ఒకే ఒక జీవితం.. రివ్యూ
Category : Latest Reviews
చిత్రం: ఒకే ఒక జీవితం; నటీనటులు: శర్వానంద్, అమల, రీతూవర్మ, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్; సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్; ఎడిటింగ్: శ్రీజిత్ సారంగ్; మాటలు: తరుణ్ భాస్కర్; నిర్మాత: ప్రకాశ్‌బాబు, ప్రభు; కథ, కథనం, దర్శకత్వం: శ్రీ కార్తిక్; విడుదల తేదీ: 9-9-2022
శర్వానంద్ కొన్ని సంవత్సరాల నుండీ మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. అతని దురదృష్టం ఏంటి అంటే కొన్ని సార్లు సినిమా ఎంత బాగున్నా, కమర్షియల్ గా ఆడకపోవడం, లేదా సినిమా బాగోలేకపోవటం జరుగుతూ వున్నాయి. అందువల్ల అతనికి హిట్ వచ్చి చాలా కాలం అవుతోంది. చాలా సినిమాలు కూడా చేశాడు. నిజం చెప్పాలి అంటే, 2016లో వచ్చిన శతమానం భవతి తరువాత అతనికి అంత పెద్ద హిట్ రాలేదు. ఇప్పుడు ఒకే ఒక జీవితం అనే సినిమాతో మన ముందుకు వచ్చాడు. చాలా కాలం తరువాత అమల అక్కినేని మళ్ళీ కెమెరా ముందుకు వచ్చారు. ఇందులో ఆమె శర్వానంద్ తల్లిగా నటించారు. శ్రీ కార్తీక్ అనే అతను ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇది తమిళ్ లో కూడా విడుదలయింది. ఈ సినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో, భావోద్వేగాలతో కూడిన డ్రామా. మరి ఇది ఎలా ఉందో చూద్దాం.
కథేంటంటే: ఆది (శర్వానంద్), శ్రీను (వెన్నెల కిషోర్), చైతూ (ప్రియదర్శి) మంచి స్నేహితులు. చిన్నప్పట్నుంచీ కలిసి పెరిగిన వీళ్లు ఒకొక్కరూ ఒక్కో సమస్యతో సతమతమవుతూ ఉంటారు. ఎవరిలోనూ సంతృప్తి ఉండదు. ఈ ముగ్గురికీ పాల్ (నాజర్) అనే ఓ శాస్త్రవేత్త పరిచయం అవుతాడు. అతడు ఇరవయ్యేళ్లుగా టైమ్ మెషిన్ కనిపెట్టడం కోసం కష్టపడుతుంటాడు. చివరికి తాను కనిపెట్టిన టైమ్ మెషిన్‌తో గతంలోకి వెళ్లి తమ తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశాన్ని ఆది, శ్రీను, చైతూలకి ఇస్తాడు. మరి వాళ్లు గతంలోకి వెళ్లి ఏం చేశారు? తప్పుల్ని సరిదిద్దుకున్నారా ? భవిష్యత్తుని గొప్పగా మార్చుకున్నారా? విధి వారికి ఏం చెప్పిందనేది మిగతా కథ.
టైం మెషిన్ లో కాలం వెనక్కి ముందుకి వెళ్ళటం అనే కాన్సెప్ట్ తో సినిమాలు మన తెలుగులో కూడా వచ్చాయి. బాలకృష్ణ నటించిన ఆదిత్య369 ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. తమిళంలో సూర్య నటించిన 24 కూడా ఇదే జోనర్లో వచ్చిన సినిమానే. అలాగే, ఈమధ్యే వచ్చిన బింబిసార సినిమా కూడా అటువంటిదే. అదీ సక్సెస్ అయింది. అయితే దర్శకుడు శ్రీ కార్తీక్ అదే టైం మెషిన్ కాన్సెప్ట్ తో ఒక కొత్త కథని ఎంచుకున్నాడు. అతను దాంట్లో చాలా భావోద్వేగాలను, చిన్న కామెడీ.. రెండూ కలిపి చూపించాడు. చాలా వరకు విజయం సాధించాడని చెప్పాలి. ముగ్గురు స్నేహితులు వాళ్ళ మధ్య చిన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకు వున్న అనుబంధం బాగా చూపించాడు. అలాగే, కథ అంతా ఒక హీరో చుట్టూనే కాకుండా, మిగతా వాళ్ళ పాత్రలకి కూడా మంచి ఇంపార్టెన్స్ ఇవ్వటం వల్ల సినిమా ఆసక్తి కరంగా ముందుకు వెళుతూ ఉంటుంది. అలాగే ఈ స్నేహబంధంతో పాటు, అమ్మ సెంటిమెంట్ కూడా దర్శకుడు జోడించడంతో సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా భావోద్వేగంగా ఉంటూ వస్తుంది. టైం మెషిన్, వెనక్కి వెళ్ళడమే కాకుండా, ఇక్కడ దర్శకుడు ఇంకో ఆసక్తికర విషయం జోడించాడు.
స్నేహితులు ముగ్గురూ 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చిన్నప్పుడు ఎలా వున్నారో వాళ్ళని ఈ పెద్దయిన ముగ్గురూ కలవటం. వాళ్ళతో వాళ్ళే ఎలా మాట్లాడుకుంటారో అన్నది కొంచెం సరదాగా బాగా చిత్రీకరించారు. మొత్తం మీద దర్శకుడు ఒక రకంగా సఫలీకృతుడు అయ్యాడనే చెప్పాలి. కొత్త దర్శకుడు అయినా, సినిమా మీద మంచి పట్టు ఉన్నట్టు కనపడుతోంది. దీంతో సెంటిమెంట్ సన్నివేశాలు బాగా వచ్చాయి. విధిని ఎవరూ ఆపలేరు, భగవంతుడు రాసిన గీతని మానవుడు చెరపలేడు అన్న విషయం కూడా. దర్శకుడు బాగా చూపించాడు. అమ్మని బతికిద్దామనుకుంటాడు ఆది. కానీ విధి ముందు తలవంచాల్సిందే ఎవరయినా అని చెప్పాడు దర్శకుడు.
శర్వానంద్, వెన్నెలకిషోర్, ప్రియదర్శి తమ పాత్రల్లో ఒదిగిపోయారు. వీళ్ల బాల్యాన్ని గుర్తు చేసే పాత్రల్లో నటించిన చిన్నారులు కూడా ఆకట్టుకున్నారు. శర్వానంద్ సెంటిమెంట్ ప్రధానంగా సాగే సన్నివేశాల్లో తనలో ఎంత గొప్ప నటుడు ఉన్నాడో మరోసారి చాటి చెప్పాడు. అమల తన అనుభవాన్నంతా రంగరించి నటించారు. చాలా రోజుల తర్వాత ఆమె తెరపై ఓ బలమైన పాత్రలో కనిపించారు. ఆమె కెరీర్లో గుర్తుండిపోయే సినిమా ఇది. శర్వానంద్‌కి కూడా అంతే. రీతూవర్మ పాత్ర, ఆమె అభినయం కూడా ఆకట్టుకుంటుంది. నాజర్ తనకి అలవాటైన పాత్రలోనే కనిపించారు. సాంకేతికత విషయానికొస్తే ప్రతీ విభాగం చక్కటి పనితీరుని కనబరిచింది. ముఖ్యంగా సంగీతంతో సినిమాకి ప్రాణం పోశారు జేక్స్ బిజోయ్. సుజీత్ సారంగ్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. దర్శకుడు శ్రీకార్తిక్ కథని తెరపైకి తీసుకొచ్చిన విధానంలోనూ ఓ ప్రత్యేకత కనిపించింది. నిర్మాణం బాగుంది.