ మేక చేసిన పని ఇప్పుడు అందరి నోళ్లల్లోనూ నానుతోంది. సోషల్ మీడియాలోనూ ఈ మేకపై చర్చ జరుగుతోంది.