థ్యాంక్యూ రివ్యూ(Thankyou Review)

థ్యాంక్యూ రివ్యూ(Thankyou Review)

చిత్రం: థ్యాంక్యూ
న‌టీన‌టులు: నాగ‌చైత‌న్య, రాశీఖ‌న్నా, మాళ‌విక నాయ‌ర్‌, అవికాగోర్‌, ప్రకాశ్‌రాజ్‌, ఈశ్వరీరావు, సాయి సుశాంత్ రెడ్డి, త‌దిత‌రులు
క‌థ‌: బి.వి.ఎస్‌.ర‌వి
సంగీతం: త‌మ‌న్
ఛాయాగ్రహ‌ణం: పి.సి.శ్రీరామ్‌
కూర్పు: న‌వీన్ నూలి
నిర్మాణం: దిల్‌రాజు, శిరీష్‌
నిర్మాణ సంస్థ: శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్‌
ద‌ర్శక‌త్వం: విక్రమ్ కె.కుమార్‌
విడుద‌ల‌: 22-07-2022

మ‌జిలీ, వెంకీ మామ‌, ల‌వ్‌స్టోరి, బంగార్రాజు ఇలా వ‌రుస విజ‌యాల‌తో స‌క్సెస్ ఊపు మీదున్న అక్కినేని హీరో నాగ చైత‌న్య. ఆయ‌న కెరీర్‌లో మ‌నం ఓ మెమొర‌బుల్ మూవీ. ఆ సినిమాను డైరెక్ట్ చేసింది విక్రమ్ కె.కుమార్‌. త‌ర్వాత వీరిద్దరి కాంబినేష‌న్‌లో సినిమా తెరకెక్కలేదు. దాదాపు 8 ఏళ్ల త‌ర్వాత ఈ హిట్ కాంబినేష‌న్‌లో రూపొందిన సినిమా ‘థాంక్యూ’. చైతన్య సక్సెస్ ట్రాక్.. విక్రమ్ కుమార్ వంటి సెన్సిబుల్ డైరెక్టర్‌కి తోడుగా దిల్ రాజు, శిరీష్ వంటి అభిరుచి గ‌ల నిర్మాత‌లు తోడయ్యారు. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌తో ఈ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ మ‌రింత పెరిగాయి. మ‌రి వాటిని సినిమా ఏ మేర‌కు అందుకుంద‌నేది తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం…

క‌థేంటంటే
అభిరామ్ (నాగ‌చైత‌న్య) పేదింటి కుర్రాడు. చిన్ననాటి నుంచే త‌న‌కంటూ కొన్ని ఆశ‌యాలుంటాయి. త‌న జీవితంలో ఒకొక్క మ‌జిలీ త‌ర్వాత అమెరికా చేరుకుంటాడు. అక్కడ త‌న తెలివితేట‌ల‌తో కార్పొరేట్ సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు. అత‌డి మ‌న‌సుని చూసి ప్రియ (రాశీఖ‌న్నా) ప్రేమిస్తుంది. ఇద్దరూ స‌హ‌జీవ‌నం చేస్తారు. జీవితంలో ఎదుగుతున్న కొద్దీ అభి ఆలోచ‌న‌లు మారిపోతాయి. జీవితంలో ఎన్నో వ‌దులుకుని ఇక్కడిదాకా వ‌చ్చా.. రాజీ ప‌డే ప్రస‌క్తే లేదంటూ ఎవ్వరినీ లెక్క చేయ‌డు. నేను, నా ఎదుగుద‌ల అన్నట్టుగానే వ్యవ‌హరిస్తుంటాడు. ఎదుటివాళ్ల మ‌నోభావాల్ని అస్సలు ప‌ట్టించుకోడు. దీంతో ప్రియ అత‌డికి దూరంగా వెళ్లిపోతుంది. అభి అలా సెల్ఫ్ సెంట్రిక్‌గా మార‌డానికి దారి తీసిన ప‌రిస్థితులు ఏమిటి? ప్రియ దూర‌మ‌య్యాకైనా అతడి ఆలోచ‌న‌లు మారాయా? ఆ తర్వాత ఇండియాకి వ‌చ్చిన అభి ఏం చేశాడన్నదే మిగ‌తా క‌థ‌.

వ్యక్తి జీవితంలో సాధించిన విజ‌యాల వెనుక ఎంతో మంది ప్రోత్సాహం, తోడ్పాటు ఉంటుంది. అలాంటి వారిని క‌లుసుకునే వ్యక్తి భావోద్వేగ ప్రయాణ‌మే ‘థాంక్యూ’ సినిమా. నాగ చైత‌న్య చుట్టూనే ‘థాంక్యూ’ సినిమా నడిచింది. ఓ రకంగా భారీ యాక్షన్ స‌న్నివేశాలు, సెట్స్‌, క‌మ‌ర్షియ‌ల్ అంశాలు లేకుండా.. ఎమోష‌న్స్‌ను ప్రధానంగా చేసుకుని న‌డిచే సినిమా ఇది. ఇలాంటి సినిమాను యాక్సెప్ట్ చేయ‌ట‌మే గొప్ప విష‌యం అనాలి. 30ఏళ్ల వ్యక్తి జీవితంలో జరిగే మూడు ముఖ్య ద‌శ‌ల‌ను ఈ సినిమా రూపంలో మ‌లిచారు. వాటిలో ఒదిగిపోవ‌టానికి నాగ చైత‌న్య చాలానే క‌ష్టప‌డ్డారు. ముఖ్యంగా గ్రామంలో ప‌ద్దెనిమిదేళ్ల కుర్రాడుగా క‌నిపించటానికి త‌న బ‌రువు త‌గ్గటం.. మ‌ళ్లీ త‌ర్వాత క‌నిపించే పాత్రలో ర‌గ్డ్‌గా క‌నిపించ‌టం అనేది చాలా క‌ష్టమైన విష‌యం. ఆ రెంటిని చైత‌న్య త‌న‌దైన న‌ట‌న‌తో చ‌క్కగా బ్యాలెన్స్ చేస్తూ వ‌చ్చారు. నిజంగా త‌న ప్రయ‌త్నాన్ని క‌చ్చితంగా అభినందించాలి. త‌న ఓజ్‌ను దాటి ఓ కొత్త ఎక్స్‌పెరిమెంట్ చేశాడు చైత‌న్య.

అభిరామ్ ప్రయాణ‌మే ఈ సినిమా. జీవితంలో అప్పటిదాకా దాటుకుంటూ వ‌చ్చిన ఒక్కొక్క ద‌శ‌ని ఆవిష్కరిస్తూ భావోద్వేగాల్ని పంచ‌డ‌మ‌నే కాన్సెప్ట్ మ‌న సినిమాకి కొత్తేమీ కాదు. నాగ‌చైత‌న్య ‘ప్రేమ‌మ్‌’ కూడా అలాంటి ప్రయ‌త్నమే. కాక‌పోతే ఈ క‌థ‌లో ప్రేమ‌కంటే కూడా జీవితంపైనే ఎక్కువ‌గా దృష్టిపెట్టారు. తెలిసో తెలియ‌కో ఒక్కొక్కరూ మ‌న జీవితాన్ని ఒక్కో మ‌లుపు తిప్పుతుంటారు. మ‌నం ఎదిగాక కృత‌జ్ఞత‌గా వాళ్లని గుర్తు చేసుకోవాల్సిందే అని చెప్పే ప్రయ‌త్నం ఇందులో క‌నిపిస్తుంది. క‌థేదైనా క‌థ‌నంతో దానికి కొత్త హంగులు తీసుకొచ్చే ప్రయ‌త్నం చేస్తుంటారు. ఇందులోని క‌థ అంద‌రికీ తెలిసిందే. క‌థ‌నం విష‌యంలోనూ పెద్దగా క‌స‌ర‌త్తులు చేయ‌లేదు. దాంతో ఏ ద‌శ‌లోనూ సినిమా ఆస‌క్తిని రేకెత్తించ‌దు. ఆరంభ స‌న్నివేశాలు ఆహ్లాదాన్ని పంచుతాయి. ప్రియ‌, అభిరామ్ క‌ల‌వ‌డం.. వాళ్ల మ‌ధ్య ప్రేమ చిగురించ‌డం.. ఆ త‌ర్వాత అభిరామ్ ఎదుగుద‌ల నేప‌థ్యంలో స‌న్నివేశాలు ప్రేక్షకుడిని క‌థ‌లో లీనం చేస్తాయి.

కానీ ఈ క‌థాగ‌మ‌నం ఏమిటో ప్రేక్షకుడి ఊహ‌కు అందేలా సాగుతుంది. మ‌న‌స్సాక్షి ఎపిసోడ్ త‌ర్వాత క‌థ‌లో ఉప‌క‌థ‌లు మొద‌ల‌వుతాయి. నాగ‌చైత‌న్య – మాళ‌విక నాయ‌ర్ (పార్వతి) మ‌ధ్య సాగే తొలిక‌థ కొత్తగా అనిపించ‌క‌పోయినా అందంగానే ఉంటుంది. ద్వితీయార్ధం త‌ర్వాత మొద‌ల‌య్యే రెండో క‌థ విష‌యంలోనే స‌మ‌స్యంతా. సుదీర్ఘంగా సాగ‌డం, అందులో కొత్తద‌నమేదీ లేక‌పోవ‌డంతో సినిమా రొటీన్‌గా మారిపోయింది. క‌టౌట్లు, హాకీ అంటూ చాలా హంగామానే ఉంటుంది కానీ, ఆ స‌న్నివేశాల‌న్నీ కూడా సాగ‌దీత‌గానే అనిపిస్తాయి. పార్వతి, శ‌ర్వాని క‌లిశాక ప‌తాక స‌న్నివేశాలు మొద‌ల‌వుతాయి. అవి భావోద్వేగాల‌తో మ‌న‌సుల్ని హ‌త్తుకునేలా ఉన్నప్పటికీ అప్పటికే జ‌రగాల్సిన న‌ష్టమంతా జ‌రిగిపోయిన‌ట్టు అనిపిస్తుంది.

భావోద్వేగంగా సినిమా ప్రేక్షకుల‌ను మెప్పించాల‌ని యూనిట్ చేసిన ప్రయ‌త్నం ఓకే. అయితే సినిమా బావున‌ట్లే ఉంటుంది కానీ.. ఎమోష‌న‌ల్‌గా ప్రేక్షకుడు క‌నెక్ట్ కాలేడు.. మ‌నం వంటి ఎమోష‌న‌ల్ మూవీని అద్భుతంగా తెర‌కెక్కించి ద‌ర్శకుడు విక్రమ్ కుమారేనా ఈ సినిమాను డైరెక్ట్ చేసింద‌నే డౌట్ రాక మాన‌దు. ఇక ఇలాంటి ఫీల్ గుడ్ మూవీలో ఎమోషన్ క‌నెక్ట్ కావాలంటే సంగీతం ప్రధాన పాత్రను పోషించాల్సి ఉంటుంది. త‌మ‌న్ సంగీతం పాట‌లు సిట్యువేష‌న్స్‌కు త‌గ్గట్టు వెళ్లాయే త‌ప్ప.. గొప్పగా లేవు. నేప‌థ్య సంగీతం ఫర్వాలేదు. ఇక పి.సి.శ్రీరామ్‌గారి సినిమాటోగ్రఫీకి మ‌నం వంక‌లు పెట్టలేం. విజువ‌ల్స్‌గా సినిమా చాలా ఎఫెక్టివ్‌గా అనిపిస్తుంద‌న‌డంలో సందేహం లేదు. అక్కినేని అభిమానులు సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ కామ‌న్ ఆడియెన్స్‌కు మాత్రం సినిమా అంత ఎమోష‌న‌ల్‌గా క‌నెక్టింగ్‌గా అనిపించ‌దు.


సంక్రాంతి సోగ్గాడు. ‘బంగార్రాజు’ రివ్యూ

న‌టీన‌టులు: అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి, చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, ఝాన్సీ త‌దిత‌రులు.

కథ, దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ
నిర్మాత: అక్కినేని నాగార్జున
స్క్రీన్ ప్లే: సత్యానంద్
సంగీతం: అనూప్ రూబెన్స్,
ఛాయాగ్రహ‌ణం: యువరాజ్
నిర్మాణ సంస్థ: జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి.
విడుద‌ల‌: 14 జ‌న‌వ‌రి 2021

అక్కినేని నాగార్జున కెరీర్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా’. నాగార్జున డ్యూయల్ రోల్‌ చేసిన ఈ సినిమా 2016, సంక్రాంతి సీజన్‌లో విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ చిత్రానికి కొనసాగింపుగా అందులోని బంగార్రాజు పాత్రతో కథని అల్లుకొని ‘సోగ్గాడే చిన్ని నాయనా’కి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ సినిమా తెరకెక్కింది. ‘మనం’ తర్వాత నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన ఈ చిత్రం శుక్రవారం(జనవరి 14)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కి మంచి స్పందన రావడం.. దానికి తోడు ప్రమోషన్స్‌ని గ్రాండ్‌‌గా చేయడంలో ‘బంగార్రాజు’పై భారీగా హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య సంక్రాంతి బరిలోకి దిగిన ‘బంగార్రాజు’ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించాడు?.. బంగార్రాజు పాత్రల్లో తండ్రీ తనయులు చేసిన సందడి ఎలా ఉంది? త‌దిత‌ర విష‌యాలు తెలుసుకుందాం…

కథేంటి..

సోగ్గాడే చిన్ని నాయన’చిత్రం ఎక్కడ ముగిసిందో.. అక్కడి నుంచే ‘బంగార్రాజు’ కథ మొదలవుతుంది. ఆత్మగా వచ్చిన బంగార్రాజు(నాగార్జున)..తన ఫ్యామిలీ సమస్యలన్నీ చక్కదిద్ది స్వర్గానికి తిరిగి వెళ్తాడు. కొన్నాళ్లకు డాక్టర్‌ రాము(నాగార్జున), సీత దంపతులకు కొడుకు పుట్టడం, కొంతకాలానికే సీత చనిపోవడంతో కొడుకు బాధ్యతలకు తన తల్లి సత్తెమ్మ(రమ్యకృష్ణ)కు అప్పగించి రాము విదేశాలకు వెళ్లిపోతాడు. మనవడు పెద్దయ్యేసరికి సత్తెమ్మ కూడా చనిపోయి ఉన్న బంగార్రాజు దగ్గరకు వెళ్లుంది. చిన్న బంగార్రాజు(నాగచైతన్య) కూడా తాత మాదిరే ఊర్లో ఆవారాగా తిరుతూ అమ్మాయిల వెంటపడుతుంటాడు. మరోపక్క చిన్న బంగార్రాజు మరదలు నాగలక్ష్మీ(కృతిశెట్టి) ఆ ఊరికి సర్పంచ్‌ అవుతుంది. వీరిద్దరికి ఒకరంటే ఒకరుపడరు. కానీ వీరిద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుందని సత్తెమ్మ భావిస్తుంది సత్తెమ్మ. తన మనవడి ప్రేమకి సహాయం చేయడానికి బంగార్రాజుని భూమ్మీదకి పంపిస్తుంది. అలా చిన బంగార్రాజులోకి ఆత్మగా దూరి అత‌నికి పెద బంగార్రాజు ఎలా సాయం చేశాడు? భార్య స‌త్యభామ కోరిక మేర‌కు చిన్న బంగార్రాజునీ, నాగ‌ల‌క్ష్మి (కృతిశెట్టి)నీ ఎలా క‌లిపాడు? చిన బంగార్రాజుని చంపాల‌నే కుట్రతోపాటు, ఊరి గుడిలో ఉన్న నిధులపై క‌న్నేసిన దుష్ట శ‌క్తుల ప‌త‌కాల్ని బంగార్రాజు ఎలా తిప్పికొట్టాడన్నదే మిగ‌తా క‌థ‌.

సినిమా ఎలా ఉందంటే…
పండ‌గ‌ లాంటి సినిమా అని ముందునుంచీ చెబుతూ వ‌చ్చిన చిత్ర బృందం అందుకు త‌గ్గ హంగుల్ని ప‌క్కాగా మేళ‌వించింది. గ్రామీణ నేప‌థ్యం, ఆక‌ట్టుకునే తారాగ‌ణం, క‌ల‌ర్‌ఫుల్ పాట‌ల‌కి తోడు అభిమానుల్ని మెప్పించే అంశాల్ని జోడించి సినిమాని తీర్చిదిద్దారు. పండ‌గ స‌మ‌యంలోనే విడుద‌లైంది కాబ‌ట్టి సంద‌డికి ఢోకా లేద‌న్నట్టుగా సాగిపోతుంది సినిమా. తొలి సినిమా త‌ర‌హాలోనే ప‌క్కా ఫార్ములాతో గుడికీ, బంగార్రాజు కుటుంబానికీ ముడిపెట్టి క‌థ‌ని అల్లుకున్నారు ద‌ర్శకుడు. తొలి సినిమాలో త‌న‌యుడి స‌మ‌స్యయితే, ఇందులో మ‌న‌వ‌డి జీవితాన్ని చ‌క్కబెడ‌తాడు. తొలి సినిమాలో బంగార్రాజు మాత్రమే ఆత్మ, ఇందులో మాత్రం ఆయ‌న‌కి భార్య స‌త్యభామ కూడా కూడా తోడైంది.

ఫస్టాప్ కూల్.. సెకండాఫ్ కేక
ఫస్టాప్ అంతా మ‌న్మథుడిగా ముద్రప‌డిన చిన‌బంగార్రాజు, ఊరి స‌ర్పంచ్ అయిన నాగ‌ల‌క్ష్మి హంగామాతోనే సాగుతుంది. ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌ని ఆ ఇద్దరూ క‌లిసే వైనం, పెద్ద బంగార్రాజు చేసే మేజిక్‌తో స‌న్నివేశాలు స‌ర‌దాగా సాగిపోతాయి. ప్రథ‌మార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం ఆస‌క్తిని పెంచుతుంది. చాలా స‌న్నివేశాలు ఊహాజ‌నితంగానే సాగినప్పటికీ మాస్ ప్రేక్షకుల్ని మెప్పించే అంశాల్ని పుష్కలంగా జోడించారు. మామిడి తోట‌లో చిన్న పిల్లాడిని కాపాడే స‌న్నివేశాలు, ప‌తాక స‌న్నివేశాల్లో గుడి ద‌గ్గర చోటు చేసుకునే మ‌లుపు ప్రేక్షకుల్ని అలరిస్తాయి. అత్తమామ‌లు, కోడ‌లికి మ‌ధ్య మ‌న‌స్పర్థల్ని తొలిగించే ఓ స‌న్నివేశంలో బంగార్రాజు చెప్పే సంభాష‌ణ‌లు, ఆ నేప‌థ్యంలో పండే భావోద్వేగాలు ఆక‌ట్టుకుంటాయి. అయితే ఈ సినిమాల్లో కొన్ని విషయాలు మరీ నాటకీయంగా అనిపిస్తాయి.

తండ్రీకొడుకులే హైలెట్
ఈ సినిమాకు ప్రధాన బలం నాగార్జున, నాగచైతన్యల నటనే. చిన్నబంగార్రాజు, పెద్ద బంగార్రాజు పాత్రల్లో వీరిద్దరు ఒదిగిపోయారు. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తాయి. బంగార్రాజు ఆత్మ దూరిన ప్రతిసారి నాగచైతన్య చేసే సందడి ఆకట్టుకుంటుంది. అయితే సాధారణ సమయంలో చిన్నబంగార్రాజు కామ్‌గా ఉండడం.. ఆత్మ దూరిన తర్వాత రెచ్చిపోవడంతో.. చై కంటే నాగార్జుననే హైలెట్‌ అయ్యాడని చెప్పాలి. క్లైమాక్స్‌లో వీరిద్దరు కలిసి చేసే ఫైట్‌ సీన్‌ కూడా ఆకట్టుకుంటుంది.

ఎవరెలా చేశారంటే..
గ్రామ సర్పంచ్‌ నాగలక్ష్మీగా కృతిశెట్టి తనదైన నటనతో మెప్పించింది. అమాయకపు మాటలతో నవ్వించింది. బంగార్రాజు భార‍్య సత్య అలియాస్‌ సత్తెమ్మగా రమ్యకృష్ణ మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించింది. సంపత్‌ రాజ్‌, రావు రమేశ్‌, వెన్నెల కిశోర్‌, బ్రహ్మాజీలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. యువ‌రాజ్ కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. అనూప్ పాట‌లు సినిమాకి ప్రధాన బ‌లం. విజువ‌ల్‌గా కూడా పాట‌లు ఆక‌ట్టుకుంటాయి. ద‌ర్శకుడు క‌ళ్యాణ్‌కృష్ణ ర‌చ‌న ప‌రంగా త‌న‌దైన ప్రభావం చూపించారు. కథ పరంగా మరింత ఫోకస్ చేస్తే సినిమా మరో స్థాయిలో ఉండేది. మొత్తానికి ‘బంగార్రాజు’ సంక్రాంతి సోగ్గాడు తానేనని మరోసారి నిరూపించుకున్నాడు.


‘బంగార్రాజు’ టీజర్ అదరహో.. సంక్రాంతికి వచ్చేస్తున్నాడు

అక్కినేని నాగార్జున కెరీర్‌లో బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా’. కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కించిన ఈ చిత్రం 2016 సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించింది. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన సోగ్గాడే సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా ఘనవిజయంతో సీక్వెల్ చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు నాగార్జున. అయితే ఇప్పుడు దాన్ని సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ చేసాడు నాగార్జున. అంటే ముందు జరిగే కథ అన్నమాట. దీనికి సంబంధించిన ప్రకటన కూడా అప్పుడే చేసినా అది పట్టాలెక్కడానికి ఐదేళ్ళు పట్టింది. మూడేళ్లుగా ఇప్పుడు అప్పుడూ అంటూ వాయిదా పడుతున్న బంగార్రాజు సంక్రాంతికి వచ్చేస్తున్నాడు. ఇందులో నాగార్జున, రమ్యకృష్ణతో పాటు నాగచైతన్య, కృతి శెట్టిలు కూడా జంటగా నటిస్తున్నారు.

న్యూ ఇయర్ కానుకగా చిత్ర యూనిట్ శనివారం టీజర్ విడుదల చేసింది. టీజర్ చూస్తుంటే ‘సోగ్గాడే చిన్ని నాయనా’ను మించి ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఇందులో కామెడీ, రొమాంటిక్ సన్నివేశాలే కాక యాక్షన్, డివోషనల్ సన్నివేశాలు కూడా బాగానే ఉన్నట్లు తెలుస్తుంది. నాగ చైతన్య కూడా తండ్రి లాంటి క్యారెక్టర్‌తో అదరగొట్టేశాడు. ఇక కృతి శెట్టి చాలా క్యూట్‌ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది. ఇందులో కృతిశెట్టి గ్రామ సర్పంచ్ గా చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే నాగార్జునకి, నాగ చైతన్యకి మధ్య ఉన్న సంబంధం ఏంటో మాత్రం టీజర్ లో రివీల్ చేయలేదు.