థ్యాంక్యూ రివ్యూ(Thankyou Review)

థ్యాంక్యూ రివ్యూ(Thankyou Review)

చిత్రం: థ్యాంక్యూ
న‌టీన‌టులు: నాగ‌చైత‌న్య, రాశీఖ‌న్నా, మాళ‌విక నాయ‌ర్‌, అవికాగోర్‌, ప్రకాశ్‌రాజ్‌, ఈశ్వరీరావు, సాయి సుశాంత్ రెడ్డి, త‌దిత‌రులు
క‌థ‌: బి.వి.ఎస్‌.ర‌వి
సంగీతం: త‌మ‌న్
ఛాయాగ్రహ‌ణం: పి.సి.శ్రీరామ్‌
కూర్పు: న‌వీన్ నూలి
నిర్మాణం: దిల్‌రాజు, శిరీష్‌
నిర్మాణ సంస్థ: శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్‌
ద‌ర్శక‌త్వం: విక్రమ్ కె.కుమార్‌
విడుద‌ల‌: 22-07-2022

మ‌జిలీ, వెంకీ మామ‌, ల‌వ్‌స్టోరి, బంగార్రాజు ఇలా వ‌రుస విజ‌యాల‌తో స‌క్సెస్ ఊపు మీదున్న అక్కినేని హీరో నాగ చైత‌న్య. ఆయ‌న కెరీర్‌లో మ‌నం ఓ మెమొర‌బుల్ మూవీ. ఆ సినిమాను డైరెక్ట్ చేసింది విక్రమ్ కె.కుమార్‌. త‌ర్వాత వీరిద్దరి కాంబినేష‌న్‌లో సినిమా తెరకెక్కలేదు. దాదాపు 8 ఏళ్ల త‌ర్వాత ఈ హిట్ కాంబినేష‌న్‌లో రూపొందిన సినిమా ‘థాంక్యూ’. చైతన్య సక్సెస్ ట్రాక్.. విక్రమ్ కుమార్ వంటి సెన్సిబుల్ డైరెక్టర్‌కి తోడుగా దిల్ రాజు, శిరీష్ వంటి అభిరుచి గ‌ల నిర్మాత‌లు తోడయ్యారు. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌తో ఈ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ మ‌రింత పెరిగాయి. మ‌రి వాటిని సినిమా ఏ మేర‌కు అందుకుంద‌నేది తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం…

క‌థేంటంటే
అభిరామ్ (నాగ‌చైత‌న్య) పేదింటి కుర్రాడు. చిన్ననాటి నుంచే త‌న‌కంటూ కొన్ని ఆశ‌యాలుంటాయి. త‌న జీవితంలో ఒకొక్క మ‌జిలీ త‌ర్వాత అమెరికా చేరుకుంటాడు. అక్కడ త‌న తెలివితేట‌ల‌తో కార్పొరేట్ సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు. అత‌డి మ‌న‌సుని చూసి ప్రియ (రాశీఖ‌న్నా) ప్రేమిస్తుంది. ఇద్దరూ స‌హ‌జీవ‌నం చేస్తారు. జీవితంలో ఎదుగుతున్న కొద్దీ అభి ఆలోచ‌న‌లు మారిపోతాయి. జీవితంలో ఎన్నో వ‌దులుకుని ఇక్కడిదాకా వ‌చ్చా.. రాజీ ప‌డే ప్రస‌క్తే లేదంటూ ఎవ్వరినీ లెక్క చేయ‌డు. నేను, నా ఎదుగుద‌ల అన్నట్టుగానే వ్యవ‌హరిస్తుంటాడు. ఎదుటివాళ్ల మ‌నోభావాల్ని అస్సలు ప‌ట్టించుకోడు. దీంతో ప్రియ అత‌డికి దూరంగా వెళ్లిపోతుంది. అభి అలా సెల్ఫ్ సెంట్రిక్‌గా మార‌డానికి దారి తీసిన ప‌రిస్థితులు ఏమిటి? ప్రియ దూర‌మ‌య్యాకైనా అతడి ఆలోచ‌న‌లు మారాయా? ఆ తర్వాత ఇండియాకి వ‌చ్చిన అభి ఏం చేశాడన్నదే మిగ‌తా క‌థ‌.

వ్యక్తి జీవితంలో సాధించిన విజ‌యాల వెనుక ఎంతో మంది ప్రోత్సాహం, తోడ్పాటు ఉంటుంది. అలాంటి వారిని క‌లుసుకునే వ్యక్తి భావోద్వేగ ప్రయాణ‌మే ‘థాంక్యూ’ సినిమా. నాగ చైత‌న్య చుట్టూనే ‘థాంక్యూ’ సినిమా నడిచింది. ఓ రకంగా భారీ యాక్షన్ స‌న్నివేశాలు, సెట్స్‌, క‌మ‌ర్షియ‌ల్ అంశాలు లేకుండా.. ఎమోష‌న్స్‌ను ప్రధానంగా చేసుకుని న‌డిచే సినిమా ఇది. ఇలాంటి సినిమాను యాక్సెప్ట్ చేయ‌ట‌మే గొప్ప విష‌యం అనాలి. 30ఏళ్ల వ్యక్తి జీవితంలో జరిగే మూడు ముఖ్య ద‌శ‌ల‌ను ఈ సినిమా రూపంలో మ‌లిచారు. వాటిలో ఒదిగిపోవ‌టానికి నాగ చైత‌న్య చాలానే క‌ష్టప‌డ్డారు. ముఖ్యంగా గ్రామంలో ప‌ద్దెనిమిదేళ్ల కుర్రాడుగా క‌నిపించటానికి త‌న బ‌రువు త‌గ్గటం.. మ‌ళ్లీ త‌ర్వాత క‌నిపించే పాత్రలో ర‌గ్డ్‌గా క‌నిపించ‌టం అనేది చాలా క‌ష్టమైన విష‌యం. ఆ రెంటిని చైత‌న్య త‌న‌దైన న‌ట‌న‌తో చ‌క్కగా బ్యాలెన్స్ చేస్తూ వ‌చ్చారు. నిజంగా త‌న ప్రయ‌త్నాన్ని క‌చ్చితంగా అభినందించాలి. త‌న ఓజ్‌ను దాటి ఓ కొత్త ఎక్స్‌పెరిమెంట్ చేశాడు చైత‌న్య.

అభిరామ్ ప్రయాణ‌మే ఈ సినిమా. జీవితంలో అప్పటిదాకా దాటుకుంటూ వ‌చ్చిన ఒక్కొక్క ద‌శ‌ని ఆవిష్కరిస్తూ భావోద్వేగాల్ని పంచ‌డ‌మ‌నే కాన్సెప్ట్ మ‌న సినిమాకి కొత్తేమీ కాదు. నాగ‌చైత‌న్య ‘ప్రేమ‌మ్‌’ కూడా అలాంటి ప్రయ‌త్నమే. కాక‌పోతే ఈ క‌థ‌లో ప్రేమ‌కంటే కూడా జీవితంపైనే ఎక్కువ‌గా దృష్టిపెట్టారు. తెలిసో తెలియ‌కో ఒక్కొక్కరూ మ‌న జీవితాన్ని ఒక్కో మ‌లుపు తిప్పుతుంటారు. మ‌నం ఎదిగాక కృత‌జ్ఞత‌గా వాళ్లని గుర్తు చేసుకోవాల్సిందే అని చెప్పే ప్రయ‌త్నం ఇందులో క‌నిపిస్తుంది. క‌థేదైనా క‌థ‌నంతో దానికి కొత్త హంగులు తీసుకొచ్చే ప్రయ‌త్నం చేస్తుంటారు. ఇందులోని క‌థ అంద‌రికీ తెలిసిందే. క‌థ‌నం విష‌యంలోనూ పెద్దగా క‌స‌ర‌త్తులు చేయ‌లేదు. దాంతో ఏ ద‌శ‌లోనూ సినిమా ఆస‌క్తిని రేకెత్తించ‌దు. ఆరంభ స‌న్నివేశాలు ఆహ్లాదాన్ని పంచుతాయి. ప్రియ‌, అభిరామ్ క‌ల‌వ‌డం.. వాళ్ల మ‌ధ్య ప్రేమ చిగురించ‌డం.. ఆ త‌ర్వాత అభిరామ్ ఎదుగుద‌ల నేప‌థ్యంలో స‌న్నివేశాలు ప్రేక్షకుడిని క‌థ‌లో లీనం చేస్తాయి.

కానీ ఈ క‌థాగ‌మ‌నం ఏమిటో ప్రేక్షకుడి ఊహ‌కు అందేలా సాగుతుంది. మ‌న‌స్సాక్షి ఎపిసోడ్ త‌ర్వాత క‌థ‌లో ఉప‌క‌థ‌లు మొద‌ల‌వుతాయి. నాగ‌చైత‌న్య – మాళ‌విక నాయ‌ర్ (పార్వతి) మ‌ధ్య సాగే తొలిక‌థ కొత్తగా అనిపించ‌క‌పోయినా అందంగానే ఉంటుంది. ద్వితీయార్ధం త‌ర్వాత మొద‌ల‌య్యే రెండో క‌థ విష‌యంలోనే స‌మ‌స్యంతా. సుదీర్ఘంగా సాగ‌డం, అందులో కొత్తద‌నమేదీ లేక‌పోవ‌డంతో సినిమా రొటీన్‌గా మారిపోయింది. క‌టౌట్లు, హాకీ అంటూ చాలా హంగామానే ఉంటుంది కానీ, ఆ స‌న్నివేశాల‌న్నీ కూడా సాగ‌దీత‌గానే అనిపిస్తాయి. పార్వతి, శ‌ర్వాని క‌లిశాక ప‌తాక స‌న్నివేశాలు మొద‌ల‌వుతాయి. అవి భావోద్వేగాల‌తో మ‌న‌సుల్ని హ‌త్తుకునేలా ఉన్నప్పటికీ అప్పటికే జ‌రగాల్సిన న‌ష్టమంతా జ‌రిగిపోయిన‌ట్టు అనిపిస్తుంది.

భావోద్వేగంగా సినిమా ప్రేక్షకుల‌ను మెప్పించాల‌ని యూనిట్ చేసిన ప్రయ‌త్నం ఓకే. అయితే సినిమా బావున‌ట్లే ఉంటుంది కానీ.. ఎమోష‌న‌ల్‌గా ప్రేక్షకుడు క‌నెక్ట్ కాలేడు.. మ‌నం వంటి ఎమోష‌న‌ల్ మూవీని అద్భుతంగా తెర‌కెక్కించి ద‌ర్శకుడు విక్రమ్ కుమారేనా ఈ సినిమాను డైరెక్ట్ చేసింద‌నే డౌట్ రాక మాన‌దు. ఇక ఇలాంటి ఫీల్ గుడ్ మూవీలో ఎమోషన్ క‌నెక్ట్ కావాలంటే సంగీతం ప్రధాన పాత్రను పోషించాల్సి ఉంటుంది. త‌మ‌న్ సంగీతం పాట‌లు సిట్యువేష‌న్స్‌కు త‌గ్గట్టు వెళ్లాయే త‌ప్ప.. గొప్పగా లేవు. నేప‌థ్య సంగీతం ఫర్వాలేదు. ఇక పి.సి.శ్రీరామ్‌గారి సినిమాటోగ్రఫీకి మ‌నం వంక‌లు పెట్టలేం. విజువ‌ల్స్‌గా సినిమా చాలా ఎఫెక్టివ్‌గా అనిపిస్తుంద‌న‌డంలో సందేహం లేదు. అక్కినేని అభిమానులు సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ కామ‌న్ ఆడియెన్స్‌కు మాత్రం సినిమా అంత ఎమోష‌న‌ల్‌గా క‌నెక్టింగ్‌గా అనిపించ‌దు.


దిల్ రాజుకు కరోనా పాజిటివ్.. టెన్షన్‌లో ‘వకీల్ సాబ్’ టీమ్

తెలుగు ఇండస్ట్రీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. సెకండ్ వేవ్ మొదలైన తర్వాత చాలా మంది సినీ ప్రముఖులు కొవిడ్-19 బారిన పడ్డారు. తాజాగా అగ్ర నిర్మాత దిల్ రాజుకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా నిర్మించాలనే తన 22 ఏళ్ల కలను వకీల్ సాబ్ సినిమాతో నెరవేర్చుకున్న దిల్ రాజు.. ఈ సినిమా ప్రచారంలో భాగంగా కొద్ది రోజులుగా అభిమానులతో కలిసి సందడి చేస్తున్నారు. ‘వకీల్ సాబ్’ బ్లాక్‌బస్టర్ సంతోషాన్ని అందరితోనూ పంచుకుంటూ తెగ సంబరపడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది.

దీంతో ఆయన వెంటనే హోమ్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. కొద్ది రోజులుగా తనను కలిసిన వాళ్లందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆయన కోరారు. వకీల్ సాబ్ చిత్ర యూనిట్‌తో పాటు ఆ సినిమా దర్శకుడు వేణు శ్రీరామ్ కూడా చాలా రోజుల నుంచి దిల్ రాజుతోనే ఉన్నాడు. ఇప్పటికే వకీల్ సాబ్ చిత్ర యూనిట్‌లో హీరోయిన్ నివేదా థామస్ కు కరోనా వచ్చి తగ్గిపోయింది. ఇప్పుడు నిర్మాత దిల్ రాజుకు కరోనా వచ్చింది. మరోవైపు వ్యక్తిగత భద్రతా సిబ్బందికి కరోనా రావడంతో పవన్‌ కళ్యాణ్‌ కూడా హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. దిల్‌రాజుకు కరోనా పాజిటివ్ రావడంతో ఇప్పుడు అందరిలోనే టెన్షన్ మొదలైంది.


‘వకీల్‌ సాబ్’కు బ్లాక్‌బస్టర్ టాక్.. యూనిట్ సంబరాలు


‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘వకీల్ సాబ్’ తొలి షోతోనే సెన్సేషనల్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని సెంటర్స్ నుంచి బ్లాక్ బస్టర్ హిట్ రావడంతో యూనిట్‌ సంబరాల్లో మునిగిపోయింది. యూనానమస్ సూపర్ హిట్ రెస్పాన్స్ నేపథ్యంలో “వకీల్ సాబ్” చిత్ర బృందం హైదరాబాద్‌లోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీసులో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శ్రీరామ్ వేణు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా… నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ….నిర్మాతగా మారి 18 ఏళ్లవుతోంది. లైఫ్‌లో ఎన్నో సక్సెస్ లు చూశాను. డిస్ట్రిబ్యూటర్‌గా అంతకుముందు నుంచే విజయాలు చూశాను. అయితే ‘వకీల్ సాబ్’ సక్సెస్ ఎందుకో కొత్తగా అనిపిస్తోంది. ఉదయం 4.30 కూకట్ పల్లిలో ప్రీమియర్ షోస్ చూశాను. ఆ ఫ్యాన్స్ మధ్యలో సినిమా చూస్తుంటే నన్ను నేను మర్చిపోయాను. నిర్మాతనని మర్చిపోయి ఫ్యాన్స్‌లాగే పేపర్స్ విసిరేశాను. పది నిమిషాల తర్వాత రియలైజ్ అయ్యాను. వకీల్ సాబ్ మీద మాసివ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమాను ఒక్కో స్టేజీలో చూస్తుంటే ఇలాంటి ఘన విజయాన్ని అంచనా వేశాం. ప్రేక్షకులు, అభిమానుల మధ్యలో సినిమా చూస్తుంటే ఒక అద్భుతమైన ఫీలింగ్ కలిగింది. అప్పటికే అమెరికా, దుబాయ్ షోస్ నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. విదేశాల నుంచి సినిమా సూపర్ హిట్ అనే టాక్ వచ్చింది. వకీల్ సాబ్ విజయం నాకు కొత్తగా అనిపించడానికి కారణం, నేను కళ్యాణ్ గారితో సినిమా చేయాలనే కోరిక కావొచ్చు, ఇలాంటి సబ్జెక్ట్ కావొచ్చు. పవన్ గారితో పాటు ఈ సినిమా సక్సెస్ ఘనత దర్శకుడు శ్రీరామ్ వేణుకి ఇస్తాను. ఒక హీరోను ఇలా చూడాలి అనే ఆలోచనతో తను రాసుకున్న సీన్స్ కానీ, ప్రెజంటేషన్ గానీ సూపర్బ్. ప్రతి సీన్‌కు, ప్రతి డైలాగుకు ఆడియెన్స్ రియాక్ట్ అవుతున్నారు. గంటా పదిహేను నిమిషాల సెకండాఫ్ అయితే విజిల్స్, చప్పట్లు కొడుతున్నారు.

సినిమా అయ్యాక దర్శకుడు వేణుకు కాల్ చేశాను. ఇద్దరం కలిసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వెళ్లాం. ఆయనకు ముందుగా చెప్పలేదు, ఆ సంతోషంలో ఆయన ఇంటికి వెళ్లి పవన్ గారిని కలిసి సినిమా సక్సెస్ గురించి చెప్పాం. ఆయన కూడా చాలా సంతోషంగా ఫీలయ్యారు. కళ్యాణ్ గారు చాలా సక్సెస్‌లు చూశారు కానీ వకీల్ సాబ్‌లో అమ్మాయిలు, మహిళల గొప్పదనం తెలిపే కంటెంట్ ప్రేక్షకులకు రీచ్ అయితే ఆ సంతృప్తి వేరుగా ఉంటుంది. వేణు, పవన్ గారు ప్రతి సీన్ ఎలా చేయాలో డిస్కషన్ చేసుకుని షూట్ చేశారు. ఆ సీన్స్ ఇప్పుడు థియేటర్లో బాగా ఆకట్టుకుంటున్నాయి. దాదాపు గంట సేపు పవన్ గారితో మాట్లాడాం. నేను ప్రసాద్ ఐమాక్స్, సుదర్శన్ థియేటర్లకు వెళ్లి అక్కడ ఆడియెన్స్ రెస్పాన్స్ గమనించాను. టెర్రఫిక్ రెస్పాన్స్ ఉంది. ఏదో తెలియని అనుభూతికి లోనవుతున్నాను. ఇంతలో చాలా మంది మీడియా పర్సన్స్ ఫోన్ చేసి సినిమాను ప్రశంసిస్తూ మాట్లాడారు. మీడియా మిత్రులకు కృతజ్ఞతలు. ఇదొక అద్భుతమైన ఎక్సీపిరియన్స్. బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్, కళ్యాణ్ గారి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటూ చెబుతున్నారు. ఈ సినిమా ఎంత సునామీ సృష్టిస్తుందో ఇప్పుడో చెప్పలేం. ఇప్పటిదాకా వచ్చిన రిపోర్ట్ మాత్రం ట్రెమండస్‌గా ఉన్నాయి. ఏ సినిమా ఎంత డబ్బు తెస్తుందనేది నేనెప్పుడూ ఆలోచించలేదు. మంచి సినిమా చేశాక డబ్బు ఆటోమేటిక్‌గా వస్తుంది. 18 ఇయర్స్ నుంచి మా సంస్థలో ఉన్న వేణు, నా డ్రీమ్ ప్రాజెక్ట్‌కు ఇంత విజయాన్ని ఇచ్చాడు. అందుకు అతన్ని సత్కరిస్తున్నాం’ అని అన్నారు.

దర్శకుడు శ్రీరామ్ వేణు మాట్లాడుతూ….ఓవర్సీస్‌తో పాటు అన్ని చోట్ల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. యూత్ మాస్ మహిళలు.. అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను ఆస్వాదిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ అని చెబుతున్నారు. ఇవాళ టికెట్స్ దొరకని వారు రేపు బుక్ చేసుకుని వెళ్లండి. సినిమాను ఎంజాయ్ చేయండి. టాక్ బాగా స్ప్రెడ్ చేస్తున్న మీడియా వాళ్లకు థాంక్స్. రాజు గారు మార్నింగ్ షో సినిమా చూసి దర్శకుడిని పిలిచి మాట్లాడుతారు. ఇలాగే ఇవాళ నన్ను మాట్లాడేందుకు పిలిచారు. ఇద్దరం కలిసి పవన్ గారి దగ్గరకు వెళ్లాం. అభిమాన హీరోతో హిట్ సినిమా చేసి ఆడియెన్స్ ఏమనుకుంటున్నారో తిరిగి ఆయనతో చర్చించుకోవడం మాటల్లో చెప్పలేని అనుభూతినిచ్చింది. లైఫ్ లాంగ్ ఈ మూవ్‌మెంట్స్ గుర్తుపెట్టుకుంటాను.

పవన్ గారి వ్యక్తిత్వం ఒక అభిమానిగా నాకు తెలుసు. అందుకే ఆయన పాత్రకు సత్యదేవ్ అని పేరు పెట్టి, ఆయన సమాజాన్ని చూసే కోణంలోనే డైలాగ్స్ రాశాను. సత్యదేవ్ క్యారెక్టర్ ప్రజల కోస పోరాడతాడు. ఆ కోణంలోనే మాటలు రాశాం. ఇవి జనసేన పార్టీ రిలేటెడ్‌గా కుదిరాయని ఎవరైనా అంటే సంతోషమే కదా. వకీల్ సాబ్ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన రాజు గారికి, కళ్యాణ్ గారికి, త్రివిక్రమ్ గారికి థాంక్స్. ఈ విజయం ఆర్టిస్టుల సహా కంప్లీట్ టీమ్ వర్క్. అంతా తమ బెస్ట్ వర్క్ చేశారు. మా చిత్ర బృందం అందరికీ థాంక్స్’ అంటూ ఆయన ఉద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు శ్రీరామ్ ‌వేణుకు నిర్మాత దిల్ రాజు శాలువా కప్పి, పుష్పగుచ్చంతో సత్కరించారు. అనంతరం యూనిట్ బాణాసంచా కాలుస్తూ వకీల్ సాబ్ సక్సెస్ సంబరాలు జరుపుకున్నారు.


‘వకీల్ సాబ్’ రివ్యూ.. పవర్‌స్టార్ విశ్వరూపం

చిత్రం: వకీల్‌ సాబ్‌,
నటీనటులు: పవన్‌కల్యాణ్‌, నివేదా థామస్‌, అంజలి, అనన్య, ప్రకాశ్‌రాజ్‌, శ్రుతి హాసన్‌, నరేశ్‌,
సంగీతం: తమన్‌,
నిర్మాత: దిల్‌రాజ్‌,
సమర్పణ: బోనీకపూర్‌,
రచన, దర్శకత్వం: వేణు శ్రీరామ్‌,
బ్యానర్‌: శ్రీ వేంకటేశ్వరక్రియేషన్స్‌,
విడుదల: 09-04-2021

రేటింగ్: 3.5/5

తెలుగు హీరోల్లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఉండే క్రేజే వేరు. ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన క్రేజ్‌ని పెంచాయే తప్ప… ఇసుమంతైనా తగ్గించలేకపోయాయి. రాజకీయాల్లో బిజీగా మారడంతో మూడేళ్లు గ్యాప్ తీసుకున్నా పవన్ సినిమా వస్తుందంటే ఆయన అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. హిందీలో విజ‌య‌వంత‌మైన ‘పింక్’ సినిమా రీమేక్‌గా త‌న రీఎంట్రీ సినిమా ‘వ‌కీల్‌సాబ్‌’ని ప్రకటించ‌డంతో ఈ సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురు చూశారు. ప్రచార చిత్రాలు సైతం సినిమాపై మ‌రిన్ని అంచ‌నాల్ని పెంచాయి. మూడేళ్లుగా ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. నేడు(ఏప్రిల్ 9) థియేటర్లలో అడుగుపెట్టిన ‘వకీల్ సాబ్’ అంచనాలను అందుకున్నాడా? లేదా? అన్నది చూద్దాం…

మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ముగ్గురు అమ్మాయిలు నివేదా థామస్ (పల్లవి), అంజలి (జరీనా), అనన్య (దివ్య నాయక్) నగరానికి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటూ ఒకే ఇంట్లో కలిసి ఉంటారు. ఓరోజు రాత్రి ఇంటికి వెళ్తుండగా క్యాబ్ సడెన్‌గా ఆగిపోతుంది. వీరిపై కన్నేసిన ఎంపీ రాజేంద్ర (ముఖేష్ రుషి) కొడుకు వంశీ తన స్నేహితులతో కలిసి వాళ్లకు మాయమాటలు చెప్పి ఓ రిసార్ట్‌కి తీసుకెళ్తాడు. అక్కడ పల్లవికి వంశీ నుంచి చేదు అనుభవం ఎదురవుతుంది. తప్పించుకునే క్రమంలో వంశీని మందు సీసాతో కొట్టిన పల్లవి తన ఫ్రెండ్స్‌తో కలిసి అక్కడి నుంచి పారిపోతుంది.

ఎంపీ రాజేంద్ర తన పలుకుబడి ఉపయోగించి ఈ ముగ్గురు యువతులపై ఎదురు కేసు పెట్టిస్తాడు. ప్రాసిక్యూషన్ లాయర్ నంద (ప్రకాష్ రాజ్) సాయంతో వీళ్లని వ్యభిచారులుగా చిత్రీకరించి పల్లవిని జైలుకు పంపిస్తాడు.. అయితే పల్లవిని బెయిల్‌పై తీసుకొచ్చేందుకు జరీనా, అనన్య ఎన్ని ప్రయత్నాలు చేసినా నిరాశే ఎదురవుతుంది. ఆ సంద‌ర్భంలోనే స‌త్యదేవ్ అలియాస్ వకీల్‌సాబ్ (ప‌వ‌న్‌క‌ల్యాణ్‌) గురించి తెలుసుకుని ఆయ‌న సాయం కోరతారు. వాళ్ల ప‌రిస్థితిని చూసి రంగంలోకి దిగిన వకీల్ సాబ్ ఈ కేసుని ఎలా ఛేదించాడు? ఈ ముగ్గురు అమ్మాయిల్ని కేసు నుంచి ఎలా బయటపడేశాడు? అసలు నిందితులను చట్టానికి ఎలా పట్టించాడు? అసలు వకీల్ సాబ్ నేపథ్యం ఏంటి? అన్నది థియేటర్లలో చూడాల్సిందే..

సమాజంలో మహిళలకు ఎదురవుతున్న సంఘటనలు, అఘాయిత్యాలను ఎత్తిచూపుతూనే కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన చిత్రమిది. అమ్మాయి న‌వ్వినా, ఒకరిని ట‌‌చ్ చేస్తూ మాట్లాడినా, ఒంట‌రిగా వెళ్లినా మ‌రో వంక‌తో చూసే ధోర‌ణి గురించి ఇందులో హీరో చెప్పిన విష‌యాలు ఆలోచ‌న రేకెత్తిస్తాయి. ఇలా జ‌ర‌గొద్దు… జ‌ర‌గ‌కూడ‌ద‌నే ఓ బ‌ల‌మైన సందేశాన్నిస్తాయి. మ‌గువా… పాట‌తో సినిమా మొద‌ల‌వుతుంది. మూడు భిన్నమైన కుటుంబాల నుంచి అమ్మాయిలు త‌మ క‌ల‌ల్ని సాకారం చేసుకోవ‌డం కోసం న‌గ‌రానికి చేరుకోవ‌డం, ఉద్యోగాలు చేస్తూ కుటుంబానికి ఆస‌రాగా నిల‌వ‌డం వంటి స‌న్నివేశాల‌తో ఆ పాట సాగుతుంది. ముగ్గుర‌మ్మాయిల‌కి ఎదురైన సంఘట‌న‌ల త‌ర్వాత వ‌కీల్‌సాబ్‌గా ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎంట్రీ ఇస్తాడు. అక్కడి నుంచి క‌థ వేగం పుంజుకుంటుంది. స‌త్యదేవ్ ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు, పల్లవి కోసం కోర్టు వాదించే సన్నివేశాలు సినిమాకే హైలట్‌గా నిలిచాయి.

ఫస్టాఫ్‌లో పవన్ అభిమానుల్ని అల‌రించ‌డ‌మే ల‌క్ష్యంగా స‌న్నివేశాలుండగా.. సెకండాఫ్‌లో కోర్టు రూమ్ డ్రామా సినిమాకు ప్రాణంగా నిలిచాయి. సత్యదేవ్, నందా వాద ప్రతివాదనలతో సన్నివేశాలను రక్తి కట్టించారు. హిందీ చిత్రం ‘పింక్‌’కి రీమేక్ అయినప్పటికీ దాన్ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇమేజ్‌కి త‌గ్గట్టుగా తీర్చిదిద్దిన విధానం, అభిమానుల్ని అల‌రించేలా వాణిజ్యాంశాల్ని జోడించిన తీరు మెచ్చుకుని తీరాల్సిందే. హీరో పాత్రను బలంగా ఎలివేట్ చేసినా కథ పక్కదారి పట్టకుండా దర్శకుడు శ్రద్ధ తీసుకున్నాడు.

చీడ పురుగు మ‌గ‌వాడి మెద‌డులో పెట్టుకుని… మందు ఆడ‌వాళ్ల మొహం మీద కొడ‌తాం అంటే ఎలా? అంటూ సాగే సంభాష‌ణ‌లు చిత్రానికి హైలైట్‌గా నిలిచాయి. ప‌వ‌న్‌క‌ల్యాణ్ పొలిటిక‌ల్ ఇమేజ్‌కి తగినట్లుగా కూడా ఇందులో కొన్ని డైలాగులు జోడించారు. ‘ఆశ‌యం కోసం ప‌నిచేసేవాడికి గెలుపు ఓట‌ముల‌తో ప‌ని ఉండ‌దు’ అంటూ పవన్ రాజకీయ నేపథ్యాన్ని పవన్ టచ్ చేశారు. పొలిటిక‌ల్ ఇమేజ్ ఈ సినిమా విష‌యంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌‌కి బాగా క‌లిసొచ్చింది.

వ‌కీల్‌సాబ్‌ పాత్రలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ పూర్తిగా ఒదిగిపోయారు. కోర్టులో అమ్మాయిలకు న్యాయం జరిగేలా చూడటంతో పాటు తన పాత్రకు వందశాతం న్యాయం చేశారు. కోర్టు సన్నివేశాల్లో పవన్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. నివేదా, అంజ‌లి, అన‌న్య వారి పాత్రల్లో జీవించారు. నందా పాత్రలో ప్రకాశ్‌రాజ్ న‌ట‌న సినిమాకి మ‌రింత బ‌లాన్నిచ్చింది. ద‌ర్శకుడు శ్రీరామ్ వేణు ముందు నుంచి చెప్పినట్లుగానే తన పనితనంగా అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే ఫస్టాఫ్‌పై మరింత శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా మరో రేంజ్‌కి వెళ్లేదనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని మైనస్‌లున్నా పవన్‌ కళ్యాణ్ వాటన్నింటినీ కనిపించకుండా చేశారు. థమ‌న్ పాట‌లు, నేప‌థ్య సంగీతం, పి.ఎస్‌. వినోద్ కెమెరా ప‌నిత‌నం సినిమాకి అద‌న‌పు ఆకర్షణలుగా నిలిచాయి. నిర్మాణ పరంగా దిల్‌రాజు టేస్ట్ ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. మొత్తం ‘వకీల్ సాబ్’ అందరూ కచ్చితంగా చూడాల్సిన సినిమా.