బాలయ్య బాక్సాఫీస్ ఊచకోత.. ‘అఖండ’ కలెక్షన్ల ప్రభంజనం, తొలిరోజే రికార్డుల మోత
బాలయ్య బాక్సాఫీస్ దుమ్ముతులుపుతున్నాడు. అఘోరాగా అదరగొడుతున్నాడు. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘అఖండ’ ఎన్నో అంచనాలతో డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలకు మించి తొలి షోతోనే మాస్ ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీ ఎంతగానో ఎదురుచూసిన నందమూరి ఫ్యాన్స్ తొలి రోజు సినిమా చూసి ఫుల్ ఖుషీ అయ్యారు. మాస్ ఆడియన్స్ చేత గోలలు పెట్టిస్తూ క్లాస్ ఆడియన్స్ దృష్టిని లాగేసి ఈ సినిమా తొలిరోజే కలెక్షన్ల ఊచకోత మొదలు పెట్టేసింది. విడుదలైన అన్ని ఏరియాల్లో బాలకృష్ణ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి చెప్పే కలెక్షన్స్ వచ్చాయి. బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడని అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు. బొయపాటి మార్క్ ఎలివేషన్స్‌ను జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడక్కడా ఫైట్స్ కొంచెం ఓవర్ అయ్యాయన్న మాటలు వినిపిస్తున్నా.. బాలయ్య అంటే ఆ మాత్రం ఉండాలి అంటున్నారు ఫ్యాన్స్.
ఓవరాల్‌గా మౌత్ టాక్ బాగుందని రావడంతో జనాలు సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఊహించని విధంగా చాలా థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల ముందు ఈ బోర్డులు కనిపించి చాలా రోజులైందనే చెప్పాలి. మొత్తంగా డిసెంబర్ 2న తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద మాస్ జాతర నడిచింది. దీంతో ఊహించిన దానికంటే కలెక్షన్లు కాస్త ఎక్కువే వచ్చినట్లు తెలుస్తోంది. టోటల్‌గా ఈ మూవీకి తొలిరోజు 23 కోట్ల గ్రాస్, 15.39 నెట్ వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా కలెక్షన్స్
నైజాం- 4.39 కోట్లు
సీడెడ్- 4.02 కోట్లు
ఉత్తరాంధ్ర- 1.36 కోట్లు
ఈస్ట్ గోదావరి- 1.05 కోట్లు
వెస్ట్ గోదావరి- 96 లక్షలు
గుంటూరు- 1.87 కోట్లు
కృష్ణా- 81 లక్షలు
నెల్లూరు- 93 లక్షలు
మొత్తంగా అఖండ 53 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. అంటే.. 54 కోట్లు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్‌లోకి వెళ్తుంది. తొలిరోజే హిట్ టాక్ తెచ్చుకోవడం, మౌత్ టాక్ బాగుండటం, మరో వారం వరకు పెద్ద సినిమాలేవీ లేకపోవడం ‘అఖండ’కు కలిసిరానుంది. వీకెండ్ హాలిడేస్ కూడా ఉండనే ఉన్నాయి. దీంతో ఈ వారాంతం ముగిసేసరికి బాలయ్య సినిమా బ్రేక్ ఈవెన్ క్రాస్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
థియేటర్లలో ఫ్యాన్స్ గోలల మధ్య సినిమా చూసి ఎంజాయ్ చేస్తే వచ్చే ఆ కిక్కే వేరప్పా అని కొందరు ఫస్ట్ షో సినిమాకి వెళ్లినా.. బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ఆ డైలాగులు వినడానికి మళ్లీ థియేటర్ల వైపు పరుగులు తీస్తున్నారు. చాలామంది అభిమానులు ఒక్క రోజులోనే రెండు సార్లు సినిమా చూసేసారు. దీంతో 2021లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా అఖండ చరిత్ర సృష్టించింది. సాధారణంగా బాలకృష్ణ సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ తక్కువగా ఉంటుంది. కానీ అఖండ అక్కడ కూడా ప్రభంజనాన్ని సృష్టించింది.
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ రికార్డులను సైతం దాటేసి దూసుకుపోతోంది ‘అఖండ’. మరీ ముఖ్యంగా నార్త్ అమెరికాలో బాలయ్య సినిమాకి అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. అక్కడ సినిమా ప్రీమియర్స్ నుంచే 3.25 లక్షల డాలర్స్ వచ్చాయి. అంటే దాదాపు 2.75 కోట్లు. బాలయ్య కెరీర్లోనే ఇది మూడో బెస్ట్ ఓపెనింగ్ ఇది. గతంలో ఎన్టీఆర్ కథానాయకుడు 3.74 లక్షల డాలర్స్, గౌతమీ పుత్ర శాతకర్ణి 3.50 లక్షల డాలర్స్ వసూలు చేసింది. తాజాగా అఖండ మూడో స్థానంలో ఉంది. ఇక తెలుగులో వకీల్ సాబ్ 3 లక్షల డాలర్లు వసూలు చేస్తే, నాగచైతన్య, సాయి పల్లవిల లవ్ స్టోరీ 3.13 లక్షల డాలర్స్ వసూలు చేసింది. ఈ రెండు సినిమాల ప్రీమియర్ షోస్ కలెక్షన్స్‌ను అఖండ సినిమా క్రాస్ చేసింది. మాస్ హీరోకి పక్కా అర్థం చెప్పిన బాలయ్య ‘అఖండ’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు 15 కోట్లకు పైగానే వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.