భక్తుల కోర్కెలు తీర్చే దైవం.. అయినవిల్లి సిద్ధి వినాయకుడు

భక్తుల కోర్కెలు తీర్చే దైవం.. అయినవిల్లి సిద్ధి వినాయకుడు

వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా..

అంటూ కోటి సూర్యులతో సమానంగా ప్రకాశించే గణనాథుడిని స్తుతిస్తుంది భక్తలోకం. విఘ్నాలు తొలంగించి సకాలంలో పనులు పూర్తయ్యేలా అనుగ్రహించమని ప్రార్థిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో అనేక సుప్రసిద్ధ వినాయక ఆలయాలున్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లోని అయినవిల్లి ఒకటి. ఇది స్వయంభూ గణపతి క్షేత్రం. కాణిపాకం తరువాత అంతటి ప్రాశస్త్యం ఉన్న పుణ్యక్షేత్రం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి సుమారు 60 కి.మీ, అమలాపురానికి 12 కి.మీ దూరంలో ఈ క్షేత్రం నెలకొంది. పవిత్ర గోదావరి నది ఒడ్డున, పచ్చని కోనసీమ అందాలు, సుందర ప్రశాంత వాతావరణం, ప్రకృతి రమణీయతలతో ఈ ఆలయం అలలారుతోంది. పార్వతీ తనయుడు ఇక్కడ సిద్ది వినాయకునిగా కొలువై భక్త జనాన్ని అనుగ్రహిస్తున్నారు.

స్థల పురాణం
కృతయుగం నుంచే ఇక్కడ స్వామి కొలువై ఉన్నట్లు స్ధల పురాణం ద్వారా తెలుస్తోంది. దక్ష ప్రజాపతి ద్రాక్షరామంలో చేసిన దక్షయజ్ఞానికి ముందు ఇక్కడి వినాయకున్ని పూజించి పునీతుడయ్యాడని ప్రతీతి. వ్యాస మహర్షి దక్షణ యాత్ర ప్రారంభానికి ముందు ఇక్కడ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించగా దేవతలు ఆలయాన్ని నిర్మించారు. అనంతర కాలంలో నాటి తూర్పు చాళుక్యుల నుంచి నేటి పెద్దాపురం సంస్ధానాధీశుల వరకు ఎందరో ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధిలో భాగస్వాములయ్యారు.

క్షేత్ర ప్రత్యేకత
అయినవిల్లి ఆలయ ప్రస్తావన క్రీ.శ 14వ శతాబ్ధంలో శంకరభట్టు రచించిన శ్రీపాదవల్లభ చరిత్రలో ఉంది. శ్రీపాదవల్లభుల మాతామహులు అయినవిల్లిలో స్వర్ణ గణపతి యజ్ఞం చేసినట్లు.. యజ్ఞం ముగింపులో గణనాథుడు సర్ణమయకాంతులతో దర్శనమిచ్చి హారతులను స్వయంగా అందుకున్నట్లు అందులో పేర్కొన్నారు. శ్రీపాద వల్లభుని జననాన్ని తెలియజేశారని చెబుతారు. సాధారణంగా దేవాలయాల్లోని మూలవిరాట్‌ తూర్పు ముఖంగా దర్శనమిస్తారు. దీనికి భిన్నంగా ఇక్కడి సిద్ధి వినాయకుడు దక్షిణాభిముఖుడై భక్తకోటికి అభయమిస్తున్నాడు. దీంతో గ్రామంలో దక్షిణ సింహద్వారం ఉన్న గృహాలకు ఎలాంటి విఘ్నాలు కలగవని అయినవిల్లివాసుల నమ్మకం.

ఇక్కడి సిద్ధి వినాయకుని మూలవిరాట్‌ అత్యంత ప్రాచీనమైంది. రోజూ స్వామికి వివిధ పూజలు, అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. అభిషేక సేవకు ఈ ఆలయంలో విశేష ప్రాముఖ్యం ఉంది. శివకేశవులకు ప్రీతికరమైన వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు పాంచాహ్నిక దీక్షతో అయిదు రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. పూర్ణిమనాడు కల్యాణం.. గ్రామోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. భాద్రపద శుద్ధ చవితి నుంచి తొమ్మిది రోజుల పాటు వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. మకర సంక్రాంతి, కనుమనాడు ప్రభల ఉత్సవం చేస్తారు. విజయదశమి, కార్తీకమాసం మొదటి, నాలుగు సోమవారాలు, కృష్ణాష్టమినాడు ప్రత్యేక పూజలు చేసి గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఏటా మాఘ మాసంలో చదువుల పండుగ జరుగుతుంది. పండగలో భాగంగా గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి నదీ జలాలతో స్వామిని అభిషేకిస్తారు. లక్ష పెన్నులు సిద్ది వినాయకుని పాదాల వద్ద ఉంచి లక్ష దూర్వములతో పూజిస్తారు. అనంతరం ఆ పెన్నులను విద్యార్థులకు పంచుతారు. వీటితో పరీక్షలు రాస్తే మంచి ఉత్తీర్ణత సాధించడంతో పాటు, చదువులో రాణిస్తారని భక్తుల విశ్వాసం.


ఇలా చేరుకోవచ్చు:
అయినవిల్లి రాజమహేంద్రవరానికి 60 కిలోమీటర్లు, అమలాపురానికి 12కిలోమీటర్లు దూరం ఉంది. రాజమహేంద్రవరం నుంచి వచ్చేవారు రావులపాలెం చేరుకుంటే అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. అమలాపురం నుంచి వచ్చేవారు ముక్తేశ్వరం చేరుకుని అక్కడి నుంచి ఆటోలో అయినవిల్లి చేరుకోవచ్చు. రైలు, విమాన మార్గాల ద్వారా వచ్చేవారు రాజమహేంద్రవరంలో దిగి అక్కడికి నుంచి రోడ్డుమార్గంలో అయినవిల్లి చేరుకోవచ్చు.


మైమరపించే మారేడుమిల్లి… ప్రకృతి అందాలకు ఫిదా కావాల్సిందే

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 87 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం మారేడుమిల్లి. విలక్షణమైన గిరిజన జీవనశైలి, విభిన్నమైన ప్రకృతి అందాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. నదులు, జలపాతాలతో పాటు సుందరమైన క్యాంపింగ్ ప్రాంతాలు కూడా ఇక్కడ ఉన్నాయి. వారాంతాల్లో సరదాగా పిక్నిక్‌లకు వెళ్లేందుకు ఇది సరైన ప్రాంతం. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలాల్లో ఈ ప్రాంతం పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది. ఆకుపచ్చ లోయలు, వృక్షజాలం పరవశింపజేస్తాయి.

హైదరాబాద్, కాకినాడ, విశాఖపట్నం నగరాల నుంచి ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు. సందర్శకులు తెల్లవారుజామునే ఇక్కడికి చేరుకుని సాయంత్రానికి తిరుగు ప్రయాణం అవుతారు. విశాఖపట్నం నుంచి మారేడుమిల్లి 225 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నాలుగు గంటల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. మారేడుమిల్లి సందర్శనకు వెళ్లేవారు చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు.

జలతరంగిణి జలపాతాలు
మారేడుమిల్లి, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక నీటి మడుగులు, జలపాతాలు కనిపిస్తాయి. కొండలపై నుంచి దూకుతూ దట్టమైన అడవుల్లోకి ప్రవహించే జలపాతాల దృశ్యాలు పర్యాటకులకు మరపురాని జ్ఞాపకాలను అందిస్తాయి. ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక చక్కని గమ్యస్థానం. మారేడుమిల్లి ప్రాంతం పరిధిలో అనేక చిన్న జలపాతాలతో పాటు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో జలతరంగిణి జలపాతాలు ఉన్నాయి. ప్రధాన రహదారికి ఈ ప్రదేశం కాస్త దగ్గరగా ఉంటుంది. బైక్‌లపై ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు.

రాజమండ్రి నుండి గోకవరం దాటిన తరువాత ఫోక్స్ పేట నుండి రక్షిత అటవీ ప్రాంతం మెుదలవుతుంది. దారి మద్యలో సీతపల్లి వద్ద వనదేవతగా కోలిచే బాపనమ్మ తల్లి దేవస్దానం వస్తుంది. ఆ చల్లని తల్లిని ప్రతి ఒక్కరూ దర్శిస్తారు. సీతపల్లి దాటి 5 కిలోమీటర్లు వెళ్తే సీతపల్లి వాగు, పాలవాగు కనిపిస్తాయి. అక్కడినుండి ముందుకు వెళితే రంపచోడవరం దగ్గరలో రంప జలపాతం వస్తుంది. వేసవిలో జలధార తక్కువగా ఉంటుంది.. కాబట్టి జులై, ఆగస్టు నెలలో వెళ్తే ఆ జలపాతం అందాలు ఆస్వాదించొచ్చు.

ఈ ప్రకృతి అందాల నడుమ సేద తీరడానికి ప్రభుత్వ, ప్రైవేట్ రిసార్ట్స్ అందుబాటులో ఉన్నాయి. రంపచోడవరంకి 4 కి.మీ.ల దూరంలో శ్రీ నీలకంఠేశ్వర వన విహార స్థలం పురాతన శివాలయం ఉంటుంది. అల్లూరి సీతారామరాజు గారు ఈ ఆలయంలో పూజలు చేసేవారని చెబుతారు.

స్వర్ణధార – రంప జలపాతాలు
జలతరంగిణి జలపాతాల నుంచి 20 కిలోమీటర్ల దూరంలో స్వర్ణధార జలపాతాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో భారీ మామిడి చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి మర్రిచెట్ల మాదిరిగా పెద్దగా ఉంటాయి. దట్టమైన, లోతైన అటవీ మార్గంలో ఉన్న ఈ ప్రదేశానికి ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లవచ్చు. మార్గమధ్యంలో నెమళ్లను, ఇతర పక్షులను కూడా చూసే అవకాశం ఉంటుంది.

అలాగే మారేడుమిల్లి నుంచి 36 కిలోమీటర్ల దూరంలో రంప జలపాతాలు ఉన్నాయి. రంప చోడవరం నుండి రంప జలపాతం వరకూ జీప్‌లో ప్రయాణం చేస్తూ చేరుకోవడం గొప్ప అనుభవం. 10 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకుంటూ కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ జలపాతం వద్ద నీరు తియ్యని రుచితో ఉంటుంది. జలపాతానికి సమీపంలో పాత శివాలయం కూడా ఉంది. అనేక ఔషధ మొక్కలు, వెదురు చెట్లు ఈ ప్రాంతంలో కనిపిస్తాయి.

కార్తీక వనం
కార్తీక వనం ప్రాంతం అరుదైన మొక్కలు, వృక్ష జాతులకు ప్రధాన ఆవాసం. సహజసిద్ధ ప్రకృతి అందాలతో ఈ ప్రదేశం పర్యాటకుల మనసు దోచుకుంటుంది. ఉసిరి, మారేడు, గూస్ బెర్రీ, బేల్ వంటి అనేక రకాల మొక్కల జాతులు ఇక్కడ కనిపిస్తాయి. అరుదైన ఔషధ మొక్కలపై పరిశోధనలు చేసేందుకు ఇది ఒక బహిరంగ ప్రయోగశాలగా ఉపయోగపడుతుంది. దాదాపు 203 జాతుల ఔషధ మొక్కలను ఇక్కడ చూడవచ్చు. స్వచ్చమైన గాలి, వాతావరణం మధ్య ఇక్కడ అమూల్యమైన సమయాన్ని గడపవచ్చు.

జంగల్ స్టార్ క్యాంప్ సైట్
ఈ ప్రదేశానికి రామాయణానికి సంబంధం ఉందంటారు. ఇక్కడ రామాయణ కాలంలో యుద్ధం జరిగినట్లు చెప్తారు. ఇక్కడ వలమూరు నది నీటి ప్రవాహాలు, గడ్డి మైదానాలు, కొండలు , అడవులు ఇలా చెప్పాలంటే తూర్పు కనుమల అందాలన్నీ ఇక్కడే ఉన్నాయా? అన్నట్టు అనిపిస్తుంది.

మదనికుంజ్ విహార స్థల్
మారేడుమిల్లి ప్రాంతంలో ఉన్న మరో అద్భుతమైన విహార ప్రదేశం మదనికుంజ్-విహార స్థల్. ప్రకృతి ఒడిలో సేద తీరే పిక్నిక్ స్పాట్‌గా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. బంగారు వర్ణంలో ఉండే వెదురు చెట్లు, వందల ఏళ్ల నాటి వృక్షాలు ఇక్కడ అధిక సంఖ్యలో ఉంటాయి. పులులు, అడవి కోళ్లు, అడవి దున్నలు, నల్ల చిరుతలు, నెమళ్లతో పాటు విభిన్న రకాల సీతాకోక చిలుకలు ఇక్కడ కనిపిస్తాయి.

ఈ మజిలీలో మారేడుమిల్లిలో అక్కడి గిరిజనులు సహజసిద్ధంగా అడవిలో పెరిగిన కోళ్లతో చేసే బొంగు చికెన్ రుచి చూడండి. ఆ చికెన్ ఒక్కసారి తింటే మళ్ళీ వదిలిపెట్టాలని అనిపించదు. అక్కడ బస చేయడానికి ఏపీ టూరిజం హరితా రిసార్ట్స్, ప్రైవేట్ వ్యక్తులు నడిపే లాడ్జీలు అందుబాటులో ఉన్నాయి. దారిలో ప్రకృతి అందాలను వీక్షించడానికి పర్యాటక శాఖ వారు వ్యూ పాయింట్లు ఏర్పాటు చేశారు. అక్కడినుండి ప్రకృతి రమణీయతను తిలకించవచ్చు, రెండవ వ్యూ పాయింట్ చెరుకుంటే ఘాట్ రోడ్ ప్రయాణం పూర్తి అయినట్టే. అక్కడే సోకులేరు వాగు అద్బుతంగా ఉంటుంది.


ముఖ్య గమనిక: ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌‌తో వెళ్ళాలనుకునేవారు ముందుగా మీ వాహనం కండీషన్ చూసుకోవాలి ఎందుకంటే అక్కడ ఏదైనా రిపేరు వస్తే దగ్గర్లో మెకానిక్ దొరకని పరిస్దితి ఉంటుంది. ఈ మార్గంలో రాత్రి ప్రయాణం అంత శ్రేయస్కరం కాదు. చీకటి పడేలోపు ఏదైనా ప్రదేశానికి చేరుకునేలా చూసుకోండి..


ప్రకృతి అందాల స్వర్గధామం.. కోనసీమ చూసి తీరాల్సిందే!


‘కోనసీమ’.. కేరళను తలదన్నే పచ్చటి అందాలతో ఆంధ్రా పాలిట భూతలస్వర్గంగా ప్రసిద్ధి చెందింది. ప్రకృతి రమణీయకతకు నిలువుటద్దంగా నిలిచే ప్రాంతం ప్రకృతి అందాలతో ఎప్పుడూ కళకళల్లాడుతూ ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని త్రిభుజాకార ప్రదేశాన్ని కోనసీమగా పిలుస్తారు. దీని ప్రధాన కేంద్రం అమలాపురం. పచ్చని తివాచీ పరిచినట్లుండే కోనసీమలో నదీ సంగమ ప్రదేశాలు, ఓడరేవులు, ఆహారాలు విశేషంగా ఆకర్షిస్తాయి. కోనసీమ నాలుగు వైపులా గోదావరి, బంగాళాఖాతాలు చుట్టుముట్టి ఉన్నాయి.

కోనసీమ ప్రకృతి పదం.. మూల (కోన) ప్రదేశం (సీమ) నుండి వచ్చింది. కోనసీమకు సరిహద్దులుగా ఉత్తరం వైపు గౌతమి, దక్షిణం వైపున వశిష్ట అనే గోదావరి పాయలున్నాయి. ఇక్కడి ప్రధాన వృత్తి వ్యవసాయం. కోనసీమకు అమలాపురం పట్టణం ప్రధాన కేంద్రం కాగా.. రావులపాలెం, రాజోలు, ముమ్మిడివరం, ముక్తేశ్వరం, కొత్తపేట అంబాజీపేట ప్రధాన ప్రాంతాలు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న రావులపాలెంను కోనసీమ ముఖద్వారంగా పిలుస్తారు.

అందాల సీమ
మాటలకందని అనుభూతులు, రహదారుల వెంట కాలువలు, పచ్చని చెట్ల తోరణాలు, అరటి గెలలు, కొబ్బరి తోటలు, మంచు తెరలు ఇలాంటి మనోహర దృశ్యాలన్నీ కోనసీమ వాసులకు సర్వసాధారణం. పుష్కలమైన ప్రకృతి వనరులు, కనుచూపు మేరకు తనివితీరని రమణీయమైన ప్రకృతి సౌందర్యం కోనసీమకే వన్నె తెస్తుంటాయి. కోనసీమలో పండించని పంట ఉండదు. కోనసీమలో వరి తర్వాత ఎక్కువగా అరటిని పండిస్తారు. పలురకలైన కొబ్బరి మొదలు, అరటి, మామిడి, పనస, సపోటా, బత్తాయి ఇలా అన్ని రకాల పంటలు పండిస్తారు.

కోనసీమ ప్రాంతం పురాతన తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయంగా భాసిల్లుతోంది. అతిథులకు మర్యాదలు చేయడంలో కోనసీమ వాసులకు కొట్టేవాళ్లే ఉండరు. అన్నిచోట్ల కొట్టి చంపితే.. కోనసీమ వాళ్ల తిండి పెట్టి చంపేస్తారన్న నానుడి ఉంది. సంక్రాంతి పండుగకు నిర్వహించే ముగ్గుల పోటీలు, కోనసీమలో జరిగే కోడిపందేలు, తీర్థాలు, జాతరలు చూడటానికి రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదేమో.

పలకరింపులు భలే ఉంటాయ్
కోనసీమలో పలకరింపులు భలే వింతగా ఉన్నాయి. అక్కడ ఎదుటివారిని ఆయ్, అండి అంటూ ప్రత్యేక శైలిలో మర్యాదగా పిలుస్తుంటారు. ఈ తరహా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా మనకు కనిపించదు. ఎవరు కనిపించినా ఆప్యాయంగా పలకరించే సంస్కారం వారి సొంతం.

ప్రసిద్ధ ఆలయాలకు కేంద్రం
కోనసీమ ప్రాంతంలో ఎన్నో ప్రసిద్ధ, పురాతన ఆలయాలు ఉన్నాయి. వీటిలో అయినవిల్లిలోని విఘ్నేశ్వరుడి ఆలయం, మురమళ్లలోని భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ఆలయం, ర్యాలీలోని జగన్మోహిని కేశవస్వామి ఆలయం, ముక్తేశ్వరంలోని క్షణ ముక్తేశ్వరాలయం, పలివెలలోని శ్రీ ఉమా కొప్పులింగేశ్వర ఆలయం మందపల్లిలోని శనీశ్వర ఆలయం ముఖ్యమైనవి. అవివాహితులు మురముళ్ల వీరేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేస్తే త్వరగా పెళ్లి జరుగుతుందని నమ్మకం. అమలాపురం నుంచి కాకినాడ వెళ్లే మార్గంలో ఈ ఆలయం ఉంది. ప్రధాన రహదారి నుంచి అర కిలోమీటరు ప్రయాణిస్తే ఆ ఆలయాన్ని చేరుకోవచ్చు.

కోనసీమ వంటలు ఆహా అనిపించకమానవు. కోడికూర, కోడి పలావ్‌కు కోనసీమ పెట్టింది పేరు. చేపల పులుసు, రొయ్యల ఇగురు, వేపుడు కూడా రుచిగా వండుతారు. గోదావరి నదిపై వంతెనలు నిర్మించక ముందు ప్రజా రవాణా అంతాకూడా లాంచీలు, పడవల మీదుగానే సాగిపోయేవి. కోనసీమలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ వాటినే కొనసాగిస్తూనే ఉన్నారు. కోనసీమ ప్రాంతం సినిమా షూటింగులకు కూడా ప్రసిద్ధి. గతంలో అనేక పెద్ద పెద్ద హీరోల సినిమాలు కూడా ఇక్కడ జరిగాయి.

కోనసీమ చేరుకోవటం ఎలా ?
వాయు మార్గం: అమలాపురానికి సమీపంలోని ఉన్న అతిపెద్ద నగరం రాజమండ్రి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు విమాన సర్వీసులు ఉన్నాయి. రాజమండ్రి నుంచి ప్రతి అరగంటకు అమలాపురానికి బస్సు సౌకర్యం ఉంది.


రైలు మార్గం: కోనసీమ పరిసరాల్లో రాజమండ్రి, కాకినాడ, గంగవరం, పాలకొల్లు, నరసాపురం పట్టణాల్లో రైల్వే స్టేషన్‌లు కలవు. రైలు మార్గం ద్వారా ఆయా ప్రాంతాలకు చేరుకుని అక్కడి నుంచి బస్సు ద్వారా చేరుకోవచ్చు.
బస్సు/ రోడ్డు మార్గం : హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి నుండి కోనసీమలోని ప్రతి ప్రాంతానికి బస్సు సర్వీసులు ఉన్నాయి.