చిరంజీవితో విభేదాలు.. మరోసారి క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్

చిరంజీవితో విభేదాలు.. మరోసారి క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్

చిరంజీవి – అల్లు అరవింద్‌ ఒకరికొకరు ఎలా గౌరవంగా మెలుగుతారో సినిమా ఇండస్ట్రీతో పాటు సామాన్య ప్రేక్షకులకు కూడా తెలిసిందే. అయితే మెగా-అల్లు కుటుంబాల మధ్య విభేదాలున్నాయంటూ తరుచూ వార్తలొస్తూనే ఉంటాయి. అయితే ఎప్పటికప్పుడు ఆ వార్తలను వారు ఖండిస్తూనే ఉన్నా పుకార్లు మాత్రం ఆగవు. ఇదే అంశంపై అల్లు అరవింద్‌ మరోసారి స్పందించారు.

తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అరవింద్‌ మాట్లాడుతూ.. ‘‘సమాజంలో ఇలాంటి మాటలు సహజం. అయితే 80ల కాలం నుంచి మేమిద్దరం ఒకరికొకరు అన్నట్లు స్నేహితులుగా ఉంటూ పైకొచ్చాం. బావబావమరుదులుగా కాకుండా మంచి స్నేహితులుగా ఎదిగాం. మేం ఎదుగుతున్న తరుణంలో మా కుటుంబాలు పెరిగాయి. పిల్లలు వచ్చారు. వారు కూడా ఇదే వృత్తిలో స్థిరపడ్డారు. ఫిల్మ్‌ సొసైటీలో ఉన్న అవకాశాలను అందరూ పంచుకోవాలి. ఎవరి స్థానాలను వారు కాపాడుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. ఇలాంటి పరిస్థితులు పోటీ అనేది సహజంగా ఉంటుంది. అయితే ఇక్కడ జనాలు ఒకటి గమనించాలి. వీళ్లందరూ ఒక్కటే. ఎవరి మీద ఏ మాట పడినా అందరూ ఒక మాట మీద ఉంటారు అన్నది జనాలకు తెలియడం చాలా ముఖ్యం. ఉదాహరణకు ఇటీవల నాన్నగారి శత జయంతి ఉత్సవాలను మా కుటుంబాలన్నీ కలిసి నిర్వహించాం. సంక్రాంతి పండుగ రోజు మా నాన్నగారికి చేయాల్సిన కార్యక్రమాలు పూర్తి చేసి చిరంజీవిగారి ఇంటికి వెళ్లిపోతాం. దీపావళి రోజున అందరం కలిసి చిరంజీవిగారింట్లో చేరి సరదాగా సెలబ్రేట్‌ చేసుకుంటాం. కొన్నేళ్లుగా ఇది జరుగుతూనే ఉంది. మేమంతా కలిసి పండగలు సెలబ్రేట్‌ చేసుకుంటున్నామని వీడియోలు తీసే మీడియా పెడతామా? పెట్టం కదా! ఎవరి కాంపిటీషన్‌తో వాళ్లు పైకి వస్తున్నారు కానీ వీరంతా ఒకటే అని జనాలు తెలుసుకోవాలి’’ అని అల్లు అరవింద్‌ క్లారిటీ ఇచ్చారు.

‘ఓ సన్నివేశంలో నటించడం కష్టమై 10 టేకులు తీసుకోవడం వల్ల దర్శకుడు విసుక్కున్నారని నాన్న అమ్మతో చెబుతుంటే విన్నాను. అప్పుడు నాన్న కళ్లల్లో నీళ్లు చూశా. ఆ సంఘటన బలంగా నాటుకుపోయింది. కొన్నాళ్ల తర్వాత బలవంతం మీద చిరంజీవి నటించిన ‘చంటబ్బాయ్‌’లో ఓ పాత్ర చేశా. దానికి చక్కని ఆదరణ లభించింది. ఆ సినిమా విడుదల తర్వాత ‘నిర్మాతగా ఉంటే డబ్బులు వస్తాయో రావో తెలియదు. అదే నటిస్తే ఆ సమస్య ఉండదు. యాక్టర్‌ అవ్వచ్చు కదా’’ అని ఓ రోజు నాన్న అడిగారు. మరుసటి రోజు ఆయన దగ్గరకు వెళ్లి ‘నేను ఎప్పుడూ యజమానిగా ఉండాలనుకుంటున్నా.. కానీ, ఉద్యోగి కావాలనుకోలేదు’ అని చెప్పాను. నాన్నకు తెలిసిన మంత్రి ద్వారా స్టేట్‌ బ్యాంక్‌లో ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేశారు. అప్పట్లోనే రూ.900 జీతం. నేను వ్యాపారమే చేస్తాను కానీ ఉద్యోగం జోలికి వెళ్లనని చెప్పేశా’ అని అరవింద్ చెప్పుకొచ్చారు.


‘అఖండ’ అలాంటి సినిమా రాదనుకున్నా.. కానీ కార్తికేయ-2 వచ్చింది

‘కార్తికేయ 2’ సినిమా విడుదలకు ముందు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కానీ విడుదల తర్వాత విజయదుందుభి మోగిస్తుంది. చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలలో మా సినిమాను కృష్ణుడు నడిపిస్తున్నాడు అని చెబుతూ వస్తున్నారు. ‘మనం ఏదైనా బలంగా కోరుకుంటే.. అది మనకు చేరే వరకు ఈ విశ్వమంతా సహాయపడుతుంది..’ అనేది.. ఈ టీమ్ నమ్మకాన్ని చూస్తుంటే నిజమేనని అనిపిస్తుంది. రోజురోజుకీ ఊహించని విధంగా ఈ చిత్రం కలెక్షన్లను రాబడుతోంది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఈ చిత్రం సత్తా చాటుతోంది. బాలీవుడ్ పరంగా ఈ చిత్రాన్ని నిర్మాత అల్లు అరవింద్వంటివారు ‘పుష్ప’ సినిమాతో పోల్చుతున్నారంటే.. ఏ స్థాయిలో బాలీవుడ్‌లో ఈ చిత్రం సంచలనాలను క్రియేట్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.

ఒక్క అల్లు అరవిందే కాదు.. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ దర్శకుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శ్రీ కృష్ణుని లీలలను సైన్స్‌కి, టెక్నాలజీకి ముడిపెట్టడం ప్రేక్షకులను కదిలించిందంటూ.. అలాగే.. ‘‘మనకు కనిపించడం లేదంటే మన కన్ను చూడలేకపోతుందని అర్ధం, మనకు కన్ను లేదని కాదు. శ్రీకృష్ణుడు చెప్పిన కర్మం మతం కాదు మన జీవితం. గీతతో కోట్ల మందికి దారి చూపించిన శ్రీ కృష్ణుడు కంటే గురువు ఎవరు.?’’ వంటి డైలాగ్స్ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే విధంగా ఉన్నాయంటూ.. సినీ విశ్లేషకులు సైతం ఈ సినిమాని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. .

తాజాగా జరిగిన సక్సెస్ మీట్‌లో.. ‘‘మాములుగా హిందీలో కేవలం 50 థియేటర్లలో రిలీజైన కార్తికేయ 2 సినిమా, రెండో రోజుకు 200 థియేటర్లు, 3వ రోజుకి 700 థియేటర్లలో ఆడటం.. సంతోషాన్ని కలిగించే విషయం. ఈ సినిమాలో సత్తా ఉంది కాబట్టే ఇది సాధ్యమైంది. ‘పుష్ప’ కూడా ఇలానే బాలీవుడ్‌లో ఘన విజయం సాధించింది. నేను ‘అఖండ’ సినిమా చూసినప్పుడు శైవం మీద, శివతత్వంపై ఎమోషన్స్‌ని పండిస్తూ.. తారా స్థాయికి తీసుకెళ్లారని అనిపించింది. అలాగే.. ఇంకో రెండు మూడు ఏళ్ళల్లో విష్ణువును బేస్‌గా తీసుకుని సినిమా చేస్తారు అని ఉహించి.. చర్చలు కూడా జరిపాను. అటువంటిది ఒక ఏడాది తిరగకముందే విష్ణుతత్వం (కృష్ణతత్వం) మీద సినిమా రావడం, పెద్ద విజయం సాధించడం ఆశ్చర్యపరిచింది. మధ్య మధ్యలో యానిమేషన్‌లో చూపిస్తూ మళ్ళీ పిక్చర్‌లో తీసుకెళ్లడం చాలా బాగుంది. అందుకు దర్శకుడు చందూ మొండేటికి అభినందనలు.

సినిమా అంటే అమ్మాయి, అబ్బాయి మధ్య రొమాన్స్ మాత్రమే కాకుండా.. ఒక అమ్మాయి, అబ్బాయి ఒక కాజ్ కోసం పరిగెడితే చాలు, మనం కూడా వాళ్ళ వెనుక పరిగెడతాం.. అని ప్రేక్షకుల చేత థియేటర్లకి పరుగులు పెట్టిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక అడ్వెంచర్ ఫిల్మ్‌కు పౌరాణిక బేస్ ఇచ్చి.. మళ్ళీ దానిని కలికాలంలోకి తీసుకొచ్చిన విధానం నాకెంతో నచ్చింది’’ అని నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాపై విశ్లేషణ చేశారు.