ఏడాదిలో 4 నెలలు మాత్రమే దర్శనమిచ్చే సంగమేశ్వరాలయం

ఏడాదిలో 4 నెలలు మాత్రమే దర్శనమిచ్చే సంగమేశ్వరాలయం

ఏకంగా ఏడునదులు కలిసే ప్రదేశం. ఏడాదిలో 8 నెలలపాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు భక్తులకు దర్శనభాగ్యం కలిగించే ఆలయం. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్ర స్థలం. ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయమిచ్చిన ప్రాంతం. అదే కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం. ఆత్మకూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిలో సంగమేశ్వర ఆలయం ఉంది. సప్తనదీ సంగమంగా పిలువబడే ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం … నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధికెక్కింది.

పురాణ గాథ
పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని, ఆ సమయంలో దక్షుడు తన కుమార్తె, శివుడి భార్య అయిన సతీదేవిని అవమానించడంతో… ఆమె యజ్ఞ వాటికలో పడి మరణించిందని స్థల పురాణం చెబుతోంది. సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ది కెక్కింది. పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించాడు. ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు ప్రతిష్ట సమయానికి రాలేదు. రుషుల సూచన మేరకు వేపమొద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్టించి పూజలు చేశాడు ధర్మరాజు. దీంతో, ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు. భీముడిని శాంతింప జేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్టించి, భీమలింగంగా దానికి పేరు పెట్టాడు. భక్తులు భీమేశ్వరున్ని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరున్ని దర్శించుకోవాలని సూచించినట్లు స్థల పురాణం చెబుతోంది.

ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన సంగమేశ్వరాలయం క్రమంగా శిథిలమై పోయింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం స్ధానిక ప్రజలు నిర్మించారు. సుమారు లక్షా ఇరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయంతో పాటు, చుట్టూ ప్రాకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తే అర్ధమవుతుంది. ఈ ప్రాకారానికి ఉత్తరాన గోపురద్వారం, పశ్చిమ దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మింపబడి ఉండేవని చరిత్ర చెబుతోంది. కానీ, ప్రస్తుతం అవేమీ కనిపించవు. ప్రస్తుతం కనిపించే ప్రధాన ఆలయం అత్యంత సాదాసీదాగా ఉంటుంది. ముఖమండపం పూర్తిగా శిథిలమై పోగా… అంతరాలయం, గర్భాలయాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. శివుడి వెనుక వైపున ఎడమ భాగంలో శ్రీలలితాదేవి, కుడి వైపున వినాయకుడు దర్శనమిస్తారు. అంతకు ముందు వారిద్దరికీ వేరు వేరు ఆలయాలు ఉండేవి. అయితే, అవి శిథిలమై పోవడంతో లలితాదేవి, గణపతులను గర్భాలయంలో ప్రతిష్టించారు.

అన్ని ఆలయాల్లోలాగా ఈ క్షేత్రంలో నిత్య పూజలు జరుగవు. ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో మునిగివుండడమే దీనికి కారణం. ఏడాదిలో సుమారు 8 నెలలు ఈ ఆలయం నీటిలోనే మునిగి ఉంటుంది. అయినప్పటికీ వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వరాలయంలో ప్రతిష్టించిన వేపలింగం ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించక మానదు. ఆలయం ప్రాంగణంలోని అనేక ఉపాలయాల్లో దేవతా మూర్తులు పూజలందుకునే వారు. ఆ ఆలయాలన్నీ శిథిలమవడంతో కర్నూలు జిల్లాలోని అనేక ఆలయాలకు వాటిని తరలించారు. వాటితో పాటు పల్లవ సాంప్రదాయంలో నిర్మితమైన రథం కూడా ఉండేది. దాన్ని పురాతత్వ శాఖ వారు జగన్నాథ గుట్టకు తరలించారు.

ఈ ఆలయం మొదట నది ఒడ్డున ఉండేది. శ్రీశైలం డ్యామ్ నిర్మాణం తరువాత సంగమేశ్వరాలయం 23 ఏళ్లపాటు నీటిలోనే మునిగిపోయింది. అసలు ఇక్కడ ఆలయం ఉందనే విషయాన్ని కూడా జనం మర్చిపోయారు. 2003 తరువాత శ్రీశైలం డ్యామ్ నీటిమట్టం పడిపోయిన కాలంలో మాత్రమే ఆలయం నీటి నుంచి బయటపడింది. అప్పటి నుంచి తిరిగి ఆలయంలో పూజలు ప్రారంభమయ్యాయి.

ప్రపంచంలో ఏడు నదులు ఒకేచోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో తుంగ, భద్ర, క్రిష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి నదులు కలిసే ప్రదేశాన్నే సంగమేశ్వరం అంటున్నారు. ఈ నదుల్లో భవనాసి నది మాత్రమే పురుషుడి పేరున్న నది. మిగిలినవన్నీ స్త్రీ పేర్లున్న నదులే. భవనాసి తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్తాయి.ఈ నదులన్నీ కలసి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలసిపోతాయి.

ఎలా చేరుకోవాలి
కర్నూలు నుంచి 55 కిలోమీటర్ల, నందికోట్కూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ క్షేత్రానికి వివిధ మార్గాల ద్వారా చేరవచ్చు. నందికోట్కూరుకు 16 కిలోమీటర్ల దూరంలో వున్న ‘మచ్చుమర్రి’ గ్రామానికి బస్సుల ద్వారా చేరుకుని , అక్కడినుంచి 6 కిలోమీటర్ల దూరంలో వున్న సంగమేశ్వరానికి ఆటోలు, జీపుల్లో వెళ్ళవచ్చు. కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి కపిలేశ్వరమునకు బస్సులో చేరుకుని అక్కడి నుంచి 5 కిలో మీటర్ల దూరంలోవున్న ఈ క్షేత్రానికి ఆటోలు, జీపులలో చేరవచ్చు. స్వంతవాహనాల్లో వెళ్ళేవారు ఏ దారిలోనైనా సరాసరి ఆలయం వరకు వెళ్లవచ్చు. మహాశివరాత్రి నాటికి ఈ క్షేత్రం బయటపడితే క్షేత్రానికి వివిధ ప్రాంతాలనుంచి ఆర్టీసీ వారు బస్సులు నడుపుతారు. తెలంగాణ ప్రజలు మహబూబ్‌నగర్ నుంచి సోమశిల వరకు బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి బోటు ద్వారా సంగమేశ్వరం చేరుకోవచ్చు.


శ్రీవారి హుండీ గలగల.. టీటీడీ చరిత్రలోనే రికార్డుస్థాయి ఆదాయం

తిరుమల వేంకటేశ్వర స్వామి హుండీ కానుకలతో కళకళలాడుతోంది. టీటీడీ (TTD) చరిత్రలో శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. భక్తులు స్వామివారికి కాసుల వర్షం కురిపించారు. ఈనెల రూ. 100 కోట్ల ఆదాయం దాటింది. కొన్ని నెలలుగా పెద్ద ఎత్తున తిరుమలకు భక్తులు వస్తున్నారు. శ్రీవారిని దర్శించుకుని విరివిగా కానుకలు సమర్పించుకుంటున్నారు. కరోనా ప్రభావం తగ్గడంతో తిరుమల కొండ నిత్యం రద్దీతో కళకళలాడుతోంది. మొక్కులున్న భక్తులతో పాటు, ముడుపులనూ భారీగా సమర్పిస్తున్న క్రమంలో హుండీ ఆదాయం పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.

అలిపిరి నుంచి స్వామి కొండకు వేలాదిమంది భక్తులు కాలినడకన తిరుమల చేరుకుంటున్నారు. వాహనాల సంఖ్య కూడా పెరిగింది. శ్రీవారి ఆలయం, క్యూకాంప్లెక్స్‌లు, మాడవీధులు, అన్నప్రసాద భవనం, అఖిలాండం, బస్టాండు, రోడ్లు, దుకాణ సముదాయాలు, కల్యాణకట్ట, లడ్డూల జారీ కేంద్రం, ఇతర సందర్శనీయ ప్రదేశాలు భక్తులతో రద్దీగా మారాయి. తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఉన్న హుండీ తిరుమల హుండీగా సుప్రసిద్ధం. వడ్డీకాసుల వాడు, ఆపదమొక్కుల వాడు అని పేరొందిన తిరుమల వేంకటేశ్వరున్ని దర్శించుకునే భక్తులు.. కానుకలు హుండీలో వేయడం పరిపాటి. ప్రపంచవ్యాప్తంగా వాటికన్ సిటీ తర్వాత అంతటి ఆదాయం కలిగిన ప్రార్థనా స్థలంగా తిరుమల ప్రసిద్ధి చెందింది. ఆపదలు వచ్చినప్పుడు మొక్కులు మొక్కుకుంటే ఆయన తీరుస్తాడని భక్తుల నమ్మకం. ఒంటిపై వేసుకుని వచ్చిన బంగారం, సొమ్ముతో సహా మొత్తం హుండీలో వేయడాన్ని నిలువు దోపిడీ అని వ్యవహరిస్తారు. తిరుపతిలో నిలువు దోపిడీ చెల్లించుకుంటానని మొక్కుకుని, మొక్కు తీర్చుకుంటూంటారు


ముఖ్యమంత్రి హోదాలో పెళ్లి పెద్దగా మారిన NTR

నందమూరి తారకరామారావు.. ఆ చంద్ర తారార్కం తెలుగు ప్రజల గుండెల్లో విరాజిల్లే ఆరాధ్యమూర్తి… వెండితెర చరిత్రలో అజరామరమైన ఆయన నటనా ప్రస్థానం మనందరికీ తెలుసు. ఆ యుగపురుషుడి రాజకీయ జీవితం అందరికీ ఎరుకే. కానీ ఎన్టీఆర్‌ స్వయంగా ఓ పెళ్లికి పౌరోహిత్యం వహించారన్న సంగతి అతి తక్కువమందికి మాత్రమే తెలిసిన విషయం. అదీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సమయంలో పెళ్లి పెద్దగా వ్యవహరించడం విశేషం. ఆయన పౌరహిత్యంలో ఒక్కటైన ఆనాటి వధూవరులు నాగభైరవ వీరబాబు, పద్మజ దంపతులు. ఎన్టీఆర్‌ అరుదైన ఆ సంఘటన గురించిన విశేషాలివి..

జూలై 7, 1988… ఉదయం 6గంటల 40 నిమిషాలకు వివాహ ముహూర్తం… ఒంగోలు పట్టణం రాంనగర్‌లోని టొబాకో సంస్థ ప్రాంగణంలో కళ్యాణ వేదిక. ఆ ప్రదేశమంతా 10 వేల మంది జనాభాతో కిక్కిరిసిపోయి ఉంది. ఆ క్షణం అందరి కళ్లు ఓ వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నాయి. వారంతా వధూవరుల బంధుమిత్రులు కారు. ఆ పెళ్లికి అతిథిగా హాజరవుతున్న తమ ప్రియతమ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావును కనులారా చూసిపోదామని అక్కడికి విచ్చేసిన జనవాహిని. ముహూర్తం సమయం ఆసన్నమైంది. అన్నగారు వివాహ మండపంలోకి అడుగుపెట్టారు. వధూవరులను ఆశీర్వదించడానికి హాజరైన ఎన్టీఆర్‌ ‘‘కవి గారూ’’ అంటూ నాగభైరవ కోటేశ్వరరావు (పెళ్లికొడుకు తండ్రి)ని దగ్గరకు పిలిచి చెవిలో ఏదో చెప్పారు. అంతే అక్కడ సీన్‌ మొత్తం మారిపోయింది.

అప్పటిదాకా వేదికపై ఉన్న పురోహితుడు వేదిక దిగాడు. ఆయన స్థానంలో ఎన్టీఆర్‌ ఆశీనులయ్యారు. అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాకయ్యారు. సర్వత్రా ఏం జరగబోతోందనే ఉత్కంఠ. ఎన్టీఆర్‌ మైక్‌ అందుకున్నారు. ‘‘సంస్కృతంలో ఉన్న వివాహ మంత్రాల అర్థం వీరికి తెలీదు. భార్యాభర్తల అన్యోన్యత, దాంపత్యం గురించి వివరించే ఆ మంత్రాల పరమార్థాన్ని మనకు అర్థమైన తెలుగులో చెప్పి ఈ పెళ్లి నేనే జరిపిస్తాను’’ అన్నారు.

ఆ గంట ఏం జరిగిందో గుర్తులేదు..!
ఎన్టీఆర్‌ తన వివాహానికి స్వయంగా పౌరహిత్యం చేసి 30 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆ విశేషాలను నాగభైరవ వీరబాబు గుర్తుచేసుకున్నారు. ‘‘మా నాన్న నాగభైరవ కోటేశ్వరరావు ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాకు మాటల రచయితగా పనిచేశారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌తో 60 రోజులు కలిసి ఉన్నారు కూడా. సాహిత్యాభిలాషి, తెలుగు భాషా ప్రేమికుడైన ఎన్టీఆర్‌ మా నాన్నను ప్రేమగా ‘కవిగారు’ అని పిలిచేవారు. ఆయనపై ఉన్న ఆత్మీయతతో ఆహ్వానించగానే నా పెళ్లికి విచ్చేశారు. అప్పుడు మా జిల్లా కలెక్టరుగా డా. జయప్రకాశ్‌ నారాయణ ఉన్నారు. ఎన్టీఆర్‌ను దగ్గరి నుంచి చూస్తే చాలనుకునేవాళ్లం. అలాంటిది ఆయనే స్వయంగా నా పెళ్లి జరిపిస్తుండటంతో ఆ సమయంలో ఏదో తెలియని భావన నాలో కలిగింది.
ఆ తన్మయత్వంలో గంటసేపు ఏం జరిగిందో కూడా గుర్తులేదు’’ అన్నారాయన. ఆ రోజు సంఘటనను వీరబాబు సతీమణి పద్మజ గుర్తు చేసుకుంటూ ‘‘అప్పుడు నాకు 19 ఏళ్లు. కళ్యాణ మంటపం మీద మేమిద్దరం, తాతయ్య, ఎన్టీఆర్‌… అంతే. ఇంకెవ్వరినీ అనుమతించలేదు. వివాహ వ్యవస్థ ఔన్నత్యాన్ని, సప్తపది, తాళి పరమార్థాన్ని అచ్చమైన తెలుగులో వివరించారాయన. మా చేత పెళ్లి ప్రమాణాలు చేయించారు. ‘ఆ! మేలగాళ్లు కానివ్వండి.!’’ అంటూ ఆయనే స్వయంగా బాజాభజంత్రీలను పురమాయించారు. ఎన్టీఆర్‌ గారు పెళ్లి మంత్రాలన్నింటినీ కంఠతా ఆలపించడం విశేషం. ఆయన పురోహితుడుగా వ్యవహరించిన తొలి, తుది పెళ్లి మాదే కావడం మాకు దక్కిన అదృష్టం’’ అన్నారామె.

కవిరాజు ‘వివాహ విధి’
త్రిపురనేని రామస్వామి చౌదరి రచించిన ‘వివాహ విధి’ గ్రంథం ఆధారంగా ఎన్టీఆర్‌ వివాహ మంత్రాల అర్థాన్ని వివరిస్తూ, విపులీకరిస్తూ వధూవరులతో ప్రమాణాలు చేయించారు. సప్తపది, జిలుకర బెల్లం, మంగళసూత్రధారణ పవిత్రను, పరమార్థాన్ని వివరించి పెళ్లితంతు జరిపారు. అనంతరం వేదిక కింద ఉన్న అతిధులంతా అక్షితలను వధూవరులపైకి విసురుతున్నారు. అప్పుడు ‘‘మనమంతా అక్షింతలు అంటాం. కానీ అక్షితలు అనాలి. వాటిని వధూవరులపై దయచేసి అలా విసరకండి. ఒక్కొక్కరుగా వచ్చి నిండు మనస్సుతో నవ దంపతులను ఆశీర్వదించండి.!’’ అని సూచించారు. ఎన్టీఆర్‌ 45 నిమిషాల పాటు మండపంపై ఆశీనులై కళ్యాణ క్రతువులోని ప్రతి ఘట్టాన్ని, దానివెనుకున్న పరమార్థాన్ని వివరిస్తూ పౌరహిత్యం చేశారు.


ఆ సమయంలో ‘ఆంధ్రజ్యోతి’ ఒంగోలు పాత్రికేయుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏవీఎస్‌ (తర్వాత హాస్యనటుడుగా మారారు)ఆ వార్తను రాశారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ని ఆయన సన్నిహితులు చాలామంది పెళ్లి పెద్దగా హాజరవ్వాల్సిందిగా విన్నవిస్తే ‘‘కవిగారిపై నాకున్న అభిమానంతో వారి కుమారుడి వివాహానికి పౌరోహిత్యం చేశాను. ఆ అవకాశం వారికి మాత్రమే సొంతం’’ అని అన్నట్లు ‘నందమూరితో నా అనుభవాలు’ పుస్తకంలో నాగభైరవ కోటేశ్వరరావు రాశారు.


అరుదైన శైవక్షేత్రాలు… పంచారామాలు.. కార్తీక మాసంలో తప్పక దర్శించాల్సిందే

ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు పురాతన శైవ క్షేత్రాలను పంచారామాలుగా పిలుస్తుంటారు. పురాణాల పరంగా, భౌగోళికంగా ఈ పుణ్యక్షేత్రాలకు ఎంతో విశిష్ఠత ఉంది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కార్తీక మాసంలో పంచారామ క్షేత్రాల సందర్శన ఎంతో గొప్పగా ఉంటుంది. మహాశివరాత్రితో పాటు అనేక పర్వదినాల్లో హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పరమశివున్ని పూజిస్తుంటారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో ఉన్న మహిమాన్విత శివ లింగ క్షేత్రాలను దర్శించేందుకు ఆసక్తి చూపిస్తారు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ క్షేత్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పంచారామాలు ప్రముఖమైనవి. పేరుకు తగినట్లుగానే పరమేశ్వరుడికి సంబంధించిన ఐదు పవిత్ర దేవాలయాలు ఇవి. దేశంలో ఎన్నో శివలింగ క్షేత్రాలు ఉన్నా పంచారామాలకు ఉన్న విశిష్టత మాత్రం ప్రత్యేకమైనది. ఈ ఐదు దేవాలయాలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండటం మరో విశేషం. ఇంతకీ ఈ క్షేత్రాల విశిష్టతలు ఏమిటి? ఎక్కడ ఉన్నాయి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పంచారామాల చరిత్ర

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచారామాల పుట్టుకకు సంబంధించి అనేక పురాణ గాధలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీనాధుడు రచించిన భీమేశ్వర పురాణం ప్రకారం.. క్షీరసాగర మధనంలో ఉద్భవించిన అమృతాన్ని మహా విష్ణువు మోహినీ రూపం ధరించి దేవతలకు, రాక్షసులకు పంపిణీ చేశాడు. అయితే త్రిపురాసురులు మాత్రం (రాక్షసులు) ఈ పంపిణీలో తమకు అన్యాయం జరిగిందంటూ అసంతృప్తి వ్యక్తం చేసి శివుని కోసం ఘోర తప్పసును ఆచరిస్తారు. రాక్షసుల తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు వారికి వివిధ వరములను అనుగ్రహిస్తాడు. ఆ శక్తులతో రాక్షసులు దేవతలను అనేక ఇబ్బందులకు గురి చేస్తారు. దీంతో దేవతలు మహాశివుని వద్దకు వెళ్లి తమను రాక్షసుల బారి నుంచి రక్షించాలని వేడుకుంటారు. దేవతల మొర ఆలకించిన మహాశివుడు త్రిపురాంతకుడి రూపంలో ఆ రాక్షసులను, వారి రాజ్యాన్ని బూడిద చేస్తాడు. అయితే ఈ యుద్ధంలో త్రిపురాసురులు పూజించిన అతిపెద్ద శివలింగం మాత్రం చెక్కుచెదరకుండా ఉంటుంది. ఈ శివలింగాన్నే దేవతలు భూమిపై ఐదు చోట్ల ప్రతిష్టించారు. అవే పంచారామాలుగా ప్రసిద్ధి చెందినట్లు చెబుతారు.

అయితే స్కాంధ పురాణంలోని తారకాసుర వధ ఘట్టం ప్రకారం పంచారామాల పుట్టుక మరో విధంగా ఉంది. హిరణ్య కశ్యపుడి మనుమడైన తారకాసురుడు శివుని కోసం ఘోర తపస్సు చేసి పరమేశ్వరుడి ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. ఒక బాలుడి చేతిలో తప్ప తనకు మరెవ్వరి చేతిలో మరణం ఉండకూడదని కోరుతాడు. బాలలు ఎవ్వరూ తనను ఏమీ చేయలేరు కాబట్టి తారకాసురుడు ఈ వరాన్ని కోరుకుంటాడు. పరమేశ్వరుడు తధాస్తు అనడంతో ఆ వరగర్వంతో దేవతలను ముప్పతిప్పలు పెట్టడం ప్రారంభిస్తాడు. దీంతో తారకాసురున్ని నిలువరించేందుకు పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామికి జన్మనిస్తారు. దేవతలతో కలిసి బాలుడైన కుమారస్వామి తారకాసుడిపై యుద్ధానికి దిగుతాడు. ఆ భీకర యుద్ధంలో తారకాసురుడి కంఠంలో ఉన్న ఆత్మలింగాన్ని కుమారస్వామి ఛేదించడంతో అతడు మరణిస్తాడు. ఆ సమయంలో ఐదు భాగాలుగా ముక్కలైన ఆత్మలింగాన్ని ఐదు చోట్ల ప్రతిష్ట చేశారు. అవే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పంచారామ క్షేత్రాలు.

ద్రాక్షారామము:
దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన కారణంగా ఈ ప్రాంతాన్ని ద్రాక్షారామంగా పిలుస్తారు. రెండు అంతస్తులలో 60 అడుగుల ఎత్తులో స్వామి వారి శివలింగం సగం తెలుపు, సగం నలుపు రంగులో ఉంటుంది. రెండో అంతస్తు పై భాగం నుంచి అర్చకులు, భక్తులు అభిషేకాలు నిర్వహిస్తారు. ఇక్కడి స్వామి వారిని భీమేశ్వరుడిగా కొలుస్తారు. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారు స్వామి వారితో కలిసి కొలువై ఉండడం విశేషం. భారతదేశంలోని అత్యంత అరుదైన దేవాలయాల్లో ఒకటైన ఈ ఆలయాన్ని దేవతలే నిర్మించారని చెబుతుంటారు.

అద్భుతమైన శిల్పకళతో అలరారే ఈ దేవాలయాన్ని సందర్శించడం ప్రతి ఒక్కరికీ ఓ మధురమైన అనుభూతిగా మిగిలిపోతుంది. క్రీస్తు శకం 892-922 మధ్య చాళుక్యుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా స్పష్టమవుతుంది. కార్తీక మాసం, మహాశివరాత్రి పర్వదినాల్లో ఆలయం భక్తులతో పోటెత్తుతుంది. తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడకు 32కి.మీ, రాజమండ్రి నుంచి 51కి.మీ, అమలాపురానికి 27కి.మీల దూరంలో ద్రాక్షారామం ఆలయం ఉంది.

అమరారామము:
పరమేశ్వరుడు ఇక్కడ అమరేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. రెండు అంతస్తులలో 16 అడుగుల ఎత్తుతో ఈ స్పటిక శివలింగం ఉంటుంది. రెండవ అంతస్తుపై నుంచి స్వామి వారికి అభిషేకాలు నిర్వహిస్తారు. అమ్మవారు బాలచాముండి, క్షేత్ర పాలకుడు వేణుగోపాల స్వామి ఆలయాలు కూడా ఇక్కడ ఉంటాయి. తారకాసురుడి సంహారం తరువాత చెల్లాచెదురైన ఆత్మలింగంలో ఒక భాగాన్ని ఇంద్రుడు ఇక్కడ ప్రతిష్టించినట్లు స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయం మొత్తం మూడు ప్రాకారాలతో నిర్మితమై ఉంటుంది. ఈ ప్రాకారాల్లో అనేక దేవాలయాలు కనిపిస్తాయి. భక్తుల్లో ఆధ్యాత్మిక చింతనను ఇవి రెట్టింపు చేస్తాయి. గుంటూకు 35 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది తీరంలో ఉన్న అమరావతిలో ఈ ఆలయం ఉంది.

క్షీరారామము:
పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు పట్టణంలో క్షీరారామం ఉంది. శివుడు భూమిపై తన బాణాన్ని వదిలినప్పుడు అది ఈ ప్రదేశంలో పడి భూమి నుంచి క్షీరదార వచ్చినట్లు కధనం. దీని కారణంగానే ఈ ప్రాంతం క్షీరపురిగా, కాలక్రమంలో పాలకొల్లుగా మార్పు చెందినట్లు చెబుతారు. క్షీరారామం ఆలయాన్ని 11వ శతాబ్ధంలో చాళుక్యులు నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. తెల్లని రంగులో రెండున్నర అడుగుల ఎత్తులో ఉండే ఇక్కడి శివలింగాన్ని రామలింగేశ్వర స్వామిగా కొలుస్తారు. త్రేతా యుగంలో సీతారాములు ఈ లింగాన్ని ప్రతిష్టించినట్లు ప్రతీతి. మొత్తం 125 అడుగుల ఎత్తులో 9 గోపురాలతో ఎంతో సుందరంగా ఈ ఆలయం తీర్చిదిద్దబడింది. ఏటా ఉత్తరాయణ దక్షిణాయన ప్రారంభంలో సూర్యోదయాన పెద్ద గోపురం నుంచి సూర్య కిరణాలు శివలింగంపై పడే దృశ్యం ఎంతో మనోహరంగా ఉంటుంది.

సోమారామము:
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో గునిపూడిలో ఈ క్షేత్రం ఉంది. తూర్పు చాళుక్య రాజైన చాళుక్య భీముడు 3వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఇక్కడి శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్టించిన కారణంగా దీనికి సోమారామము అని పేరు వచ్చింది. స్వామివారి చెంత రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు ఉంటారు. ఈ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. మామూలు రోజుల్లో తెలుగు, నలుపు రంగులో ఉండే ఈ శివలింగం అమావాస్య రోజున మాత్రం గోధుమ వర్ణంలో ప్రకాశిస్తుంది. పౌర్ణమి నాటికి తిరిగి యధారూపంలోకి వస్తుంది. ఈ ఆలయంలో సోమేశ్వర స్వామి కింది అంతస్తులోనూ, అన్నపూర్ణా దేవి అమ్మవారు పై అంతస్తులో ఉంటారు.

కుమార భీమారామము:
తూర్పు గోదావరి జిల్లా సామర్ల కోటకు సమీపంలో ఈ ఆలయం ఉంటుంది. సున్నపురాయి రంగులో 60 అడుగుల ఎత్తైన రెండస్తుల మండపంలో ఇక్కడి శివలింగం ఉంటుంది. ద్రాక్షారామం క్షేత్రాన్ని నిర్మించిన చాళుక్య రాజైన భీమునిచే ఈ ఆలయం నిర్మించబడింది. అందుకే ఈ రెండు క్షేత్రాల నిర్మాణ శైలి ఒకే విధంగా అనిపిస్తుంది. ఆలయ ద్వారాల నుంచి కొలను వరకూ ప్రతి నిర్మాణంలోనూ పోలిక కనిపిస్తుంది. క్రీస్తు శకం 892 నుంచి 922 మధ్య ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. సామర్లకోట రైల్వే స్టేషన్‌కు ఈ ఆలయం అతి సమీపంలోనే ఉంది.


భక్తుల కోర్కెలు తీర్చే దైవం.. అయినవిల్లి సిద్ధి వినాయకుడు

వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా..

అంటూ కోటి సూర్యులతో సమానంగా ప్రకాశించే గణనాథుడిని స్తుతిస్తుంది భక్తలోకం. విఘ్నాలు తొలంగించి సకాలంలో పనులు పూర్తయ్యేలా అనుగ్రహించమని ప్రార్థిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో అనేక సుప్రసిద్ధ వినాయక ఆలయాలున్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లోని అయినవిల్లి ఒకటి. ఇది స్వయంభూ గణపతి క్షేత్రం. కాణిపాకం తరువాత అంతటి ప్రాశస్త్యం ఉన్న పుణ్యక్షేత్రం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి సుమారు 60 కి.మీ, అమలాపురానికి 12 కి.మీ దూరంలో ఈ క్షేత్రం నెలకొంది. పవిత్ర గోదావరి నది ఒడ్డున, పచ్చని కోనసీమ అందాలు, సుందర ప్రశాంత వాతావరణం, ప్రకృతి రమణీయతలతో ఈ ఆలయం అలలారుతోంది. పార్వతీ తనయుడు ఇక్కడ సిద్ది వినాయకునిగా కొలువై భక్త జనాన్ని అనుగ్రహిస్తున్నారు.

స్థల పురాణం
కృతయుగం నుంచే ఇక్కడ స్వామి కొలువై ఉన్నట్లు స్ధల పురాణం ద్వారా తెలుస్తోంది. దక్ష ప్రజాపతి ద్రాక్షరామంలో చేసిన దక్షయజ్ఞానికి ముందు ఇక్కడి వినాయకున్ని పూజించి పునీతుడయ్యాడని ప్రతీతి. వ్యాస మహర్షి దక్షణ యాత్ర ప్రారంభానికి ముందు ఇక్కడ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించగా దేవతలు ఆలయాన్ని నిర్మించారు. అనంతర కాలంలో నాటి తూర్పు చాళుక్యుల నుంచి నేటి పెద్దాపురం సంస్ధానాధీశుల వరకు ఎందరో ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధిలో భాగస్వాములయ్యారు.

క్షేత్ర ప్రత్యేకత
అయినవిల్లి ఆలయ ప్రస్తావన క్రీ.శ 14వ శతాబ్ధంలో శంకరభట్టు రచించిన శ్రీపాదవల్లభ చరిత్రలో ఉంది. శ్రీపాదవల్లభుల మాతామహులు అయినవిల్లిలో స్వర్ణ గణపతి యజ్ఞం చేసినట్లు.. యజ్ఞం ముగింపులో గణనాథుడు సర్ణమయకాంతులతో దర్శనమిచ్చి హారతులను స్వయంగా అందుకున్నట్లు అందులో పేర్కొన్నారు. శ్రీపాద వల్లభుని జననాన్ని తెలియజేశారని చెబుతారు. సాధారణంగా దేవాలయాల్లోని మూలవిరాట్‌ తూర్పు ముఖంగా దర్శనమిస్తారు. దీనికి భిన్నంగా ఇక్కడి సిద్ధి వినాయకుడు దక్షిణాభిముఖుడై భక్తకోటికి అభయమిస్తున్నాడు. దీంతో గ్రామంలో దక్షిణ సింహద్వారం ఉన్న గృహాలకు ఎలాంటి విఘ్నాలు కలగవని అయినవిల్లివాసుల నమ్మకం.

ఇక్కడి సిద్ధి వినాయకుని మూలవిరాట్‌ అత్యంత ప్రాచీనమైంది. రోజూ స్వామికి వివిధ పూజలు, అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. అభిషేక సేవకు ఈ ఆలయంలో విశేష ప్రాముఖ్యం ఉంది. శివకేశవులకు ప్రీతికరమైన వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు పాంచాహ్నిక దీక్షతో అయిదు రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. పూర్ణిమనాడు కల్యాణం.. గ్రామోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. భాద్రపద శుద్ధ చవితి నుంచి తొమ్మిది రోజుల పాటు వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. మకర సంక్రాంతి, కనుమనాడు ప్రభల ఉత్సవం చేస్తారు. విజయదశమి, కార్తీకమాసం మొదటి, నాలుగు సోమవారాలు, కృష్ణాష్టమినాడు ప్రత్యేక పూజలు చేసి గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఏటా మాఘ మాసంలో చదువుల పండుగ జరుగుతుంది. పండగలో భాగంగా గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి నదీ జలాలతో స్వామిని అభిషేకిస్తారు. లక్ష పెన్నులు సిద్ది వినాయకుని పాదాల వద్ద ఉంచి లక్ష దూర్వములతో పూజిస్తారు. అనంతరం ఆ పెన్నులను విద్యార్థులకు పంచుతారు. వీటితో పరీక్షలు రాస్తే మంచి ఉత్తీర్ణత సాధించడంతో పాటు, చదువులో రాణిస్తారని భక్తుల విశ్వాసం.


ఇలా చేరుకోవచ్చు:
అయినవిల్లి రాజమహేంద్రవరానికి 60 కిలోమీటర్లు, అమలాపురానికి 12కిలోమీటర్లు దూరం ఉంది. రాజమహేంద్రవరం నుంచి వచ్చేవారు రావులపాలెం చేరుకుంటే అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. అమలాపురం నుంచి వచ్చేవారు ముక్తేశ్వరం చేరుకుని అక్కడి నుంచి ఆటోలో అయినవిల్లి చేరుకోవచ్చు. రైలు, విమాన మార్గాల ద్వారా వచ్చేవారు రాజమహేంద్రవరంలో దిగి అక్కడికి నుంచి రోడ్డుమార్గంలో అయినవిల్లి చేరుకోవచ్చు.


ప్రకృతి అందాల స్వర్గధామం.. కోనసీమ చూసి తీరాల్సిందే!


‘కోనసీమ’.. కేరళను తలదన్నే పచ్చటి అందాలతో ఆంధ్రా పాలిట భూతలస్వర్గంగా ప్రసిద్ధి చెందింది. ప్రకృతి రమణీయకతకు నిలువుటద్దంగా నిలిచే ప్రాంతం ప్రకృతి అందాలతో ఎప్పుడూ కళకళల్లాడుతూ ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని త్రిభుజాకార ప్రదేశాన్ని కోనసీమగా పిలుస్తారు. దీని ప్రధాన కేంద్రం అమలాపురం. పచ్చని తివాచీ పరిచినట్లుండే కోనసీమలో నదీ సంగమ ప్రదేశాలు, ఓడరేవులు, ఆహారాలు విశేషంగా ఆకర్షిస్తాయి. కోనసీమ నాలుగు వైపులా గోదావరి, బంగాళాఖాతాలు చుట్టుముట్టి ఉన్నాయి.

కోనసీమ ప్రకృతి పదం.. మూల (కోన) ప్రదేశం (సీమ) నుండి వచ్చింది. కోనసీమకు సరిహద్దులుగా ఉత్తరం వైపు గౌతమి, దక్షిణం వైపున వశిష్ట అనే గోదావరి పాయలున్నాయి. ఇక్కడి ప్రధాన వృత్తి వ్యవసాయం. కోనసీమకు అమలాపురం పట్టణం ప్రధాన కేంద్రం కాగా.. రావులపాలెం, రాజోలు, ముమ్మిడివరం, ముక్తేశ్వరం, కొత్తపేట అంబాజీపేట ప్రధాన ప్రాంతాలు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న రావులపాలెంను కోనసీమ ముఖద్వారంగా పిలుస్తారు.

అందాల సీమ
మాటలకందని అనుభూతులు, రహదారుల వెంట కాలువలు, పచ్చని చెట్ల తోరణాలు, అరటి గెలలు, కొబ్బరి తోటలు, మంచు తెరలు ఇలాంటి మనోహర దృశ్యాలన్నీ కోనసీమ వాసులకు సర్వసాధారణం. పుష్కలమైన ప్రకృతి వనరులు, కనుచూపు మేరకు తనివితీరని రమణీయమైన ప్రకృతి సౌందర్యం కోనసీమకే వన్నె తెస్తుంటాయి. కోనసీమలో పండించని పంట ఉండదు. కోనసీమలో వరి తర్వాత ఎక్కువగా అరటిని పండిస్తారు. పలురకలైన కొబ్బరి మొదలు, అరటి, మామిడి, పనస, సపోటా, బత్తాయి ఇలా అన్ని రకాల పంటలు పండిస్తారు.

కోనసీమ ప్రాంతం పురాతన తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయంగా భాసిల్లుతోంది. అతిథులకు మర్యాదలు చేయడంలో కోనసీమ వాసులకు కొట్టేవాళ్లే ఉండరు. అన్నిచోట్ల కొట్టి చంపితే.. కోనసీమ వాళ్ల తిండి పెట్టి చంపేస్తారన్న నానుడి ఉంది. సంక్రాంతి పండుగకు నిర్వహించే ముగ్గుల పోటీలు, కోనసీమలో జరిగే కోడిపందేలు, తీర్థాలు, జాతరలు చూడటానికి రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదేమో.

పలకరింపులు భలే ఉంటాయ్
కోనసీమలో పలకరింపులు భలే వింతగా ఉన్నాయి. అక్కడ ఎదుటివారిని ఆయ్, అండి అంటూ ప్రత్యేక శైలిలో మర్యాదగా పిలుస్తుంటారు. ఈ తరహా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా మనకు కనిపించదు. ఎవరు కనిపించినా ఆప్యాయంగా పలకరించే సంస్కారం వారి సొంతం.

ప్రసిద్ధ ఆలయాలకు కేంద్రం
కోనసీమ ప్రాంతంలో ఎన్నో ప్రసిద్ధ, పురాతన ఆలయాలు ఉన్నాయి. వీటిలో అయినవిల్లిలోని విఘ్నేశ్వరుడి ఆలయం, మురమళ్లలోని భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ఆలయం, ర్యాలీలోని జగన్మోహిని కేశవస్వామి ఆలయం, ముక్తేశ్వరంలోని క్షణ ముక్తేశ్వరాలయం, పలివెలలోని శ్రీ ఉమా కొప్పులింగేశ్వర ఆలయం మందపల్లిలోని శనీశ్వర ఆలయం ముఖ్యమైనవి. అవివాహితులు మురముళ్ల వీరేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేస్తే త్వరగా పెళ్లి జరుగుతుందని నమ్మకం. అమలాపురం నుంచి కాకినాడ వెళ్లే మార్గంలో ఈ ఆలయం ఉంది. ప్రధాన రహదారి నుంచి అర కిలోమీటరు ప్రయాణిస్తే ఆ ఆలయాన్ని చేరుకోవచ్చు.

కోనసీమ వంటలు ఆహా అనిపించకమానవు. కోడికూర, కోడి పలావ్‌కు కోనసీమ పెట్టింది పేరు. చేపల పులుసు, రొయ్యల ఇగురు, వేపుడు కూడా రుచిగా వండుతారు. గోదావరి నదిపై వంతెనలు నిర్మించక ముందు ప్రజా రవాణా అంతాకూడా లాంచీలు, పడవల మీదుగానే సాగిపోయేవి. కోనసీమలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ వాటినే కొనసాగిస్తూనే ఉన్నారు. కోనసీమ ప్రాంతం సినిమా షూటింగులకు కూడా ప్రసిద్ధి. గతంలో అనేక పెద్ద పెద్ద హీరోల సినిమాలు కూడా ఇక్కడ జరిగాయి.

కోనసీమ చేరుకోవటం ఎలా ?
వాయు మార్గం: అమలాపురానికి సమీపంలోని ఉన్న అతిపెద్ద నగరం రాజమండ్రి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు విమాన సర్వీసులు ఉన్నాయి. రాజమండ్రి నుంచి ప్రతి అరగంటకు అమలాపురానికి బస్సు సౌకర్యం ఉంది.


రైలు మార్గం: కోనసీమ పరిసరాల్లో రాజమండ్రి, కాకినాడ, గంగవరం, పాలకొల్లు, నరసాపురం పట్టణాల్లో రైల్వే స్టేషన్‌లు కలవు. రైలు మార్గం ద్వారా ఆయా ప్రాంతాలకు చేరుకుని అక్కడి నుంచి బస్సు ద్వారా చేరుకోవచ్చు.
బస్సు/ రోడ్డు మార్గం : హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి నుండి కోనసీమలోని ప్రతి ప్రాంతానికి బస్సు సర్వీసులు ఉన్నాయి.