సినీ కార్మికులకు ఫ్రీ వ్యాక్సిన్.. మాట నిలబెట్టుకున్న చిరంజీవి
Category : Behind the Scenes Latest Events Movie News Movies
లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌లు ఆగిపోవడంతో సినీ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి.. కొందరు సినీ పెద్దలతో కలిసి కరోనా క్రైసిస్ చారిటీ(సీసీసీ)ని ఏర్పాటు చేసి.. కష్టాల్లో ఉన్న సినీ కార్మికులను ఆదుకున్నారు. అయితే లాక్‌డౌన్ ముగిసినప్పటికీ.. సీసీసీ ద్వారా ఇంకా సరైన ఉపాధి లేని సినీ కార్మికులకు అండగా నిలుస్తున్నారు. మరోవైపు శాస్త్రవేత్తల కృషితో కోవిడ్ టీకా అందుబాటులోకి రావడంతో అందరికి కాస్త ఉపశమనం కలిగింది.
భారతదేశంలో ఈ టీకా వినియోగం విస్తృతంగా జరుగుతోంది. దశల వారిగా అర్హులైన వారందరికీ టీకాను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతకాలం క్రితం సీసీసీ తరఫున సినీ కార్మికులు అందరికీ ఉచితంగా టీకాలు అందజేస్తామని చిరంజీవి ప్రకటించారు. సీసీసీ తరఫున సేకరించిన విరాళాలలో కొంత డబ్బు మిగిలి ఉందని.. ఆ డబ్బుతో సినీ కార్మికులకు టీకాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే చిరంజీవీ ఆ ఏర్పాట్లు చేశారు. అపోలో 24/7 సహకారంతో సినీ కార్మికులతో పాటు సినీ జర్నలిస్టులకు కూడా ఉచితంగా టీకా అందజేస్తున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.