Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
చిరంజీవితో విభేదాలు.. మరోసారి క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్
చిరంజీవి – అల్లు అరవింద్ ఒకరికొకరు ఎలా గౌరవంగా మెలుగుతారో సినిమా ఇండస్ట్రీతో పాటు సామాన్య ప్రేక్షకులకు కూడా తెలిసిందే. అయితే మెగా-అల్లు కుటుంబాల మధ్య విభేదాలున్నాయంటూ తరుచూ వార్తలొస్తూనే ఉంటాయి. అయితే ఎప్పటికప్పుడు ఆ వార్తలను వారు ఖండిస్తూనే ఉన్నా పుకార్లు మాత్రం ఆగవు. ఇదే అంశంపై అల్లు అరవింద్ మరోసారి స్పందించారు.
తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అరవింద్ మాట్లాడుతూ.. ‘‘సమాజంలో ఇలాంటి మాటలు సహజం. అయితే 80ల కాలం నుంచి మేమిద్దరం ఒకరికొకరు అన్నట్లు స్నేహితులుగా ఉంటూ పైకొచ్చాం. బావబావమరుదులుగా కాకుండా మంచి స్నేహితులుగా ఎదిగాం. మేం ఎదుగుతున్న తరుణంలో మా కుటుంబాలు పెరిగాయి. పిల్లలు వచ్చారు. వారు కూడా ఇదే వృత్తిలో స్థిరపడ్డారు. ఫిల్మ్ సొసైటీలో ఉన్న అవకాశాలను అందరూ పంచుకోవాలి. ఎవరి స్థానాలను వారు కాపాడుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. ఇలాంటి పరిస్థితులు పోటీ అనేది సహజంగా ఉంటుంది. అయితే ఇక్కడ జనాలు ఒకటి గమనించాలి. వీళ్లందరూ ఒక్కటే. ఎవరి మీద ఏ మాట పడినా అందరూ ఒక మాట మీద ఉంటారు అన్నది జనాలకు తెలియడం చాలా ముఖ్యం. ఉదాహరణకు ఇటీవల నాన్నగారి శత జయంతి ఉత్సవాలను మా కుటుంబాలన్నీ కలిసి నిర్వహించాం. సంక్రాంతి పండుగ రోజు మా నాన్నగారికి చేయాల్సిన కార్యక్రమాలు పూర్తి చేసి చిరంజీవిగారి ఇంటికి వెళ్లిపోతాం. దీపావళి రోజున అందరం కలిసి చిరంజీవిగారింట్లో చేరి సరదాగా సెలబ్రేట్ చేసుకుంటాం. కొన్నేళ్లుగా ఇది జరుగుతూనే ఉంది. మేమంతా కలిసి పండగలు సెలబ్రేట్ చేసుకుంటున్నామని వీడియోలు తీసే మీడియా పెడతామా? పెట్టం కదా! ఎవరి కాంపిటీషన్‌తో వాళ్లు పైకి వస్తున్నారు కానీ వీరంతా ఒకటే అని జనాలు తెలుసుకోవాలి’’ అని అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు.
‘ఓ సన్నివేశంలో నటించడం కష్టమై 10 టేకులు తీసుకోవడం వల్ల దర్శకుడు విసుక్కున్నారని నాన్న అమ్మతో చెబుతుంటే విన్నాను. అప్పుడు నాన్న కళ్లల్లో నీళ్లు చూశా. ఆ సంఘటన బలంగా నాటుకుపోయింది. కొన్నాళ్ల తర్వాత బలవంతం మీద చిరంజీవి నటించిన ‘చంటబ్బాయ్’లో ఓ పాత్ర చేశా. దానికి చక్కని ఆదరణ లభించింది. ఆ సినిమా విడుదల తర్వాత ‘నిర్మాతగా ఉంటే డబ్బులు వస్తాయో రావో తెలియదు. అదే నటిస్తే ఆ సమస్య ఉండదు. యాక్టర్ అవ్వచ్చు కదా’’ అని ఓ రోజు నాన్న అడిగారు. మరుసటి రోజు ఆయన దగ్గరకు వెళ్లి ‘నేను ఎప్పుడూ యజమానిగా ఉండాలనుకుంటున్నా.. కానీ, ఉద్యోగి కావాలనుకోలేదు’ అని చెప్పాను. నాన్నకు తెలిసిన మంత్రి ద్వారా స్టేట్ బ్యాంక్‌లో ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేశారు. అప్పట్లోనే రూ.900 జీతం. నేను వ్యాపారమే చేస్తాను కానీ ఉద్యోగం జోలికి వెళ్లనని చెప్పేశా’ అని అరవింద్ చెప్పుకొచ్చారు.
చిరంజీవి సినిమా వస్తుందంటే ఆయన అభిమానులకే కాదు.. ప్రతి తెలుగు ప్రేక్షకుడికీ ఆసక్తి ఉంటుంది. రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలు చేస్తున్న ఆయనకు ఈ ఏడాది ‘ఆచార్య’ కాస్త గట్టిగానే షాక్ ఇచ్చింది. అయితే, ఈ దసరాకు ‘గాడ్‌ఫాదర్’గా తనదైన వినోదాన్ని పంచడానికి సిద్ధమయ్యారు. మరోవైపు లూసిఫర్ మలయాళంలో చాలా పెద్ద హిట్ మూవీ. మోహన్‌లాల్‌కి ఉన్న చరిష్మాను మరో రేంజ్‌లో ఎలివేట్ చేసింది. పృథ్విరాజ్ కెరీర్లో డైరక్టర్‌గా గోల్డెన్ ఫిల్మ్. తెలుగులోనూ అనువాదమై ఓటీటీల్లో అందుబాటులో ఉంది. అన్నా చెల్లెలు, ఓ రాష్ట్రం సీఎం, ఫ్యామిలీ ఇబ్బందులు, పొలిటికల్ ఇష్యూస్.. స్థూలంగా ఇదే కథాంశం. ఇదే కథను తెలుగు నేటివిటీకి తగినట్లుగా ఎలా తెరకెక్కించారు? కింగ్ మేకర్‌గా చిరు మెప్పించారా?.. మాతృకతో పోలిస్తే ఏవి మెరుగ్గా ఉన్నాయి?.. సల్మాన్, నయన్, సత్యదేవ్ పాత్రలు అదనపు ఆకర్షణ తెచ్చాయా? తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్దాం..
రాష్ట్ర ముఖ్యమంత్రి పి.కె.రామదాసు (పీకేఆర్) మరణం తర్వాత రాజకీయ శూన్యం ఏర్పడుతుంది. సీఎంగా ఎవరిని ఎంపిక చేయాలన్నదానిపై జన జాగృతి పార్టీ (జేజేపీ) తర్జనభర్జన పడుతుంటుంది. పీకేఆర్ స్థానంలో అధికారాన్ని హస్తగతం చేసుకుని సీఎం కావాలని అతడి అల్లుడు జైదేవ్ (సత్యదేవ్) భావిస్తాడు. అందుకు పార్టీలోని కొందరు దురాశపరులతో చేతులు కలుపుతాడు. అయితే, పీకేఆర్‌కు అత్యంత సన్నిహితుడు, ప్రజాదరణ కలిగిన నాయకుడు బ్రహ్మ తేజ (చిరంజీవి) మాత్రం జైదేవ్ సీఎం కాకుండా అడ్డు నిలబడతాడు. దీంతో జన జాగృతి పార్టీ నుంచి, అసలు ఈ లోకం నుంచే బ్రహ్మను పంపించడానికి జైదేవ్ కుట్రలు పన్నుతాడు. మరి ఆ కుట్రలను బ్రహ్మ ఎలా ఎదుర్కొన్నాడు? జైదేవ్ నీచుడన్న విషయం జైదేవ్ భార్య సత్యప్రియ (నయనతార)కు ఎలా తెలిసింది? రాష్ట్ర పాలన దురాశపరుల చేతిలో పడకుండా బ్రహ్మ ఎలా అడ్డుకున్నాడు? ఇంతకీ బ్రహ్మకు, పీకేఆర్‌కు ఉన్న సంబంధం ఏంటి? మధ్యలో మసూద్ భాయ్ (సల్మాన్) ఎవరు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
మలయాళ సినిమా లూసిఫర్‌ను దాదాపు తెలుగు ప్రేక్షకులందరూ చూశారు. ఆ సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్‌గా రీమేక్ చేయటమేంటని ముందు చాలా మంది భావించారు. కానీ ఇప్పుడు సినిమా చూసిన తర్వాత ఆ అభిప్రాయం తప్పకుండా మార్చుకోవాల్సిందే. సినిమా ప్రధాన కథాంశం అదే తీసుకున్నారు. కొన్ని మెయిన్ సీన్స్ కూడా అదే స్టైల్లోనే చిత్రీకరించారు. కానీ కథలో చేయాల్సిన ప్రధాన మార్పులన్నింటినీ చక్కగా చేశారు. మన తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా మార్పులు చేశారు. అలాగే చిరంజీవి హీరోయిజాన్ని అభిమానులే కాదు.. ప్రేక్షకులు సైతం మెచ్చుకునేలా సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించారు దర్శకుడు మోహన్ రాజా. లూసిఫర్ సినిమాను చూసిన ప్రేక్షకులు సైతం గాడ్ ఫాదర్‌ను చూస్తే కొత్తగా ఉన్నట్లు భావన కలిగింది.
‘‘గాడ్ ఫాదర్’ స్క్రీన్‌ప్లే కొత్తగా, ఆశ్చర్యకరంగా ఉంటుంది. మలయాళంలో చూడని పది పాత్రలు ఇందులో వేరే రూపంలో ఉంటాయి. ఇవన్నీ సర్‌ప్రైజింగ్‌గా ఉంటాయి. ఓపిక ఉంటే ‘లూసిఫర్’ని మరోసారి చూసి రండి’’ – ఇదీ ఇటీవల ఇంటర్వ్యూలో దర్శకుడు మోహన్‌రాజా చెప్పిన విషయం. తన స్క్రీన్‌ప్లే, మార్పులపై ఎంత నమ్మకంతో చెప్పారో దాన్నే తెరపై చూపించడంలో విజయం సాధించారు దర్శకుడు. ‘లూసిఫర్’ చూసిన వాళ్లు కూడా ‘గాడ్‌ఫాదర్’ను ఎంజాయ్ చేస్తారు. పీకేఆర్ మరణంతో సినిమా మొదలు పెట్టిన దర్శకుడు, కొద్దిసేపటికే అసలు కథేంటి? సినిమాలో పాత్రల తీరుతెన్నులు వివరంగా చెప్పేశారు. ఇక ప్రేక్షకుడు చూడాల్సింది తెరపై కనిపించే రాజకీయ చదరంగమే. ఈ చదరంగంలో రెండు బలమైన పావులుగా ఒకవైపు బ్రహ్మగా చిరంజీవి, జైదేవ్‌గా సత్యదేవ్‌లు నిలబడ్డారు. ఒక్కో సన్నివేశంలో ఒక్కొక్కరిది పై చేయి ఉంటుంది. అయితే, బ్రహ్మ పాత్ర కీలకం కావడంతో అంతర్లీనంగా అతడే ఒక మెట్టుపైన ఉంటాడు. చిరంజీవి కనిపించే ప్రతి సన్నివేశమూ ఆయన్ను ఎలివేట్ చేసిన విధానం స్టైలిష్‌గా బాగుంది. ఆ సన్నివేశాలకు తమన్ నేపథ్యం సంగీతం థియేటర్‌ను ఊపేసింది.
లూసిఫర్ తో పోలిక పక్కనపెట్టి ఈ సినిమా వరకు చర్చించుకుంటే చిరంజీవి ఆద్యంతం హుందాగా కనిపిస్తూ వయసుకు తగ్గట్టు కనిపించారు. అయితే ఆయన్నుంచి ఆశించే నామమాత్రపు డ్యాన్సు కూడా ఇందులో లేదు. చివర్లో వచ్చే తార్ మార్ టక్కర్ మార్ లో కూడా సరైన స్టెప్పు ఒక్కటి కూడా వేయలేదు. పైగా దానికి ప్రభుదేవా కోరియోగ్రఫీ. ఎంత చిరంజీవి వయసుని దృష్టిలో పెట్టుకున్నా ఆయననుంచి కనీసం ఖైది 150లో షూలేస్ స్టెప్పులాంటిదైనా ఆయన ఫ్యాన్స్ ఆశించడం సహజం. అది పెద్దగా శ్రమలేని స్టెప్పే. ఆ విషయంలో మాత్రం పూర్తిగా నిరాశ కలిగినట్టే. అసలు తార్ మార్ పాట పెట్టి ప్రయోజనం లేకుండా పోయింది.
ఈ సినిమాకు నీరవ్‌షా కెమెరా హైలైట్. మోహన్‌రాజా పల్స్ పట్టుకుని ప్రతి షాట్‌నీ ఎలివేట్ చేశారు తమన్. తమన్ మ్యూజిక్‌కి స్పెషల్ అప్లాజ్ వస్తుంది. అలాగే తప్పక మెన్షన్ చేయాల్సిన మరో పేరు లక్ష్మీభూపాల్. ప్రతి మాటనూ శ్రద్ధగా రాశారు. ఆయా కేరక్టర్ల బిహేవియర్‌ని, బాడీ లాంగ్వేజ్‌నీ బట్టి ఆయన రాసిన మాటలు మెప్పిస్తాయి. పూరి జగన్నాథ్ కేరక్టర్ స్పెషల్ అట్రాక్షన్. సునీల్, షఫి, దివి, గంగవ్వ, బ్రహ్మాజీ, సముద్రఖని,భరత్‌రెడ్డి, అనసూయ.. ఇలా ప్రతి పాత్రకూ స్క్రీన్ మీద న్యాయం చేశారు డైరక్టర్.
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ . మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను రామ్ చరణ్, ఆర్.బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ ఇందులో ఓ కీలక పాత్రలో నటించటం విశేషం. చిరంజీవి – సల్మాన్ ఖాన్ కలిసి చేసిన ‘థార్ మార్..’ అనే సాంగ్‌ను సెప్టెంబర్ 15న రిలీజ్ చేయబోతున్నారు. ఆ సాంగ్ ప్రోమోను మంగళవారం చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ప్రోమో చూస్తుంటే చిరు, సల్మాన్ మాస్ స్టెప్పులతో అదరగొట్టేశారని క్లియర్‌గా అర్థమవుతోంది. అక్టోబర్ 5న సినిమా థియేటర్స్‌లో సందడి చేయనుంది.
కరోనా కారణంగా చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. ఇప్పటికే RRR, ప్రభాస్ రాధేశ్యామ్ వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఈ బాటలోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య మూవీని వాయిదా వేశారు. ఫిబ్రవరి 4న రిలీజ్ కావాల్సిన ఆచార్యను చిత్ర యూనిట్ వాయిదా వేసింది. తాజాగా ఈ సినిమానున ఏప్రిల్ 1న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇదే రోజున మహేశ్ బాబు సర్కారు వారి పాట రిలీజ్ అవుతుంది. ఈ మూవీని సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కావాల్సింది. కానీ అనుకోని పరిస్థితుల్లో మూవీని ఏప్రిల్ 2 న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీంతో మెగాస్టార్, సూపర్ స్టార్ మధ్య పోటీ రానుంది. అయితే రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే అప్పటికైనా పరిస్థితులు చక్కబడతాయా? లేదా? అన్నది చూడాలి మరి.
This Ugadi, Witness the MEGA MASS on big screens 💥💥#Acharya Grand Release on April 1 🔥#AcharyaOnApril1
ప్రస్తుతం సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ నయనతార హవా కొనసాగుతోంది. వయసు పైబడుతున్నా ఆమె రేంజ్ పెరుగుతోందో గానీ.. ఎక్కడా తగ్గడం లేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటున్న నయనతార గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి చెల్లి పాత్రలో కనిపించనుంది. ‘సైరా నరసింహారెడ్డి’ లో చిరుకు భార్యగా నటించిన నయన్.. తాజా సినిమాలో ఆయనకు చెల్లెలిగా నటిస్తుండటం విశేషం.
అయితే ఈ సినిమా కోసం నయనతార ఏకంగా నాలుగు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. నయనతార నటించడం వల్ల ఇతర భాషల్లో కూడా రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో నిర్మాతలు ఈ స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధమైనట్లు సమాచారం. మలయాళంలో సూపర్‌హిట్ అందుకున్న ‘లూసిఫర్’ రీమేక్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాలో హీరో చెల్లెలి పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అందువల్లే ఈ రోల్‌కి నయనతారను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే ‘గాడ్ ఫాదర్’ సినిమా కోసం నయన్ తీసుకున్న పారితోషికం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సినిమా కోసం ఆమె ఏకంగా రూ.4కోట్లు తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.మునుపెన్నడూ లేనివిధంగా ఆమె పవర్ ఫుల్ లుక్‌లో కనిపించనున్నారట.
‘గాడ్ ఫాదర్’ సినిమా విషయానికి వస్తే కొణిదెల ప్రొడెక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సత్యదేవ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. నయనతార భర్తగా ఆయన కనిపించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఈ సినిమాలో నటించనున్నారంటూ గత కొన్నిరోజుల నుంచి ప్రచారం సాగుతోంది.
లాక్‌డౌన్ తెలుగు సినీ పరిశ్రమను కోలుకోలేని దెబ్బతీసింది. షూటింగులు ఆగిపోవడం, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న సినిమాలు థియేటర్లు మూతపడటంతో నెలలపాటు ల్యాబ్‌కే పరిమితమయ్యాయి. పరిస్థితి ఇప్పుడిప్పుడే కాస్త సద్దుమణుగుతున్నా టాలీవుడ్‌లో ఇదివరకటి సందడి లేదనే చెప్పాలి. అయితే కరోనా మహమ్మారి ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న టాలీవుడ్‌లో వరుసగా పెద్దపెద్ద సినిమాలు తెరకెక్కడం చర్చనీయాశంగా మారింది. సీనియర్, యంగ్ హీరోలు గతంలో కంటే స్పీడుగా వరుసబెట్టి సినిమాలు చేస్తున్నారు. ఓ సినిమా సెట్స్‌పై ఉండగానే, మరో రెండు మూడు కథలకు ఓకే చెప్పి, వాటినీ సమాంతరంగా పట్టాలెక్కించేందుకు అగ్ర కథానాయకులు ప్రణాళికలు రచిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మాస్ మహరాజ్ రవితేజ చేతిలోనే ఏకంగా 16 సినిమాలున్నాయంటే ఆశ్చర్యం కలగకమానదు. సినిమాల్ని ఒప్పుకోవడంలో ఈ ముగ్గురి రూటే సెపరేటు. ‘ఒకదాని తరవాత మరోటి’ అనే చందాన కథల్ని ఒప్పుకునే ఈ హీరోలు ఒకేసారి రెండు మూడు సినిమాల్ని సెట్స్‌పైకి తీసుకెళ్లడం, అవి చిత్రీకరణ దశలో ఉండగానే మరిన్ని కథలు సిద్ధం చేసుకోవడం మార్కెట్ వర్గాలకు ఉత్సాహాన్ని ఇస్తోంది.
చిరంజీవి ‘ఆచార్య’ షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. 2022 ఫిబ్రవరి 4న ఈ చిత్రం విడుదల కానుంది. ‘ఆచార్య’ పనులు ఇంకా మిగిలి ఉండగానే, ‘గాడ్ ఫాదర్’కి కొబ్బరికాయ కొట్టారు చిరు. ఇటీవలే ‘భోళా శంకర్’ పనులూ మొదలయ్యాయి. రెండ్రోజుల క్రితమే బాబి సినిమాకి క్లాప్ కొట్టారు. ఇవన్నీ ఎప్పుడు పూర్తవుతాయో తెలీదు. ఇవన్నీ సెట్స్‌పై ఉండగానే చిరంజీవికి మారుతి ఓ కథ వినిపించాడని టాక్ నడుస్తోంది. మారుతి కూడా ‘చిరంజీవిగారితో ఓ సినిమా ఉంటుంది. ఇప్పటికే లైన్ వినిపించేశా. పూర్తి స్థాయి కథని సిద్ధం చేయాలి’ అని చెప్పేశారు. మరోవైపు త్రివిక్రమ్ సైతం చిరుతో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తుంటే చిరంజీవి చేతిలో అరడజను ప్రాజెక్టులు ఉన్నాయి.
మరోవైపు ‘క్రాక్’ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న రవితేజ తన కెరీర్‌లో ఎప్పుడూ లేనంత స్పీడు కొనసాగిస్తున్నారు. ఆయన నటించిన ‘ఖిలాడి’ రిలీజ్ కి రెడీకాగా.. ‘ధమాకా’, ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘రావణాసుర’, ‘రామారావు ఆన్ డ్యూటీ’… సినిమాలు లైన్‌లో ఉన్నాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా… కొత్త సినిమాలు ఒప్పుకోవడమే కాదు, సినిమా సినిమాకీ ఆయన పారితోషికం పెరుగుతూనే ఉందన్నది ట్రేడ్ వర్గాల టాక్.
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ కూడా బిజీగా మారిపోయారు. ఆయన ఊ అంటే చాలు అడ్వాన్సులు చేతిలో పెట్టడానికి అగ్ర నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. భారతదేశంలోనే అత్యంత క్రేజీ స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ ‘రాధేశ్యామ్’తో ఈ సంక్రాంతికి రానున్నాడు. ఆ తర్వాత సలార్, ఆదిపురుష్ పూర్తి చేయనున్నాడు. నాగ్‌అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ప్రాజెక్ట్ K’పై కూడా భారీ అంచనాలున్నాయి. వీటితో పాటు ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ సందీప్‌రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ అనే సినిమా చేస్తున్నాడు. మరోవైపు బాలీవుడ్ నుంచి కూడా ప్రభాస్‌కి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. కొత్త కథలు వినిపించడానికి దర్శకులు సిద్ధంగా ఉన్నా బిజీ షెడ్యూల్ వల్ల ప్రభాస్ ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.
లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌లు ఆగిపోవడంతో సినీ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి.. కొందరు సినీ పెద్దలతో కలిసి కరోనా క్రైసిస్ చారిటీ(సీసీసీ)ని ఏర్పాటు చేసి.. కష్టాల్లో ఉన్న సినీ కార్మికులను ఆదుకున్నారు. అయితే లాక్‌డౌన్ ముగిసినప్పటికీ.. సీసీసీ ద్వారా ఇంకా సరైన ఉపాధి లేని సినీ కార్మికులకు అండగా నిలుస్తున్నారు. మరోవైపు శాస్త్రవేత్తల కృషితో కోవిడ్ టీకా అందుబాటులోకి రావడంతో అందరికి కాస్త ఉపశమనం కలిగింది.
భారతదేశంలో ఈ టీకా వినియోగం విస్తృతంగా జరుగుతోంది. దశల వారిగా అర్హులైన వారందరికీ టీకాను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతకాలం క్రితం సీసీసీ తరఫున సినీ కార్మికులు అందరికీ ఉచితంగా టీకాలు అందజేస్తామని చిరంజీవి ప్రకటించారు. సీసీసీ తరఫున సేకరించిన విరాళాలలో కొంత డబ్బు మిగిలి ఉందని.. ఆ డబ్బుతో సినీ కార్మికులకు టీకాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే చిరంజీవీ ఆ ఏర్పాట్లు చేశారు. అపోలో 24/7 సహకారంతో సినీ కార్మికులతో పాటు సినీ జర్నలిస్టులకు కూడా ఉచితంగా టీకా అందజేస్తున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.