రివ్యూ: బింబిసార
చిత్రం: బింబిసార
నటీనటులు: నందమూరి కల్యాణ్ రామ్, కేథరిన్, సంయుక్తా మేనన్, వివాన్ భటేనా, ప్రకాష్ రాజ్, తనికెళ్ల భరణి, అయ్యప్ప శర్మ, శ్రీనివాస్ రెడ్డి, వరీనా హుస్సేన్ తదితరులు
మ్యూజిక్: చిరంతన్ భట్, ఎం.ఎం.కీరవాణి
మాటలు: వాసుదేవ మునేప్పగారి
ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు
రచన, దర్శకత్వం: వశిష్ఠ
నిర్మాణ సంస్థ: ఎన్టీఆర్ ఆర్ట్స్
విడుదల తేదీ: 05-08-2022
జయాపజయాలను పట్టించుకోకుండా కొత్త కథల్ని భుజానికెత్తుకుంటూ.. కొత్త దర్శకులకు అవకాశాలిస్తూ సినీ కెరీర్‌ను వైవిధ్యభరితంగా ముందుకు తీసుకెళ్తున్నారు కథానాయకుడు కల్యాణ్ రామ్. ఈ క్రమంలోనే ఇప్పుడాయన ‘బింబిసార’గా ప్రేక్షకుల్ని పలకరించారు. కొత్త దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన చిత్రమిది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే సోషియో ఫాంటసీ సినిమా కావడం.. ఇందుకు తగ్గట్లుగానే ప్రచార చిత్రాలు చక్కటి గ్రాఫిక్స్ హంగులతో ఆసక్తిరేకెత్తించేలా ఉండటంతో అందరి దృష్టి దీనిపై పడింది. మరి ఈ బింబిసారుడి కథేంటి? ఆయన చేసిన కాల ప్రయాణం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందించింది?.. తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్దాం…
కథ
త్రిగర్తల సామ్రాజ్యాన్ని ఏకచక్రాధిపతిగా పాలిస్తుంటాడు బింబిసారుడు (కల్యాణ్ రామ్). అహం, తనను ఎవరు ఎదిరించలేరనే పొగరుతో, పాలించే ప్రజలను, చిన్న పిల్లలను సైతం చూడకుండా అతి కిరాతకంగా చంపే కర్కోటకుడిగా రాజ్యాన్ని ఏలుతుంటాడు. ఈ క్రమంలోనే ఒక మాయ దర్పణం ద్వారా భూలోకానికి వస్తాడు. భూలోకంలో అతనికి వారసులు ఉన్నారని, అతని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని తెలిసిన బింబిసారుడు ఏం చేశాడు? అతి క్రూరుడైన రాజు రాజు బింబిసారుడు.. తన ప్రజల కోసం ప్రాణాలిచ్చే నిజమైన చక్రవర్తిగా, ఒక మానవత్వం గల మనిషిగా ఎలా మారాడు? టైమ్ ట్రావెల్ చేసేందుకు వీలుగా ఉన్న మాయ దర్పణం ఎలా వచ్చింది? బింబిసారుడు దాచిన నిధి తలపులు తెరవడానికి ప్రయత్నిస్తున్న సుబ్రహ్మణ్య శాస్త్రి (వివాన్ భటేనా) ఎవరు? అనే తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ‘బింబిసార’ సినిమాను కచ్చితంగా చూడాల్సిందే.
క్రీస్తుపూర్వం ఐదో శతాబ్దంలో మగధ సామ్రాజ్యాన్ని పాలించిన రాజు బింబిసారుడు. నిజానికి ఇతను హర్యాంక రాజవంశానికి చెందినవాడు. అయితే ఈ బింబిసారుడు అనే పాత్రను తీసుకుని పూర్తి కల్పిత కథతో ‘బింబిసార’ను తెరకెక్కించారు డైరెక్టర్ వశిష్ఠ. ‘ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ అనే ఒక్క క్యాప్షన్‌తో సినిమా కథను చెప్పేశారు. చరిత్రలో బింబిసారుడు ఎలా ఉన్న ఈ సినిమాలో మాత్రం అత్యంత క్రూరుడిగా, మద గజ మహారాజుగా చిత్రీకరించారు. రాజ్యాన్ని తాను ఒక్కడే పాలించాలనే కోరికతో సొంత తమ్మున్ని సైతం చంపించే అన్నగా బింబిసారుడి పాత్రను ఆవిష్కరించారు.
నటీనటుల విషయానికి వస్తే.. అతనొక్కడే, త్రీడీ మూవీగా తెరకెక్కిన ఓం వంటి సినిమాలను గమనిస్తే హీరోగా, నిర్మాతగా చేసిన కళ్యాణ్ రామ్ స్టైల్‌ను ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆయన కొత్తదనానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అర్థం చేసుకోవచ్చు. అదే ప్యాషన్‌తో బింబిసార సినిమాలో యాక్ట్ చేశారు. ఇప్పటివరకు ఆయన రాజ్యాన్ని పాలించిన చక్రవర్తి పాత్రను పోషించలేదు. కానీ ఏదో ఒక వెరైటీని అందించాలనే లక్ష్యంతో డిఫరెంట్ లుక్, బాడీ లాంగ్వేజ్‌ను ఆపాదించుకుని బింబిసారుడు అనే పాత్రను క్యారీ చేశాడు. ఆ పాత్ర కోసం తను ఎంత కష్టపడ్డాడనేది సినిమాలో తెరపై కనిపిస్తుంది. లుక్‌తో పాటు డైలాగ్ డెలివరీని ఆయన చేంజ్ చేసుకున్నారు. అంతే కాదండోయ్ నెగిటివ్ టచ్‌లో సాగే పాత్ర అనే చెప్పాలి. ఈ పాత్రలో విలనిజాన్ని చూపించడానికి వంద శాతం ట్రై చేశారు. అందులో సక్సెస్ అయ్యారు.
మెయిన్ విలన్‌గా నటించిన వివాన్ తన పరిధి మేరకు చక్కగా నటించారు. హీరోయిన్స్‌గా నటించిన క్యాథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ పాత్రలు పరిమితంగానే ఉన్నాయి. జుబేదా పాత్రలో శ్రీనివాస రెడ్డి కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అలాగే చమ్మక్ చంద్ర పాత్ర చిన్నదే అయినా నవ్వించారు. ప్రకాష్ రాజ్, రాజీవ్ కనకాల తదితరులు పాత్రల పరిధి మేరకు తమదైన నటనతో అలరించారు. విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే ఒక రాక్షస రాజుగా నటనతో మెస్మరైజ్ చేసిన కల్యాణ్ రామ్ ‘బింబిసార’ సినిమా కచ్చితంగా చూడాల్సిందే.