బన్నీ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. ‘సామి సామి’ వీడియో సాంగ్‌ వచ్చేసింది

బన్నీ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. ‘సామి సామి’ వీడియో సాంగ్‌ వచ్చేసింది

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ సినిమా వచ్చిన ‘పుష్ప ది రైజ్‌’ ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయయాన్ని నమోదు చేసుకుంది. డిసెంబర్‌ 17న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన చిత్రం అన్ని భాషల్లో మంచి బజ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో బన్నీ మాస్‌ యాక్టింగ్‌తో పాటు పాటలు కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్‌ వరుస పెట్టి వీడియో సాంగ్స్‌ను విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే చిత్ర యూనిట్‌ విడుదల చేసిన ‘దాక్కో దాక్కో మేక’ వీడియో సాంగ్‌ యూట్యూబ్‌లో రికార్డ్‌ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా.. ‘సామి సామి’ వీడియో సాంగ్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ పాటను విడుదల చేసిన కేవలం కొన్ని గంటల్లోనే లక్షల వ్యూస్‌తో దూసుకుపోతోంది. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ పాటను మౌనిక యాదవ్‌ అనే ఫోక్‌ సింగర్‌ అద్భుతంగా ఆలపించారు.


Pushpa: ‘దాక్కో దాక్కో మేక’ వీడియో సాంగ్ రిలీజ్

అల్లు అర్జున్‌- సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ సినిమా అన్ని భాషల్లో మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. సినిమా రిలీజ్‌కు ముందే ఈ సినిమా పాటలు సూపర్‌ హిట్టైన సంగతి తెలిసిందే. తాజాగా పుష్ప చిత్రంలోని తొలి సాంగ్‌ ‘దాక్కో దాక్కో మేక’ ఫుల్ వీడియోను చిత్రబృందం గురువారం విడుదల చేసింది. ఒకేసారి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఫుల్‌సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. ఇక ఈ చిత్రంలోని అన్ని పాటలను చంద్రబోస్‌ రాయడం విశేషం. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటించింది. అల్లు అర్జున్ కెరీర్లోనే తొలి పాన్ ఇండియా సినిమాగా ‘పుష్ప’ నిలిచింది.


‘పుష్ప-2’ వచ్చేది అప్పుడే.. ప్లాన్ చేస్తున్న సుక్కూ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో హ్యాట్రిక్ మూవీగా వచ్చిన ‘పుష్ప : ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ తన దూకుడు చూపిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో నూ, ఓవర్సీస్ లోనూ ఈ సినిమాకి డీసెంట్ కలెక్షన్స్ వస్తూండడం అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇక తదుపరి భాగంగా రాబోయే ‘పుష్ప ది రూల్’ పైనే ఉంది అందరి దృష్టి. ఈ సినిమా షూటింగ్ ను ఫిబ్రవరిలో మొదలు పెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిజానికి రెండో భాగంలో మదర్ సెంటిమెంట్ మోతాదు కాస్త ఎక్కువగానే ఉందట. దాన్ని నిడివి తగ్గించి.. ఫహద్ ఫాజిల్ కు , బన్నీకి మధ్య వచ్చే సీన్స్ లెంత్ పెంచే ఆలోచనలో ఉందట టీమ్. అలాగే బన్నీ, రష్మికల మధ్య రొమాంటిక్ సీన్స్ ను కూడా పెంచుతున్నారట. ‘పుష్ప 2’ చిత్రం షూటింగ్ కోసం సుకుమార్ 100రోజుల టార్గెట్ పెట్టుకున్నారట. అంటే దాదాపు మూడు నెలలు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ మొదలైతే.. మే నెల నాటికి టాకీ పార్ట్ కంప్లీట్ అవ్వాలి. ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసి.. సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలనేది సుకుమార్ ఆలోచనగా తెలుస్తోంది. ఫహద్ ఫాజిల్ మలయాళంలో చాలా బిజీ ఆర్టిస్ట్.. ఆయన వీలును బట్టి.. సీన్స్ ప్లాన్ చేయాలి. అలాగే… అల్లు అర్జున్, ఇతర ముఖ్య నటుల వీలు కూడా చూసుకోవాలి. వీరి డేట్స్ ను బట్టే.. పుష్ప2 షెడ్యూల్స్ ప్లానింగ్ ఉంటుందట.


Pushpa Review: ‘పుష్ప’ రివ్యూ… సినిమా ఎలా ఉందంటే..

‘అల వైకుంఠ‌పురంలో’ వంటి క్లాస్ మూవీ త‌ర్వాత ప‌క్కా మాస్ ఎంటర్‌టైనర్ ‘పుష్ప: ది రైజ్ పార్ట్ 1’ తో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చాడు అల్లు అర్జున్. ఆర్య, ఆర్య-2 వంటి విజయాల తర్వాత సుకుమార్ – అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ఇది. దీంతో కొబ్బరికాయ కొట్టడం నుంచి గుమ్మడికాయ కొట్టేవరకు ఈ సినిమాకు సంబంధించి ప్రతి చిన్న విషయం హాట్‌టాపిక్‌గా మారింది. బన్నీని ఊరమాస్‌ లుక్‌లో ‘పుష్ప’గా పరిచయం చేసిన తర్వాత ఆ అంచనాలు మరింత రెట్టింపయ్యాయి.

అల్లు అర్జున్‌ ఎర్రచందనం స్మగ్లర్‌గా నటించటం, రష్మిక డీగ్లామర్‌ పాత్ర చేయటం, సునీల్‌, మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకులుగా నటిస్తుండటం ఆసక్తిని కలిగించింది. బన్నీ కెరీర్లో తొలి పాన్‌ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్‌కు ముందే 250 కోట్ల వరకు ప్రీ రిజీజ్ బిజినెస్ చేసి రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చిన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘పుష్ప’ ఎలా ఉంది? పుష్పరాజ్‌గా మాస్‌ లుక్‌లో అల్లు అర్జున్‌ ఎలా నటించారు? అసలు ఈ సినిమా కథేంటి.. తెలుసుకుందామా..

పుష్పరాజ్‌(అల్లు అర్జున్‌) కట్టెల దుకాణంలో కూలీగా పనిచేస్తుంటాడు. అయితే అతడి పుట్టుకకు సంబంధించిన విషయంలో సమాజంలో ఎప్పుడూ అవమానాలే ఎదుర్కొంటూ ఉంటాడు. దీంతో జీవితంలో ఎలాగైనా ఉన్నతస్థాయికి ఎదగాలన్న కాంక్ష అతడిలో రగులుతుంది. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను కొట్టి ఇతర దేశాలకు ఎగుమతి చేసే సిండికేట్‌కు మధ్యవర్తిగా వ్యవహరిస్తుంటాడు కొండారెడ్డి(అజయ్‌ ఘోష్‌). ఈ విషయం తెలుసుకున్న పుష్పరాజ్‌ ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తే డబ్బులు బాగా వస్తాయని ఆ సిండికేట్‌ తరఫున కూలీగా అడవుల్లోకి వెళతాడు. ఒక కూలీగా ఎర్ర చందనం స్మగ్లింగ్‌లో అడుగు పెట్టిన పుష్పరాజ్‌ ఆ సిండికేట్‌కు నాయకుడుగా ఎలా ఎదిగాడు? స్మగ్లింగ్‌ చేసే ఎర్రచందనం పోలీసులకు చిక్కకుండా పుష్పరాజ్‌ ఎలా తరలించాడు? ఈ క్రమంలో అడ్డు వచ్చిన మంగళం శ్రీను(సునీల్‌), కొండారెడ్డిలను ఎలా ఎదిరించాడు? పోలీసు ఆఫీసర్‌ భన్వర్‌ సింగ్‌ షెకావత్‌(ఫహద్‌ ఫాజిల్‌) నుంచి పుష్పరాజ్‌కు ఎదురైన పరిస్థితులు ఏంటి? శ్రీవల్లి(రష్మిక) ప్రేమను ఎలా పొందాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఫస్టాప్
ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తిగా అల్లు అర్జున్ మాస్ ఎంట్రీ అదిరిపోయింది. వాయిస్ ఓవర్‌తో ఫ్లాష్ బ్యాక్ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలోనే చిత్తూర్ యాసతో సినిమా అసలు కథాంశంలోకి వెళుతుంది. హరీష్ ఉత్తమన్ పోలీస్ ఆఫీసర్ గోవిందప్పగా పరిచయం అవుతాడు. ఈ నేపథ్యంలో ఫస్ట్ సాంగ్ *దాక్కో దాక్కో మేక వచ్చి’ బన్నీ మాస్ స్టెప్పులతో అలరిస్తాడు. పుష్ప కొండారెడ్డితో చేతులు కలుపుతాడు. అప్పుడే శ్రీవల్లిగా రష్మిక పరిచయమవుతుంది. ఈ నేపథ్యంలో బన్నీ – రష్మికల మధ్య శ్రీవల్లి సాంగ్ వచ్చి ఆకట్టుకుంటుంది. ఇక మంగళం శీనుగా సునీల్‌, ద్రాక్షాయణిగా అనసూయ భరద్వాజ్ పాత్రలు పరిచయమవుతాయి. ఆ తర్వాత ఓ ఆసక్తికరమైన స్మగ్లింగ్ సన్నివేశం. ఈ నేపథ్యంలో సమంత స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా… ఊ ఊ అంటావా’ వచ్చి థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. ఈ సాంగ్ తర్వాత భారీ యాక్షన్ సీన్.. “పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్” అంటూ బన్నీ చెప్పిన మాస్ డైలాగ్‌తో ఇంటర్వెల్.

సెకండాఫ్..
కొన్ని పరిస్థితుల్లో పుష్ప మంగళం శీనుకి ఎదురుతిరుగుతాడు. శ్రీవల్లి కోసం కొండారెడ్డి సోదరులకు వ్యతిరేకమవుతాడు. దీంతో కథలో మంచి ఆసక్తి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే సాలీడ్ మాస్ ఫైట్ బాగా ఆకట్టుకుంది. ఈ ఫైట్ తర్వాత వచ్చిన సామీ సామీ అనే మాస్ సాంగ్‌కి థియేటర్స్‌లో ఈలలు అరుపులతో మోగిపోయాయి. ఇక ఎర్రచందనం స్మగ్లింగ్ సీన్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. మొహం కనిపించకుండా అడవిలో పుష్ప చేసే ఫైట్ ఉత్కంఠభరితంగా సాగింది. ఈ ఫైట్ సెకండాఫ్‌లో హైలెట్ అని చెప్పొచ్చు. దీని తర్వాత వచ్చే ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ సాంగ్ అలరిస్తుంది. ఇక షికావత్‌గా మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తాడు. క్లైమాక్స్‌లో పుష్పకు షికావత్‌ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. దీని తర్వాత పుష్పకు పెళ్లి జరుగుతుంది. అనంతరం కథ ఎన్ని మలుపులు తీసుకుంటుందనేది రెండో భాగం ‘పుష్ప: ది రూల్‌’ చూడాల్సిందే

ఇప్పటి వరకూ వివిధ మాఫియాల నేపథ్యంలో వందల కథలను దర్శకులు వెండితెరపై చూపించారు. హవాలా, డ్రగ్స్‌, ఆయుధాలు ఇలా చెప్పుకొంటూ పోతే ప్రతిదీ ఒక సబ్జెక్ట్‌ అవుతుంది. ‘పుష్ప’ కోసం దర్శకుడు సుకుమార్‌ ‘ఎర్రచందనం’ స్మగ్లింగ్‌ నేపథ్యాన్ని, మాస్‌లో మంచి క్రేజ్‌ ఉన్న అల్లు అర్జున్‌ని కథానాయకుడిగా ఎంచుకున్నాడు. ఈ పాయింటే ‘పుష్ప’పై మంచి అంచనాలు ఏర్పడేలా చేసింది. అందుకు తగినట్లుగానే ప్రేక్షకులను మెప్పించేలా కథ, కథనాలను తీర్చిదిద్దడంలో సుకుమార్‌ కొంతవరకూ సఫలమయ్యాడు. మాస్‌ ప్రేక్షకులు మెచ్చేలా పుష్పరాజ్‌ను పరిచయం చేయడం, ఎర్రచందనం రవాణా, సిండికేట్‌ తదితర వ్యవహారాలతో కథను ప్రారంభించిన దర్శకుడు ఆసక్తి కలిగించేలా ఆయా సన్నివేశాలను గ్రాండ్‌ లుక్‌తో తెరపై చూపించాడు. ప్రతి సన్నివేశం కథానాయకుడి పాత్రను ఎలివేట్‌ చేసేలా తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులను అలరిస్తుంది. ముఖ్యంగా బన్నీ అభిమానులకు కనులపండువగా ఉంటుంది. ఒకవైపు పుష్పరాజ్‌ ప్రయాణాన్ని చూపిస్తూనే, మరోవైపు సిండికేట్‌ వెనుక ఉన్న అసలు పాత్రలను పరిచయం చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచాడు దర్శకుడు.

పుష్పరాజ్‌ కూలీ నుంచి సిండికేట్‌ నాయకుడిగా అడుగులు వేయడానికి దోహద పడేందుకు అవసరమైన బలమైన సన్నివేశాలు తెరపై చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. విరామం ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. దీంతో ‘పుష్ప’ పాత్ర పతాక స్థాయికి వెళ్లిపోతుంది. ఎర్రచందనం సిండికేట్‌ నుంచి వచ్చే పోటీని పుష్పరాజ్‌ ఎలా ఎదుర్కొంటాడన్న ఆసక్తితో ద్వితీయార్ధం చూడటం మొదలు పెట్టిన ప్రేక్షకుడికి నిరాశే ఎదురవుతుంది. తెరపై సన్నివేశాలు వస్తున్నా, కథ ముందుకు నడవదు. మధ్యలో శ్రీవల్లి ప్రేమ ప్రయాణం, పాటలు బాగున్నా, ఒక సీరియస్‌ మోడ్‌లో సాగుతున్న కథకు చిన్న చిన్న బ్రేక్‌లు వేసిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఈ క్రమంలోనే పోలీస్‌ ఆఫీసర్‌ భన్వర్‌సింగ్ షెకావత్‌గా ఫహద్‌ ఫాజిల్‌ పాత్ర పరిచయంతో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. ఇక్కడి నుంచి పుష్పరాజ్‌- భన్వర్‌ సింగ్‌ల మధ్య పోటాపోటీ ఉంటుందని ఆశించినా ఆయా సన్నివేశాలన్నీ సాదాసీదాగా సాగుతుంటాయి. ఒక బలమైన ముగింపుతో తొలి పార్ట్‌ ముగుస్తుందని ఆశించిన ప్రేక్షకుడు పూర్తి సంతృప్తి చెందడు. పార్ట్‌-2 కోసం చాలా విషయాలను ప్రశ్నార్థంగానే వదిలేసినట్లు అర్థమవుతుంది.

ఎవరెలా చేశారంటే..
‘పుష్ప: ది రైజ్‌’ అల్లు అర్జున్‌ వన్‌ మ్యాన్‌ షో అనే చెప్పాలి. కథ మొదలైన దగ్గరి నుంచి పుష్పరాజ్‌ పాత్రను ఎలివేట్‌ చేస్తూ తెరకెక్కించిన సన్నివేశాలు అద్భుతంగా అలరిస్తాయి. మాస్‌ లుక్‌లోనే కాదు నటనలోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టేశాడు. ఏ సన్నివేశం చూసినా ‘తగ్గేదేలే’ అంటూ ఫ్యాన్స్‌తో విజిల్స్‌ వేయించాడు. చిత్తూరు యాసలో బన్నీ పలికిన సంభాషణలు అలరిస్తాయి. శ్రీవల్లిగా డీగ్లామర్‌ పాత్రలో రష్మిక నటన సహజంగా ఉంది. కమెడియన్‌గా ప్రేక్షకులకు సుపరిచితమైన సునీల్‌ ఇందులో ప్రతినాయకుడు మంగళం శ్రీను పాత్రలో నటించాడు. ఈ పాత్ర కోసం సునీల్‌ మారిన తీరు, ఆయన డిక్షన్‌ బాగున్నాయి. అనసూయ, అజయ్‌ ఘోష్‌, రావు రమేశ్‌, ధనుంజయ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సమంత ఐటమ్‌ సాంగ్‌ మాస్ ప్రేక్షకులతో విజిల్స్‌ వేయిస్తుంది.

‘పుష్ప’ టెక్నికల్‌గా మరో లెవల్‌లో ఉంది. సినిమాటోగ్రాఫర్‌ కూబా గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి సన్నివేశాన్ని రిచ్‌లుక్‌లో చూపిస్తూనే, వాస్తవాన్ని ప్రతిబింబించేలా చూపించారు. యాక్షన్‌ సన్నివేశాలు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి. ప్రథమార్ధంతో పోలిస్తే, ద్వితీయార్ధం నిడివి పెరిగిందేమోననిపిస్తుంది. కొన్ని సన్నివేశాలను ఇంకాస్త ఎడిట్ చేస్తే బాగుండేది. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన పాటలు బాగున్నాయి. ‘సామి సామి’, ‘ఊ అంటావా’, ‘ఏ బిడ్డా’ పాటలు తెరపైనా అలరించేలా ఉన్నాయి. నేపథ్య సంగీతం ఓకే. అడవి వాతావరణం చూపించడానికి ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పడిన కష్టం తెరపై ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. నిర్మాతలు ఖర్చుకి ఎక్కడా వెనుకాడలేదు. తనదైన మార్క్‌ కథలతో ప్రేక్షకులను అలరించే దర్శకుడు సుకుమార్‌ ‘రంగస్థలం’ తర్వాత మరో మాస్‌ కథను ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేశారు. పుష్పరాజ్‌ పాత్రతో సహా మిగిలిన పాత్రలను తీర్చిదిద్దిన విధానం బాగుంది. ముఖ్యంగా కథానాయకుడి పాత్రను ఎలివేట్‌ చేసిన విధానం, అందుకు తగిన సన్నివేశాలు మెప్పిస్తాయి.

చివరిగా..: ‘పుష్ప’ పక్కా మాస్ ఎంటర్‌టైనర్.


సుక్కూ-బన్నీ హ్యాట్రిక్ కాంబో: ‘పుష్ప’ గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం..

ఆర్య, ఆర్య-2 చిత్రాలతో టాలీవుడ్‌లో హిట్‌ కాంబినేషన్‌గా ముద్రపడ్డారు జీనియస్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. వారిద్దరి కలయికలో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కింది ‘పుష్ప’. 12 ఏళ్ల తర్వాత బన్నీ, సుకుమార్ కలిసి చేస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమాలోని మొదటి పార్ట్‌ ‘పుష్ప – ది రైజ్‌’ డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచంలో ఎక్కడా దొరకని శేషాచలం అడవుల్లో మాత్రమే లభించే అరుదైన ఎర్రచందనం దుంగల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ గురించి ఆసక్తికరమైన విషయాలు మీకోసం..

  • అల్లు అర్జున్‌ – సుకుమార్‌ తొలిసారి 2004లో ‘ఆర్య’తో మంచి హిట్‌ అందుకున్నారు. ఆ తర్వాత 2009లో ‘ఆర్య 2’తో అలరించారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ముచ్చటగా మూడోసారి కలిసి చేస్తున్న చిత్రం ‘పుష్ప’.
  • అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా సినిమా ఇదే. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేశారు. ‘పుష్ప’రాజ్‌ పాత్ర కోసం అల్లు అర్జున్‌ ప్రత్యేకంగా సిద్ధమయ్యారు. చిత్తూరు యాస నేర్చుకున్నారు.
  • ‘పుష్ప’ సినిమాకు ₹160 కోట్ల నుంచి ₹180 కోట్లు ఖర్చు చేశారని భోగట్టా. రెండో భాగం చిత్రీకరణను ఫిబ్రవరిలో ప్రారంభిస్తారట.
  • అల్లు అర్జున్‌ ‘పుష్ప’ గెటప్‌లో రెడీ అయ్యేందుకు మేకప్‌ కోసం దాదాపు రెండు గంటల సమయం పట్టేదట. తెల్లవారుజామున 4.30 నిద్రలేచి.. ఐదుకల్లా సెట్‌కెళ్లి.. 5 నుంచి 7 వరకూ మేకప్‌ కోసమే ఓపిగ్గా కూర్చొనేవారట. షూట్‌ పూర్తయ్యాక మేకప్ తీయడానికి మరో 20 నుంచి 40 నిమిషాలు పట్టేదని బన్నీ చెప్పారు.
  • ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే సినిమా కావడంతో ‘పుష్ప’అత్యధిక భాగం అడవుల్లో చిత్రీకరించారు. అందుకోసం చిత్ర బృందం మారేడుమిల్లి అడవులను ఎంచుకుంది.
  • కొన్ని రోజులు కేరళ అడవుల్లో చిత్రీకరణ జరిగింది. కృత్రిమ దుంగల్ని చిత్రీకరణ కోసం అక్కడకు తీసుకెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు అక్కడి పోలీసులు పట్టుకున్నారట. ఇది ఎర్రచందనం కాదన్నా, తాము సినిమా వాళ్లమని చెప్పినా వాళ్లు వినలేదట. అవి సినిమా కోసం తయారు చేసినవని నిరూపించాక గానీ వదిలిపెట్టలేదట.
  • యూనిట్‌ మొత్తాన్ని మారేడుమిల్లి అడవుల్లోకి తీసుకెళ్లడానికి రోజూ దాదాపు 300 వాహనాలను ఉపయోగించేవారు.
  • తొలి రోజు చిత్రీకరణే 1500 మంది నేపథ్యంలో సాగింది. ఎర్రచందనం కృత్రిమ దుంగలు ఒకొక్కసారి వేల సంఖ్యలో అవసరమయ్యేవి. ఫోమ్‌, ఫైబర్‌ కలిపి కృత్రిమ దుంగల్ని తయారు చేశారు. ఎర్రచందనం దుంగలు, యూనిట్‌ సామాగ్రిని అడవుల్లోకి తీసుకెళ్లడానికి కష్టమయ్యేది. ఇందుకోసం అడవుల్లో కొన్ని చోట్ల మట్టి రోడ్లు కూడా వేయాల్సి వచ్చింది.
  • ‘పుష్ప’ కోసం అడవుల్లో రోజూ 500 మందికి పైగా పనిచేవారట. ఇక ఈ సినిమాలో ఓ పాటను దాదాపు 1000మందితో చిత్రీకరించారు.
  • సునీల్‌ ఇందులో మంగళం శ్రీను అనే ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. విలన్‌ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన సునీల్‌ కమెడియన్‌గా పేరు తెచ్చుకోవటం గమనార్హం. అయితే పాన్ ఇండియాలో విలన్‌గా చేస్తూ తన కోరిక నెరవేర్చుకున్నారు.
  • ఈ సినిమాతో మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌, కన్నడ నటుడు ధనుంజయ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. ఫహద్‌ ఫాజిల్‌ పాత్ర మొదటి విజయ్‌ సేతుపతిని అడిగారు. కానీ డేట్స్‌ కుదరక ఆయన చేయలేకపోయారు.
  • సుకుమార్‌- దేవిశ్రీ ప్రసాద్‌ కలిసి వరుసగా చేస్తున్న ఎనిమిదో చిత్రం ‘పుష్ప’. ఇప్పటివరకూ విడుదలైన సాంగ్స్‌ అన్నీ కలిసి మొత్తంగా 250 మిలియన్‌ వ్యూస్‌కు పైగా సాధించాయి.
  • ఈ సినిమాలో యాక్షన్‌ సన్నివేశాలకు పెద్ద పీట వేశారు. ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం ఏకంగా రూ.6 కోట్లు ఖర్చు పెట్టారట.
  • మైత్రీ మూవీ మేకర్స్‌తో రష్మికకు ఇది రెండో చిత్రం మొదటి చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌ చేశారు.’ అలాగే దర్శకుడు సుకుమార్‌కు మైత్రీ వారితో ఇది రెండో చిత్రమే మొదటిది ‘రంగస్థలం’.
  • ‘పుష్ప’ను మొదట ఒక చిత్రంగా తీయాలనుకున్నారు. కానీ, కథ పెద్దది కావడంతో రెండు భాగాలు చేశారు. ‘పుష్ప: ది రైజ్’ ఇప్పుడు విడుదలవుతోంది. ఈ సినిమా రన్‌ టైమ్‌ 2 గంటలా 59 నిమిషాలు.
  • తొలి పార్ట్‌లో రష్మిక పాత్ర నిడివి తక్కువగానే ఉంటుంది. ఆమె రెండో పార్టులో విశ్వరూపం చూపిస్తుందట. ఫహద్‌ ఫాజిల్‌ కూడా సినిమా ఆఖరులోనే వస్తారని టాక్‌.
  • ఈ సినిమాలో సమంత ‘ఉ అంటావా… ఊఊ అంటావా’ అనే ఐటెమ్‌ సాంగ్‌ చేసింది. ఆమె కెరీర్‌లో తొలిసారి ఇలా కనిపిస్తోంది. సమంత ఐటెమ్‌ సాంగ్‌ కోసం పెద్ద మొత్తంలోనే పారితోషికం అందుకుందని టాక్‌. పాట కోసం ఆమెకు కోటిన్నర రూపాయలు ఇచ్చారట. మొత్తంగా ఈ పాటకు చిత్రబృందం రూ. ఐదు కోట్లు బడ్జెట్‌ పెట్టిందని టాక్‌.
  • ఈ సినిమాలో పాటలకు చాలామంచి పేరు వస్తోంది. అన్నింటినీ చంద్రబోసే రాశారు. ‘ఉ అంటావా… ఊ ఊ అంటావా..’ పాటను ఆలపించిన ఇంద్రావతి చౌహాన్‌… ప్రముఖ సింగర్‌ మంగ్లీ చెల్లెలు.

‘ఊ అంటావా… ఊ ఊ అంటావా’…. యూట్యూబ్‌లో రికార్డుల మోత

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా ‘పుష్ప’. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ సమంత ఓ ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల రిలీజైన ఈ సాంగ్ లిరికల్ వీడియో Youtubeలో ట్రెండ్ అవుతూ భారీ వ్యూస్‌ను రాబడుతోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ‘పుష్ప’ చిత్రంలో మొదటి భాగం ‘పుష్ప: ది రైజ్ పార్ట్ 1’ ఈ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇక ఇప్పటికే ‘పుష్ప’ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా రిలీజైన ‘ఊ అంటావా… ఊ ఊ అంటావా’ అనే ఐటెం సాంగ్‌కు భారీగా రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటలో సమంత ఆడిపాడగా… యూట్యూబ్‌లో ఇప్పటి వరకు అన్ని బాషల్లో కలిపి 45 మిలియన్స్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. అంతేకాదు 1.6 మిలియన్స్‌కు పైగా లైక్స్ రావడం హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ – ముత్తం శెట్టి మీడియా తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో సందడి చేయనున్నారు.