తెలుగు సినిమా హాస్యానికి చిరునామా ‘జంధ్యాల’

తెలుగు సినిమా హాస్యానికి చిరునామా ‘జంధ్యాల’

తెలుగు తెరపై ఆయన పండించిన నవ్వుల పంట మరెవరికీ సాధ్యం కాలేదు. శ్రీవారికి ప్రేమలేఖలు రాయించిన చంటబ్బాయి. తన సినిమాలతో ప్రేక్షకులు హాయిగా నవ్వుకునేలా చేసిన హై హై నాయకుడు. హాస్య చిత్రాలు ఉన్నంత కాలం గుర్తుండిపోయే అమరజీవి. ఆయనే కామెడీ చిత్రాల కేరాఫ్ అడ్రస్ హాస్య బ్రహ్మ జంధ్యాల గారు. నవ్వడం ఒక యోగం., నవ్వించడం ఒక భోగం., నవ్వలేకపోవడం ఒక రోగం అని చెప్పిన హాస్యబ్రహ్మ. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా తనదైన కామెడీ మార్క్ ఉండేలా జాగ్రత్త తీసుకునే హాస్య చక్రవర్తి జంధ్యాల.

జంధ్యాల పూర్తి పేరు జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి. 1951 జనవరి 14న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి నాటకాలపై ఆసక్తితో కొన్ని నాటకాలు రచించారు. అలా నాటకాలు రాస్తూనే కళాతపస్వీ కె.విశ్వనాథ్ గారి దృష్టిలో పడ్డారు. రచయితగా జంధ్యాల గారి తొలి చిత్రం ‘సిరిసిరి మువ్వ’. మొదటి చిత్రంతోనే తనదైన పంచ్ డైలాగులతో, కామెడీ టైమింగుతో పరిశ్రమలో పలువురిని ఆకర్షించారు. ‘శంకరాభరణం’ వంటి క్లాస్ చిత్రాలకు సంభాషణలు అందిస్తునే… ‘అడవిరాముడు’, ‘వేటగాడు’ వంటి మాస్ సినిమాలకు డైలాగ్స్ రాస్తూ తన కలానికి రెండు వైపులా పదును ఉందని నిరూపించుకున్నారు జంధ్యాల . మాటల రచయతగా ప్రారంభమైన ఆయన సినీ కెరీర్.. ఆ తర్వాత దర్శకుడి అవతారమెత్తి అనేక హాస్య చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. కుటుంబ సభ్యులందరూ కూర్చొని చూసే ఆరోగ్యకరమైన హాస్య చిత్రాలు అందించారాయన. డైరెక్టర్‌గా తొలి చిత్రం ‘ముద్ద మందారం’తో సక్సెస్ అందుకున్నారు.

ఎంతో మంది కామెడీ నటీనటులను తెలుగుతెరకు అందించిన ఘనత జంధ్యాల గారిది. ముఖ్యంగా సుత్తి జంటైన వీరభద్రరావు గారు , వేలు గారిని ‘నాలుగు స్తంభాలాట’ సినిమాతో వెండితెరకు పరిచయం చేసారు. ఆ తర్వాత ఈ సుత్తి జంట ఎన్నో చిత్రాల్లో తమ కామెడీ టైమింగ్‌తో ఓ వెలుగు వెలిగేలా చేసిన ఘనత జంధ్యాలకే దక్కుతుంది. తెలుగు వారందరికీ పరిచయమైన బ్రహ్మానందాన్ని ‘అహనా పెళ్లంట’ చిత్రంతో స్టార్ కమెడియన్ చేసిన గొప్ప దర్శకులు జంధ్యాల. ‘ఒరేయ్ అరగుండు వెధవ’ అని కోట గారితో బ్రహ్మానందం గారిని తిట్టించినా అది జంధ్యాలకే మాత్రమే చెల్లింది. బ్రహ్మానందం కామెడీ స్టార్‌గా ఎదగడంలో ఆయన పాత్ర మరిచిపోలేనిది. తన మార్క్ డైలాగ్స్ తో ప్రేక్షకులను థియోటర్లకు రప్పించడంలో అయనది అందెవేసిన చేయి. దరిద్ర నారాయణుడికి దిక్కు మాలిన స్వరూపం అని వర్ణించినా…. పాండు రంగారావును జేమ్స్ పాండ్ చేసినా…హై హై నాయకాలో బూతు బూతు అని వినీ వినిపించని బూతులు తిట్టించినా…శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంలో శ్రీలక్ష్మీతో సినిమా స్టోరీ చెప్పించినా… ‘జయమ్ము నిశ్చయమ్మురా’ బాబూ చిట్టి అని శ్రీ లక్ష్మీతో వెరైటీ డైలాగ్స్ పలికించినా అది ఒక్క జంధ్యాల గారికే సొంతం. తెలుగు వారిని తన నవ్వులతో ముంచిన హాస్య బ్రహ్మ 2001 జూన్ 19న హాస్య ప్రియులను శోకసంద్రంలో ముంచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మరణించినా తన చిత్రాలతో నేటికి హాస్యప్రియులను తన సినిమాలతో నవ్విస్తునే ఉన్నారు.